మధ్యయుగ భారతదేశ చరిత్ర (8వ శతాబ్దం - 18వ శతాబ్దం)

తొలి మధ్యయుగం
 హర్షుడి అనంతర యుగం నుంచి ఢిల్లీ సుల్తనత్ ఏర్పడే వరకు  ఉన్న  కాలాన్ని భారతదేశ చరిత్రలో ‘తొలి మధ్యయుగం’గా పిలుస్తారు. ఉత్తర భారతదేశ చరిత్రలో అప్పటి వరకు పాటలీపుత్రం అధికార కేంద్రంగా ఉండేది. ఈ యుగంలో దాని స్థానాన్ని కనౌజ్ ఆక్రమించింది. అందుకే కనౌజ్‌ను దక్కించుకునేందుకు మధ్యయుగంలోని మూడు ముఖ్యమైన రాజ్యాల మధ్య ఎడతెరపిలేని యుద్ధాలు జరిగాయి. అందుకే ఈ యుగాన్ని ఉత్తర భారత చరిత్రలో ‘త్రిరాజ్య సంఘర్షణ యుగం’గా పేర్కొంటారు. ఈ ఘర్షణల్లో పాల్గొన్న రాజవంశాలు... రాష్ర్టకూటులు, ఘార్జర ప్రతీహారులు, పాలరాజులు. ఈ కాలంలో ఉత్తర భారతదేశం పూర్తిగా రాజపుత్రుల ఆధీనంలో ఉంది. మూడు డజన్లకు పైగా రాజపుత్ర రాజ్యాలు ఈ కాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాయి. ఈ యుగంలో దక్కన్‌లో ప్రాబల్యంలో ఉన్న రాజులు రాష్ర్టకూటులు, వారి తర్వాత వచ్చిన కల్యాణి చాళుక్యులు. ఇక దక్షిణ భారతదేశంపై సార్వభౌమాధికారాన్ని స్థాపించిన ప్రముఖ రాజవంశం చోళులు. వీరు 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు దక్షిణభారతదేశాన్ని పాలించారు. చోళుల తర్వాత వీరి రాజ్యాన్ని హోయసాలులు, పాండ్యులు ఆక్రమించుకున్నారు. 
 
ఉత్తర భార తదేశ రాజవంశాలు
తొలి మధ్యయుగంలో ఉత్తర భారతదేశాన్ని దాదాపు 36 రాజవంశాలు పరిపాలించాయి. వీటిలో నాలుగు రాజవంశాలు తమకు తాము అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాయి. అవి ప్రతీహారులు, చాళుక్యులు లేదా సోలంకీలు, పరమారులు లేదా పవార్‌లు, చౌహాన్ లు.
 
ప్రతీహారులు
వీరు ఘార్జర అనే తెగకు చెందినవారు. ఇది మధ్యాసియాకు చెందిన తెగ. హూణులతోపాటుగా వీరు భారత్‌కు వచ్చారు.
మొదటి నాగభటుడు: భారతదేశంలో పలు ప్రతీహార రాజ్యాలున్నాయి. వాటిలో తొలి ప్రతీహార రాజ్యస్థాపకుడు హరిశ్చంద్రుడు. అయితే భారత్‌లో నాగభటుడు స్థాపించిన ప్రతీహార రాజ్యం అతి ముఖ్యమైంది. ఇది 8వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో ఏర్పడింది. నాగభటుడు పశ్చిమ భారతదేశంపై జరిగిన అరబ్బుల దాడిని తిప్పి కొట్టాడు.
వత్సరాజు: మొదటి నాగభటుడి అనంతరం కాకుత్స, దేవరాజ అనే రాజులు పాలించారు. వారి తర్వాత వత్సరాజు రాజ్యానికి వచ్చాడు. ఇతడు నాగభటుడి మనుమడు. పాలరాజు ధర్మపాలుడిని వత్సరాజు ఓడించాడు. కానీ రాష్ర్టకూట ధ్రువుడి చేతిలో ఓడిపోయి మాళ్వా తదితర ప్రాంతాలను కోల్పోయాడు.
రెండో నాగభటుడు: ఇతడు కనౌజ్‌ను పాలించే చక్రాయుధుడిని ఓడించి తన రాజధానిని బిన్‌మల్ నుంచి కనౌజ్‌కు మార్చాడు. మాంఘీర్ యుద్ధంలో ధర్మపాలుడిని ఓడించాడు. కానీ ఇతడు రాష్ర్టకూట రాజు మూడో గోవిందుని చేతిలో ఓడిపోయాడు.
మిహిర భోజ: రెండో నాగభటుడి అనంతరం రామభద్రుడి స్వల్పకాల పాలన తర్వాత మిహిరభోజుడు రాజయ్యాడు. ఇతడు ప్రతీహార వంశంలో అందరి కంటే గొప్పవాడు. అటు పాల రాజులను, ఇటు రాష్ర్టకూటులను ఓడించి విశాలమైన సామ్రాజ్యాన్ని మిహిర భోజుడు నిర్మించాడు. క్రీ.శ. 851లో సులేమాన్ అనే అరబ్ యాత్రికుడు ఇతడి పాలనా కాలంలో రాజ్యాన్ని సందర్శించాడు. మిహిర భోజుడు మహ్మదీయుల బద్ధశత్రువుగా సులేమాన్ పేర్కొన్నాడు.
మహేంద్రపాల: ఇతడి కాలంలో ప్రతీహార రాజ్యం హిమాలయాల నుంచి వింధ్యా వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. మహేంద్రపాల ఆస్థానంలో ఉన్న గొప్ప సంస్కృత కవి రాజశేఖరుడు. ఇతడు కర్పూర మంజరీ, బాల రామాయణం, బాల భారతం, కావ్య మీమాంస, భువనకోశ, హరవిలాస వంటి గ్రంథాలను రచించాడు.
మహీపాల: మహేంద్రపాలుడి అనంతరం రెండో భోజుడు కొంతకాలం పాటు రాజ్యాన్ని పాలించాడు. అతడి అనంతరం మహీపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు రాష్ర్టకూట రాజు మూడో ఇంద్రుడి దాడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. మహీపాలుడి కాలంలో క్రీ.శ. 915-916 మధ్య అరబ్ యాత్రికుడు అల్‌మసూది ఇతడి రాజ్యాన్ని సందర్శించాడు. మహీపాలుడి అనంతరం ఈ రాజ్యం బలహీనమైంది. పలు సామంత రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. మహీపాలుడి అనంతరం రెండో మహేంద్రపాల, దేవపాల, విజయపాల, రాజ్యపాల మొదలైనవారు పాలించారు. యశపాలుడు ఈ వంశంలోని చివరి రాజు.
 
 పరమారులు
 ధార రాజధానిగా మాళ్వా ప్రాంతాన్ని పాలించిన రాజపుత్ర వంశమే పరమార లేదా పవార్ వంశం. ఉపేంద్ర ఈ వంశ స్థాపకుడు. వీరు మొదట ప్రతీహారులకు, రాష్ర్టకూటులకు సామంతులుగా ఉండేవారు.
రెండో సియాకుడు: ఇతడు స్వతంత్ర పరమార రాజ్య స్థాపకుడు. రాష్ర్టకూట రాజు మూడో కృష్ణుడి అనంతరం ఇతడు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు.
వాక్పతి ముంజరాజు: ఇతడు కాలచూరి రాజులను, కల్యాణి చాళుక్యులను ఓడించాడు. చాళుక్య రాజు రెండో తైలపుడు ఆరుసార్లు మాళ్వాపై దండెత్తాడు. చివరికి ఈ దాడుల్లోనే ముంజరాజు మరణించాడు. రాజధాని ధారలో ఇతడు తన పేరుతో ‘ముంజసాగర’ చెరువును నిర్మించాడు. రాజ్యంలో అనేక దేవాలయాలు నిర్మించాడు. ముంజరాజు స్వయంగా కవి. సాహిత్యాన్ని, కళలను పోషించాడు. ఆస్థానంలో పలువురు కవులుండేవారు. వారిలో ముఖ్యమైనవారు పద్మగుప్త, ధనిక, ధనుంజయ.
భోజ: పరమార రాజుల్లో అత్యంత గొప్పవాడు. ఇతడు గొప్ప సైనికుడు, సాహిత్య ప్రియుడు. వివిధ అంశాలపై 24 గ్రంథాలను రచించాడు. అనేక మంది కవులను పోషించాడు. పలు వాస్తు శిల్ప నిర్మాణాలు చేపట్టాడు. భోజుడు రాసిన గ్రంథాలు సమరాంగన సూత్రధార, ఆయుర్వేద సర్వస్వ, యుక్తి కల్పతరు, తత్త్వ ప్రకాశ మొదలైనవి. ‘భోజపుర’ నగరాన్ని నిర్మించాడు. తన రాజధాని ధారలో భోజశాల పేరుతో ఒక కళాశాలను నిర్మించాడు. భోజుడి తర్వాత పరమార రాజ్య వైభోగం క్షీణించింది. ఇతడి తర్వాత పాలించిన రాజుల్లో ముఖ్యమైనవారు జయసింహ, ఉదయాదిత్య. లక్ష్మదేవ, నరవర్మ మొదలైనవారు. పరమారుల్లో చివరిరాజు మహాలకదేవ. ఇతడి తర్వాత ఈ రాజ్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ జయించాడు.

సోలంకీలు
అనిల్‌వారా రాజధానిగా గుజరాత్, కథియవార్ ప్రాంతాలను దాదాపు నాలుగు శతాబ్దాల పాటు సోలంకీలు పాలించారు. వీరిని అనిల్‌వారా చాళుక్యులు అని కూడా అంటారు.
మూలరాజు: అనిల్‌వారా కేంద్రంగా సోలంకీ రాజ్యాన్ని స్థాపించిన రాజు మూలరాజు. రాజధానిలో రెండు శైవాలయాలను నిర్మించాడు.
మొదటి భీమ: ఇతడి పాలనా కాలంలో గజనీ మహ్మద్ సోమనాథ్‌లోని దేవాలయాన్ని ముట్టడించాడు. భీముడు ఈ దాడిని ఎదుర్కోలేక కచ్‌కు పారిపోయాడు. ఇతడు తన కుమారుడు కర్ణ కోసం సింహాసనాన్ని త్యాగం చేశాడు.
కర్ణ: ఇతడు తన రాజ్యంలో అనేక నిర్మాణాలు చేపట్టాడు. పలు దేవాలయాలతోపాటు తన పేరుతో ఒక నగరాన్ని కూడా నిర్మించాడు. అదే నేటి అహ్మదాబాద్.
జయసింహ సిద్ధరాజు: సిద్ధరాజ అనే బిరుదుతో ఇతడు సింహాసనాన్ని అధిష్టించాడు. సోలంకీలందరిలో అగ్రగణ్యుడిగా పేరుగాంచాడు. అనేక యుద్ధాలు చేసి పరమారులు, చాందేలులు, చౌహాన్‌లు, కల్యాణి చాళుక్యులను ఓడించాడు. మరోవైపు భాషా సాహిత్యాలను ప్రోత్సహించాడు. ఇతడి ఆస్థానంలోని ప్రముఖ కవి హేమచంద్రుడు. జయసింహుడు సిద్ధపురలో రుద్ర మహాకాల దేవాలయాన్ని నిర్మించాడు.
కుమారపాల: హేమచంద్రుడు ఇతడి ఆస్థాన కవిగానూ కొనసాగాడు. కుమారపాల చరిత్ర, త్రిశస్తి శలక పురుష, పరిశిష్ట పర్వన్ అనే గ్రంథాలను రచించాడు. ఇతడి ప్రభావంతో కుమారపాలుడు జైనమతాన్ని పోషించడమే కాకుండా తన రాజ్యంలో జంతువధను, జూదాన్ని నిషేధించాడు.
అజయపాల: ఇతడు జైన దేవాలయాలను ధ్వంసం చేసి, జైన మత గురువు రామచంద్రను వధించాడు.
రెండో మూలరాజు: ఇతడు బాలుడు కావడంతో తల్లి నాయికీదేవి సంరక్షకురాలిగా ఉండి రాజ్య పాలనను చేపట్టింది. వీరి ఆధ్వర్యంలోనే 1178 మౌంట్ అబూ యుద్ధంలో సోలంకీ సేనలు ఘోరీ మహ్మద్‌ను ఓడించాయి.
రెండో భీమ: ఇతడి వద్ద తేజపాల, వస్తుపాల అనే సోదరులు మంత్రులుగా ఉండేవారు. రెండో భీముడి పాలనా కాలంలో క్రీ.శ. 1197లో కుతుబుద్దీన్ ఐబక్ ఇతడి రాజ్యంపై దాడి చేశాడు. ఇల్‌టుట్‌మిష్ దాడిని వస్తుపాలుడు తిప్పికొట్టాడు. భీముడి తర్వాత ఈ రాజ్యాన్ని వాఘేలా వంశస్థులు ఆక్రమించారు. చివరికి అల్లావుద్దీన్ ఖిల్జీ మొత్తం గుజరాత్‌ను ఆక్రమించాడు.
 
చౌహాన్‌లు
ప్రతీహారుల తరహాలో చౌహాన్‌ల్లోనూ అనేక శాఖలున్నాయి. శాకంబరిని(అజ్మీర్) కేంద్రంగా చేసుకొని పాలించిన చౌహాన్ రాజ్యం వాటన్నింటిలోకి అతి ముఖ్యమైంది. వీరు మొదట ప్రతీహారులకు సామంతులుగా ఉండి తర్వాత స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.
వాసుదేవుడు: క్రీ.శ. 6వ శతాబ్దంలో చౌహాన్ వంశాన్ని స్థాపించిన రాజు వాసుదేవుడు.
వాక్పతి రాజు: వాసుదేవుడి అనంతరం పలువురు రాజులు పాలించిన తర్వాత వాక్పతి రాజు రాజ్యానికొచ్చాడు. ఇతడు పుష్కరలో ఒక శైవాలయాన్ని నిర్మించాడు. దీన్ని విమర్శకులు శివుడి కైలాసంతో పోల్చారు.
సింహరాజు: చౌహాన్ వంశంలోని తొలి స్వతంత్ర పాలకుడు సింహరాజు. ఇతడు మహారాజాధిరాజ అనే బిరుదును పొందాడు. 
రెండో విగ్రహరాజు: ఇతడు చౌహాన్ రాజ్య వాస్తవ స్థాపకుడు. గుజరాత్‌పై దాడి చేసి మూలరాజును ఓడించాడు. 
మొదటి పృథ్వీరాజు: రెండో విగ్రహరాజు తర్వాత పాలకుల్లో ముఖ్యమైన రాజు మొదటి పృథ్వీరాజు. పుష్కరపై జరిగిన చాళుక్యుల దాడిని తిప్పికొట్టాడు. 700 మందిని అంతం చేశాడు.
రెండో అజయరాజు: శాకంబరికి గజ్నవీ రాజుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ఇతడు అజయయేరు(అజ్మీర్) అనే నూతన నగరాన్ని, కోటను నిర్మించాడు. తన రాజధానిని శాకంబరి నుంచి అజ్మీర్‌కు మార్చాడు. ఇతడు తన చివరికాలంలో రాజ్యాన్ని తన కుమారుడు అర్న రాజుకు అప్పగించి సన్యాసాన్ని స్వీకరించాడు.
నాలుగో విగ్రహరాజు: ఇతడు గొప్ప విజేత. అనేక ప్రాంతాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. తోమారులను ఓడించి వారి నుంచి ఢిల్లీని ఆక్రమించాడు. ఇతడు స్వయంగా కవి, సాహిత్య పోషకుడు. హరికేళి అనే నాటకాన్ని రచించాడు. మహాకవి సోమదేవుడు ఇతడి గురించి లలిత విగ్రహ రాజనాటకం అనే గ్రంథాన్ని రచించాడు. భోజుడు ధారలో నిర్మించిన సరస్వతి కంఠాభరణ విద్యాలయ నమూనాలో ఇతడు అజ్మీర్‌లో సంస్కృత కళాశాలను నిర్మించాడు. విశాల్‌పూర్ అనే నూతన నగరాన్ని కూడా నిర్మించాడు.
మూడో పృథ్వీరాజు: మూడో పృథ్వీరాజుకు ముందు అపరాంగగేయ, రెండో పృథ్వీరాజు, సోమేశ్వర అనే రాజులు పాలించారు. చౌహాన్ రాజుల్లో అగ్రగణ్యుడు మూడో పృథ్వీరాజు. ఇతడు తన సమకాలీన రాజులైన గహద్వాలులు, చాందేలులు, సోలంకీలతో అనేక యుద్ధాలు చేశాడు. ఘోరీ మహ్మద్‌తో రెండు యుద్ధాలు చేశాడు. 1191లో మొదటి తరైన్ (స్థానేశ్వర్) యుద్ధంలో ఘోరీని ఓడించాడు. 1192లో జరిగిన రెండో తరైన్ యుద్ధంలో ఘోరీ మహ్మద్, పృథ్వీరాజును ఓడించి అంతమొందించాడు. అనంతరం పృథ్వీరాజు వారసులు రణతంభోర్ కేంద్రంగా కొంతకాలం పాటు పాలించారు. చివరికి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ రాజ్యాన్ని జయించి ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపివేశాడు.



































#Tags