Skip to main content

లివింగ్ ప్లానెట్ రిపోర్ట్-2016

మానవ జనిత విపత్తుల వల్ల 2020 నాటికి మూడింట రెండొంతుల సకశేరుకాలు విలుప్తత చెందే ప్రమాదమున్నట్లు WWF (WorldWide Fund for Nature) విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్-2016 పేర్కొంది. ప్రపంచ వన్య మృగాల పరిస్థితులను సమీక్షిస్తూ WWF ప్రతి రెండేళ్లకోసారి ఈ నివేదికను విడుదల చేస్తుంది. 1970 నుంచి ప్రపంచ వన్య ప్రాణుల సంఖ్య 58 శాతం మేర తగ్గినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
భూమిపై మనిషి పరిణామం చెందక ముందే జీవుల విలుప్తత కనిపిస్తుంది. చివరి సారిగా భారీ స్థాయిలో రాక్షస బల్లులు అంతరించాయి. ప్రకృతి కారణాల వల్ల జీవులు అంతరించడం సాధారణ విషయం. అయితే ప్రస్తుతం మనిషి ప్రభావాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ఆంథ్రోపోసిన్ అనే ఈ యుగంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా, అతి వేగంగా జీవులు అంతరిస్తున్నాయని ఈ నివేదికను బట్టి అర్థమవుతోంది. జీవ వైవిధ్య విలుప్తత వల్ల మనిషి ఆహార, ఆరోగ్య, పోషణ భద్రత తగ్గడమే కాకుండా చివరకు మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.
 
 ఒక జాతి జీవుల్లోని జన్యు వైరుధ్యం; విభిన్న జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైరుధ్యమే జీవవైవిధ్యం. వ్యవసాయ విస్తరణ, కలప, మానవ నివాసాలు, డ్యాంలు, రోడ్లు, రైల్వే మార్గాల నిర్మాణం కోసం ఇంతకుముందు జరిగిన, ప్రస్తుతం కూడా కొనసాగుతున్న అడవుల క్షీణత, నష్టమే వన్యప్రాణులకు ప్రధాన ముప్పుగా పరిణమించింది. దీనికి అదనంగా బయటి జాతుల ప్రవేశం కూడా స్థానీయ జీవవైవిధ్యానికి పెద్ద సవాలుగా మారింది. ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తూ బయటి జాతులు ప్రవేశించినప్పుడు వాటి అనూహ్య విస్తరణ ద్వారా స్థానీయ జాతులు అంతరించే ప్రమాదముంది.
ఉదా: పొలాల్లో ఎలుకల బెడదను నియంత్రించడానికి ఆస్ట్రేలియా ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ కేన్ టోడ్ అనే కప్పను తమ దేశంలోకి ప్రవేశపెట్టింది. ఈ భారీ కప్ప ఎలుకలతోపాటు స్థానిక కప్ప, సర్ప జాతులను పూర్తిగా నాశనం చేసే స్థాయికి వేగంగా విస్తరించింది. ఆవాసాల నష్టం, క్షీణత, కొత్త జాతుల ప్రవేశంతోపాటు పర్యావరణ కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, ఆహారం, ఔషధాలు, శరీర భాగాల కోసం వేట మొదలైనవి కూడా వన్యప్రాణుల జనాభా తగ్గుదలకు కారణమవుతున్నట్లు ఈ నివేదిక గుర్తించింది.
 
ఆహారం, ఔషధాల కోసం..
వాజాల కోసం సొర చేపలను, ఆహారం కోసం తిమింగలాలు, డాల్ఫిన్లు, ఉడుములు, జింకలు, ఇతర వన్య పక్షులను, కొమ్ముల కోసం ఖడ్గ మృగాలను, పొలుసుల కోసం పిపీలకాహారులను, తైలం కోసం పునుగు పిల్లులు, కస్తూరి జింకలను, శరీర భాగాల కోసం పులులను మానవుడు వేటాడటం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది. చైనా సంప్రదాయ వైద్య విధానంలో పులుల శరీర భాగాలను వినియోగించడంపై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అయినా ఈ విధానాన్ని చైనా నిషేధించలేక పోతోంది.
 
చమురు, క్రిమిసంహారకాలు..
చమురు వెలికితీత, రవాణాలో జరిగే ప్రమాదాల ద్వారా తరచూ సముద్ర కాలుష్యం సంభవిస్తోంది. సముద్ర ఉపరితలంపై చమురు పొర పేరుకుపోయి నీటిలో ఆక్సిజన్ కరిగే ప్రక్రియకు అవరోధం ఏర్పడుతోంది. ఫలితంగా సముద్ర జలచరాలు ఆక్సిజన్ అందక మరణిస్తున్నాయి. 2010లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో బ్రిటిష్ పెట్రోలియానికి చెందిన చమురు బావి ప్రమాదంలో దాదాపు 11,500 చ.కి.మీ. మేర సముద్ర ఉపరితలంపై మందంగా చమురు పేరుకుపోయింది. వ్యవసాయ రంగంలో నియంత్రణ లేకుండా వినియోగిస్తున్న క్రిమి సంహారక అవశేషాలు కూడా ఆహార శృంఖలాల ద్వారా వన్యప్రాణుల్లోకి చేరుతున్నాయి. పశువులకు వాడే డైక్లోఫినాక్ అవశేషాలు వాటిలో పేరుకుపోతున్నాయి. మరణించిన ఈ పశువులను తినడం వల్ల రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 
 
శీతోష్ణస్థితి మార్పు..
ప్రస్తుతం శీతోష్ణస్థితి మార్పు ఒక ప్రధాన ముప్పుగా మారిందని కూడా నివేదిక పేర్కొంది. మానవులపై మాత్రమే కాకుండా ఇతర జీవ జాతులపై కూడా దీని ప్రభావాలను ఇప్పటికే గుర్తించారు. శీతోష్ణస్థితి మార్పు వల్ల వన్యప్రాణుల వలసలు, ప్రజననం అస్తవ్యస్తమై వాటి సంఖ్య తగ్గిపోతోంది. భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగేకొద్దీ 20-30 శాతం మేర జీవవైవిధ్యం నష్టపోయే ప్రమాదముందని ఇదివరకే IPCC (Intergovernmental Panel on Climate Change) తన నివేదికలో పేర్కొంది. 
 
కేవలం సకశేరుకాలకే..
లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ (LPI) ఆధారంగా ఈ నివేదికను WWF సంస్థ తయారు చేసింది. జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (ZSL), గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్, స్టాక్‌హోం ఎన్విరాన్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థలు కూడా ఈ నివేదిక రూపకల్పనలో పాల్గొన్నాయి. 3,706 సకశేరుక జాతుల (చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు)కు చెందిన 14,152 పరిశీలన జనాభా (monitored populations)కు సంబంధించిన శాస్త్రీయ సమాచారం ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 1970 నుంచి 2012 వరకు సకశేరుక జనాభాలో 58 శాతం తగ్గుదల నమోదైనట్లు దీనిద్వారా తెలుస్తోంది. 2014 నివేదిక ప్రకారం 1970-2010 మధ్య కాలంలో 52 శాతం మేర సకశేరుకాల జనాభా తగ్గింది. అయితే స్వాదుజల జీవ జాతుల జనాభా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. 2014 నివేదికతో పోల్చితే ఈ నివేదిక 668 జాతులు, 3,772 భిన్న జనాభాలను అదనంగా అధ్యయనం చేసింది. అయితే ఈ నివేదికను కేవలం సకశేరుక జాతుల సమాచారం ఆధారంగానే రూపొందించారు. భవిష్యత్‌లో అకశేరుక, మొక్క జాతులను కూడా అధ్యయనంలోకి తీసుకోనున్నారు.
 
భారత్‌లో...
ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది. అయితే ఎల్‌పీఐ ప్రకారం ప్రస్తుతం దేశంలో వన్య జీవులు, ఆవరణ వ్యవస్థలు తీవ్ర స్థాయిలో ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. దేశంలో ఏడు శాతం పక్షులు అంతరించే ప్రమాదానికి చే రాయి. వీటిలో ముఖ్యమైనవి రాబందులు, బట్టమేక పక్షి. దేశంలోని 57 శాతం ఉభయచరాలు దాదాపు అంతరించాయి. 70 శాతం స్వాదు జల చేప జాతులు అంతరించే స్థాయికి చేరాయి. దేశంలో ప్రస్తుత అటవీ ఛత్రం 21.3 శాతం. 1991 నుంచి దేశంలో 38 శాతం చిత్తడి నేలలు అదృశ్యమయ్యాయి. 25 శాతం నేల ఎడారీకరణలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
 
నివారించకుంటే తీవ్ర నష్టం..
భారత్‌లో సహజ ఆవాసాల క్షీణత నష్టాన్ని నివారించకుంటే భవిష్యత్‌తో కీలక జాతులు అంతరించే ప్రమాదముంది. అడవుల్లోని ప్రధాన పర భక్షక జాతులు అంతరిస్తే ఎడారీకరణ వేగవంతమవుతుంది. అడవులపై మనిషి ప్రభావం పెరిగేకొద్దీ మనిషి-వన్యజాతుల మధ్య ఘర్షణ తీవ్రమవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇది కనిపిస్తోంది. చిత్తడి నేలల దురాక్రమణను అడ్డుకోవడం ద్వారా జీవ వైవిధ్య సంరక్షణతో పాటు స్థానిక తెగల జీవనోపాధి మెరుగవుతుంది. ఎడారీకరణ పెరిగేకొద్దీ ఆహార భద్రత కొరవడుతుంది. అందువల్ల సహజ ఆవాసాల పరిరక్షణ, వన్యజీవులకు సంబంధించిన నేరాలకు కఠిన శిక్షల అమలు, జీవవైవిధ్య సంరక్షణ, స్వాదుజల, చిత్తడి నేలల పునరుద్ధరణ, ఉపరితల, భూగర్భ జల వనరుల అభివృద్ధి ప్రస్తుతం చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Published date : 14 Mar 2017 02:14PM

Photo Stories