Skip to main content

రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్

రాజ్యాంగం పనితీరును సమీక్షించడానికిఎన్డీఏ ప్రభుత్వం 2000 ఫిబ్రవరి 22న జస్టిస్ ఎం.ఎన్.వెంకటాచలయ్య అధ్యక్షతన 10 మంది సభ్యులతో భారత రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్ సభ్యుడు పి.ఏ. సంగ్మా కమిషన్ నివేదిక సమర్పించక ముందే రాజీనామా చేశారు. ఈ కమిషన్‌కు కార్యదర్శిగా డా.రఘువీర్‌సింగ్ వ్యవహరించారు. ఈ కమిషన్ రచనా సంఘం 2001 సెప్టెంబర్‌లో డా.సుభాష్ సి.కశ్యప్ అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో ఏర్పడింది. రచనా సంఘంలో కె.పరాశరన్, డా. అబిద్ హుస్సేన్‌లను సభ్యులుగా నియమించారు. ఈ రాజ్యాంగ సమీక్ష సంఘం 18 పర్యాయాలు సమావేశమై 46 రోజులు సంప్రదింపులు జరిపింది. రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002 మార్చి 11న తన అధ్యయన నివేదికను ఆమోదించింది. 2002 మార్చి 31న అధ్యయన నివేదికను నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయికి సమర్పించింది. ఈ కమిషన్ 249 సిఫారసులతో 11 శీర్షికలుగా నివేదికను రూపొందించింది.

సూచనలు:
  • ఏడాదిలో కనీసం 80 రోజులు వేతనం అందేలా గ్రామాల్లో ఉపాధి పొందే హక్కును కల్పించడం.
  • భారత రాజ్యాంగంలోని 4వ భాగం శీర్షిక- రాజ్యాంగ విధాన ‘ఆదేశిక సూత్రాలు’ అనే చర్యగా సవరించాలి.
  • కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల గురించి, ప్రాథమిక విధులకు సంబంధించి పౌరులకు తగిన అవగాహన, పరిజ్ఞానం కల్పించే చర్యలు చేపట్టాలి.
  • ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి.
  • రాజకీయ పార్టీలన్నీ మహిళలకు 30 శాతం స్థానాలు కేటాయించాలి.
  • పార్లమెంటు ఏడాదికి 120 రోజులు సమావేశం కావాలి. రాజ్యసభ 100 రోజులు సమావేశం కావాలి. రాష్ట్రాల శాసన సభలు కూడా ఏడాదికి 90 రోజులు సమావేశం కావాలి.
  • కార్యనిర్వహణ శాఖ, ప్రభుత్వ పాలన, అధికారుల్లో బాధ్యత, జవాబుదారీతనం పెంపొందించడానికి సామాజిక తనిఖీ వ్యవస్థను ప్రవేశపెట్టాలి.
  • కేంద్ర, రాష్ర్ట సంబంధాలు బలంగా ఉండాలి, అంతర్రాష్ర్ట మండలి ద్వారా కేంద్ర ప్రభుత్వం వైయుక్తికంగా, సమష్టిగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి.
  • న్యాయశాఖలో మార్పులు చేపడుతూ, జాతీయ న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
  • అధికార వికేంద్రీకరణ, స్వావలంబన, గ్రామ పంచాయతీలను స్వయం పాలనా సంస్థలుగా ప్రకటించి వాటికి ప్రత్యేక అధికారాలు కేటాయించాలి.
  • వ్యవస్థీకృతమైన మార్పులు జరగాలి. సాంఘిక, ఆర్థిక మార్పులతో పాటు అభివృద్ధి క్రమం విస్తరించాలి. మైనారిటీ వర్గాల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి చర్యలు చేపట్టాలి.

లక్ష్యాలు
  • దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థవంతమైన, జవాబుదారీతనం, పారదర్శకత, నీతివంతమైన పాలన కోసం ఏ మేరకు రాజ్యాంగపరమైన అంశాలు దోహదపడతాయనే అంశాలను సునిశితంగా పరిశీలించి సూచనలు చేయడం.
  • రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా రాజ్యాంగపరమైన అంశాల్లో అవసరమైన క్రమానుగత మార్పులను సూచించడం.
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంవిధానం మేరకు ఆధునిక భారతదేశ ఆర్థిక, సాంఘిక, రాజకీయ అభివృద్ధి సాధనకు సవివరమైన సూచనలు చేయడం.

జిల్లా కలెక్టర్
దేశంలో జిల్లా కలెక్టర్ పదవిని 1772లో వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. స్వాత్రంత్యానంతరం ఐఏఎస్‌కు చెందిన అధికారి జిల్లా కలెక్టర్‌గా నియమితులవుతున్నారు. జిల్లా కలెక్టర్ హోదాను ఫ్రాన్స్ లోని ప్రిఫెక్ట్ అనే పదవితో పోల్చుతారు.

అధికారాలు-విధులు
1) రెవెన్యూ విధులు
2) న్యాయపరమైన విధులు
3) ఎన్నికల నిర్వహణ
4) ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినవారిని ఆదుకోవడం
5) అభివృద్ధి కార్యక్రమాల అమలు
6) జనాభా లెక్కల సేకరణ
7) స్థానిక సంస్థలపై పర్యవేక్షణ.
నోట్: జిల్లా కలెక్టర్‌కు అనేక అంశాలతో జిల్లా పరిషత్‌లకు సంబంధం ఉంటుంది. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలకుశాశ్వత ఆహ్వానితుడి హోదాలో కలెక్టర్ హాజరవుతాడు. జిల్లా పరిషత్ పనితీరు గురించి రాష్ర్ట ప్రభుత్వానికి నివేదికను పంపిస్తాడు. జిల్లా పరిషత్‌లోని వివిధ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తాడు.

జాతీయ న్యాయ మండలి
న్యాయమూర్తులను జవాబుదారీ చట్రంలోకి తెచ్చే దిశగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. న్యాయమూర్తులపై వచ్చే ఆరోపణలపై విచారణ చేయడానికి, దోషులుగా తేలిన న్యాయమూర్తులను తొలగించడానికి వీలుగా ఉండే ‘The Judges Bill - 2006’ను తీసుకురావాలని అప్పట్లో కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. 2006 నవంబర్ 9న నాటి ప్రధాని అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. న్యాయవ్యవస్థ పనితీరులో పారదర్శకత, జడ్జీలను జవాబుదారీ చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను విచారించడానికి జాతీయ న్యాయ మండలి (ఎన్‌జేసీ) ఏర్పాటు చేయాలని ఈ బిల్లు పేర్కొంటుంది. దీనికోసం 1968 జడ్జీల చట్టానికి సవరణ తీసుకొస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మినహా ఇతర జడ్జీల్లో ఎవరిపై ఆరోపణలు వచ్చినా ఎన్‌జేసీ విచారిస్తుంది. జాతీయ న్యాయ మండలిలో భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, మరో ఇద్దరు సీనియర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. ఒకవేళ సుప్రీంకోర్టులోని జడ్జిపై ఫిర్యాదును విచారించాల్సివస్తే హైకోర్టు న్యాయమూర్తుల స్థానంలో మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తారు. జడ్జీలపై తప్పుడు ఆరోపణలు చేస్తే అతడికి ఏడాది జైలు, రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తారు. ఈ న్యాయ మండలి నేరుగా లేదా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్‌పర్సన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఫిర్యాదుదారు, జడ్జి ఎవరనేది రహస్యంగా ఉంచేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా నెల పాటు శిక్ష, రూ. 500 జరిమానా లేదా రెండూ అమలు చేయవచ్చు. ఫిర్యాదులను ఎన్‌జేసీ రహస్యంగా విచారిస్తుంది. జడ్జి దుష్ర్పవర్తన, అసమర్థతతో వ్యవహరించినట్లు రుజువైతే.. అతడ్ని తొలగించాల్సిన అవసరం లేదని న్యాయ మండలి భావిస్తే, ఈ కింది చర్యలు తీసుకోవచ్చు.
  • సలహాలు ఇవ్వడం.
  • హెచ్చరికలు చేయడం
  • స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని కోరడం.
  • బహిరంగంగా లేదా రహస్యంగా మందలించడం లేదా అభిశంసించడం చేస్తుంది.

ఒకవేళ న్యాయమూర్తి తొలగింపు తప్పదని భావిస్తే, ఆ మేరకు రాష్ర్టపతికి న్యాయ మండలి సిఫారసు చేస్తుంది. దీన్ని స్వీకరించిన రాష్ర్టపతి మండలి గుర్తించిన అంశాలు, సంబంధిత నివేదికలను, సిఫారసులను పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని కోరతాడు. అప్పుడు జడ్జి తొలగింపు కోసం రాష్ర్టపతికి అభ్యర్థన చేస్తూ సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెడుతుంది. ఆ తీర్మానం ఆమోదం ద్వారా తొలగింపునకు గురైన న్యాయమూర్తి వివిధ రకాల విధులకు అనర్హుడవుతారు. లా కమిషన్ 195వ నివేదికలో చేసిన సిఫారసుల ప్రాతిపదికన ఈ నూతన బిల్లును రూపొందించారు. జస్టిస్ వెంకటాచలయ్య కమిటీ, జాతీయ లా కమిషన్‌లు న్యాయమూర్తులను జవాబుదారీ చట్రంలోకి తీసుకురావాలని సిఫారసు చేశాయి.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
పదవి, డబ్బులకోసం సభ్యులు పార్టీలు మారడం 1967 తర్వాత ఎక్కువగా జరిగాయి. దీన్నే ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. పార్టీ ఫిరాయింపులను నివారించడానికి 1985లో 52వ రాజ్యాంగ సవరణ చేశారు. పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం ఈ కింది కారణాలతో సభ్యులను తొలగించవచ్చు.
  • పార్టీ సభ్యుడు తాను ఎన్నికైన పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు.
  • పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సభలో తన ఓటు హక్కును వినియోగించినప్పుడు, ముందుగా అనుమతి తీసుకోకుండా ఓటింగ్‌కు గైర్హాజరైనప్పుడు.

అయితే అత్యవసర కారణాల వల్ల సభకు రాలేకపోయాడని గైర్హాజరైన 15 రోజుల లోపు పార్టీ గుర్తిస్తే పార్టీ ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. 1942లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పార్టీలు జారీ చేసే విప్.. విశ్వాస, అవిశ్వాస తీర్మానాలకు మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. స్వతంత్రంగా ఎన్నికైన సభ్యుడు ఏదైనా పార్టీలో చేరితే సభ్యత్వం కోల్పోతాడు. నామినేటేడ్ సభ్యుడు ఆరు నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరితే సభ్యత్వం కోల్పోతాడు.
ముఖ్యాంశాలు:
  • భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అనే పదం 10వ షెడ్యూల్‌లో మాత్రమే ఉంది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హయాంలో 52వ రాజ్యాంగ సవరణ చేసి ఫిరాయింపుల చట్టానికి సంబంధించి 102(2), 191(2) అధికరణలను చేర్చారు.
  • దేశంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగ బద్ధమైనవి కావు. అవి కేవలం చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ ద్వారా గుర్తింపు పొంది ఏర్పాటయ్యాయి.

వర్తించని సందర్భాలు:
  • పార్టీలలో చీలిక ఏర్పడి మూడో వంతు సభ్యులు గ్రూప్‌గా ఏర్పడితే ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాదు.
  • పార్టీ సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు వేరే పార్టీలో చేరినప్పుడు కూడా ఈ చట్టం పరిధిలోకి రాదు.
  • లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌లు తమ పదవులు వదిలి వారి పార్టీల్లో చేరినప్పుడు వారికి ఈ చట్టం వర్తించదు. రాష్ట్రాల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
  • పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు విషయంలో చైర్మన్, స్పీకర్‌దే అంతిమ నిర్ణయం.
  • రాజకీయ పారీల్లో చీలికలను నిరోధించడానికి, రాష్ట్రాల్లో మంత్రివర్గ పరిమాణాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన 97వ రాజ్యాంగ సవరణ బిల్లు, 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003గా అమల్లోకి వచ్చింది. ఈ బిల్లు ప్రకారం పార్టీ నుంచి ఎంతమంది ఫిరాయించినా వారు అనర్హులవుతారు. తిరిగి పోటీ చేసి గెలిచే వరకూ వారు ప్రతిఫలాన్నిచ్చే ఏ పదవీ చేపట్టడానికి వీలులేదు.
  • పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు స్పీకర్ వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది.

సభ్యత్వం రద్దు-సుప్రీంకోర్టు తీర్పు
1993లో కివోటో ఉలాహన్ వర్సెస్ జాచి లు కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. సభ్యుడి సభ్యత్వం రద్దుపై స్పీకర్(సభాధ్యక్షుడు)ది తుది నిర్ణయం కాదని వారి నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని పేర్కొంది.

ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ
క్రిమినల్ కేసుల్లో కోర్టు దోషులుగా నిర్ధారించిన వ్యక్తులు శిక్ష అనుభవిస్తున్న కాలం తర్వాత మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా ప్రజాప్రాతినిధ్యం చట్టం (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది. నేర చరితులను చట్ట సభలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేస్తున్నారు. గతంలో దీర్ఘకాలం శిక్షపడిన వ్యక్తులు తొలి ఆరేళ్లలో పోటీ చేయలేకపోయినా తర్వాత జైలులో ఉండి పోటీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా చేశారు. అవినీతి నిరోధక చట్టం, తీవ్రవాద నిరోధక చట్టం కింద శిక్షపడిన వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. అవినీతి నిరోధక చట్టం కింద కనీసం రెండు సంవత్సరాలు శిక్షపడినా అనర్హత వర్తిస్తుంది.

రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్
ఎం.ఎన్. వెంకటాచలయ్య (అధ్యక్షుడు)
సభ్యులు..
  • జస్టిస్ బి.పి.జీవన్‌రెడ్డి ( చైర్మన్, లా కమిషన్ ఆఫ్ ఇండియా)
  • జస్టిస్ ఆర్.ఎస్.సర్కారియా (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి)
  • జస్టిస్ కె.పున్నయ్య (ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి)
  • పి.ఏ.సంగ్మా (లోక్‌సభ మాజీ స్వీకర్)
  • సోలీ జె.సొరాబ్జీ (అటార్నీ జనరల్)
  • కె.పరాశరన్ (మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా)
  • డాక్టర్. సుభాష్ సి.కశ్యప్ (లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్)
  • సి.ఆర్.ఇరానీ (ది స్టేట్స్‌మన్ పత్రిక చీఫ్ ఎడిటర్)
  • అబిద్ హుస్సేన్ (యూఎస్‌ఏలో భారత మాజీ రాయబారి)
  • శ్రీమతి సుమిత్ర జి.కులకర్ణి (మాజీ ఎంపీ)

మాదిరి ప్రశ్నలు

1. రాజ్యాంగ సమీక్ష కోసం ఏర్పాటైన జాతీయ కమిషన్‌కు అధ్యక్షత వహించిన వారు?
ఎ) పి.ఏ సంగ్మా
బి) జస్టిస్ బి.పి జీవన్‌రెడ్డి
సి) జస్టిస్ ఎంఎన్. వెంకటాచలయ్య
డి) సీఆర్ ఇరానీ

Published date : 27 Nov 2015 06:35PM

Photo Stories