తెలంగాణ - వ్యవసాయ రంగ స్థితిగతులు

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. రాష్ర్ట జనాభాలో 55.49 శాతం మందికి వ్యవసాయ రంగం జీవనోపాధి కల్పిస్తుంది. రాష్ర్టం గుండా గోదావరి, కృష్ణా వంటి రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి. రాష్ర్టంలో అధిక శాతం భూములకు ఈ రెండు నదులే నీటి పారుదల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. గోదావరి, కృష్ణాలాంటి ముఖ్యనదులతోపాటు తుంగభద్ర, భీమా, దిండి, కిన్నెరసాని, మంజీరా, మానేరు, పెన్‌గంగ, ప్రాణహిత, పెద్దవాగు, తాలిపేరు లాంటి చిన్న నదులు కూడా తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తున్నాయి.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ పాత్ర
తెలంగాణ రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు వ్యవసాయ రంగం తనవంతు చేయూతను అందించింది. 1993-94లో జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగ వాటా 23.9 శాతం కాగా, 2010-11 నాటికి 19.5 శాతానికి తగ్గింది. 2013-14లో స్థిర ధరల వద్ద (2004-05) తెలంగాణ జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగ వాటా 15.1 శాతంగా ఉంటే 2014-15లో స్థిర ధరల వద్ద (2004-05) 12.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం వాటా 17.9 శాతంగా ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో (జీఎస్‌డీపీలో) వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ పారిశ్రామిక, సేవారంగాల వాటా పెరుగుతున్నప్పటికీ ఒకే ఆర్థిక కార్యకలాపంగా వ్యవసాయరంగమే ఇప్పటికీ రాష్ర్ట ఆదాయానికి అధిక మొత్తాన్ని సమకూరుస్తుందని చెప్పవచ్చు.

సుస్థిరవృద్ధి సాధన ద్వారా పేదరికం తగ్గించాలంటే వ్యవసాయాదాయాల్లో పెరుగుదలను నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంలోని మిగులు శ్రామికులను ఇతర రంగాలకు మరల్చాలి. ముఖ్యంగా వారిలో నైపుణ్యాలను పెంచి గ్రామీణ పరిశ్రమలకు బదిలీ చేయగలిగినప్పుడు వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత తగ్గుతుంది. ఫలితంగా వ్యవసాయ ఆదాయాలు పెరుగడంతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి.

తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక కార్యకలాపాల కోసం ఎంపిక చేసిన కీలక రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు అధిక పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. అదే జరిగితే వ్యవసాయదారుల ఉత్పత్తికి డిమాండ్ పెరిగి వారి ఆదాయాల్లో పెరుగుదల ఏర్పడుతుంది. ఫలితంగా వ్యవసాయ కార్యకలాపాలు విస్తృతమై జీఎస్‌డీపీలో పెరుగుదల నమోదవుతుంది.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత కల్పించేందుకు తీసుకునే చర్యల్లో వ్యవసాయ రంగం పాత్ర కీలకమైంది. 2015, జనవరి 1 తర్వాత లెక్కల ప్రకారం దేశంలో 87.57 లక్షల కుటుంబాలకు (2.80 కోట్ల లబ్ధిదారులు) ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. ఇందులో భాగంగా వారందరికీ ఆహార ధాన్యాల సరఫరాను నిరంతంరంగా కొనసాగించటంలో దేశ వ్యవసాయరంగానిది విస్మరించలేని పాత్ర.

రాష్ర్టంలోని ముఖ్య వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు ముడి సరుకుల కోసం వ్యవసాయ రంగంపై ఆదారపడి ఉన్నాయి. తయారీ రంగానికి సంబంధించి అధిక భాగం ఆదాయం వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచే లభిస్తుంది.

రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా గణణీయంగా ఉంది. భూమి శిస్తు పెంపు ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడం ద్వారా భారతీయ రైల్వే, రోడ్డు రవాణ సంస్థలు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.


తెలంగాణలో వ్యవసాయ రంగం స్థితి - శ్రీకృష్ణ కమిటీ నివేదిక
  • 1950-60 మధ్యకాలంలో తెలంగాణ రాష్ర్టంలో మొత్తం సాగుభూమి సగటు 4.8 మిలియన్ హెక్టార్లు కాగా, 2006-09 మధ్యనాటికి సాగుభూమి సగటు 5 మిలియన్ హెక్టార్లుగా ఉంది.
  • తెలంగాణలో 1956-60 నుంచి 2006-09 మధ్య కాలంలో సాగునీటి వసతి కలిగిన నికర ప్రాంతంలో పెరుగుదల 113 శాతంగా ఉంది. గత ఐదు దశాబ్దాల కాలంలో, ముఖ్యంగా 1970వ దశకం మధ్య భాగంలో సాగునీటి వసతి కలిగిన నికర ప్రాంతంలో పెరుగుదల గణణీయంగా ఉంది.
  • తెలంగాణలో 1956లో వ్యవసాయ భూమిలో సాగు భూమి నిష్పత్తి (సాగునీటి లభ్యత) 17.2 శాతంగా ఉంటే 2008-09 నాటికి 50.4 శాతానికి పెరిగింది. గత ఐదు దశాబ్దాల కాలంలో సాగునీటి లభ్యత గణణీయంగా 33 శాతం పాయింట్లు పెరిగింది.
  • సాగునీటి అవసరాల కోసం అధికంగా ఉపరితల జలాలను వినియోగిస్తూ, ఇతర అవసరాలకు అధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. అందువల్ల ఉపరితల నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. తెలంగాణలో 1957 ట్యాంకుల ద్వారా సాగునీటి లభ్యత 64 శాతం కాగా, అది 2008-09 నాటికి 12 శాతానికి తగ్గింది.
  • రాష్ర్టంలో వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు వినియోగించిన విద్యుత్ 1974-75లో 260 కిలోవాట్లు కాగా, 2008-09 నాటికి 4930 కిలోవాట్లకు పెరిగింది. ఈ కాలంలో వ్యవసాయానికి సాగునీరు అందించటానికి వినియోగించే విద్యుత్‌లో పెరుగుదల 18 రెట్లు.
  • తెలంగాణలో సగటు కమతం విస్తీర్ణం 1.3 హెక్టార్లు. మొత్తం సాగుభూమిలో 46 శాతం రెండు హెక్టార్ల కన్నా తక్కువగా ఉంది. సాగులో ఉన్న వ్యవసాయ భూమిలో 44 శాతం భూమికి సాగునీటి వసతి ఉంది.

వ్యవసాయ రంగం - ప్రస్తుత స్థితి
  • వ్యవసాయ గణాంకాలు 2010-11 ప్రకారం, తెలంగాణ రాష్ర్టంలో మొత్తం 55.54 లక్షల కమతాలు ఉన్నాయి. ఈ కమతాలు 61.97 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. రాష్ర్టంలో కమతాల సగటు పరిమాణం 1.11 హెక్టార్లు. మొత్తం కమతాల్లో ఒక హెక్టార్లులోపు ఉన్న ఉపాంత కమతాల వాటా 62 శాతం కాగా, ఒకటి నుంచి రెండు హెక్టార్లలోపు ఉన్న చిన్న కమతాల వాటా 23.9 శాతం. రాష్ర్టంలోని మొత్తం కమతాల్లో ఉపాంత, చిన్న కమతాల వాటా 85.9 శాతంగా ఉంది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కమతాల్లో 60 శాతానికి పైగా కమతాలు ఉపాంత కమతాలు. ఆదిలాబాద్ జిల్లాలో కమతం సగటు పరిమాణం ఎక్కువ కాగా, నిజామాబాద్ జిల్లాలో తక్కువగా ఉంది.
  • 2004-05 నుంచి 2013-14 మధ్యకాలంలో వర్షపాతాన్ని పరిశీలిస్తే 2004-05లో సాంవత్సరిక వాస్తవ వర్షపాతం తక్కువగా (614మి.మీ) నమోదు కాగా, 2013-14లో అధికంగా (1212 మి.మీ.) నమోదైంది.
  • 2012-13లో స్థూల నీటి పారుదల విస్తీర్ణం 25.57 లక్షల హెక్టార్లు కాగా, 2013-14లో 31.64 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇదే కాలానికి సంబంధించి నికర నీటి పారుదల విస్తీర్ణం 17.74 లక్షల హెక్టార్ల నుంచి 22.89లక్షల హెక్టార్లకు పెరిగింది.
  • నికర సాగు విస్తీర్ణాన్ని ఆధారాల పరంగా పరిశీలించినప్పుడు 2009-10లో బావుల వాటా 84.33 శాతం నుంచి 2013-14లో 74.83 శాతానికి తగ్గింది. మొత్తం నికర నీటిపారుదల విస్తీర్ణంలో కాల్వల వాటా 2012 -13లో 5.07 శాతం నుంచి 2013-14లో 12.67 శాతానికి పెరిగింది.


#Tags