పర్యావరణ సమస్యలు - విపత్తు
1. సహజ(Natural)
2. మానవ జనిత (Anthropogenic)
వీటిని భారీ, స్వల్ప అనే రెండు రకాలుగా విభజిస్తారు.
సహజ భారీ విపత్తులు: వరద, తుపాను, కరవు, భుకంపం, సునామీ, అగ్నిపర్వతాల విస్ఫోటం.
సహజ స్వల్ప విపత్తులు: అత్యల్ప శీతాకాల ఉష్ణోగ్రతలు, అధిక వేసవి ఉష్ణోగ్రతలు, కొండ చరియలు, మంచు చరియలు విరిగిపడటం.
మానవ జనిత భారీ విపత్తులు: యుద్ధాలు, భారీ అగ్ని ప్రమాదాలు, వ్యాధుల ప్రబలత, శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలు.
మానవ జనిత స్వల్ప విపత్తులు: రోడ్డు, రైళ్ల, విమాన ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు, ఆహార విషపూరితం కావడం, తొక్కిసలాట, పర్యావరణ కాలుష్యం.
విపత్తు నిర్వహణ చక్రం
ఒక సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు ద్వారా మాత్రమే విపత్తుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించడం వీలవుతుంది. సాధారణంగా విపత్తు నిర్వహణలో మూడు అంశాలు ఉంటాయి.
1. విపత్తు పూర్వ నిర్వహణ (Pre - Disaster Management)
2. విపత్తు స్పందన (Disaster Response)
3. విపత్తు అనంతర నిర్వహణ (Post - Disaster Management)
విపత్తు పూర్వ నిర్వహణ
ఇందులో నిర్మూలన, సంసిద్ధత ముఖ్య అంశాలు.
నిర్మూలన: విపత్తు సంభవించే ప్రాంతాన్ని ముందుగానే గుర్తించి, భవిష్యత్తులో విపత్తు రాకుండా చేపట్టే చర్యలను నిర్మూలనగా పిలుస్తారు. సక్రమైన నిర్మూలన చర్యల ద్వారా విపత్తు సంభవించే పరిస్థితులను పూర్తిగా అరికట్టడానికి వీలవుతుంది. నిర్మూలన చర్యల ద్వారా విపత్తు నష్టం తగ్గుతుంది.
ఉదా: రుతుపవనాలకు ముందు నదులు, కాలువలు, రిజర్వాయర్లలో పూడికతీత కార్యక్రమాలు నిర్వహించడం. రైల్వేట్రాక్‌ల తనిఖీ. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాల్లో అటవీకరణను ప్రోత్సహించడం.
సంసిద్ధత: విపత్తు పూర్వ నిర్వహణలో ఇది చాలా కీలకం. ఇందులో భాగంగా విపత్తు సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అనేక నివారణ చర్యలను తీసుకోవాలి.
ఉదా:
- వరద సంభవించే ప్రమాదమున్న ప్రాంతాల్లో వేగవంతమైన హెచ్చరిక జారీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
- విపత్తు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే అంచనా వ్యవస్థలను ఆధునిక సాంకేతికత సహాయంతో ఏర్పాటు చేయాలి.
- సంసిద్ధతలో ప్రభుత్వరంగ సంస్థలు, ఎన్జీవోలు, సాంకేతిక బృందాలు, స్వయం సహాయక బృందాలు పాల్గొనాలి.
విపత్తు సంభవించిన సమయంలో నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ ‘స్పందన’ అంటారు. విపత్తు సమయంలో నష్టాన్ని నివారించడానికి ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్’(ఈఆర్ఎస్) ఏర్పాటు తప్పనిసరి. స్వల్ప వ్యవధిలో ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ, సత్వర ఆరోగ్య సేవలు, ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి, రక్షించే (సెర్చ్ అండ్ రెస్క్యూ) సేవలన్నీ ఈఆర్ఎస్ లో భాగంగా ఉంటాయి.
విపత్తు అనంతర నిర్వహణ
విపత్తు సంభవించిన తర్వాత నిర్వహించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలన్నింటినీ కలిపి ‘విపత్తు అనంతర నిర్వహణ’ అంటారు. అత్యవసర సేవల పునరుద్ధరణ, దెబ్బతిన్న కమ్యూనికేషన్స వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ, పునరావాస సేవల కల్పన, ఆరోగ్య సేవలు మొదలైనవి విపత్తు అనంతర నిర్వహణలో ముఖ్య అంశాలు. విపత్తు రకం, తీవ్రతను బట్టి పునరావాసం, పునరుద్ధరణ సమయం ఉంటుంది. ఈ చర్యలు కొన్ని వారాలు లేదా నెలలపాటు కొనసాగుతాయి.
భారత్‌లో విపత్తు నిర్వహణ వ్యవస్థ
భారతదేశంలో 2005కు ముందు ఒక సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థ అంటూ ఏదీలేదు. 1994లో జపాన్‌లోని యొకొహోమ నగరంలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సదస్సులో తొలిసారిగా ‘విపత్తు సంసిద్ధత’ను చర్చించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతోన్న పేద దేశాల్లో విపత్తు నిర్వహణ చాలా పేలవంగా ఉందని ఈ సదస్సులో గుర్తించారు. కాబట్టి ప్రతి సభ్యదేశం తమ పౌరుల రక్షణ కోసం విపత్తు నివారణ, నిర్మూలన, సంసిద్ధత చర్యలను నిర్వహించాలి. దీంతో విపత్తు ద్వారా సంభవించే నష్టాన్ని తగ్గించాలని నిర్ణయించారు. దీని కోసం అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిలో సహకరించుకోవాలని సూచించారు. ఇదే సదస్సులో 1991-2000 దశకాన్ని ‘ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ నేచురల్ డిజాస్టర్ రిడక్షన్’గా గుర్తించారు. యొకొహోమ సదస్సు స్ఫూర్తితో 1999లో భారత్ ఒక ‘హై పవర్డ్ కమిటీ’(హెచ్పీసీ)ని ఏర్పాటు చేసింది. 2001 జనవరిలో గుజరాత్లో సంభవించిన భూకంపం తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక ఏర్పాటుకు, నిర్మూలన చర్యలను సూచించడానికి ఒక జాతీయ కమిటీ ఏర్పాటు చేశారు. 10వ పంచవర్ష ప్రణాళికలో తొలిసారిగా విపత్తు నిర్వహణ అంశాన్ని చేర్చారు. 2005 డిసెంబర్ 23న భారత ప్రభుత్వం ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా దేశంలో
విపత్తుల నిర్వహణకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణ విధానాలను రూపొందించి, మార్గదర్శకాలను విడుదల చేసే లక్ష్యంతో ‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ (ఎన్డీఎంఏ) ఏర్పాటైంది. ప్రధాని ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి యంత్రాంగం ఎన్డీఎంఏ విధులను నిర్వహిస్తుంది. రాష్ర్ట స్థాయిలో విపత్తు నిర్వహణకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ర్ట విపత్తు నిర్వహణ సంస్థ(ఎస్డీఎంఏ) ఏర్పాటైంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) కృషి చేస్తుంది.
విపత్తు నిర్వహణపై పూర్తి స్థాయిలో పరిశోధనలు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం)ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. యొకొహోమ సదస్సు అనంతరం 1995లో నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్సీడీఎం)ను ఏర్పాటు చేశారు. దీన్నే 2003 అక్టోబర్ 16న ఎన్‌ఐడీఎంగా అభివృద్ధి చేశారు.
ఎన్ఐడీఎం ప్రధాన విధులు
- విపత్తు నిర్వహణలో వివిధ శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడం.
- విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో మానవ వనరులను అభివృద్ధి చేసే ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం.
- జాతీయ స్థాయి విపత్తు ప్రణాళికలను రూపొందించడం. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సూచనలివ్వడం.
- విపత్తు నిర్వహణలో శిక్షణతోపాటు ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను రూపొందించి నిర్వహించడం. దేశంలో, దేశం వెలుపల విపత్తు నిర్వహణపై సెమినార్లను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహను కల్పించడం.
- పాఠశాల, కళాశాల స్థాయిల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులకు విపత్తు నిర్మూలన, సంసిద్ధతలపై అవగాహన కల్పించడం.
విపత్తు సంభవించిన సమయంలో తక్షణ సహాయ కార్యక్రమాలను అందించి, ప్రమాదంలో చిక్కుకున్న వారిని వేగవంతంగా రక్షించే ఉద్దేశంలో జాతీయ విపత్తు నిర్వహణలో భాగంగా 2006లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) ఏర్పాటైంది.
ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లకు చెందిన 8 బెటాలియన్లు ఉన్నాయి. పై వాటికి అదనంగా సశస్త్ర సీమాబల్‌కు చెందిన రెండు బెటాలియన్లు ఉన్నాయి. ఒక్కో బెటాలియన్‌లో 1149 సిబ్బంది ఉంటారు.
మాదిరి ప్రశ్నలు
1. 1994 లో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదస్సు జరిగిన యొకొహోమ నగరం ఏ దేశంలో ఉంది?
ఎ) చైనా
బి) తైవాన్
సి) జపాన్
డి) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: సి
2. దేశంలో ఏటా వరదకు గురయ్యే ప్రమా దమున్న ప్రాంతం?
ఎ) 80 మిలియన్ హెక్టార్లు
బి) 45 మిలియన్ హెక్టార్లు
సి) 100 మిలియన్ హెక్టార్లు
డి) 150 మిలియన్ హెక్టార్లు
- View Answer
- సమాధానం: బి
3. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏ నగరంలో ఉంది?
ఎ) చెన్నై
బి) హైదరాబాద్
సి) బెంగుళూరు
డి) విశాఖపట్నం
- View Answer
- సమాధానం:ఎ
4. హుద్‌హుద్ తుపాను ఏ రకమైన విపత్తు?
ఎ) పెను తుపాను
బి) తీవ్ర పెను తుపాను
సి) సూపర్ సైక్లోన్
డి) అల్పపీడనం
- View Answer
- సమాధానం: బి
5. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎన్‌సీవోఐఎస్) ఏ నగరంలో ఉంది?
ఎ) హైదరాబాద్
బి) చెన్నై
సి) గోవా
డి) ముంబై
- View Answer
- సమాధానం: ఎ
6. విపత్తు నిర్వహణలో ఏయే అంశాలు ఉంటాయి?
ఎ) నివారణ
బి) సంసిద్ధత
సి) నిర్మూలన
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. 1999లో ఏ రాష్ర్ట తీరంలో ప్రమాదకర భారీ సూపర్ సైక్లోన్ సంభవించింది?
ఎ) ఒడిశా
బి) ఆంధ్రప్రదేశ్
సి) తమిళనాడు
డి) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: ఎ
8. ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ ఉంది?
ఎ) హొనోలులు
బి) గోవా
సి) జకార్తా
డి) మాల్దీవులు
- View Answer
- సమాధానం: ఎ
9. సైక్లోన్ అనేది ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) గ్రీకు
బి) లాటిన్
సి) జపనీస్
డి) ఫ్రెంచ్
- View Answer
- సమాధానం: ఎ
10. హిందు మహాసముద్రంలో తుపానుకు తొలిసారిగా ఎప్పుడు నామకరణం చేశారు?
ఎ) 2001
బి) 2002
సి) 2003
డి) 2004
- View Answer
- సమాధానం:డి
11. కుండ్స్ అనే భూగర్భ ట్యాంకులను ఏ రాష్ర్టంలో నిర్మిస్తున్నారు?
ఎ) మేఘాలయ
బి) మధ్యప్రదేశ్
సి) రాజస్థాన్
డి) తెలంగాణ
- View Answer
- సమాధానం: సి
12. ఏ దేశంలోని తియాంజిన్ అనే ప్రాంతం లో 2015 ఆగస్టు 12న సయనైడ్ లీకేజి ఘటన జరిగింది?
ఎ) జపాన్
బి) చైనా
సి) దక్షిణ కొరియా
డి) ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: బి
13.డిజాస్టర్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ కోర్సును అందించేది?
ఎ) ఇగ్నో
బి) బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
సి) నలందా ఓపెన్ యూనివర్సిటీ
డి) వర్థమాన్ మహావీర్ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: ఎ
14. గుజరాత్ తీరంలో సునామీ సంభవించిన సంవత్సరం?
ఎ) 1945
బి) 1962
సి) 2004
డి) 2006
- View Answer
- సమాధానం: ఎ
15. ఇటీవల మక్కాలో జరిగిన విపత్తు ఏ రకమైంది?
ఎ) బాంబు పేలుడు
బి) తొక్కిసలాట
సి) భూకంపం
డి) వరదలు
- View Answer
- సమాధానం: బి