Skip to main content

ఆంధ్రప్రదేశ్‌ – నైసర్గిక స్వరూపాలు

ఆంధ్రప్రదేశ్‌ను మూడు నైసర్గిక విభాగాలుగా విభజించొచ్చు. అవి..
1. తీర మైదానం
2. తూర్పుకనుమలు
3. పడమటి పీఠభూమి

తీర మైదానం
తూర్పు కనుమలకు, బంగాళాఖాత తీర రేఖకు మధ్య తీర మైదానం విస్తరించి ఉంది. ఈ తీరమైదానం సముద్ర మట్టం నుంచి సుమారు 150 మీటర్ల ఎత్తులో ఉంటుంది. శ్రీకాకుళం నుంచి దక్షిణాన çపులికాట్‌ సరస్సు వరకు 974 కి.మీ ఉంటుంది. ఉత్తరాన శ్రీకాకుళంలోని నాగావళి – వంశధార నదుల వద్ద 19 కి.మీ వెడల్పుతో ప్రారంభమవుతుంది. మధ్య భాగంలో కృష్ణా – గోదావరి డెల్టాల ప్రాంతంలో ఎక్కువ వెడల్పుగా 160 కి.మీ ఉంటుంది. దక్షిణాన నెల్లూరు వద్ద 22 కి.మీ వెడల్పు ఉంటుంది.

తీర మైదానంలో రెండు సరస్సులు ఉన్నాయి. అవి..
కొల్లేరు సరస్సు
  • ఈ సరస్సు వైశాల్యం – 250 చ.కి.మీ
  • రాష్ట్రంలో పెద్ద మంచినీటి సరస్సు (దేశంలో పెద్ద మంచినీటి సరస్సు ఊలార్‌)
  • కృష్ణా – పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది.
  • తమ్మిలేరు, బుడమలేరు నదులు కొల్లేరులో కలుస్తాయి.
  • 1999లో ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు.
  • ఈ సరస్సు పెలికాన్‌ పక్షులకు ప్రసిద్ధి.
పులికాట్‌ సరస్సు
  • ఈ సరస్సు వైశాల్యం – 460 చ.కి.మీ
  • నెల్లూరు జిల్లాలో ఉంది. తమిళనాడు సరిహద్దులో ఉంది.
  • ఇది రాష్ట్రంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు (లెగూన్‌ సరస్సు)
  • అతిపెద్ద ఉప్పునీటి సరస్సుల్లో దేశంలోనే రెండోది. (దేశంలోనే పెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్‌)

తూర్పు కనుమలు
తూర్పు కనుమలు.. దక్కన్‌ పీఠభూమికి – తీర మైదానానికి మధ్య ఉన్నాయి. ఇవి ఎల్తైన కొండల వరుసలతో అవిచ్ఛిన్నంగా ఉండవు. నిర్మాణంలో, స్థలాకృతిలోనూ ఒకే విధంగా ఉండవు. ఇవి విచ్ఛిన్న శ్రేణులు ఉత్తర భాగంలో ఉన్న తూర్పు కనుమలను ‘తూర్పు శ్రేణులు’ అంటారు. దక్షిణ భాగంలో ఉన్నవాటిని ‘కడప శ్రేణులు’ అంటారు. తూర్పు కనుమల ఉత్తర శాఖలో 60 నుంచి 70 కి.మీ వెడల్పుతో సగటున 1200 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా చార్నోఖైట్, ఖోండా లైట్‌ శిలలతో కూడుకుని ఉన్నాయి.

తూర్పు కనుమల్లో ఎల్తైన శిఖరాలు

  • జిందగడ – 1690 మీ. (విశాఖపట్నం – చింతపల్లి)
  • అరోమా కొండ – 1680 మీ. ( విశాఖపట్నం)
  • మహేంద్రగిరి–1501 మీ.(ఒడిశా–గంజాం)
తూర్పు కనుమలు – కొండలు
  • శ్రీకాకుళం: పాల కొండలు
  • విశాఖపట్నం: అరకు, మాడ్గుల కొండలు, యారాడ కొండలు, అనంతగిరి, బాల కొండలు, సింహాచలం కొండలు, డాల్ఫిన్స్‌నోస్‌ కొండ (335 మీ.)
  • ఉభయగోదావరి: పాపికొండలు, ధూమ కొండలు, బైసన్‌ కొండలు
  • కృష్ణా : మొగల్రాజపురం కొండలు, కొండపల్లి కొండలు, ఇంద్రకీలాద్రి కొండలు
  • గుంటూరు: బెల్లంపల్లి కొండలు, గని కొండలు, వినుకొండ, మంగళగిరి కొండలు, నాగార్జున కొండ, కొండవీటి కొండ, కోటప్పకొండ
  • ప్రకాశం: చీమకుర్తి కొండలు, మార్కాపురం కొండలు
  • నెల్లూరు: ఎర్రమల కొండలు, వెలికొండలు
  • కర్నూలు: నల్లమల కొండలు
  • కడప: శేషాచలం కొండలు, పాల కొండలు, ఎర్రమల కొండలు
  • అనంతపురం: మడకశిర, మల్లప్పకొండ, పెనుగొండ.
  • చిత్తూరు: శేషాచలం (తిరుమల కొండలు), ఆవులపల్లి కొండలు, హార్స్‌లీహిల్స్‌ (ఏనుగుమల్లమ్మ కొండలు)

పడమటి పీఠభూమి
ఈ ప్రాంతం ఆర్కియన్, నీస్, గ్రానైట్‌ శిలలతో ఏర్పడింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు, వాటిని ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఈ పీఠభూమిలో ఉన్నాయి. దీనిలో ఆరు రకాల శిలలు ఉన్నాయి. అవి..

1. ఆర్కియన్‌ వ్యవస్థ: భూపటం చల్లారుతూ గట్టిపడుతున్న క్రమంలో ఏర్పడిన అతిపురాతన శిలా వ్యవస్థ.. ఆర్కియన్‌ శిలలు. ఇవి అగ్ని, అవక్షేప శిలలు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడ్డాయి. ఈ ఆర్కియన్‌ శిలల్లో నీస్‌ పదార్థం ఎక్కువ. ఈ శిలల్లో ఇనుము, మాంగనీస్, రాగి, బంగారం, సీసం లభిస్తాయి.

2. ధార్వార్‌ వ్యవస్థ:
కర్నాటకలోని ధార్వార్‌ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు పురాతన అవక్షేప శిలలతో ఏర్పడ్డాయి. నీస్, షిస్ట్స్‌ పదార్థాలుంటాయి. విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల ఉత్తర భాగంంలో కూడా విస్తరించి ఉన్నాయి.

3. కడప శిలలు:
మిలియన్‌ సంవత్సరాల నుంచి వికోషీకరణం చెందుతూ ఉన్న ధార్వార్‌ శిలలను కడప శిలలు అంటారు. ఇవి.. కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇనుము, మాంగనీస్, రాతినార, ఆస్బెస్టాస్, సున్నపురాయి ఖనిజాలకు నిలయం.

4. కర్నూలు శిలలు:
ఈ శిలా వ్యవస్థలో లోహ ఖనిజాలు ఉండవు. ఆభరణాలు, రాళ్లు, గ్లాస్‌ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు లభిస్తాయి. సున్నపురాయి, ఇసుకరాయి, ఆస్బెస్టాస్, షేల్స్‌ విస్తరించి ఉన్నాయి.

5. దక్కన్‌ నాపలు:
క్రెటాసియన్‌ కాలంలో ద్వీపకల్ప భూభాగంలోని భూపటల రంధ్రాల ద్వారా లావా వెలువడి ఘనీభవించి మెట్లులాగా ఏర్పడ్డాయి. వీటినే దక్కన్‌ ట్రాప్స్‌ అంటారు. ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి.

6. రాజమండ్రి శిలలు:
సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుక, సున్నం, మట్టి లాంటి అవక్షేప శిలలు.. రాజమండ్రి శిలలు. తాడేపల్లి గూడెం, జాగర్లమూడి, నూజివీడు, తునిలలో ఈ శిలలు కనిపిస్తాయి. ఈ శిలా ప్రాంతాల్లో గ్యాస్, పెట్రోలియం నిల్వలున్నాయి.


మాదిరి ప్రశ్నలు

1. కొల్లేరు సరస్సు ఏయే జిల్లాల మధ్య విస్తరించి ఉంది?
 1. పశ్చిమ గోదావరి – తూర్పుగోదావరి
 2. పశ్చిమగోదావరి – కృష్ణా
 3. కృష్ణా – గుంటూరు 
 4. నెల్లూరు – ప్రకాశం

Published date : 06 Mar 2017 12:11PM

Photo Stories