Andhra Pradesh: ట్రైనీ ఎస్సైలకు దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లు..
సాక్షి: స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్‌ఐల నియామకాల్లో భాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల కోసం విశాఖ రేంజ్ పోలీస్ ఉన్నతాధికారులు గురువారం ఏర్పాట్లు పూర్తి చేశారు. కైలాసగిరి ప్రాంతం ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్ మైదానం ఇందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 23 వరకు దేహదారుఢ్య పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. విశాఖ రేంజ్ పరిధి అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు గోదావరి జిల్లాల వరకు అభ్యర్థులకు ఇక్కడే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో 17,374 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వారిలో 2,745 మంది మహిళా అభ్యర్థులున్నారు. వారంతా ఇప్పుడు నిర్విహిస్తున్న దేహదారుఢ్య పరీక్షకు అర్హత సాధించారు. మహిళా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు దేహదారుఢ్య పరీక్ష నిర్వహించనున్నారు.
పోలీస్ అధికారులు వారికోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలతో పాటు లాంగ్ జంప్, హై జంప్, జావలిన్ త్రో, డిస్క్‌స్ త్రో, పరుగు పోటీలు తదితర పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో ఈవెంట్ కోసం వేర్వేరుగా టెంట్లు వేసి విభాగాలు ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అభ్యర్థులు ఎటు వెళ్లాలో రూటు మ్యాప్‌తో పాటు రిక్రూట్‌మెంట్ బోర్డు అమర్చారు. ఏర్పాట్లును గురువారం అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ అధికారులుతో కలిసి పర్యవేక్షించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
ఎస్‌ఎల్‌పీఆర్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు చేపట్టామన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో హాల్ టికెట్, కాల్ లెటర్, అప్లికేషన్, ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఉదయం 5 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.