Jagananna Animutyalu: టాపర్లతో.. ఓ సెల్ఫీ
ప్రభుత్వ పాఠశాలలను భౌతికంగా అభివృద్ధి చేయడమే కాకుండా గుణాత్మక విద్యను పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రోత్సాహకాలు అందజేసి, స్ఫూర్తిని నింపింది.
ఇదే తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఫార్మేటివ్ అసెస్‌మెంట్, సమ్మేటివ్ పరీక్షల్లో మెరిట్ విద్యార్థులతో ‘సెల్ఫీ విత్ టాపర్స్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా టాపర్లుగా నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉపాధ్యాయులు సెల్ఫీ దిగనున్నారు. ఈ కార్యక్రమంపై విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
తీపిగుర్తుగా నిలిపేందుకు..
ఎవరైనా ఎక్కడికై నా వెళ్తున్నప్పుడు ఆ సందర్భాన్ని తీపిగుర్తుగా నిలుపుకొనేందుకు సెల్ఫీలు దిగడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. అలాగే ప్రముఖ వ్యక్తులు, క్రీడాకారులు, తమకు ఇష్టమైన నాయకులు, హీరోలను కలిసిన సందర్భంలో కూడా సెల్ఫీలు దిగుతూంటారు.
అదే కోవలో విద్యార్థులు సాధించిన విజయాలను వారికి తీపిగుర్తుగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘సెల్ఫీ విత్ టాపర్స్’ అనే వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. అయితే పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో సెల్ఫీలు దిగడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీని వలన విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు.
ఎఫ్‌ఏ–2 నుంచి అమలు
సెల్ఫీ విత్ టాపర్స్ అనే కార్యక్రమాన్ని ఫార్మేటివ్ అసెస్‌మెంట్–2 పరీక్షల నుంచే అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశించింది. ఈ నెల మూడు నుంచి ఆరో తేదీ వరకూ నిర్వహించిన ఎఫ్‌ఏ–2 పరీక్షల్లో పాఠశాల స్థాయిలో టాపర్ల ఎంపిక ప్రక్రియను ఉపాధ్యాయులు ప్రారంభించారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు.
ఇలా పాఠశాల స్థాయిలో ప్రతి తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించారు. ఆ విద్యార్థులతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు, అలాగే పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులతో సెల్ఫీలు దిగుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
మిగిలిన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా..
సెల్ఫీ విత్ టాపర్స్ కార్యక్రమం కేవలం టాపర్లను ప్రోత్సహించడానికే కాకుండా సహచర విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి కూడా దోహపడుతుంది. టాపర్లతో పోటీ పడేలా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడమే దీని ముఖ్యోద్దేశం. రానున్న పరీక్షల్లో టాపర్లతో మిగిలిన వారు కూడా పోటీ పడేలా, సి, డి గ్రేడ్ విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇది ప్రోత్సాహకరంగా నిలుస్తోంది. అలాగే ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో పాఠశాలల్లోని టాపర్లతో సెల్ఫీలు దిగడం అనే భావన విద్యార్థులను గర్వపడేలా చేస్తోంది.
పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన తమతో తోటి మిత్రుల సమక్షంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సెల్ఫీలు దిగడం వారికి తీపిగుర్తుగా మిగిలిపోనుంది. అలాగే విజయాలు సాధించిన విద్యార్థులు తమ స్థానాలను కాపాడుకోవడానికి, ఇతర విద్యార్థులు తాము కూడా ఆ ఘనత సాధించడానికి ఇటువంటి కార్యక్రమం స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జిల్లాలోని 1,579 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఎఫ్‌ఏ–2 పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో సెల్ఫీ విత్ టాపర్స్ కార్యక్రమం అమలు చేశారు. అలాగే విద్యార్థులకు వారు సాధించిన మార్కుల వివరాలతో ప్రోగ్రెస్ కార్డులు కూడా అందజేశారు.
వినూత్న ప్రయోగం
విద్యాశాఖ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘సెల్ఫీ విత్ టాపర్స్’. ఇది విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి కూడా తోడ్పడుతుంది. ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నాం.
– ఎం.కమలకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి