పర్యాటక రంగం

రాష్ర్ట సామాజిక-ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగం దోహదం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. టూరిజం ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ రంగానికి అనేక అవకాశాలను కల్పిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ర్ట పర్యాటక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ విభిన్న తరహాల పర్యాటక ప్యాకేజీలు/సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి, వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ప్రపంచంలో అత్యుత్తమ, 2015లో చూడాల్సిన 20 ప్రదేశాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెలర్ మ్యాగజీన్ వార్షిక గైడ్ ఈ జాబితాను ప్రచురించింది. హైదరాబాద్‌లోని వారసత్వ ప్రదేశాలు సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యంతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. హైదరాబాద్‌ను సందర్శించే పర్యాటకుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్యాకేజీలను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫలక్‌నుమ, చౌమహల్లా ప్యాలెస్‌లను సందర్శించాలనుకునేవారి కోసం నిజాం ప్యాలెస్‌ల పర్యాటక ప్యాకేజీని అందిస్తున్నారు. ఈ ప్యాలెస్‌లతోపాటు గోల్కొండ కోటలో తారామతి బారాదరీలో సౌండ్ అండ్ లైట్ షోను తిలకించేందుకు ప్రతిరోజూ హైదరాబాద్‌లో రాత్రి పర్యటనను తెలంగాణ రాష్ర్ట పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ప్రవేశపెట్టింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న కుతుబ్‌షాహీ సమాధుల పరిరక్షణ, సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తామని కేంద్ర బడ్జెట్ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. సమాధుల పరిరక్షణ ప్రాజెక్టులో రాష్ర్ట ప్రభుత్వంతో అగాఖాన్ ట్రస్ట్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సును అభివృద్ధి చేసింది. దీని సమీపంలో గోల్ఫ్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉంది. ఈ అసోసియేషన్ ఇప్పటికే గోల్కొండ మాస్టర్స్‌ పీజీటీఐ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. హైదరాబాద్‌లో ఈ తరహా టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఎంఐసీఈ (సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలు) పర్యాటకానికి కూడా హైదరాబాద్ కేంద్రంగా ఆవిర్భవించింది. ఈ విషయంలో దేశంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న నగరంగా నిలిచే అవకాశం భాగ్యనగరానికి ఉంది. హైదరాబాద్ సదస్సులు, సందర్శకుల బ్యూరో (హెచ్‌ఎస్‌వీబీ)ను ఏర్పాటు చేశారు. భారత్‌లో ఏర్పాటైన ఈ తరహా సంస్థల్లో ఇదే మొదటిది కావడం విశేషం. సంబంధిత అంశాల్లో మార్కెటింగ్ ప్రయత్నాలను ఈ బ్యూరో సమన్వయపరుస్తుంది.
తెలంగాణ జిల్లాల్లోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి, వసతులను కల్పించనున్నారు. అనువైన ప్యాకేజిల ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్, కరీంనగర్, రామప్ప, కిన్నెరసాని, కొత్తగూడెం, గజ్వేల్ ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయనున్నారు. ఇందు కోసం నీతి ఆయోగ్ రూ. 33 కోట్లను కేటాయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. దీని కోసం సమగ్ర జిల్లా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా అనేక ఆలయాలు, చారిత్రక ఆరాధనా ప్రదేశాలున్నాయి. ఇవి ఇప్పుడు ప్రసిద్ధ యాత్రా కేంద్రాలుగా రూపొందాయి. హైదరాబాద్ సమీపంలో ఉస్మాన్ సాగర్ తీరాన చిలుకూరు బాలాజీ ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని సందర్శించేలా ఒక సర్క్యూట్‌ను టీఎస్‌టీడీసీ ప్రారంభించింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం, ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉన్న సరస్వతి ఆలయం, నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ సందర్శన కోసం ఇదే తరహా ప్యాకేజీ టూర్లను కూడా టీఎస్‌టీడీసీ అందిస్తోంది. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టులోని హనుమాన్ టెంపుల్, ధర్మపురిలోని నరసింహ స్వామి ఆలయం, వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప గుడి, మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోని జోగులాంబ ఆలయాల దగ్గర పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను చేపట్టారు.

గ్రామీణ‌ పర్యాటకం
అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులు, ఆచారాలు తెలంగాణ పల్లెల సొంతం. దీంతో రాష్ర్టంలో గ్రామీణ పర్యాటకానికి అద్భుతమైన అవకాశం ఉంది. అత్యంత ప్రాచీన జీవన సంస్కృతికి హస్తకళలు ప్రాతినిధ్యం వహిస్తాయి. తెలంగాణలో విలువైన హస్తకళా వనరులున్నాయి. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ తెలంగాణలో గ్రామీణ పర్యాటకం కింద కొన్ని ప్రాంతాలను గుర్తించింది. వీటిలో నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్, ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్, వరంగల్ జిల్లాలోని చేర్యాల గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్, పెంబర్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్ ముఖ్యమైనవి.

వన్యప్రాణి, పర్యావరణ పర్యాటకం
తెలంగాణలో అడవులు విస్తారంగా ఉన్నాయి. దీంతో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవి పర్యావరణ-పర్యాటకం, వన్యప్రాణి పర్యాటకాలకు చక్కని అవకాశం కల్పిస్తున్నాయి. వీటిలో నిజామాబాద్‌లోని అలీ సాగర్ జింకల పార్కు, వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, జన్నారం, ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, హైదరాబాద్ సమీపంలోని మహావీర్ హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనం, నెహ్రూ జంతు ప్రదర్శన శాల, సంగారెడ్డిలోని మంజీరా పక్షుల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మెదక్‌లోని పోచారం సంరక్షణ కేంద్రం, రంగారెడ్డిలోని షామీర్‌పేట జింకల పార్కు మొదలైనవి ఉన్నాయి.

వారసత్వ సంపద, సాంస్కృతిక పర్యాటకం
తెలంగాణలో చారిత్రక ప్రాధాన్యమున్న అనేక కోటలున్నాయి. సాంస్కృతిక పర్యాటకాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవి కల్పిస్తున్నాయి. దీంతో ప్రసిద్ధి చెందిన కొన్ని కోటల్లో పర్యాటక శాఖ ప్రాజెక్టుల్ని చేపట్టింది. వాటిలో గోల్కొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, ఎలగందుల, కరీంనగర్, భువనగిరి, నల్గొండ కోటలున్నాయి. వరంగల్, గోల్కొండ కోటల్లో సౌండ్ అండ్ లైట్ షోలు నిర్వహిస్తున్నారు. ఇవి సందర్శకులను చరిత్రలోకి తీసుకెళ్తాయి. చాలా ప్రదర్శనలు తెలంగాణ ఘన వారసత్వాన్ని చాటుతాయి. పైన పేర్కొన్న పర్యాటక ప్యాకేజీలను తెలంగాణ రాష్ర్ట పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తోంది. వీటిని పొరుగు రాష్ట్రాలతో కూడా అనుసంధానిస్తారు. వివిధ ప్రాంతాల్లో గొలుసుకట్టు ‘హరిత’ హోటళ్లు, మార్గమధ్య సౌకర్యాలను టీఎస్‌టీడీసీ కల్పిస్తోంది. నదీ ప్రయాణాలు, జల విహారాలను కూడా ఆ సంస్థ నిర్వహిస్తోంది. ప్రఖ్యాత హైదరాబాద్ బిర్యానీ, ఖుర్బానీ-కా-మీఠా, హలీం, ఇరానీ ఛాయ్ తదితర హైదరాబాద్ వంటకాలను రుచి చూడకపోతే తెలంగాణలో జరిపే ఏ పర్యటనైనా అసంపూర్ణమే.

వైద్య పర్యాటకం
ప్రపంచ వైద్య పర్యాటకానికి కేంద్రంగా ఆవిర్భవించే సామర్థ్యం హైదరాబాద్‌కు ఉంది. నగరంలోని ప్రముఖ ఆసుపత్రులు అందుబాటు ధరలకే ప్రపంచ స్థాయి చికిత్సలు అందిస్తున్నాయి. ఈ అంశంపై ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి, విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

బతుకమ్మ
తెలంగాణ సాంస్కృతిక అస్థిత్వానికి చిహ్నం బతుకమ్మ. ఈ ఉత్సవాన్ని రాష్ర్ట పండుగగా ప్రకటించారు. తెలంగాణ పూల పండుగైన బతుకమ్మకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం ఉంది. 2014లో బతుకమ్మ ఉత్సవ నిర్వహణ కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఏటా ఉత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. బతుకమ్మ పండుగ సందర్భంగా పర్యాటక ప్యాకేజీలను టీఎస్‌టీడీసీ ప్రారంభించింది.

బోనాలు
ప్రభుత్వం బోనాలను కూడా రాష్ర్ట ఉత్సవంగా ప్రకటించింది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్ దర్వాజా దగ్గర ఉన్న మైసమ్మ ఆలయాలకు హైదరాబాద్ బోనాల సందర్భంగా వారాంత ప్యాకేజీ టూర్లను రాష్ర్ట పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రారంభించింది. ఈ పర్యటనలను ఏటా నిర్వహించాలని భావిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో వివిధ రాష్ట్రాల శకటాలను ప్రదర్శిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ర్ట శకటాన్ని 2015లో తొలిసారిగా ప్రదర్శించారు. బోనాల పండుగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని రూపొందించారు.

సమ్మక్క సారలమ్మ జాతర
ఇదే మేడారం జాతరగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవాన్ని వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో వేడుకగా నిర్వహిస్తారు. కుంభమేళా తర్వాత దేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఉత్సవం ఇదే. 2014లో జరిగిన జాతర సందర్భంగా కోటి మందికి పైగా భక్తులు మేడారాన్ని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాన్ని రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. తదుపరి ఉత్సవం 2016లో జరుగుతుంది.

కళల గ్రామం - శిల్పారామం
శిల్పారామం కళాత్మక వస్తువుల నిలయం. వైభవోపేతమైన భారతదేశ పూర్వ సంస్కృతిని ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రాథమిక లక్ష్యం. హస్త కళాకారులు, ప్రదర్శన కళాకారులు నైపుణ్యాలను ప్రదర్శించేందుకు శిల్పారామం ఒక ఉమ్మడి వేదికగా ఉపయోగపడుతుంది. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, వరంగల్‌లోనూ శిల్పారామాన్ని విస్తరించే ప్రక్రియ కొనసాగుతోంది.

సరికొత్త ప్రయత్నాలు
తెలంగాణ సాంస్కృతిక సారథి పేరిట ప్రత్యేక రాష్ర్టస్థాయి సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకే సొంతమైన అద్వితీయ సాంస్కృతిక అస్తిత్వం తమకు గర్వకారణమనే భావనను ప్రజల్లో పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
  • నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండలో సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో మెగా సినిమా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించింది.
  • హైదరాబాద్‌లో తెలంగాణ కళా భారతి, వరంగల్‌లో కాళోజీ కళా కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటి ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించేందుకు, ప్రపంచ స్థాయి వసతులు కల్పించేందుకు కృషి చేస్తారు.
  • యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.100 కోట్లను ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద 400 ఎకరాల్లో నరసింహ అభయారణాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీంతోపాటు మరో 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, కల్యాణ మంటపాలు, ధ్యాన మందిరాలు, వేద పాఠశాల, కాటేజిలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
#Tags