Skip to main content

ఆంధ్రప్రదేశ్‌ జిల్లాలు – ప్రత్యేకతలు

ఆంధ్రులు అత్యంత ప్రాచీనులు. క్రీ.పూ.1000 ఏళ్ల నాటి ఐతరేయ బ్రాహ్మణంలో, రామాయణ, మహాభారతాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. మహాభారతం ప్రకారం పాండవుల్లో ఒకడైన సహ దేవుడు ఆంధ్ర ప్రాంతాన్ని జయించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్లు తెలుస్తోంది. రామాయణంలో సీతాన్వేషణ సమయంలో రాముడు జటాయువు అనే పక్షితో సంభాషించినట్లు, లే పక్షీ అనేది నేటి లేపాక్షి (అనంతపురం) అయినట్లు జనశృతిలో కథనం ఉంది. ఆంధ్రులు ద్రావిడులైనా ఆర్య సంస్కృతి లక్షణాలు అధికం. అగస్త్యుడు ఆర్య సంస్కృతిని దక్షిణానికి వ్యాపింపజేశాడు. గ్రీకు రాయబారి మెగస్తనీస్‌ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొన్నాడు. అశోకుడి శిలాశాసనాల్లో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. వాటిలో 13వ, ఎర్రగుడిపాడు, రాజులమందగిరి శిలా శాసనాలు ప్రముఖమైనవి.

సునశ్శేనుడు అనే వ్యక్తిని విశ్వామిత్రుడు దత్తత తీసుకోగా అందుకు అతని కుమారులు అంగీకరించలేదు. అందుకు కోపించిన విశ్వామిత్రుడు పుండ్ర, సవర, పుళింద, మూతిబ జాతులతో వారిని కలిసిపొమ్మన్నాడని కథనం. మత్స్య, వాయు పురాణాల్లో కూడా ఆంధ్ర ప్రాంత ప్రస్తావన ఉంది. ఆంధ్రకు సంబంధించి లిఖిత పరంగా లభిస్తున్న తొలి ఆధారాలు అశోకుడి శిలా శాసనాలు.

భౌగోళిక పరిశీలన
‘తాళపు చెవి’ లేదా ‘వీణ’ఆకారంలో ఉన్న ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్‌ విశాలమైన తీరప్రాంతాన్ని (శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కి.మీ.) కలిగి ఉంది. 12ని–37’–19ని–07’ ఉత్తర అక్షాంశాలు, 76ని–46’–84ని–46’ తూర్పు రేఖాంశాల మధ్య నవ్యాంధ్రప్రదేశ్‌ విస్తరించి ఉంది. విస్తీర్ణం పరంగా దేశ వైశ్యాలంలో 8వ స్థానంలో నిలుస్తుంది. ఏపీ వైశాల్యం 1,62,760 చ.కి.మీ. అక్షరాస్యతా శాతం 67.41%. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బంగాళాఖాతం సరిహద్దులుగా కలిగి ఉంది. కోస్తాలో 9 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, గుండ్లకమ్మ తదితర నదులతో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్‌ భాసిల్లుతోంది. ఈ రాష్ట్రంలో 56% వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్ల, 32% వర్షపాతం ఈశాన్య రుతుపవనాల వల్ల, మిగిలింది వేసవి వర్షాల వల్ల సంభవిస్తోంది. కొల్లేరు అతిపెద్ద మంచినీటి సరస్సు. పులికాట్‌ ఉప్పునీటి సరస్సు తమిళనాడు సరిహద్దుగా ఉంది.

ఆయా జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రత్యేకతలు
శ్రీకాకుళం జిల్లా

 • సూర్యనారాయణ ఆలయం (అరసవెల్లి) ఈ జిల్లాలో ఉంది.
 • కూర్మనాథాలయం (శ్రీకూర్మం – ఇక్కడ 2 ధ్వజస్తంభాలున్నాయి)
 • సూర్యుడికి, కూర్మనాథుడికి ఆలయం గల ఏకైక జిల్లా శ్రీకాకుళం.
 • ఇక్కడి మహేంద్రగిరి గొప్ప పర్యాటక కేంద్రం, ఎల్తైనది.
 • వంశధార నదీ తీరాన ఉన్న శ్రీముఖలింగం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం.
 • బౌద్ధులకు ప్రసిద్ధి చెందిన శాలిహుండం వంశధార నదీ తీరంలో ఉంది.
 • వంశధార, నాగావళి, వేగావతి మొదలైన నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి.
 • మథుకేశ్వరాలయం ఉంది.
 • ‘పొందూరు’ ఖద్దరు ప్రసిద్ధి చెందింది.
 • నక్సలైట్‌ ఉద్యమం ఈ జిల్లాలోనే ప్రారంభమైంది.
 • శ్రీకాకుళం లాంగుల్యా నదీ తీరాన ఉంది.
 • కళింగపట్నం, టెక్కెలిపాడు, సారవల్లి బౌద్ధ శిథిల ప్రాంతాలు.
 • డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఉంది.
విజయనగరం జిల్లా
 • పైడితల్లి సిరిమానోత్సవం జరుగుతుంది.
 • సంగీత పరికరాలు బొబ్బిలిలో తయారు చేస్తారు.
 • నాగావళి, చంపావతి, శారద, జంఝావతి, గోముఖీ నదులు ప్రవహిస్తున్నాయి.
 • గజపతుల చారిత్రక కోటను గో«థిక్‌ శైలిలో నిర్మించారు.
 • కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ఉంది.
 • భగవద్గీత సారం ఆధారంగా నిర్మించిన ఆలయం గోవిందాపురంలో ఉంది.
 • 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది.
 • నెల్లిమర్ల మాంగనీసు ఖనిజానికి కేంద్రం.
 • జనపనార ఉత్పత్తిలో ఆంధ్రాలో అగ్రగామి జిల్లా.
విశాఖపట్నం జిల్లా
 • దీనికి కుళోత్తుంగ చోళపట్టణం, వీరకూటం అనే ప్రాచీన నామాలు ఉన్నాయి.
 • సింహాచలంలో నారసింహ క్షేత్రం ఉంది.
 • వైశాఖ శుద్ధ తదియ రోజు నారసింహుడి నిజరూప దర్శనం ఉంటుంది. దీన్ని చందనోత్సవం అంటారు.
 • సింహాచల నారసింహాలయాన్ని కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు.
 • శ్రీకృష్ణదేవరాయలు విజయ స్తంభం నాటించాడు.
 • కప్ప స్తంభాన్ని కౌగిలించుకొనే ఆచారం సింహాచలంలో ఉంది.
 • ఆంధ్ర విశ్వకళా పరిషత్తు (ఆంధ్రా విశ్వవిద్యాలయం) ఉంది.
 • సింహాద్రి అప్పన్నకు ఎద్దులు, ఆవులను కానుకగా సమర్పిస్తారు.
 • బొజ్జనకొండ గొప్ప బౌద్ధ క్షేత్రం.
 • ఈ జిల్లాలో కైలాసగిరి పార్కు ఉంది.
 • విశాఖ జిల్లాలో గిరిజనులు చేసే దైవ సంబంధ నృత్యం – థింసా నృత్యం.
 • అరకులోయ ప్రసిద్ధ వేసవి విడిది ప్రాంతం.
 • పర్యాటక కేంద్రం లంబసింగి ఈ జిల్లాలో ఉంది.
 • హిందుస్తాన్‌ షిప్‌యార్డ్, కోరమండల్‌ ఎరువుల కర్మాగారం ప్రసిద్ధి చెందాయి.
 • ఇందిరా జువాలాజికల్‌ పార్కు ఉంది.
 • రామకృష్ణ బీచ్‌ ప్రాధాన్యత పొందింది.
 • బొర్రా గుహలు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.
 • దక్షిణ భారతదేశంలో తొలి మున్సిపాలిటీ భీమిలి.
 • ఇక్కడ గల భవనాశి సరస్సును దక్షిణాది బద్రీనాథ్‌ అంటారు
 • విశాఖ ఓడరేవు సహజసిద్ధమైంది.
 • బెల్లం తయారీకి అనకాపల్లి ప్రసిద్ధి చెందింది.
తూర్పుగోదావరి జిల్లా
 • అన్నవరంలో సత్యనారాయణస్వామి ఆలయం ఉంది.
 • రాజమండ్రి/రాజమహేంద్రవరంను ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా పేర్కొంటారు.
 • పాపికొండలు పర్యాటక కేంద్రం.
 • పిఠాపురంలో సంగీత పరికరాలు తయారు చేస్తారు.
 • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ ప్రసిద్ధి చెందింది.
 • తునిలో తలుపులమ్మ జాతర నిర్వహిస్తారు. ఈ దేవతను లలితాంబిక అంటారు.
 • ద్రాక్షారామం, కొమరారామం ఈ జిల్లాలో ఉన్నాయి.
 • కడియం నర్సరీ దేశంలోనే ప్రసిద్ధి చెందింది.
 • అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ఆలయం ఈ జిల్లాలోని ద్రాక్షారామంలో ఉంది.
 • తిలతైలాభిషేకాలు నిర్వహించే శనీశ్చరస్వామి ఆలయం మందపల్లిలో ఉంది.
 • మరిడమ్మ ఆలయం పెద్దాపురంలో ఉంది.
 • జగన్మోహినీ కేశవస్వామి ఆలయం ర్యాలీలో ఉంది.
 • ముందు, వెనుక పూజలు చేసే విగ్రహం గల ఆలయం ర్యాలీ జగన్మోహినీ ఆలయం.
 • ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఉంది.
పశ్చిమగోదావరి జిల్లా
 • గుంటుపల్లి బౌద్ధమత క్షేత్రం (అలెగ్జాండర్‌ రే కనుగొన్నారు) ఈ జిల్లాలో ఉంది.
 • పెనుగొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది వైశ్యుల ఆరాధనా కేంద్రం.
 • భీమవరంలో సోమేశ్వరాలయం (సోమారామం) ఉంది. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.
 • పాలకొల్లులో క్షీరారామాలయం ఉంది. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.
 • ద్వారకా తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. దీన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు.
 • పట్టిసీమలో వీరేశ్వరుడు కొలువై ఉన్న ఆలయం ఉంది.
 • అంతరిక్ష పరిశోధనలకు వాడే ఇంధనాన్ని తణుకులో, చక్కెర పరిశ్రమలో తయారు చేస్తారు.
 • వరి అధికంగా ఈ జిల్లాలో పండుతుంది.
 • తణుకులో ఆంధ్రా షుగర్స్‌ ఫ్యాక్టరీ ఉంది.
 • కొల్లేరు సరస్సు పర్యాటక ప్రాంతం.
కృష్ణా జిల్లా
 • కూచిపూడి/కుశలవపురం/కుచేలపురం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సిద్ధేంద్ర కళాక్షేత్రం ఉంది.
 • వేదాద్రి (జగ్గయ్యపేట సమీపంలో) నరసింహస్వామి ఆలయం పేర్గాంచింది.
 • కొల్లేరు సరస్సు, కొండపల్లి దుర్గం ప్రసిద్ధి చెందాయి.
 • ఘంటసాల (కంటకసాల)లో జలంధరేశ్వరాలయం ఉంది. బుద్ధుడి గుర్రం కంటక పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది.
 • భవానీ ద్వీపం అనే పర్యాటక కేంద్రం ప్రసిద్ధి చెందింది.
 • శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు ఆలయం శ్రీకాకుళంలో ఉంది. ఆముక్తమాల్యదను రాయడానికి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే శ్రీకారం చుట్టాడు.
 • గాంధీ కొండ విజయవాడలో ఉంది.
 • మచిలీపట్నం (బందరు) ప్రముఖ, ప్రాచీన ఓడరేవు ప్రాంతం.
 • విజయవాడకు సమీపాన మొగల్రాజపురంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. అనంతశయనశాయి, అర్ధనారీశ్వర, పూర్ణ కుంభం శిల్పాలు ఇక్కడే చెక్కారు.
 • కొండపల్లి బొమ్మలకు ఈ జిల్లా ప్రసిద్ధి (తెల్లపొణిక కర్రతో వీటిని తయారు చేస్తారు)
 • ఆంధ్రుల ఆర్థిక రాజధానిగా విజయవాడను వ్యవహరిస్తారు.
 • మంగినపూడి, చిలకలపూడి బీచ్‌లు ఉన్నాయి.
 • ప్రకాశం బ్యారేజీని కృష్ణానదిపై నిర్మించారు.
 • కనకదుర్గాలయం ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది.
 • మచిలీపట్నం కలంకారీ పరిశ్రమకు కేంద్రం.
 • నూజివీడు మామిడి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
గుంటూరు జిల్లా
 • దీని ప్రాచీన నామం కర్మ రాష్ట్రం.
 • కృష్ణానది తీరాన ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోంది.
 • హాయ్‌లాండ్‌ వినోద ప్రాంతం ఉంది.
 • మిర్చి పరిశోధనా కేంద్రం ‘లాం’లో ఉంది.
 • అమరావతిలోని అమరేశ్వరాలయం పంచారామాల్లో ఒకటిగా కీర్తి పొందింది.
 • ఉప్పలపాడులో సహజ పక్షుల కేంద్రం ఉంది.
 • పల్నాటి యుద్ధం జరిగిన కారెంపూడి ఈ జిల్లాలో ఉంది.
 • జీయర్‌ వేద విశ్వవిద్యాలయం ఉంది.
 • పొగాకు బోర్డు గుంటూరులో ఉంది.
 • కొండవీటి దుర్గం కీర్తిగాంచింది.
 • అమరావతిలో కాలచక్ర ఉత్సవాలు బౌద్ధ ధర్మం ప్రకారం జరిగాయి.
 • మాచెర్ల చెన్నకేశవాలయం, ఎత్తిపోతల ఈ జిల్లాలో ఉన్నాయి.
 • మంగళగిరిలో పానకాలస్వామి ఆలయం ఉంది. (ఇది దక్షిణాదిలో రెండో అతిపెద్ద గోపురం గల ఆలయం)
 • గుత్తికొండ బిలం, చీకటి మల్లన్న ఆలయం ఉన్నాయి.
 • చేబ్రోలులో బ్రహ్మాలయాన్ని వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిర్మించారు.
 • కళ్లకు గంతలు కట్టిన శనీశ్చరాలయం మాచర్లలో ఉంది.
 • చేజెర్లలోని కపోతేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది.
 • త్రికూటేశ్వరాలయం కోటప్ప కొండలో ఉంది.
 • ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ జిల్లాలో ఉంది.
 • పృథ్వీతిలక్‌ బసది (జైన) సత్తెనపల్లిలో ఉంది.
ప్రకాశం జిల్లా
 • చందవరం బౌద్ధారామం ప్రసిద్ధి చెందింది.
 • మోటుపల్లి ఓడరేవు ప్రసిద్ధి చెందింది. మోటుపల్లి అసలు పేరు దేశీయకొండ పట్టణం.
 • మోటుపల్లిలో వీరభద్రేశ్వరాలయం ఉంది.
 • చీమకుర్తి గ్రానైట్‌కు ప్రసిద్ధి.
 • మొగిలిచర్లలో దత్తాత్రేయ ఆలయం ఉంది. (మాలికొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది)
 • కనిగిరి కోట, అందులో నేలమాళిగలు ప్రసిద్ధి చెందాయి.
 • భైరవకోనలో 8 గుహలున్నాయి.
 • భైరవకోనలో త్రిముఖ దుర్గ శిల్పం ఉంది.
 • త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వరాలయం ఉంది.
 • మార్కాపురం పలకల తయారీకి ప్రసిద్ధి.
 • సింగరాయకొండలో ప్రసన్నాంజనేయస్వామి ఆలయం ఉంది.
 • పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
 • మైపాడు బీచ్‌ పర్యాటక కేంద్రం.
 • స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ నిర్వహిస్తారు.
 • పులికాట్‌ (పాలిక్కడ్‌) సరస్సు ఉంది.
 • నేలపట్టు పక్షుల అభయారణ్యం ప్రసిద్ధి చెందింది.
 • కవిబ్రహ్మ తిక్కన స్మారక నిర్మాణం పెన్నానదీ తీరాన ఉంది.
 • సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో ఉంది.
 • గూడూరు ‘మైకా’కు ప్రసిద్ధి.
 • జై ఆంధ్ర ఉద్యమ స్థూపం నెల్లూరు పట్టణంలో నిర్మించారు.
 • సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం ప్రసిద్ధి చెందింది.
 • బారాషాహిద్‌ దర్గా, కసుమూరు దర్గాలు పేరుగాంచాయి.
 • కృష్ణపట్నం, దుగరాజ పట్నం ఓడరేవు ప్రాంతాలు.
 • గాంధీజీ ప్రారంభించిన పల్లెపాడు ఆశ్రమం ఉంది.
 • పెన్నానదీ తీరంలో తల్పగిరి రంగనాథస్వామి ఆలయం ఉంది. ఇక్కడ రంగనాథ స్వామి శయనిస్తున్నట్లు ఉంటాడు.
 • అవధూత భగవాన్‌ వేంకయస్వామి ఆలయం ఉంది.
 • వేదగిరి నరసింహస్వామి ఆలయం, పెంచలకోన లక్ష్మీనరసింహాలయం ఉన్నాయి.
 • నర్రవాడ వెంగమాంబ జాతర జరుగుతుంది.
 • జరీ చీరలకు వెంకటగిరి ప్రసిద్ధి.
 • జొన్నవాడ కామాక్షితాయి ఆలయం పెన్నానదీ తీరాన ఉంది.
 • విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉంది.
 • వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు.
చిత్తూరు జిల్లా
 • చంద్రగిరిలో మానవ కేశాల నుంచి తైలం తీసే ఫ్యాక్టరీ ఉంది. దీన్ని జపాన్‌ సాయంతో నిర్మించారు.
 • కౌండిన్య వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది.
 • శ్రీవేంకటేశ్వర అభయారణ్యం ఉంది.
 • కళ్యాణి డ్యాం గొప్ప పర్యాటక స్థలం.
 • గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో ఉంది.
 • తిరుమలలో శిలాతోరణం ఉంది.
 • రాహు– కేతు ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారు. ఈ ఆలయం స్వర్ణముఖి నదీ తీరాన ఉంది.
 • పాపానాయుడు పేటలో గాజులు తయారు చేస్తారు.
 • ఏర్పేడు వ్యాసాశ్రమాన్ని మలయాళ స్వామి స్థాపించారు.
 • భారతదేశంలోనే అతి ప్రాచీన, ప్రథమ శివాలయంగా పేర్కొనే ఆలయం – గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం.
 • కాణిపాక వరసిద్ధి వినాయకాలయం ప్రసిద్ధి చెందింది.
 • తొలి రైలు పుత్తూరు – రేణిగుంటల మధ్య 1862లో నడిచింది.
 • తలకోన జలపాతం, చంద్రగిరి కోట, కైలాసకోన ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.
 • శేషాచలం కొండల్లో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (తిరుమల) ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
 • తిరుచానూరులో అలిమేలు మంగమ్మ ఆలయం ఉంది. (ముస్లింలు ఈ దేవతను బీబీ నాంచారమ్మగా పూజించారు)
 • హార్సిలీహిల్స్‌ (ఏనుగు మల్లమ్మ కొండలు) వేసవి విడిది ప్రాంతం.
 • తిరుపతి పట్టణంలో గంగమ్మ జాతర నిర్వహిస్తారు.
 • పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఈ జిల్లాలో ఉన్నాయి.
 • నారాయణవనంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.
అనంతపురం జిల్లా
 • ఆంధ్రాలో అతిపెద్ద జిల్లా.
 • లేపాక్షి నంది విగ్రహం దేశంలోనే అతి పెద్దది.
 • తాడిపత్రిలో చింతల వెంకటరమణస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది.
 • దత్త మండలాలకు ప్రధాన కేంద్రం అనంతపురం.
 • భగవాన్‌ సత్యసాయిబాబా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఉంది.
 • విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీటి వంశస్తుల రాజధానిగా పెనుగొండ వర్ధిల్లింది.
 • ధర్మవరం చీరలు ప్రసిద్ధి.
 • విజయనగర రాజుల చిత్రకళకు లేపాక్షి ప్రసిద్ధి.
 • పట్టు పరిశ్రమలో ఆంధ్రాలో ఈ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.
 • అతిపెద్ద కుంభకర్ణుడి విగ్రహం పెనుగొండ సమీపంలో ఉంది.
 • బంగారు గనులకు ప్రసిద్ధిగాంచిన జిల్లా.
 • వజ్రాలకు ప్రసిద్ధి చెందింది.
 • కదిరిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది.
 • రాయదుర్గం కోట ఈ జిల్లాలో ఉంది.
 • తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది (కదిరి సమీపంలో ఉంది).
 • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉంది.
వైఎస్‌ఆర్‌ కడప జిల్లా
 • ప్రాచీన కాలంలో హిరణ్య రాష్ట్రం అని పిలిచేవారు.
 • తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక.
 • బంగారు ఆభరణాల తయారీ పరంగా ప్రొద్దుటూరును రెండో బొంబాయిగా పేర్కొంటారు.
 • కందిమల్లయపల్లెలో బ్రహ్మంగారి జీవ సమాధి ఉంది.
 • ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది.
 • పోతన తన ఆంధ్ర మహాభాగవతాన్ని ఒంటిమిట్ట రాముడికి అంకితమిచ్చాడని ప్రతీతి.
 • రాష్ట్రంలోని ఏకైక అద్వైత పీఠం పెన్నానది ఒడ్డున ఉన్న పుష్పగిరి. దీన్ని విద్యారణ్య స్వామి స్థాపించారు.
 • పీర్‌సాహెబ్‌ దర్గా ఈ జిల్లాలో ఉంది.
 • గండికోట గొప్ప పర్యాటక కేంద్రం.
 • కలివికోడి అనే అత్యంత అరుదైన పక్షి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపిస్తుంది.
 • సురభి నాటక సమాజం ప్రసిద్ధి చెందింది.
 • యోగి వేమన విశ్వవిద్యాలయం ఉంది.
 • ఉల్లి పరిశోధనా కేంద్రం ఎర్రగుంట్లలో ఉంది.
కర్నూలు జిల్లా
 • అశోకుడి శిలా శాసనం ఎర్రగుడిపాడులో ఉంది.
 • శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి.
 • శ్రీభ్రమరాంబిక (శ్రీశైలం) ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి.
 • ధూళిదర్శనం (కాళ్లు కడుక్కోకుండా జ్యోతిర్లింగ దర్శనం) శ్రీశైలంలో కనిపిస్తుంది.
 • అగస్త్యుడు, లోపాముద్ర విగ్రహాలు గల ప్రాంతం హఠకేశ్వరం.
 • రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో బట్టమేక పక్షి అరుదుగా సంచరిస్తోంది.
 • యాగంటి బసవన్న ఆలయం ప్రసిద్ధి చెందింది.
 • బెలూం గుహలు ప్రముఖ పర్యాటక ప్రదేశం.
 • తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయం ఉంది.
 • అహోబిల నృసింహ క్షేత్రం గొప్ప పుణ్యక్షేత్రం.
 • శివలింగంపై ఆవు గిత్త గుర్తు ఉన్న ఆలయం మహానందిలోని శివాలయం.
 • సాక్షి గణపతి ఆలయం ఉన్న ప్రాంతం హఠకేశ్వరం.

మాదిరి ప్రశ్నలు

1. మైపాడు బీచ్‌ ఏ జిల్లాలో ఉంది?
 1) ప్రకాశం 
 2) నెల్లూరు
 3) గుంటూరు 
 4) విజయనగరం

Published date : 04 Mar 2017 04:10PM

Photo Stories