Nick Vujicic: ఇక్కడ విద్యారంగం అద్భుతం
- ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. విద్యారంగంలో నమ్మశక్యం కాని పురోగతిని తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు..
- ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది.
(గుంటూరులో ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణాత్మక వక్త నిక్ వుజిసిక్ ప్రశంసల వర్షం)
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ మంత్రముగ్థులయ్యారు. ‘ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది’ అంటూ ఆయన ఫిదా అయ్యారు. గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్ జనవరి 31న సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులకు లక్ష్యసాధన, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముఖాముఖీగా మాట్లాడారు.
ఆ తర్వాత సాయంత్రం బీఆర్ స్టేడియంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతో పాటు నగరంలోని వివిధ మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన వేలాది మంది టెన్త్ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు, చేపడుతున్న కార్యక్రమాలపై మరోమారు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో అంకితభావం ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండటం అభినందనీయమంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే, ‘నేను ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలలో పర్యటించా. కానీ ఏ దేశంలో లేని అనుభూతి, ప్రత్యేకతను నేను గుంటూరులో పొందాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా.
ప్రపంచంలో ఎంతోమంది నన్ను హీరో అని పిలిచి ఉండవచ్చు.. కానీ, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇక్కడ పొందాను. వెలకట్టలేని విద్యకు, విజ్ఞానానికి అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో మంచి పాలకుడు మీకు ఉన్నారు. అంకితభావం ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. గుంటూరు ప్రాంతం విజ్ఞానం, విద్య పరంగా ఎంతో సామర్థ్యం ఉన్న ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కలిశాను. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎంతో కలవబోవడం ఎంతో ప్రత్యేకానుభూతిగా ఉంది’.. అంటూ నిక్ తన అనుభూతిని పంచుకున్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
చదవండి: Inspirational Story : ఇంటర్, డిగ్రీలో ఫెయిలైనా.. జీవితంలో పాస్ అయ్యాడిలా..
ఇది సామాన్యమైన విషయం కాదు..
ఏపీలోని ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు నేను మాట్లాడిన ఫారిన్ ఇంగ్లిష్ భాషాశైలిని అర్థంచేసుకుని, అంతేస్థాయిలో ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడిన తీరు ఎంతో అద్భుతం. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ఇంత గొప్పగా ఉంటాయని నేను ఊహించలేదు. కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో ఒక ప్రభుత్వ పాఠశాల సకల హంగులతో ఉండటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులను ఇంత గొప్ప ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దడం సామాన్య విషయం కాదు.
చదవండి: Motivational Story: కుంగిపోలేదు.. పోరాడి గెలిచాడు.. తనతో పాటు నలుగురికి..
నా జీవితగాధపై పాఠ్యాంశమా!?
రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన 10వ తరగతి ఇంగ్లిషు టెక్ట్స్‌బుక్‌లోని మొదటి పాఠ్యాంశంగా ఉన్న పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో ‘ఆటిట్యూడ్ ఆల్టిట్యూడ్’ పేరుతో తన జీవితగాధను ముద్రించడం ఆశ్చర్యకరం. పాఠ్యాంశంగా నాకు చోటు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మీ పాఠ్య పుస్తకంలో రాసిన నా జీవితం గురించి చదివారా? (మీ గురించి చదివామని విద్యార్థులు చెప్పగా, ఆయన ఆంతులేని ఆనందానికి లోనయ్యారు.)
చదవండి: Inspirational Story: ఈయన కష్టం చూసే.. ఈ కొత్త ఆవిష్కరణ
నాడు–నేడుతో పాఠశాల రూపం మార్చేశారు..
నిక్ వుజిసిక్‌తో టెన్త్ విద్యార్థిని సాజిదా మాట్లాడుతూ.. ‘నేను చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన చలువతో మా పాఠశాలలో అన్ని రకాల వసతులతో చదువుకుంటున్నాం. జగనన్న విద్యాకానుక కిట్లు, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియంతో నేను ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన మీతో ఆంగ్లంలో ఇలా మాట్లాడగలుగుతున్నాను.. వైఎస్ జగన్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాను’. (ఆత్మవిశ్వాసంతో సాజిదా చెప్పిన మాటలకు నిక్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.)
నాడు–నేడుతో ‘కార్పొరేట్’ను తలదన్నేలా..
మరో విద్యార్థిని డి. శిరీష మాట్లాడుతూ.. ‘ఇంగ్లిష్ టెక్ట్స్‌బుక్‌లో మీ బయోగ్రఫీ చదివి స్ఫూర్తి పొందా. ప్రపంచం మెచ్చే మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగిన తీరుతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాడు–నేడుకు ముందు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది. సరిపడా తరగతి గదుల్లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే, జగన్ మావయ్య సీఎం అయిన తరువాత నాడు–నేడు ద్వారా కల్పించిన వసతులతో మేం కార్పొరేట్ పాఠశాలలను మించిన స్థాయిలో ఆధునిక తరగతి గదులు, నూతన ఫర్నిచర్‌పై కూర్చుని తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ లైట్ల మధ్య ఏకాగ్రతతో చదువుకునేందుకు అవకాశం కలిగింది. జగనన్న విద్యాకానుక కిట్‌తో ఉచిత పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పొందడంతో పాటు 8వ తరగతిలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లో నాణ్యమైన బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన తీరు అద్భుతం’.. అంటూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శిరీష నిక్ దృష్టికి తెచ్చింది.
దేశంలోనే బెస్ట్ సీఎం వైఎస్ జగన్
ఇక సీఎం వైఎస్ జగన్ ఎంతో విజన్ కలిగిన నాయకునిగా దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారని నిక్ వుజిసిక్ అభివర్ణించారు. ఆ తర్వాత వేణుగోపాల్‌నగర్‌లోని కోన బాల ప్రభాకరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్ పుష్ప స్వయంగా గీసిన నిక్ చిత్రాన్ని ఆయనకు బçహూకరించగా ఆయన ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు ఆర్. ధనుంజయరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
కాలాన్ని ఎదిరించిన కాలు!
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణుడు, ప్రేరణాత్మక వక్త నిక్ వుజిసిక్ రాసిన వ్యాసాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగాలు లక్షల మందిలో వెలుగులు నింపి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. టెట్రా అమీలియా సిండ్రోమ్ కారణంగా నిక్ కాళ్లు, చేతులు లేకుండా జన్మించినా నిక్ నైరాశ్యం చెందలేదు. అతి స్వల్పంగా ఉన్న ఎడమ తుంటి భాగం సాయంతో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఆయన మెల్‌బోర్న్‌లో పుట్టారు. 2002లో ఆస్ట్రేలియా నుంచి అమెరికా చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారాలని నిర్ణయించుకుని 2005లో లైఫ్ వితౌట్ లిమిట్స్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. 2007లో ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే మరో సంస్థను ప్రారంభించారు.
కొద్దిపాటి కాలుతోనే అన్నీ..
నిక్ కష్టాల గురించి తెలుసుకోవాలంటే పొద్దున్నే లేవగానే ఒళ్లు విరుచుకునేందుకు కాళ్లు చేతులు లేకపోవడం.. కాస్తంత దురదగా అనిపించినప్పుడు, ప్రేమగా కౌగిలించుకునేందుకు చేతులు లేకపోవడం ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. 26 ఏళ్లుగా ఆయన్ను ఇవేమీ ఆపలేకపోయాయి. ఫుట్‌బాల్, గోల్ఫ్‌తోపాటు ఈత, సర్ఫింగ్ లాంటివి ఆయన వ్యాపకాలు. అవయవ శేషంగా మిగిలిన కొద్దిపాటి కాలుతోనే ఆయన టైప్ చేస్తుంటారు. పెన్నుతో రాస్తుంటారు. ఏదైనా వస్తువులను తీసుకునేందుకు ఆసరాగా వినియోగిస్తుంటారు. తన కాలును ఆయన సరదాగా చికెన్ డ్రమ్‌స్టిక్ అని వ్యాఖ్యానిస్తుంటారు.
సాధారణ బడికే..
ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం నిర్వహించే స్పెషల్ స్కూళ్లకు కాకుండా సాధారణ పాఠశాలలకే పంపాలని తన తల్లిదండ్రులు తీసుకున్న కఠిన నిర్ణయం తనను రాటుదేల్చిందని నిక్ చెబుతుంటారు. నిక్ పుట్టగానే ఆస్పత్రిలో ఆయన్ను చూసిన తండ్రి షాక్ తిని వాంతి చేసుకున్నాడు. నాలుగు నెలల వయసు వచ్చేవరకు నిక్ తల్లి సైతం ఆయన్ను దరిచేర్చుకోలేకపోయారు.
- న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ ఆథర్
- ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు
- 2005లో యంగ్ ఆస్ట్రేలియన్ అవార్డు
- ద బటర్ ఫ్లై సర్కస్ షార్ట్ ఫిల్మ్‌లో నటనకు 2010లో ఉత్తమ నటుడిగా ఎంపిక.
- ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా 2011లో స్విట్జర్లాండ్‌లో నిక్ ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
- 2012లో జీవిత భాగస్వామి కనే మియహరను కలుసుకున్నారు. వీరికి నలుగురు సంతానం.