QR Code on 10th Exam Question Papers: టెన్త్ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో క్యూఆర్ కోడ్
ఎవరైనా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తే ఎవరు చేశారో వెంటనే తెలిసిపోతుందని స్పష్టంచేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌తో కలిసి పదో తరగతి, ఇంటర్, టెట్, డీఎస్సీ పరీ క్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజాబాబు, సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్), మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి 26,507 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 151 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసేందుకు 19 సిట్టింగ్ స్క్వాడ్లు, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని వివరించారు. ప్రశ్న పత్రాల్లో ప్రతి పేజీలోనూ ప్రత్యేకంగా తొలిసారిగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారని తెలిపారు. ఎవరైనా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తే, ఏ అభ్యర్థి ఏ పరీక్ష కేంద్రం ద్వారా బయటకు పంపించారో క్షణాల్లో తెలిసిపోతుందని హెచ్చరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అన్ని పరీక్ష కేంద్రాలను నిరంతరం తనిఖీ చేసి, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా నిరోధించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎవైనా ఇబ్బందులు వస్తే వెంటనే జాయింట్ కలెక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఏఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఈఓ తాహెరాసుల్తానా, జిల్లా ప్రజారవాణాధికారి వాణిశ్రీ, ఆర్‌ఐఓ రవికుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జి.గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: 10th Class & Inter Exams: టెన్త్, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు