అసఫ్‌జాహీలు- సైన్య సహకార పద్ధతి
మొగల్ సామ్రాజ్యానికి జాగీర్దార్‌గా హైదరాబాద్‌లో అసఫ్ జాహీ వంశం ప్రారంభమైంది. మొదటి అసఫ్ జా మరణానంతరం ఈ రాజ్యం స్వతంత్రత కోల్పోతూ వచ్చింది. మహారాష్ర్టుల నుంచి రక్షణ కోసం ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకోవడానికి నిజాం అలీ ప్రయత్నించాడు. కానీ 1763లో మూడో కర్ణాటక యుద్ధ వ్యవహారాల్లో తలమునకలై ఉన్న బ్రిటిషర్లు నిజాం అలీ ప్రతిపాదనలను అంగీకరించలేదు.
- ఉత్తర సర్కారులన్నింటినీ బ్రిటిషర్లకు ఇచ్చేలా మొగల్ చక్రవర్తి ‘షా ఆలం’ నుంచి 1765లో రాబర్‌ట క్లైవ్ ఒక ఫర్మానా పొందాడు.
- భారతదేశం నుంచి ఫ్రెంచి వారిని తరిమివేసే ఉద్దేశంతో లార్‌డ వెల్లస్లీ దేశంలో సైన్య సహకార ఒప్పందం ప్రవేశపెట్టాడు. దీనిపై హైదరాబాద్ నిజాం అలీ మొదట సంతకం చేశాడు. దీని ప్రకారం నిజాం అలీ రాజ్యంలో బ్రిటిష్ సైన్యం శాశ్వతంగా ఉండే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ సైన్యానికి జీతాలు ఇవ్వడానికి దత్త మండలాలు ఇచ్చారు. బ్రిటిష్ ప్రతినిధి నిజాం అలీ ఆస్థానంలో నివాసం ఉన్నాడు.
- సికిందర్ జాతో 1800లో సైన్య సహకార ఒప్పందంపై మరోసారి సంతకం చేయించారు. దీంతో నిజాం అధికారాలు ఈస్టిండియా కంపెనీ పరిధిలోకి వెళ్లిపోయాయి. కంపెనీ చేతుల్లో నిజాం కీలుబొమ్మగా మారాడు.
- కంపెనీకి తెలియకుండా ఇతర పాలకులతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిజాంకు వీల్లేకుండా పోయింది. ఆంతరంగిక వ్యవహారాల్లోనూ నిజాం అధికారాలకు పరిమితులు విధించారు.
- తన సొంత ప్రధాని లేదా దివాన్‌ను నియమించడానికి కూడా కంపెనీ అనుమతిని పొందాల్సిన పరిస్థితి నిజాంకు ఏర్పడింది.
- రెండో ఆంగ్లో - మహారాష్ర్ట యుద్ధంలో కంపెనీకి నిజాం పూర్తి సహకారం అందించలేదు. దీన్ని తీవ్రంగా భావించిన గవర్నర్ జనరల్ వెల్లస్లీ 1803లో నిజాంతో బలవంతంగా మరో ఒప్పందం కదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధ సమయాల్లో నిజాం సైన్యాన్నంతా కంపెనీ ఆధీనంలో ఉంచాలి.
నిజాం రాజ్యంలో అరాచక పరిస్థితులను చక్కదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో హెన్రీ రస్సెల్ హైదరాబాద్‌లో నూతన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దీన్నే రస్సెల్ బ్రిగేడ్ లేదా రస్సెల్ సైన్యం అంటారు. ఇదే తర్వాతి కాలంలో హైదరాబాద్ ‘కాంటిజెంట్’ సైన్యంగా మారింది. స్థానిక పిండారీలు, బిల్లులు, జమీందార్ల ఆగడాలను అణచివేసి రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడారు. 1860, 1867లో మొదటి సాలార్జంగ్‌ను పదవి నుంచి తొలగించడానికి నిజాం యత్నించాడు. కానీ హైదరాబాద్‌లోని బ్రిటిష్ ప్రతినిధులు అతడి పదవిని రక్షించారు. 1860లో హైదరాబాద్‌లోని బ్రిటిష్ ప్రతినిధి కల్నల్ డేవిడ్‌సన్ జోక్యం చేసుకోవడంతో నిజాం మొదటి సాలార్జంగ్‌ను పదవి నుంచి తొలగించలేకపోయాడు. 1867లో బ్రిటిష్ ప్రతినిధి యూల్ సహాయంతో సాలార్జంగ్ తన పదవిని నిలుపుకున్నాడు.
సిపాయిల తిరుగుబాటు
1857లో చెలరేగిన సిపాయిల తిరుగుబాటు ఆంగ్ల ప్రభుత్వ పునాదులను కదిలించింది. ఉత్తర భారతదేశంలో.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఈ తిరుగుబాటు తీవ్ర స్థాయిలో జరిగింది.
సిపాయిల తిరుగుబాటు ప్రభావం దక్షిణ భారతంలోని ఆంధ్ర ప్రాంతం కంటే హైదరాబాద్ సంస్థానం, ఇక్కడి ప్రజలపై ఎక్కువగా ఉంది. హైదరాబాద్ సంస్థానంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. సహజంగానే వీరు ఉత్తర భారతదేశంలోని ముస్లిం తిరుగుబాటుదారుల వైపు మొగ్గు చూపారు.
హైదరాబాద్ నిజాం, అతడి ప్రధానమంత్రి సాలార్జంగ్ బ్రిటిషర్లకు విధేయులుగా ఉండేవారు. అయినప్పటికీ ముస్లింలలోని కొన్ని వర్గాలు ఉత్తర భారతదేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతు పలికాయి. వాస్తవానికి హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిషర్లపై వ్యతిరేకత అంతకు ముందు నుంచే ఉంది. ఈస్టిండియా కంపెనీ 1789లో నిజాంతో సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటి నుంచే బ్రిటిషర్లపై వ్యతిరేకత మొదలైంది.
- 1839 నాటికి ఈ వ్యతిరేకత వహాబీ ఉద్యమంగా రూపొందింది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
- 1839లో ఉత్తర భారతదేశం నుంచి వహాబీలు హైదరాబాద్‌కు వచ్చి బ్రిటిషర్లపై ‘జిహాద్’ ప్రకటించాలని బోధించారు. ఈ ఉద్యమకారులకు హైదరాబాద్ నిజాం నసీరుద్దౌలా సోదరుడైన ముబారిజుద్దౌలా ప్రోత్సాహం, మద్దతు లభించాయి.
- ‘ముబారిజుద్దౌలాకు దేశ బహిష్కారం విధించకుంటే ఇరవై వేల మంది వహాబీ ఉద్యమకారులను ఎదుర్కోవడం కష్టమవుతుంది’ అని బ్రిటిష్ రెసిడెంట్ పేర్కొన్నాడు. దీని ఆధారంగా ఈ ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
- ముబారిజుద్దౌలాను బహిష్కరించకుండా అరెస్ట్ చేసి కోటలో బంధించారు. ఇతడిని తెలంగాణలో తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా పేర్కొనవచ్చు.
- వహాబీలతో రహస్య మంతనాలు జరుపుతున్నాడనే కారణంతో కర్నూలు జాగీర్దారు గులాం రసూల్ ఖాన్‌ను తిరుచునాపల్లి జైలుకు పంపారు. కర్నూలు జాగీర్‌ను బ్రిటిష్ ఇండియాలో కలిపారు.
- వహాబీ ఉద్యమం 1857 సిపాయిల తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చింది.
- హైదరాబాద్‌లో శాశ్వత నివాసం ఉన్న బ్రిటిష్ సైన్యం కోసం బీరారు, రాయచూర్, ఉస్మానాబాద్ జిల్లాలను నిజాం బలవంతంగా కంపెనీకి స్వాధీనం చేయడంతో బ్రిటిషర్లపై వ్యతిరేకత మరింత పెరిగింది.
- 1855లో బొల్లారం కంటోన్మెంట్‌లో క్రైస్తవ మతంలోకి మారిన ముస్లింలు, ఇస్లాం మతాన్ని విమర్శించడం కూడా హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటుకు కారణమైంది.
- 1857 మే 10న మీరట్ వద్ద సిపాయిలు తిరుగుబాటు చేసినప్పుడు బ్రిటిషర్లపై ఉన్న వ్యతిరేకత బహిర్గతమైంది.
- హైదరాబాద్ నిజాం కూడా బ్రిటిషర్లపై సాగే తిరుగుబాటులో పాల్గొనాలని ప్రజలు ఆశించారు. కానీ అది నెరవేరలేదు.
- 1857 తిరుగుబాటు ప్రారంభమైన వారంలోనే 1857 మే 16న నసీరుద్దౌలా మరణించడంతో అతడి కుమారుడు అఫ్జలుద్దౌలా నిజాం పదవిని చేపట్టాడు.
- నవాబ్ అఫ్జలుద్దౌలా, అతడి ప్రధాని మొదటి సాలార్జంగ్ బ్రిటిషర్లకు అనుకూలంగా ఉన్నారు.
- ఉద్యమాల వల్ల నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ సంస్థానం ప్రాముఖ్యం, నిజాం స్నేహానికి ఉన్న విలువను బ్రిటిషర్లు కూడా గుర్తించారు.
- బొంబాయి రాష్ట్ర గవర్నర్ ‘ఈ తిరుగుబాటుకు నిజాం సహకరిస్తే, మనం సర్వస్వం కోల్పోయినట్లే’ అని గవర్నర్ జనరల్‌కు లేఖ రాశాడు.
- బ్రిటిషర్లపై తిరుగుబాటుకు ప్రజలను ప్రోత్సహించడంలో మౌల్వీ ఇబ్రహీం ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ తిరుగుబాటులో సికింద్రాబాద్, బొల్లారంలోని సైన్యం కూడా పాల్గొంటుందని ప్రజలకు తెలియజేశాడు.
- అల్లావుద్దీన్ లాంటి ముస్లిం మౌల్వీలు హైదరాబాద్ మక్కా మసీదు వద్ద ఇచ్చిన ఉపన్యాసాల్లో, బ్రిటిషర్లను ఇస్లాం మత శత్రువులుగా చిత్రించారు. వారిని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఔరంగాబాద్ వద్ద ఉన్న హైదరాబాద్ సంస్థానానికి చెందిన ఒకటో, రెండో అశ్విక దళాలు ‘మా మతం వారిపై మేం యుద్ధం చేయబోము’ అని ప్రకటించాయి. సంస్థానం సరిహద్దు వెలుపలికి వెళ్లేందుకు నిరాకరించాయి. ఔరంగాబాద్‌లో ఈ అశ్విక దళాల తిరుగుబాటుకు జమేదార్ అమీర్ ఖాన్, డఫేదార్ మీర్ ఫిదా అలీ నాయకత్వం వహించారు.
- మీర్ ఫిదా అలీని అధికారులు నిర్బంధించి, సైనిక న్యాయస్థానంలో విచారించి ఉరితీశారు. అతడికి సహాయం చేసిన చాలా మందిని అరెస్టు చేశారు.
- ఒకటో అశ్విక దళం సైనికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఔరంగాబాద్‌లో తిరుగుబాటును సులభంగా అణచివేశారు.
- బుల్తానా వద్ద ఉన్న హైదరాబాద్ కాంటిజెంట్ దళాలు కూడా ఈ తిరుగుబాటు ప్రభావానికి లోనయ్యాయి. ఈ సైన్యంలోని చాలామందిని నిర్బంధించారు.
- బుల్తానా వద్ద ఉన్న దళాల నుంచి తప్పించుకొని పారిపోయిన కొంతమంది జమేదార్ ఛీదాఖాన్ నాయకత్వంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఛీదాఖాన్‌ను పట్టుకొని అప్పగించిన వారికి హైదరాబాద్ ప్రభుత్వం రూ. 3 వేల బహుమతి ప్రకటించింది.
- ఛీదాఖాన్ సిపాయిలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టగానే అరెస్ట్ చేశారు. ఇది మరింత ఉద్రిక్తతకు కారణమైంది.
1857 జూలై 17న మక్కా మసీదు వద్ద ప్రజలు సమావేశమై ఛీదాఖాన్, అతడి అనుచరులను విడుదల చేయాల్సిందిగా నిజాంను అర్థించడానికి నలుగురు మౌల్వీలను పంపాలని తీర్మానించారు. ఈ సమావేశం గురించి తెలిసిన సాలార్జంగ్ అరబ్బీ అంగరక్షక దళాన్ని మక్కా మసీదు వద్దకు పంపాడు. అక్కడ ఉన్న వారిని ఈ దళాలు చెదరగొట్టాయి. తుర్రేబాజ్‌ఖాన్, మౌల్వీ అల్లా ఉద్దీన్ నాయకత్వంలో 500 మంది రోహిల్లాలు సుల్తాన్ బజార్‌లోని బ్రిటిష్ రెసిడెంట్ భవనంపై అదే రోజు సాయంత్రం దాడి చేశారు. రెసిడెన్సీ రక్షణ బాధ్యతను మేజర్ హెచ్‌సీ బ్రిగ్‌సకు అప్పగించారు. ఈ దాడిలో రోహిల్లాలు వీరోచితంగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. రెసిడెన్సీపై జరిగిన దాడికి నాయకత్వం వహించిన తుర్రేబాజ్‌ఖాన్ తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా మొగల్‌గూడ వద్ద అరెస్ట్ చేశారు. రెసిడెన్సీపై దాడికి తానే పూర్తి బాధ్యుడినని అతడు ఒప్పుకున్నాడు. బ్రిటిషర్లను భారతదేశం నుంచి తరిమివేయడానికి మత విశ్వాసంతో తిరుగుబాటు చేశానని ప్రకటించాడు. తుర్రేబాజ్‌ఖాన్‌పై విచారణ జరిపి అతడికి యావజ్జీవ దేశాంతరవాస శిక్ష విధించారు.
తుర్రేబాజ్‌ఖాన్ 1859 జనవరి 18న జైలు నుంచి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకోవడానికి సాయపడినవారికి రూ. 5 వేల బహుమతిని ప్రకటించారు. కుర్బాన్ అలీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా తూఫ్రాన్ గ్రామం వద్ద తుర్రేబాజ్‌ఖాన్‌ను ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో బ్రిటిష్ సైనికులు జరిపిన కాల్పుల్లో తుర్రేబాజ్‌ఖాన్ మరణించాడు. అతడి శవాన్ని సుల్తాన్ బజార్‌లో వేలాడదీశారు.
- మౌల్వీ అల్లావుద్దీన్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పారిపోయాడు. తర్వాత అతణ్ని మంగళపల్లి వద్ద అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చి విచారించి అండమాన్ ద్వీపానికి పంపించారు. 1884లో అతడు అండమాన్ జైల్లోనే మరణించాడు.
- కౌలస జాగీర్దారు రాజా దీప్‌సింగ్ కొంతమంది జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీలను కూడగట్టి కౌలస్ కోటను గెరిల్లా శిక్షణ కేంద్రంగా మార్చి బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు చేశాడు. దీంతో బ్రిటిషర్లు అతడిని అరెస్ట్ చేసి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఆయన జాగీర్‌ను రద్దు చేశారు. చివరికి కౌలస పట్వారీ రంగారావును అండమాన్‌కు పంపడంతో 1859 నాటికి కౌలసలో అల్లర్లు సద్దుమణిగాయి.
- 1859 మార్చి 25న గవర్నర్ జనరల్ తరఫున కల్నల్ డేవిడ్‌సన్ నిజాంకు కానుకలు ఇవ్వడానికి వెళ్లాడు. సాలార్జంగ్‌తో తిరిగి వస్తుండగా రోహిల్‌ఖండ్ పఠాన్ జహంగీర్ ఖాన్ వీరిపై దాడి చేశాడు. దాడి నుంచి వారు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ జహంగీర్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటిషర్లను ఎదిరించిన అజ్మత్‌సింగ్, మీర్దా చంద్, బాజేఖాన్, మౌల్వీ ఇబ్రహీంను కూడా జైలుకు పంపారు.
- ఆదిలాబాద్‌లోని నిర్మల్‌లో 1860లో రాంజీ గోండ్ నాయత్వంలో 300 మంది గోండులు, 200 మంది రోహిల్లాలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ సైన్యం వీరందరినీ కాల్చి చంపింది.
- వైస్రాయ్ కానింగ్ 1857 తిరుగుబాటులో బ్రిటిషర్లకుసహాయం చేసిన నిజాం అఫ్జలుద్దౌలాకు ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదు ఇచ్చి సత్కరించాడు.
#Tags