Skip to main content

భారతదేశం - పరిశ్రమలు

ఒక దేశం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు ఎంతగానో తోడ్పడతాయి. సమాజ సంక్షేమం పారిశ్రామిక అభివృద్ధితోనే సాధ్యమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అభివృద్ధి చెందిన దేశాలను దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. భారతదేశంలో రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిచ్చి వాటి అభివృద్ధికి కృషి చేశారు. దేశంలో వాస్తవిక పారిశ్రామికీకరణ 1950-60 మధ్య కాలంలో ప్రధానంగా ఇనుము-ఉక్కు పరిశ్రమల స్థాపనతో ప్రారంభమైంది.
దేశంలోని పరిశ్రమలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
1) వ్యవసాయాధారిత పరిశ్రమలు
2) అటవీ ఆధారిత పరిశ్రమలు
3) ఖనిజాధారిత పరిశ్రమలు

వ్యవసాయాధారిత పరిశ్రమలు

వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరకుగా ఉపయోగించే పరిశ్రమలను ‘వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు’ అంటారు.
ఉదా: నూలు, జనుము, ఉన్ని, కాఫీ, పంచదార, రబ్బరు, పట్టు, తోలు, తేయాకు పరిశ్రమలు.
వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్ ఇండస్ట్రీ)
ఇది భారతదేశంలో బాగా విస్తరించిన, అతిపెద్ద, అతి పురాతన పరిశ్రమ. దీనికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. ఇది ప్రత్యక్షంగా 3.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో 24.6 శాతం ఈ రంగం నుంచే వస్తోంది. స్థూల జాతీయోత్పత్తిలో (జీఎన్‌పీ) 4 శాతం ఈ పరిశ్రమ నుంచే లభిస్తోంది. నూలు, జనపనార, ఉన్ని, పట్టు వస్త్ర పరిశ్రమలు దీనిలో ముఖ్యమైనవి.
1. నూలు వస్త్ర పరిశ్రమ (కాటన్ టెక్స్‌టైల్స్): దేశంలో నూలు వస్త్ర పరిశ్రమ అత్యంత పురాతనమైంది, అతిపెద్దది. ఎక్కువ మంది శ్రామికులను కలిగిన పరిశ్రమ ఇది. ఇందులో సుమారు 15 మిలియన్ల మంది కార్మికులు పని చేస్తున్నారు. భారతదేశ శ్రామికుల్లో 20 శాతం ఈ పరిశ్రమలోనే ఉన్నారు.

  • దేశంలో మొదటి నూలు మిల్లును 1818లో కోల్‌కతా సమీపంలోని ‘పోర్ట్ గ్లాస్టర్’ వద్ద ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఇది మూతపడింది.
  • 1854లో ముంబై సముద్ర తీర ప్రాంతంలో సి.ఎన్. థేవార్ అనే పారశీక పెట్టుబడిదారుడి సహాయంతో ఆధునిక పద్ధతిలో నూలు మిల్లు ప్రారంభించారు. దేశంలో వాస్తవంగా పరిశ్రమల స్థాపన దీని ద్వారానే మొదలైందని భావిస్తారు.
  • స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నూలు మిల్లులు ఎక్కువగా మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్‌లోని అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి.
  • ప్రస్తుతం నూలును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న మొదటి మూడు దేశాలు.. 1) అమెరికా 2) చైనా 3) భారత్
  • దేశంలో నూలును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న మొదటి మూడు రాష్ట్రాలు.. 1) మహారాష్ట్ర 2) గుజరాత్ 3) తమిళనాడు
  • ప్రస్తుతం దేశంలో నూలు వస్త్ర పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన నగరం మహారాష్ట్రలోని ముంబయి. దీన్ని ‘కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా’, ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’గా పేర్కొంటారు.
  • గుజరాత్‌లోని అహ్మదాబాద్ నూలు వస్త్ర పరిశ్రమకు దేశంలో ముంబై తర్వాత రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ నగరాన్ని ‘మాంచెస్టర్ ఆఫ్ నార్‌‌త ఇండియా’ అని పిలుస్తారు.
  • దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని ‘కోయంబత్తూర్’ నూలు పరిశ్రమకు అత్యంత ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. దీన్ని ‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’గా భావిస్తారు.
2. జనపనార వస్త్ర పరిశ్రమ (జ్యూట్ టెక్స్‌టైల్): మొదటిసారిగా దీన్ని 1855లో పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతాకు సమీపంలోని ‘రిష్రా’ వద్ద చేనేత పరిశ్రమగా ఏర్పాటు చేశారు. 1859లో మరమగ్గాల ద్వారా జనపనార వస్త్ర పరిశ్రమ ప్రారంభమైంది. ఈ పరిశ్రమ ‘హుగ్లీ’ నదీ తీరం వెంట అధికంగా కేంద్రీకృతమైంది. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. కానీ ఎగుమతుల విషయంలో బంగ్లాదేశ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం సింథటిక్ ప్యాకింగ్ మెటీరియల్ కారణంగా జనపనార పరిశ్రమలో తీవ్ర మాంద్యం ఏర్పడింది.
  • పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం వల్ల జనపనార పరిశ్రమను ‘గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా’గా వ్యవహరిస్తున్నారు.
  • దేశంలో అధికంగా జనుమును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - పశ్చిమ బెంగాల్.
3. ఉన్ని వస్త్ర పరిశ్రమ: భారతదేశంలో ఆయన రేఖా ప్రాంత రుతుపవన శీతోష్ణస్థితి ఉన్ని పరిశ్రమ అభివృద్ధికి అవరోధంగా ఉంది. దేశంలో మేలురకం ఉన్ని ఎక్కువగా లభించకపోవడం వల్ల ఈ పరిశ్రమ అంతగా అభివృద్ధి చెందలేదు. 1876లో ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న ‘లాల్‌ఇమ్లి’ వద్ద దేశంలో మొదటి ఉన్ని పరిశ్రమ ఏర్పాటు చేశారు.
  • ప్రస్తుతం ఉన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం ‘పంజాబ్’లోని ‘లుథియానా- అమృత్‌సర్-గురుదాస్‌పూర్’.
  • ఉన్ని పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం- పంజాబ్. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
4. పట్టు వస్త్ర పరిశ్రమ (సిల్క్ టెక్స్‌టైల్స్): ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో భారతదేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. 1932లో పశ్చిమ బెంగాల్‌లోని ‘హౌరా’ వద్ద మొదటి పట్టు పరిశ్రమను ఏర్పాటు చేశారు. భారతదేశంలో ప్రధానంగా మల్బరీ, ఇరి, టసార్, ముగ అనే నాలుగు రకాల పట్టు ఉత్పత్తి చేస్తున్నారు. ‘ముగ’ అనేది ‘బంగారు పసుపు’ రకం పట్టుగా ప్రసిద్ధి చెందింది.
  • దేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - కర్ణాటక.
5. సింథటిక్ వస్త్ర పరిశ్రమ: ఈ పరిశ్రమలో రేయాన్, నైలాన్, టెర్లిన్, పాలిస్టర్ మొదలైన రసాయనాల కలయికలతో వస్త్రాలు రూపొందిస్తారు.
  • దేశంలో సింథటిక్ వస్త్రాలను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం - మహారాష్ట్ర.
పంచదార పరిశ్రమ
వ్యవసాయాధార పరిశ్రమల్లో నూలు తర్వాత రెండో అతి ముఖ్యమైన పరిశ్రమ ఇదే. చెరకుతో పాటు పంచదార ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. బెల్లం, కండసారి చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది.
  • భారతదేశంలో మొదటి పంచదార పరిశ్రమను 1840లో బిహార్‌లో ‘డచ్’ దేశస్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. ఇది కొన్ని కారణాల వల్ల కొనసాగలేదు. ఆ తర్వాత బ్రిటిషర్ల సహకారంతో 1903లో బిహార్‌లో ఆధునిక పంచదార మిల్లు ప్రారంభించారు.
  • దేశంలో అత్యధికంగా పంచదార పరిశ్రమలు ఉన్న రాష్ట్రం - ఉత్తరప్రదేశ్. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది.
  • ఉత్తరప్రదేశ్‌ను ‘సుగర్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేర్కొంటారు.
  • పంచదార పరిశ్రమ నుంచి లభించే ‘మొలాసిస్’ను చాక్లెట్లు, ఆల్కహాల్ తదితరాల తయారీలో ఉపయోగిస్తారు.
  • చెరకు గెడలలో ఉండే పదార్థం ‘సుక్రోజ్’.
  • చక్కెర పరిశ్రమకు సంబంధించి నియమించిన కమిటీ - మహాజన్ కమిటీ.
తేయాకు పరిశ్రమ (టీ ఇండస్ట్రీ)
19వ శతాబ్దంలో డార్జిలింగ్, అసోం, నీలగిరి ప్రాంతాల్లో మొదటిసారిగా టీ పరిశ్రమ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో తేయాకును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - అసోం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు తర్వాత స్థానంలో ఉన్నాయి.
కాఫీ పరిశ్రమ
భారతదేశంలో మొదటి కాఫీ పరిశ్రమను 1826లో కర్ణాటక రాష్ట్రంలోని ‘చిక్ మంగుళూరు’ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - కర్ణాటక.
రబ్బరు పరిశ్రమ
దేశంలో మొదటి రబ్బర్ పరిశ్రమను 1920లో కోల్‌కతాలో ఏర్పాటు చేశారు. మొదటి సింథటిక్ రబ్బర్ పరిశ్రమను 1955లో ఉత్తరప్రదేశ్‌లోని ‘బరేలీ’లో స్థాపించారు.
  • రబ్బరు ఉత్పత్తిలో ‘కేరళ’ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.
తోలు (లెదర్) పరిశ్రమ
భారతదేశంలో మొదటి తోలు పరిశ్రమను 1960లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఏర్పాటు చేశారు. దేశంలో అత్యధికంగా తోలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - ఉత్తరప్రదేశ్.

అటవీ ఆధార పరిశ్రమలు

అడవుల నుంచి లభించే ఉత్పత్తుల ఆధారంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలను ‘అటవీ ఆధార పరిశ్రమలు’ అంటారు. వీటిలో ముఖ్యమైనవి.. కాగితం, అగ్గిపుల్లలు, ఆట వస్తువులు, లక్క, తునికి మొదలైనవి.
కాగితం పరిశ్రమ
భారతదేశంలో మొదటి కాగితం పరిశ్రమను 1832లో కోల్‌కతా సమీపంలోని ‘సేరంపూర్’ వద్ద ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధిక ఉత్పత్తి కోసం 1870లో పశ్చిమ బెంగాల్‌లోని ‘బాలిగంజ్’ ప్రాంతంలో ఆధునిక కాగిత పరిశ్రమ ‘రాయల్ బెంగాల్ పేపర్ మిల్’ ఏర్పాటు చేశారు.
  • మధ్యప్రదేశ్‌లోని ‘నేపానగర్’లో 1955లో ‘నేషనల్ న్యూస్ ప్రింట్ మిల్’ స్థాపించారు.
  • పేపర్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు - పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర.
  • కాగితం ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్థాలు వెదురు, బగాసే, సబాయ్ గడ్డి. ఈ గడ్డి శివాలిక్ ప్రాంతంలో లభిస్తుంది.
  • దేశంలో మొదటి అగ్గిపుల్లల పరిశ్రమను 1921లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్థాపించారు.
  • దేశంలో అగ్గిపుల్లలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు - తమిళనాడు (శివకాశి), కేరళ (తిరువనంతపురం), తెలంగాణ (హైదరాబాద్, వరంగల్).
  • దేశంలో మొదటి ఆటవస్తువుల పరిశ్రమను ‘పంజాబ్’లోని ‘సియాల్ కోట్’లో స్థాపించారు. ఇది ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది. రెండో పరిశ్రమను ఉత్తరప్రదేశ్‌లోని ‘మీరట్’లో స్థాపించారు. ప్రస్తుతం వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్.
  • దేశంలో లక్క ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం - జార్ఖండ్. (చోటానాగ్‌పూర్ పీఠభూమి), రెండో రాష్ట్రం - మధ్యప్రదేశ్.
  • రెజిన్‌ను ‘ఖైర్’ అనే వృక్షం నుంచి తీస్తారు. దీని ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం - అరుణాచల్ ప్రదేశ్.
  • టెండు (లేదా) తునికి పరిశ్రమ అధికంగా ఉన్న రాష్ట్రం - మధ్యప్రదేశ్.

మహారత్నాలు

ఏడాదికి సరాసరి 25 వేల కోట్ల టర్నోవర్, 5 వేల కోట్ల ప్రాఫిట్ ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలను మహారత్నాలుగా ప్రకటిస్తారు. 2009 డిసెంబర్ నుంచి కంపెనీలకు మహారత్న హోదా ఇస్తున్నారు. ఈ హోదా ఉన్న పరిశ్రమలు నికర విలువలో 15శాతం వరకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదా॥వ్యాపార ఒప్పందాలు, అదనపు సిబ్బంది నియామకాలు, యంత్రాల కొనుగోలు మొదలైన విషయాల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ హోదా ఉన్న పరిశ్రమలు ఏడు. అవి..
1. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)
2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)
3. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)
4. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)
5. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఏఐల్)
6. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జీఏఐల్)
7. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)

నవరత్నాలు

ఏడాదికి సరాసరి 10 వేల కోట్ల టర్నోవర్, 1000 కోట్ల ప్రాఫిట్ ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను నవరత్నాలుగా ప్రకటిస్తారు. వీటిని 1997 జులై నుంచి గుర్తిస్తున్నారు. ఈ హోదా ఉన్న పరిశ్రమలు నికర విలువలో 15శాతం వరకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
నవరత్న హోదా ఉన్న కంపెనీలు..
1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)
2. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)
3. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్)
4. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్)
5. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)
6. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)
7. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్)
8. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండీసీ)
9. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఏఎల్‌సీఓ)
10. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఎల్)
11. ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్)
12. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీఎల్)
13. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)
14. రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)
15. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీఎల్)
16. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐఎల్)
17. నేషనల్ బిల్డింగ్‌‌స కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌బీసీసీ)

దేశంలోని వివిధ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలు
1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ -ముంబై
2. ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - వడోదర
3. ఇండియన్ రేర్ ఏర్‌‌త్స లిమిటెడ్ - ఆల్వే
4. నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ - న్యూఢిల్లీ
5. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ -పనాజీ
6. నేషనల్ కెమికల్ లేబొరేటరీ - పుణే
7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ - కోల్‌కతా
8. సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - జోథ్‌పూర్
9. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ - నాగపూర్
10. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కాసర్‌గఢ్
11. సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ -డెహ్రాడూన్
12. కాటన్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ముంబై
13. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ -జునాగఢ్
14. ఆటమిక్ ఎనర్జీ కమిషన్ -ముంబై
15. నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - నాగపూర్
16. ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫొడేర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ఝాన్సీ
17. ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
18. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ - అహ్మదాబాద్
Published date : 07 Oct 2015 03:22PM

Photo Stories