Skip to main content

Department of Education: ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు చర్యలు తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Department of Education
ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు

ఈ ప్రక్రియ మే 18 నుంచి మొదలవుతుందని చెప్పారు. విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో మే 17న ఆయన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్, జాయింట్‌ డైరెక్టర్‌ (సర్వీసులు) మువ్వా రామలింగంతో కలిసి పదోన్నతులు, బదిలీల విధివిధానాలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మేలు జరిగేలా పదోన్నతులు, బదిలీలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన 679 ఎంఈవో–2 పోస్టులను ప్రధానోపాధ్యాయుల ద్వారా భర్తీచేయనున్నట్టు తెలిపారు. దీంతోపాటు 350 గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీచేస్తామన్నారు. ప్లస్‌ 2 బోధనకు అనుగుణంగా పీజీటీల అవసరం ఉందని, ఈ క్రమంలో అర్హత గల స్కూల్‌ అసిస్టెంట్లను 1,746 మందిని ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి నియమిస్తామని (రీడిప్లాయిమెంట్‌) తెలిపారు.

చదవండి: Teachersగా B Tech‌ బాబులు వద్దా?.. కనిపించని బీటెక్‌ కాలమ్‌..

ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా 6,249 మందికి పదోన్నతులు కల్పిస్తామని, దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు జారీచేశామని చెప్పారు. 117 జీవో ప్రకారం కొం­తమందిని సర్దుబాటు చేశామని, ఈ నేపథ్యంలో వారు పాత పాయింట్లే కావాలని (స్టేషన్‌) అడిగిన నేపథ్యంలో ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ప్రతి పాఠశాలలో సబ్జెక్ట్‌ టీచర్‌ ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్కూళ్లను పునఃప్రారంభించేలోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. తొలుత సీనియర్స్‌ లిస్టు తయారుచేసి వారిని బదిలీ చేసిన అనంతరం పదోన్నతులు కల్పించనున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీకి ఎనిమిది విద్యాసంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్ల సర్వీసు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో న్యాయపరమైన సమస్యలు ఎదురవకుండా జిల్లాల వారీగా ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

చదవండి: Education: మూడు వేల పాఠ‌శాల‌ల్లో ఒక్క‌రే టీచ‌ర్‌... ఎక్క‌డంటే

ఉపాధ్యాయ సంఘాల హర్షం  

ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, ఆప్టా రాష్ట్ర కార్యదర్శి ప్రకాశరావు చెప్పారు. ప్లస్‌ 2 బోధనకు నియమించే స్కూల్‌ అసిస్టెంట్లను ఒక ఇంక్రిమెంట్‌తో కాకుండా రెండు ఇంక్రిమెంట్లతో కూడిన పదోన్నతి కల్పించాలని కోరారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు చాలా తక్కువగా ఉంటాయని, అందువల్ల వీరికి పీజీటీలుగా లేదా జూనియర్‌ లెక్చరర్లుగా అవకాశం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.   

చదవండి: Trina Das Inspiring Success Story : సక్సెస్ అంటే.. ఇలా ఉండాలి.. ట్యూషన్ చెప్పుతూ.. వంద కోట్లు సంపాదించారిలా..

Published date : 18 May 2023 03:00PM

Photo Stories