Skip to main content

ప్రాంతీయ రాజ్యాలు

సిక్కులు

గురునానక్ (1469-1539)
సిక్కు మతస్థాపకుడు గురునానక్. ఇతడు 1469లో పంజాబ్‌లోని తల్వండి అనే గ్రామంలో జన్మించాడు. మొదటి సిక్కు గురువైన గురునానక్ సర్వమత సమానత్వాన్ని, సహన భావాన్ని బోధించాడు. ఇతడి శిష్యులను ‘నానక్ పంతి’ అంటారు. కొంత కాలం తర్వాత వీరినే సిక్కులుగా పిలిచారు. దేవుడు ఒక్కడేనని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలని నానక్ బోధించాడు.

గురు అంగద్ (1539-1552)
గురు అంగద్ 1539లో నానక్ వారసుడిగా గురువయ్యాడు. ఇతడు మొగల్ చక్రవర్తి హుమాయూన్‌కు సమకాలీకుడు. అంగద్ ‘గురుముఖి’ లిపిని కనిపెట్టాడు. భాయిబాల సహాయంతో నానక్ జీవిత చరిత్రను రచించాడు.

గురు అమర్‌దాస్ (1552-1574)
ఇతడు 78 ఏళ్ల వయస్సులో సిక్కు గురువు అయ్యాడు. సతీ సహగమనాన్ని నిరసించాడు.

గురు రామ్‌దాస్ (1574-81)
ఇతడు గురు అమర్‌దాస్ అల్లుడు. గురు రామ్‌దాస్ మొగల్ చక్రవర్తి అక్బర్‌కు సమకాలీకుడు. అక్బర్ పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రాంతాన్ని ఇతడికి బహుకరించగా అక్కడే 1577లో స్వర్ణ దేవాలయ నిర్మాణానికి పునాది వేశాడు. ఒక సరస్సును తవ్వించాడు. ఇతడి కాలం నుంచే గురువు కావడం వారసత్వ హక్కుగా మారింది.

గురు అర్జున్ దేవ్ (1581-1606)
ఇతడు సిక్కుల అయిదో గురువు. ప్రాచీన హిందూ, ముస్లింల రచనల్లోని ముఖ్య సిద్ధాంతాలు సేకరించి ‘ఆదిగ్రంథ్’ను సంకలనం చేశాడు. ఇది సిక్కుల పవిత్ర గ్రంథం. స్వర్ణ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ‘వైశాఖి’ అనే పండుగను ప్రవేశపెట్టి ప్రజల సంపాదనలో పదో వంతు వసూలు చేసేవాడు. జహంగీర్ కుమారుడైన ఖుస్రూ తండ్రికి ఎదురు తిరిగాడు. అర్జున్ దేవ్ ఖస్రూకు ఆశ్రయం కల్పించాడు. ఫలితంగా జహంగీర్ చక్రవర్తి అర్జున్ దేవ్‌పై దేశద్రోహ నేరం మోపి అతణ్ని ఉరితీయించాడు. ఈ ఘటనతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సిక్కులు సైనికులుగా మారారు.

గురు హర గోవింద్ (1606-44)
ఇతడు గురు అర్జున్ దేవ్ వారసుడు. రక్షక దళాన్ని చిన్న సైన్యంగా మార్చాడు. సైనిక శిక్షణ ఇప్పించాడు. ‘అఖల్ తక్త్’ను స్థాపించాడు. ‘లోహఘర్’ (అమృత్‌సర్) కోటను నిర్మించాడు. ఇతడికి ‘సచ్ఛాబాద్షా’ అనే బిరుదు ఉంది. హర గోవింద్ సింగ్ ‘సంగ్రామ్’ యుద్ధంలో షాజహాన్ సైన్యాన్ని ఓడించాడు. ఇతడి తర్వాత గురువైన గురు హర రాయ్ (1644-61) శాంత స్వభావుడు. హర రాయ్ తర్వాత గురు హర కృష్ణ (1661-64) గురువయ్యాడు.

గురు తేజ్ బహద్దూర్ (1664-1675)
తేజ్ బహదూర్ కశ్మీర్‌లోని ఆనందపూర్‌లో స్థిరపడ్డాడు. ఇతడు ఔరంగజేబ్ అసహన మత విధానాన్ని వ్యతిరేకించాడు. దీంతో ఔరంగజేబ్ తేజ్ బహద్దూర్‌ను చిత్రవధ చేసి చంపించాడు.

గురు గోవింద్ సింగ్ (1675-1708)
ఇతడు పదో గురువు, చివరి వాడు. ఇతడు సిక్కులను రాజకీయ, సైనిక సమాజంగా రూపొందించాడు. దీన్నే ఖల్సా సమాజం అంటారు. సిక్కులు ఖడ్గంతో చిలికిన నీటిని తాగి ‘సింగులు’ (సింహాలు)గా బిరుదు వహించారు. ఖల్సా ప్రకారం సిక్కులు కేశ (పొడవు వెంట్రుకలు), కంఘ్రూ (దువ్వెన), కృపాణ్ (ఖడ్గం), కచ్చా (పొట్టి లాగు), కర్ద (చిన్న చాకు)ను ధరించేవారు. ఇతడి కుమారులందరూ ఆనందపూర్ యుద్ధంలో మరణించారు. గోవింద్ సింగ్‌ను నాందేడ్‌లో ఒక అఫ్గాన్ సైనికుడు కత్తితో పొడిచి చంపాడు. అయిదుగురు సిక్కులు ఎక్కడ కూడితే అక్కడే నేనుంటాను అని గురు గోవింద్ సింగ్ తన శిష్యులకు చివరి సందేశం ఇచ్చాడు.


1708 తర్వాత సిక్కుల చరిత్ర

బందా బహదూర్ (1708-16)
ఇతడు సిక్కుల నాయకుడయ్యాడు. సిక్కుల స్వాతంత్య్రం కోసం మొగలులతో పోరాటం చేశాడు. సయ్యద్ సోదరులు బందా బహదూర్‌ను బంధించి హత్య చేశారు. సిక్కులు స్థాపించిన రాజ్యాలను ఖల్సా రాజ్యాలంటారు. 1773 నాటికి 12 ఖల్సా రాజ్యాలుండేవి. సుకేర్ చకియా వీటిలో ఒక రాజ్యం. చరత్ సింగ్ దీని స్థాపకుడు. అతని కుమారుడు రంజిత్ సింగ్. ఈయన 1780 నాటికి సుకేర్ చకియా పాలకుడయ్యాడు.

రంజిత్ సింగ్ (1792-1839)
ఇతడికి పంజాబ్ సింహం అనే బిరుదు ఉంది. 1799లో లాహోర్‌ను ఆక్రమించి సట్లేజ్ నదికి పశ్చిమంగా ఉన్న ఖల్సా రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. 1801లో మహారాజా అనే బిరుదు ధరించాడు. ఇతడు సిక్కు సామ్రాజ్య నిర్మాత. బ్రిటిష్ వారితో సఖ్యతతో మెలిగాడు. 1809లో గవర్నర్ జనరల్ మింటోతో సంధి చేసుకున్నాడు. రైతుల నుంచి 40 శాతం శిస్తు వసూలు చేసేవాడు. రంజిత్ సింగ్ వారసులు అసమర్థులైనందువల్ల మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం (1845-46), రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం (1848-49)లో బ్రిటిషర్లు సిక్కులను జయించారు. దీంతో పంజాబ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైంది.

మరాఠాలు

శివాజీ
శివాజీ 1627లో జన్మించాడు. ఇతడి తల్లి జిజియా బాయి. శివాజీ దాదాజీ కొండదేవ్ సంరక్షణలో పెరిగాడు. ఇతడి గురువు రామదాస్. రాయ్‌గఢ్ వద్ద దుర్గాన్ని నిర్మించి తన కార్యకలాపాలకు కేంద్రం చేసుకున్నాడు. శివాజీని చంపి లేదా బంధించి తీసుకురమ్మని 1659లో బీజాపూర్ సుల్తాన్ తన సేనాని అఫ్జల్ ఖాన్‌ను ఆదేశించాడు. శివాజీ భాఘ్‌నఖ్ (పులిగోళ్లు) ఉపయోగించి అఫ్జల్‌ఖాన్‌ను హతమార్చాడు. 1665లో ఔరంగజేబ్ మీర్జా జయసింగ్‌ను శివాజీపై యుద్ధానికి పంపాడు. జయసింగ్ పురంధర్‌ను ముట్టడించాడు. శివాజీ 23 దుర్గాలను మొగలులకు ఇచ్చి 12 దుర్గాలను తన వద్ద ఉంచుకునేలా సంధి చేసుకున్నాడు. 1666లో శివాజీ తన కుమారుడైన శంభాజీతో కలిసి ఆగ్రాలో ఔరంగజేబ్‌ను సందర్శించాడు. కానీ ఔరంగజేబ్ శివాజీతో అమర్యాదగా ప్రవర్తించి అతణ్ని గృహ నిర్బంధం చేశాడు. శివాజీ మిఠాయిల గంపలో దాక్కొని తప్పించుకున్నాడు. తర్వాత దక్కన్ చేరి మొగలులకు ఇచ్చిన కోటలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
రాయ్‌గఢ్‌ను రాజధానిగా చేసుకున్న శివాజీ 1674లో పట్టాభిషిక్తుడయ్యాడు. శివాజీ ‘ఛత్రపతి’ బిరుదు వహించాడు. ఇతడి రాజ్యానికి స్వరాజ్యమని పేరు. శివాజీ రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. అతడి ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతానికి స్వరాజ్యమని, దాని చుట్టూ ఉన్న ప్రాంతానికి మొగలాయ్ అని పేరు. ఈ ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్‌ముఖి అనే పన్నులు వసూలు చేశాడు. కేంద్ర ప్రభుత్వంలో అష్టప్రధాన్ అనే మంత్రి పరిషత్ ఉండేది. రాజు వారికి నేరుగా జీతాలను చెల్లించేవాడు. పంటలో నాలుగో వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. సైన్యాన్ని వ్యవస్థీకరించారు. పది మంది ఉన్న దళానికి అధిపతి ‘నాయక’ నుంచి వేయి మంది ఉన్న దళానికి అధిపతి ‘హజరీ’ వరకు అనేక భాగాలుగా సైన్యాన్ని విభజించారు. శివాజీ, అతడి వారసులు గెరిల్లా యుద్ధంలో ప్రావీణ్యం పొందారు.

పీష్వాలు

బాలాజీ విశ్వనాథ్ (1713-20)
సాహు కాలంలో బాలాజీ విశ్వనాథ్ ప్రధాన మంత్రి లేదా పీష్వా. సాహుకు వారసులు లేకపోవడం వల్ల అతడి మరణానంతరం మరాఠా సామ్రాజ్యం పీష్వాల పరమైంది. పీష్వా వంశ స్థాపకుడు బాలాజీ విశ్వనాథ్. ఇతణ్ని మహారాష్ర్ట జాతీయ స్థాపకుడిగా అభివర్ణిస్తారు. బాలాజీ విశ్వనాథ్ పీష్వా పదవిని వంశ పారంపర్యం చేశాడు. పుణేను రాజధానిగా చేసుకున్నాడు.

మొదటి బాజీరావు (1720-1740)
ఇతడు పీష్వాలందరిలోకెల్లా సమర్థుడు. హిందూ పద్ పద్ షాహి లేదా అఖిల భారత సామ్రాజ్యం నిర్మించాలనేది ఇతడి ఆశయం. లక్ష్య సాధనలో కొంత మేర సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు. ఇతడి కాలంలో పన్నులు వసూలు చేసే సర్దార్లు బలవంతులై స్వతంత్రం ప్రకటించుకున్నారు. నాగ్‌పూర్‌లో రఘోజీ భోంస్లే, బరోడాలో షిల్లాజీ గైక్వాడ్, ఇండోర్‌లో మల్హర్‌రావ్ హోల్కార్, గ్వాలియర్‌లో రోబోజీ సింథియా స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. వీరందర్నీ మహారాష్ర్ట కూటమిగా చేర్చిన ఘనత మొదటి బాజీరావుదే.

బాలాజీ బాజీరావు (1740-1761)
ఇతడు మొదటి బాజీరావు కుమారుడు. బాలాజీ బాజీరావు కాలంలో మరాఠాల అధికారం, వైభవం ఉచ్ఛ స్థితికి చేరింది. 1757లో మరాఠాలు అహ్మద్ షా అబ్దాలీ ప్రతినిధి నుంచి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. రఘెబా పీష్వా తమ్ముడు పంజాబ్‌ను జయించి అటక్ కోటపై మరాఠా జెండా ఎగురవేశాడు. ఇదే సమయంలో అఫ్గానిస్తాన్ రాజైన అహమ్మద్ షా అబ్దాలీ 1761లో పానిపట్ వద్ద మరాఠాలను ఓడించాడు. దీన్నే ‘మూడో పానిపట్’ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో అబ్దాలీకి రెండో షా ఆలం, ఔద్ నవాబు సహకరించారు. గెరిల్లా పోరాటం చేయకపోవడం వల్లే మరాఠాలు ఈ యుద్ధంలో ఓడారు.

హైదరాబాద్ రాజ్యం
నిజాం-ఉల్-ముల్క్ అసఫ్‌జా 1724లో హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు 1722-24 మధ్య మొగల్ సామ్రాజ్యానికి వజీర్‌గా పనిచేశాడు. హిందువుల పట్ల సహన భావం ప్రదర్శించాడు. పూరన్ చంద్ అనే హిందువు ఆయన వద్ద దివాన్‌గా పనిచేయడమే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. నిజాం-ఉల్-ముల్క్ 1748లో మరణించాడు. తర్వాత వరుసగా.. అతడి రెండో కుమారుడైన నాజర్ జంగ్, నిజాం మనవడైన ముజఫర్ జంగ్, నిజాం మూడో కుమారుడైన సలాబత్ జంగ్ అధికారంలోకి వచ్చారు. వీరి తర్వాత రెండో నిజాంగా లేదా రెండో అసఫ్‌జాగా నిజాం అలీ రాజ్యపాలన చేపట్టాడు. ఇతడు 1763లో ఉత్తర సర్కార్ జిల్లాలను, 1788లో గుంటూరును, 1802లో దత్త జిల్లాలను బ్రిటీషర్లకు ఇచ్చేశాడు. నిజాం అలీ తర్వాత సికిందర్ ఝా మూడో నిజాంగా రాజ్యానికొచ్చాడు. ఇతడు లష్కర్ (సికింద్రాబాద్)ను నిర్మించాడు. నసీరుద్దీన్ నాలుగో నిజాం, అఫ్జల్ ఉద్దౌలా అయిదో నిజాం. ఇతడి కాలంలో హైదరాబాద్ రాజ్యంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఇతడి ప్రధాని సాలార్‌జంగ్-1 గొప్పవాడు. సాలార్‌జంగ్ అసలు పేరు తురాబ్ అలీఖాన్. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అఫ్జల్‌గంజ్‌లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, కాచిగూడలో రైల్వేస్టేషన్, నిజాం కళాశాల (1887), మహబూబ్ ఆలియా కళాశాలను నిర్మించాడు. చివరి నిజాంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో పాలనా పగ్గాలు చేపట్టాడు.

బెంగాల్
ముర్షిద్ కులీఖాన్ 1700 నుంచి బెంగాల్ దివాన్‌గా పనిచేసి స్వతంత్రంగా వ్యవహరించాడు. ఇతడు 1717లో మరణించాడు. అలీ వర్దీఖాన్ 1741లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఇతడి రాజధాని ముర్షిదాబాద్. 1756లో సిరాజ్ ఉద్దౌలా సింహాసనాన్ని అధిష్టించాడు. 1757లో ఆంగ్లేయులు రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో బెంగాల్ నవాబైన సిరాజ్ ఉద్దౌలాను ప్లాసీ యుద్ధంలో ఓడించారు. ఆంగ్లేయులు జయించిన మొదటి రాష్ర్టం బెంగాల్.

ఔద్
సాదత్ ఖాన్ 1724లో ఔద్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. 1764లో ఔద్ నవాబైన ఘజాద్దౌలా మొగల్ చక్రవర్తి రెండో షా ఆలం, బెంగాల్ నవాబ్ మీర్ ఖాసీంతో ఒక కూటమిని ఏర్పాటు చేశాడు. వీరు ఆంగ్లేయుల నుంచి బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. 1764లో జరిగిన ఈ యుద్ధానికి బక్సార్ యుద్ధమని పేరు. కూటమిపై విజయం సాధించిన ఆంగ్లేయులు, బెంగాల్, బిహార్, ఒరిస్సాలపై దివానీ హక్కు పొందారు. ఈ యుద్ధం వల్ల ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో స్వతంత్ర రాజకీయాధికారం పొందింది. ఘజాద్దౌలా తర్వాత అసఫ్ ఉద్దౌలా ఔద్ రాజ్యానికి నవాబు అయ్యాడు.

మైసూర్
1766లో మైసూర్ రాజు మరణించగానే హైదరాలీ సింహాసనం ఆక్రమించి సుల్తాన్ అయ్యాడు. 1776లో మొదటి ఆంగ్లేయ-మహారాష్ర్ట యుద్ధంలో హైదరాలీ, నిజాం నవాబు కలిసి ఆంగ్లేయులపై పోరాడారు. ఈ యుద్ధంలో ఏ పక్షానికి విజయం లభించలేదు. 20 ఏళ్లపాటు శాంతి వర్థిల్లింది. వారన్ హేస్టింగ్స్ నిజాం నవాబుకు గుంటూరు జిల్లాను లంచంగా ఇచ్చి అతణ్ని బ్రిటిష్ వ్యతిరేక కూటమి నుంచి వేరు చేశాడు. 1781-82లో జరిగిన రెండో మైసూర్ యుద్ధంలో ఐర్‌కూట్ నాయకత్వంలోని బ్రిటిష్ సేనలు పొర్టోనొవో వద్ద హైదరాలీని ఓడించాయి. 1782లో హైదరాలీ మరణించాడు. అతడి కుమారుడైన టిప్పు సుల్తాన్ అధికారాన్ని చేపట్టాక 1784లో శాంతి ఒప్పందం జరిగింది. గవర్నర్ జనరల్ లార్‌‌డ కారన్ వాలిస్ మహారాష్ర్టులు, నిజాం నవాబు, తిరువాన్కూరు, కూర్గు రాజులను తన వైపు తిప్పుకొని కూటమిని ఏర్పాటు చేశాడు. యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను ఓడించి అతడి రాజ్యంలోని సగ భాగాన్ని స్వదేశీ రాజులకు ఇచ్చేశాడు. దీన్నే మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1790-92) అంటారు. 1799లో జరిగిన నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం టిప్పును ఓడించింది. శ్రీ రంగ పట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో టిప్పు సుల్తాన్ 1799 మే 4న వీర మరణం పొందాడు.
Published date : 10 Nov 2015 04:39PM

Photo Stories