Skip to main content

74వ రాజ్యాంగ సవరణ ముఖ్యాంశాలు

మన దేశంలో పట్టణ, నగరాల్లో పౌర సదుపాయాల కల్పనకు పట్టణ స్థానిక ప్రభుత్వాలున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 రకాలైన పట్టణ స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.
పట్టణ స్థానిక ప్రభుత్వాలు
1.మునిసిపల్ కార్పొరేషన్
2. నోటిఫైడ్ ఏరియా కమిటీ
3. కంటోన్మెంట్ బోర్డ్
4. పోర్‌‌ట ట్రస్ట్, 5. మునిసిపాలిటీ
6. టౌన్ ఏరియా కమిటీ
7. టౌన్‌షిప్,
8. ప్రత్యేక ప్రయోజన సంస్థలు

దేశంలో తొలిసారిగా 1687లో మద్రాస్‌లో మునిసిపల్ కార్పొరేషన్‌ను బ్రిటిష్‌వారు ఏర్పాటు చేశారు. 1726లో బాంబే, కలకత్తా కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 1993, జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది.

74వ రాజ్యాంగ సవరణ
పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలో "IXA' భాగంలో ప్రకరణ 243P నుంచి 243Zఎ వరకు పొందుపరిచారు.
మునిసిపాలిటీ: 243Q ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలన సంస్థ.
పంచాయతీ: 243B ప్రకరణ కింద పంచాయతీగా ఏర్పడిన ప్రాంతం.
జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి, నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా.
  • 243Q మునిసిపాలిటీల నిర్మాణం గురించి తెలుపుతోంది.
  • గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు.
  • చిన్న పట్టణాల్లో మునిసిపల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు.
  • పెద్ద పట్టణాల్లో మునిసిపల్ కార్పొరేషన్లు ఉంటాయి.
  • పట్టణంగా పరివర్తన చెందుతున్న ప్రాంతం, చిన్న పట్టణం, పెద్ద పట్టణం వంటి అంశాలకు సంబంధించి రాష్ర్ట గవర్నర్ సరైన అర్థ వివరణ ఇస్తారు.
మునిసిపాలిటీ ఎన్నికలు
  • ప్రకరణ 243R మునిసిపాలిటీల నిర్మాణం, ఎన్నికల గురించి తెలియజేస్తోంది.
మునిసిపాలిటీ సభ్యులను (అన్ని స్థాయిల్లో) ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
మునిసిపాలిటీ సభ్యుల కూర్పు, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన చట్టాలను రాష్ర్ట శాసన నిర్మాణ శాఖ రూపొందిస్తుంది.
  • నగర పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ అధ్యక్షుల ఎన్నిక రాష్ర్ట శాసన నిర్మాణ శాఖ నిర్ణయించిన మేరకు ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.
  • సంబంధిత మునిసిపాలిటీ, కార్పొరేషన్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు హోదా రీత్యా సభ్యులుగా కొనసాగుతారు.
వార్డు కమిటీలు
  • ప్రకరణ 243 ప్రకారం 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన మునిసిపాలిటీల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వార్డులను కలిపి వార్డు కమిటీలను ఏర్పాటు చేయొచ్చు.
  • వార్డ్ కమిటీ ఏర్పడినప్పుడు సంబంధిత వార్డ్ ప్రతినిధిని ఆ కమిటీకి అధ్యక్షుడిగా నియమించాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ వార్డులతో వార్డు కమిటీ ఏర్పాటు చేస్తే ఆయా వార్డుల ప్రతినిధులు తమలో ఒకర్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
  • కార్పొరేషన్‌లో వార్డ్ కమిటీల సంఖ్య 50కి తగ్గకుండా, 100కి మించకుండా ఉండాలి.
రిజర్వేషన్స్
  • పకరణ 243T రిజర్వేషన్ల గురించి పేర్కొంటుంది.
  • ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి.
  • ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్వ్ చేయాలి.
  • మొత్తం స్థానాల్లో కనీసం 1/3 వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి.
రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో కేటాయించాలి.
  • రాష్ర్ట శాసన నిర్మాణ శాఖ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని కలిగి ఉంది.
పదవీ కాలం, అనర్హతలు
  • ప్రకరణ 243U పదవీ కాలం గురించి తెలుపుతోంది. అన్ని స్థాయిల్లోని సభ్యులు, అధ్యక్షుల పదవీకాల పరిమితి ఐదేళ్లు. ప్రకరణ 243V అనర్హతల గురించి పేర్కొంటోంది.
  • పంచాయతీరాజ్ వ్యవస్థలో అన్ని స్థాయిల్లోఅధ్యక్ష, సభ్యుల అర్హతలను నిర్ణయించే అధికారం రాష్ర్ట శాసన నిర్మాణశాఖకు ఉంటుంది.
  • పార్లమెంటుకు, అసెంబ్లీలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హత, అనర్హత నిబంధనలే స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు కూడా వర్తిస్తాయి.
  • స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు కనీసం 21 ఏళ్లు ఉండాలి.
  • 1995 సంవత్సరం తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగుంటే పోటీకి అనర్హులు.
అధికార విధులు
ప్రకరణ 243W అధికార విధుల గురించి వివరిస్తోంది.
12వ షెడ్యూల్‌లో 18 విధులను పట్టణ స్థానిక సంస్థలకు నిర్దేశించారు. వీటిని రాష్ర్ట ప్రభుత్వాలు బదిలీ చేస్తాయి. పన్నెండో షెడ్యూల్‌లో పేర్కొన్న 18 విధుల వివరాలు..
1.నగర ప్రణాళిక
2. సమర్ధవంత భూ వినియోగం, భవన నిర్మాణాలపై నియంత్రణ
3. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు
4. మురికివాడల నిర్మూలన, అభివృద్ధి
5. పట్టణ అడవులు, పర్యావరణ పరిరక్షణ
6. రహదారులు, వంతెనలు
7. ప్రజారోగ్యం, మురుగు నీటిపారుదల, చెత్త నియంత్రణ
8. అగ్నిమాపక వ్యవస్థ
9. పరిశ్రమలకు, గృహాలకు నీటి వసతి
10. బలహీన వర్గాల సంరక్షణ, వికలాంగులకు వసతి.
11. వీధి దీపాలు, బస్టాండుల నిర్వహణ
12. కబేళాలపై నియంత్రణ
13. నగర దారిద్య్ర నిర్మూలన పథకాలు
14. విద్య, సాంస్కృతిక అభివృద్ధికి చర్యలు
15. జంతువుల సంరక్షణ
16. ఆట స్థలాలు, ఉద్యానవనాల నిర్వహణ
17. శ్మశాన వాటికల నిర్వహణ
18. జనన, మరణాల నమోదు

ఆదాయ వనరులు, హక్కులు
ప్రకరణ 243X ప్రకారం స్థానిక సంస్థలు తమ ఆదాయం కోసం శాసనసభ నిర్ణయించిన మేరకు పన్నులు విధించడం, వసూలు చేయడం చేయవచ్చు. దీంతోపాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కూడా సహాయ నిధులు అందిస్తాయి.

ప్రకరణ 243Y ప్రకారం ఫైనాన్స్ కమిషన్
73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న ప్రకరణ 243ఐలోని రాష్ర్ట ఫైనాన్స్ కమిషన్ పట్టణ స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.

ప్రకరణ 243Z ప్రకారం అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్
పట్టణ, నగర కార్పొరేషన్ సంస్థల అకౌంట్‌లను పరిశీలించేందుకు రాష్ర్ట శాసనసభ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవచ్చు.

ప్రకరణ 243ZA ప్రకారం మునిసిపాలిటీల ఎన్నికల నిర్వహణ
ప్రకరణ 243Kలో ప్రస్తావించిన విధంగా రాష్ర్ట ఎన్నికల కమిషన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.

ప్రకరణ 243ZB ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు
74వ రాజ్యాంగ సవరణలోని అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి. పార్లమెంటు చట్టం ద్వారా వీటిని వర్తింప చేస్తుంది.

ప్రకరణ 243ZC ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపులో మినహాయింపులు
  • 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలు, 244(2) ప్రకారం షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో ఈ విభాగం వర్తించదు.
  • పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని కొండ ప్రాంతాలకు ఏర్పాటు చేసినగూర్ఖాహిల్ కౌన్సిల్‌కు ఈ విభాగం వర్తించదు.
  • ప్రకరణ 244(1), 244(2) ప్రకారం షెడ్యూల్డ్, ఆదివాసీ ప్రాంతాలకు ఈ విభాగాన్ని వర్తింపచేస్తూ పార్లమెంట్ శాసనాలను రూపొందించవచ్చు. అయితే వాటిని రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు.
ప్రకరణ 243ZD ప్రకారం జిల్లా ప్రణాళికా కమిటీ
ప్రతి రాష్ర్టంలో జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ పంచాయతీ, మునిసిపాలిటీలు రూ పొందించిన ప్రణాళికలను సమీకరించి తుది ప్రణాళికలను రూపొందిస్తుంది. జిల్లా ప్రణాళిక కమిటీ నిర్మాణాన్ని రాష్ర్ట శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.
గమనిక: జిల్లా ప్రణాళిక కమిటీ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి వర్తించదు.

ప్రకరణ 243ZE ప్రకారం మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీ
10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటి నిర్మాణం, విధులు వంటి అంశాలను రాష్ర్ట శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. నగర మేయర్ ఈ కమిటీకి చైర్మన్‌గా, మునిసిపల్ కమిషనర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. దీంతోపాటు కమిటీలో మునిసిపల్ పాలనలో అనుభవమున్న నలుగురు సభ్యులను రాష్ర్ట ప్రభుత్వం నియమిస్తుంది. మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సభ్యులను గ్రామ పంచాయతీ అధ్యక్షులు, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ప్రతినిధులు ఎన్నుకుంటారు.

ప్రకరణ 243ZF ప్రకారం పాత శాసనాల కొనసాగింపు
74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరం వరకు రాష్ర్టంలో అమల్లో ఉన్న పాత చట్టాలే కొనసాగుతాయి. ఆ తర్వాత రాష్ర్ట ప్రభుత్వాలు కొత్త చట్టాలను అనువర్తింప చేసుకోవాలి.

పట్టణ స్థానిక సంస్థలు - నిర్మాణం
1992లో 74వ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  • మొదటి అంచె - నగర పంచాయతీ
  • రెండో అంచె - పురపాలక సంస్థలు
  • మూడో అంచె - నగరపాలక సంస్థలు
నగర పంచాయితీ
  • గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణీకరణ దిశగా మారుతున్న సుమారు 20,000 నుంచి 40,000 వరకు జనాభా గల చిన్న పట్టణ ప్రాంతాలకు నగర పంచాయతీ హోదా కల్పిస్తారు. నగర పంచాయతీని జనాభా మేరకు వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఓటర్లతో ఒక సభ్యుడు నేరుగా ఎన్నికవుతారు. ప్రతి నగర పంచాయతీలో గరిష్టంగా 10 మంది ఎన్నికైన వార్డు సభ్యులు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు.
  • నగర పంచాయతీలో నివాసముంటున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హోదా రీత్యా సభ్యులుగా ఉంటారు.
  • నగర పంచాయతీ సభ్యులు తమలో ఒకర్ని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
  • సర్పంచ్, ఉప సర్పంచ్‌లను తొలగించినట్లే వీరిని కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.
పురపాలక సంస్థలు
1965లో సమగ్ర పురపాలక సంస్థల చట్టం ప్రకారం మునిసిపాలిటీలు ఏర్పడ్డాయి. 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త చట్టాన్ని రూపొందించింది. 40,000 నుంచి 3,00,000 జనాభా ఉన్న పట్టణాల్లో పురపాలక సంస్థలను ఏర్పాటు చేస్తారు. వార్షికాదాయ, పరిమాణాల ఆధారంగా పురపాలక సంస్థలను ఐదు రకాలుగా వర్గీకరించారు. అవి..
1.సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంఘం: వార్షిక ఆదాయం రూ.8 కోట్ల కంటే ఎక్కువ ఉన్నవి.
2. స్పెషల్ గ్రేడ్ పురపాలక సంఘం: వార్షికాదాయం రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య ఉన్నవి.
3. గ్రేడ్-1 పురపాలక సంఘం: వార్షికాదాయం రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల మధ్య ఉన్నవి.
4. గ్రేడ్-2 పురపాలక సంఘం: వార్షికాదాయం రూ.2 కోట్లు నుంచి రూ.4 కోట్ల మధ్య ఉన్నవి.
5. గ్రేడ్-3 పురపాలక సంఘం: వార్షికాదాయం కోటి రూపాయల నుంచి రూ. రెండు కోట్లలోపు ఉన్నవి.
సూచన: ఈ వర్గీకరణను ప్రభుత్వం కాలానుగుణంగా మార్చవచ్చు.

ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. అవి..
పురపాలక మండలి: పురపాలక సంస్థ చర్చా వేదికే పురపాలక మండలి. ఇందులో ఎన్నికైన సభ్యులు. కోఆప్టెడ్ సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉంటారు.

మున్సిపల్ కౌన్సిలర్లు:
వీరిని ఓటర్లు వార్డు ప్రాతిపదికన ఎన్నుకుంటారు. జనాభాను బట్టి వీరి సంఖ్యను నిర్ణయిస్తారు.
  • 40 వేల వరకు జనాభా ఉంటే 21 మంది కౌన్సిలర్లు ఉంటారు.
  • జనాభా 40 వేల నుంచి లక్ష వరకు ఉంటే 21 మంది సభ్యులు, ప్రతి 10 వేల జనాభాకు ఒక సభ్యుడు అదనంగా ఉంటారు.
  • జనాభా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటే 27 మంది సభ్యులు, ప్రతి 15 వేల జనాభాకు ఒక సభ్యుడు అదనంగా ఉంటారు.
  • జనాభా రెండు లక్షల మించి ఉంటే 33 మంది సభ్యులు, ప్రతి 20 వేల అదనపు జనాభాకు ఒక అదనపు సభ్యుడు ఉండవచ్చు. గరిష్టంగా 45 సభ్యులకు మించరాదు.
Published date : 18 Aug 2016 12:31PM

Photo Stories