High Court: పెద పిల్లలకు సీట్లు ఇస్తారా? మీకు జైల్లో సీట్లు ఇవ్వాలా?
ఈ విద్యా సంవత్సరం నుంచే 25 శాతం కోటా పేద పిల్లలు పాఠశాలల్లో ఉండాలని, లేని పక్షంలో మీరు జైల్లో ఉండాలని విద్యా శాఖాధికారులకు తేల్చి చెప్పింది. ఈ సంవత్సరం ఎంత మంది పేద పిల్లలు ఎన్ని పాఠశాలల్లో సీట్లు పొందారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తమ ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని చెప్పింది. పిల్లలకు సీట్లు కేటాయించకుంటే, మీకు జైల్లో సీట్లు కేటాయిస్తామని అధికారులకు స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడమంటే ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగా వ్యవహరించడమేనని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 7కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ధర్మాసనం సెప్టెంబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: Tenth Class: విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ కోత్త ప్రణాళిక
తల్లిండ్రులు అవకాశాన్ని కోల్పోతున్నారు
విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని హైకోర్టు జనవరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను School Education Department అధికారులు అమలు చేయలేదంటూ పిటిషనర్ తాండవ యోగేష్ తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సెప్టెంబర్ 1న సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయింపుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు పత్రికల్లో ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలల్లో చేర్చే అవకాశాన్ని కోల్పోతున్నారని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది (పాఠశాల విద్య) ఎల్వీఎస్ నాగరాజు స్పందిస్తూ.. ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సీట్ల భర్తీకి సిద్ధం చేశామని, ఆ వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం లేదన్నారు.