మౌర్యుల అనంతర యుగం - గుప్త సామ్రాజ్యం

మధ్య ఆసియాకు చెందిన శకులు, కుషాణులు భారత్‌పై దండెత్తారు. శకుల్లో ప్రసిద్ధి చెందిన వాడు మొదటి రుద్రదాముడు. శాతవాహనులను ఓడించి మౌర్యుల నాటి సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. శ్రీగుప్తుడు గుప్తవంశ మూలపురుషుడు. ‘అలహాబాదు ప్రశస్తి’ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. హర్షవర్ధనుడు స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించి హిందూస్థానాన్ని పాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి.
మౌర్యుల అనంతర యుగం (క్రీ.పూ. 71 నుంచి)
మధ్య ఆసియాకు చెందిన శకులు, కుషాణుల వంటి తెగలకు నిస్సారమైన భూములున్న ప్రాంతంలో జీవనం కష్టతరమైంది. క్రీ.పూ. 220లో షిహువాంగ్ టీ చైనా గోడను నిర్మించటంతో ఈ తెగలు ఆ దేశంపై దాడి చేయలేకపోయాయి. ఇండియాపై దండెత్తాయి. శుంగ, కణ్వ వంశ రాజులు ఈ దాడులను ఎదుర్కోలేకపోయారు. ‘యవనులు’గా, ‘ఇండోగ్రీకులు’గా బాక్ట్రియా పాలకులైన గ్రీకులు డిమెట్రియస్ నాయకత్వంలో దండెత్తి ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో కొన్నింటిని ఆక్రమించారు. ఈ వంశంలో మీనాండర్ ముఖ్యుడు. అతడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. బౌద్ధాచార్యుడు నాగసేనుడు, మీనాండర్ మధ్య జరిగిన మత చర్చలను ‘మిళింద పన్హా’ గ్రంథంలో వివరించారు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం ఇండియాపై దాడిచేసిన మొదటి విదేశీ తెగ ఇండో గ్రీకులు. భారత్‌లో తమ రాజుల పేరు మీద బంగారు నాణేలు విడుదల చేశారు. ఉత్తర భారత వాయవ్య ప్రాంతంలో గ్రీకు శిల్పకళ ప్రభావంతో గాంధార శిల్పరీతి అభివృద్ధి చెందింది. మన దేశంలో మొదట బంగారు నాణేలు విడుదల చేసింది ఇండోగ్రీకులే. మౌర్యుల అనంతరం విదేశీరాజులు, తెగలు ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. ముస్లింలు రాజ్యాలు స్థాపించారు. స్వదేశీ రాజ్యాల్ని కూలదోశారేగానీ దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో మౌలికమైన మార్పులు చేయలేదు. రైతులు, వృత్తికారులు, వ్యాపారులు ఎప్పటిలాగే జీవనం సాగించారు. స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకుండా కొనసాగింది. పాలకుల మార్పు అంటే రైతుల మిగులును దోచుకునే ప్రభువుల సిబ్బంది మార్పుగానే ప్రజలు భావించేవారు. కానీ బ్రిటిష్ వాళ్లు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. భారత ఆర్థిక, సంప్రదాయ వ్యవస్థను పూర్తిగా కొల్లగొట్టారు. వాళ్లెప్పుడూ భారతీయ జీవన విధానంలో అంతర్భాగం కాలేదు. దేశంలో పరాయి పాలకులుగానే మిగిలిపోయారు. దేశ వనరులు, సంపదను దోచుకెళ్లారు.

ప్రాచీన ఓడరేవులు
అరికమేడు:
ఇది పుదుచ్చేరి సమీపంలో ఉంది. క్రీ.శ. రెండో శతాబ్దంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి రోమ్ సామ్రాజ్యానికి వాణిజ్య లావాదేవీలు జరిగేవి.
బ్రోచ్ (భరుకచ్చ): ఇది గుజరాత్‌లో ఉంది.
చాల్: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. టాలమీ రచనల్లో దీని గురించి పేర్కొన్నాడు.
కావేరీపట్నం (ప్రహార్): ఇది కావేరీ నదీతీరంలో ఉండేది. దీన్ని కరికాల చోళుడు నిర్మించాడు.
మౌజురిస్: పెరిప్లస్, టాలమీ దీని గురించి ప్రస్తావించారు. రెండో శతాబ్దంలో మలబార్ తీరంలో ఇది ప్రసిద్ధి గాంచింది.
సొపారా: ఇది మహారాష్ట్రలో ఉంది.
తామ్రలిపి: పశ్చిమ బెంగాల్‌లో ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ప్రసిద్ధి చెందింది.

శకులు (క్రీ.పూ. 90)
వీరిని సిథియన్లు అనికూడా అంటారు. వీరు ‘యూచి’ జాతివారు. శకుల్లో ప్రసిద్ధి చెందిన వాడు మొదటి రుద్రదాముడు. అతడు క్రీ.శ.130 - 150 మధ్య పాలించాడు. శాతవాహనులను ఓడించి, ప్రజా సంక్షేమం కోసం మౌర్యుల నాటి సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. మొదటి సంస్కృత శాసనాన్ని వేయించాడు.
జునాగఢ్ శాసనాన్ని రుద్రదాముడు వేయించాడు. గుప్త చక్రవర్తి విక్రమాదిత్యుడు ఈ వంశానికి చెందిన రుద్రసింహుని జయించి శకరాజ్యాన్ని ఆక్రమించి ‘శకారి’ బిరుడు పొందాడు. తర్వాత ‘పార్ధియన్’ వంశస్తులు రాజ్యానికి వచ్చారు.

కుషాణులు (క్రీ.శ. 78 - 101)
కుషాణులు ‘యూబ’ తెగకు చెందిన వారు. వీరిలో మొదటి రాజు కాడ్‌ఫెసైస్. అతడి కుమారుడు విమా కాడ్‌ఫెసైస్. ఇతడు ప్రవేశపెట్టిన బంగారు, రాగి నాణేలపై ‘మహేశ్వర’ పదం ఉంది. దీంతో వీరు శైవ మతస్తులని తెలుస్తోంది. కనిష్కుడు కుషాణ రాజుల్లో గొప్పవాడు. ఇతడికి ‘దేవపుత్ర’, ‘సీజర్’ బిరుదులున్నాయి. బౌద్ధమతం స్వీకరించి మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేశాడు. మత వ్యాప్తి కోసం గాంధార శిల్పాన్ని వినియోగించాడు. కనిష్కుడి తర్వాత రాజ్యానికి వచ్చిన వసిష్కుడు, హవిష్కుడు, రెండో కనిష్కుడు, వాసుదేవుడు సమర్థులు కారు. గ్రీకు, రోమన్ శిల్పశైలితో బుద్ధుని విగ్రహాల నిర్మాణం చేపట్టారు. అనంతరం ఇది గాంధార శిల్పకళగా పరిణతి చెందింది. శకులు, కుషాణులు, గ్రీకులు, పార్ధియన్లు తమ పొడవాటి కోట్లు, ట్రౌజర్లు, తలపాగాలను భారతీయులకు పరిచయం చేశారు. క్రీ.శ. 78లో కనిష్కుడు ‘శక’యుగాన్ని ప్రారంభించారు.

గుప్త సామ్రాజ్యం (క్రీ.శ. 320 - 540)
శ్రీ గుప్తుడు గుప్తవంశ మూలపురుషుడు. తర్వాత అతడి కుమారుడు ఘటోత్కచగుప్తుడు రాజ్యాన్ని పాలించాడు.

మొదటి చంద్రగుప్తుడు (క్రీ.శ. 320 - 335)
ఘటోత్కచుని కుమారుడు మొదటి చంద్రగుప్తుడు. ఇతడ్ని గుప్తరాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు. ఇతనితో ‘గుప్తశకం’ ప్రారంభమైంది. ‘దేవీచంద్రగుప్త’ అనే నాణేలను ముద్రించాడు. ఇతడికి ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు ఉంది. లిచ్ఛవీ రాకుమారి కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. దీంతో చంద్రగుప్తుడికి లిచ్ఛవీ రాజ్యంలో చాలాభాగం సంక్రమించింది.

సముద్రగుప్తుడు (క్రీ. శ. 335 - 376)
‘అలహాబాదు ప్రశస్తి’ శాసనం సముద్రగుప్తుడి విజయాలు, విశిష్ట లక్షణాలు, బహుముఖ ప్రతిభను వివరిస్తుంది. ఇతడు అశ్వమేధయాగం చేశాడు. విద్యాపోషకుడు, పండితుడు, సంగీత విద్వాంసుడు. సముద్రగుప్తుడిని ‘ఇండియ న్ నెపోలియన్’గా స్మిత్ అభివర్ణించాడు. ‘విక్రమాంక’, ‘కవిరాజు’ బిరుదులున్నాయి. సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్న చిత్రాలతో నాణేలు ముద్రించాడు.

సముద్రగుప్తుడు జయించిన దక్షిణాపథరాజులు - రాజ్యాలు
1. మహేంద్రుడు కోసల
2. వ్యాఘ్రరాజు మహాకాంతార
3. మంథరాజు కురాల
4. దమనుడు ఎరండవల్లి
5. స్వామిదత్తుడు కొట్టూర
6. కుబేరుడు దేవరాష్ట్రం
7. మహేంద్రుడు పిష్టపురం
8. హస్తివర్మన్ వేంగి
9. నీలరాజు అవయుక్త
10. ఉగ్రసేనుడు పాలక
11. విష్ణుగోపుడు కంచి
12. ధనంజయుడు కేశస్థలపురం
 
 
రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 376 - 415)
శకరాజు రుద్రసింహుడిపై విజయం సాధించి ‘దేవగుప్తుడు’, ‘దేవరాజు’, ‘దేవశ్రీ’, ‘పరమభాగవత’, ‘విక్రమాదిత్య’, ‘శకారి’, ‘సాహసాంక’ బిరుదులు పొందాడు. ‘నవరత్నాలు’ అనే కవులను పోషించాడు. అతడి కాలంలో చైనా యాత్రికుడు ఫాహియాన్ భారత్‌ను సందర్శించాడు. ధ్రువాదేవి, కుబేరనాగ అతడి రాణులు. రాజధానిని ఉజ్జయినీకి మార్చాడు. కుమార్తె ప్రభావతిని వాకాటక రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేశాడు. బంగారంతో పాటు వెండి, రాగి నాణేలు ముద్రించాడు. బంగారు నాణేలపై వ్యాఘ్రానికి బదులు సింహం బొమ్మ ముద్రించాడు. సింహవిక్రమ అనే శాసనం వేయించాడు.

మొదటి కుమార గుప్తుడు (క్రీ.శ. 415 - 454)
మొదటి కుమారగుప్తుడికి ‘మహేంద్రాదిత్య’ బిరుదు ఉంది. చంద్రగుప్త, ధ్రువాదేవిల పుత్రుడు. ఇతడు ముద్రించిన బంగారు నాణేలపై ఒకవైపు నెమలి వాహనంపై ఉన్న కార్తికేయుడు, మరోవైపు నెమలికి మేత వేస్తున్న రాజు చిత్రాలు ఉంటాయి. వెండి నాణేల్లో గరుడ పక్షి స్థానంలో మయూరం కనిపిస్తుంది.

స్కందగుప్తుడు (క్రీ.శ. 454 - 467)
స్కందగుప్తుడి కాలంలో ‘ హూణులు’ భారతదేశంపై దండెత్తారు. వారిని ఓడించి సామ్రాజ్యాన్ని రక్షించాడు. ‘విక్రమాదిత్య’ బిరుదు పొందాడు. ఇతడి కాలంలో రాష్ట్ర పాలకుడు వర్ణదత్తుడు గిర్నార్ కొండల్లో ఉన్న సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. సుమారు 300 ఏళ్ల క్రితం ఇదే తటాకానికి క్షాత్ర రుద్రదాముడు మరమ్మతులు చేయించాడు. క్రీ.శ. 495లో రెండోసారి హూణులు భారతదేశంపై దండెత్తారు.

కడపటి గుప్తరాజులు (క్రీ.శ. 467 - 540)
స్కందగుప్తుడి తర్వాత క్షీణదశ ప్రారంభమైంది. హూణుల దాడులు, వారసత్వ పోరాటాలతో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడి గుప్తుల పాలన అంతమైంది.

గుప్తుల కాలంనాటి సమాజం
కులవ్యవస్థ పాతుకుపోయింది. శూద్రులు, ఛండాలురను హీనంగా చూసేవారు. సమాజంలో స్త్రీలకు విద్యా, ఆస్తిహక్కులు లేవు. బాల్య వివాహాలను సమర్థించారు. సతీసహగమనం ఉండేది. వారసత్వం విషయంలో గుప్తుల యుగాన్ని ఉజ్వల శకంగా పరిగణించవచ్చు. సంస్కృతం రాజభాష. అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని రాసింది హరిసేనుడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, శూద్రకుడు మృచ్ఛకటికం రాశారు. ఆర్యభట్టు ఆర్యభట్టీయం, వరాహమిహురుడు పంచసిద్ధాంతం, బ్రహ్మగుప్తుడు గణిత, ఖగోళ శాస్త్రాలు, శుశ్రుతుడు వైద్య శాస్త్రాలు రాశారు. గుప్త చక్రవర్తులు హిందూ మతాభిమానులు. వైష్ణవం వైపు మొగ్గు చూపారు.

కళలు
ఝాన్సీ సమీపంలోని దేవగఢ్‌లోని దశావతార ఆలయం, భూమ్రా ఆలయం, సాంచీ, సారనాథ్‌లోని బౌద్ధ దేవాలయాలు గుప్తుల వాస్తుకళకు చిహ్నాలు. అజంతా గుహల్లోని కొన్ని కుడ్య చిత్రాలు గుప్తుల కాలంనాటి కళా నైపుణ్యానికి నిదర్శనం. భారవి కిరాతార్జునీయం, దండి కావ్యాదర్శం, దశకుమార చరితం, విష్ణుశర్మ ‘పంచతంత్రం’ గ్రంథాలు ఈ కాలం నాటివే. ఢిల్లీ సమీపంలోని మొహ్రాలీలో ఇనుపస్తంభం అప్పటి లోహ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.

అలహాబాద్ శాసన స్తంభం
రెండు భాషల్లో రాసిన రెండు శాసనాలు ఇందులో ఉన్నాయి. అశోకుడి శాసనం ప్రాకృతంలో ఉంటుంది. దమ్మ, అహింస గురించి వివరిస్తుంది. రెండో శాసనాన్ని సముద్రగుప్తుని ఆస్థాన కవి హరిసేనుడు సంస్కృతంలో రాశాడు. ఇది సముద్రగుప్తుని దండయాత్రల గురించి తెలుపుతుంది.
 
గుప్తుల పరిపాలన
గుప్త రాజులు.. మహారాజాధిరాజా, ఏకాధిరాజా, చక్రవర్తి, పరమేశ్వర, పరమద్వైత, సామ్రాట్ తదితర ఆడంబర బిరుదులను ధరించారు. వీరి కాలంలో కేంద్ర స్థాయిలో అనేకమంది అధికారులున్నారు. వీరిలో ముఖ్యులు... కాల్బలం, అశ్వికదళ అధ్యక్షుడు ‘భటాశ్వపతి’. గజదళానికి అధ్యక్షుడు ‘కటుక’, ‘టిలుపతి’. సైనిక కోశాధిగారానికి అధిపతి ‘రణభాండాగారాధికరణ’. సముద్రగుప్తుడి కాలంలో సంధి విగ్రాహక అనే పదవిని సృష్టించారు. ఇది విదేశాంగ మంత్రి పదవి. సముద్రగుప్తుడి కాలంలో అనేక మంది రాజులు సామంతులుగా మారారు. వారితో రాజు తరఫున వ్యవహారాలు నిర్వహించడం సంధి విగ్రాహకుడి ప్రధాన విధి. దూతకులనే అధికారులు రాజాజ్ఞలను చేరవేసేవారు. శాంతి భద్రతలకు సంబంధించిన ఉన్నతాధికారిని ‘దండపాశాధికరణ’గా పిలిచేవారు. ‘చేరొద్ధరణిక’ బాధ్యత దొంగలను పట్టుకోవడం. ఉన్నతాధికారులతో పాటు కుమారామాత్యులు, ఆయుక్తలు అనే ఉన్నతాధికారులు ఉండేవారు.
రాష్ట్రాలను ‘భుక్తి’గా పిలిచేవారు. రాష్ర్ట పాలకులను ఉపారిక, భోగిక, రాజస్థానీయ అనే పేర్లతో పిలిచేవారు. రాజుకు పరిపాలనలో సహాయం చేసేందుకు కొందరు అధికారులుండేవారు. వీరిలో ముఖ్యమైనవారు మహామంత్రులు, గ్రామికులు, శౌల్కికులు, గౌల్మికులు, పుష్టపాల మొదలైనవారు. జిల్లాలను ‘విధి’ అనే విభాగాలుగా, విధులను గ్రామాలుగా విభజించారు. గ్రామ పాలనాధికారి ‘గ్రామిక’. పట్టణాల పాలనా బాధ్యతలను ‘పురపాల’ అనే అధికారి చూసేవారు

గుప్తుల వాస్తు శిల్పకళలు
భారతీయ వాస్తు శిల్ప కళారంగంలో గుప్తయుగాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవాలయ నిర్మాణంలో వీరు ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టారు. దీన్ని నగర శైలి లేదా శిఖర శైలి అంటారు. గర్భగుడిపై వివిధ అంతస్తులు ఉన్న శిఖర నిర్మాణం ఇందులోని ప్రధానాంశం. వీరు నిర్మించిన దేవాలయాల్లో ఈ శైలి ప్రముఖంగా కనిపిస్తుంది.
గుహాలయాలు: భారతదేశంలో హిందూ గుహాలయాల నిర్మాణాన్ని మొదటగా గుప్తులే ప్రారంభించారు. వీరి కాలం నాటి గుహాలయాలు ప్రముఖంగా అజంతా, ఎల్లోరా, బాఘ్, ఉదయ్‌గిరి మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి.
ఆలయాలు: గుప్తులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. అయినప్పటికీ వైష్ణవాలయాలతో పాటు శైవాలయాలూ నిర్మించారు. వీరి ఆలయాలు ప్రధానంగా భిటార్గావ్, నాచనకుటార, కోహ్, దేవ్‌గఢ్, తిగ్వా మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి. సాంచీ, గయ, సారనాథ్ లాంటి ప్రదేశాల్లో వీరి కాలం నాటి బౌద్ధాలయాలూ ఉన్నాయి.

గుప్తుల కాలం నాటి శిల్పకళ
రాగితో చేసిన రెండు బుద్ధ విగ్రహాలు వీరికాలం నాటి లోహ శిల్పకళకు ప్రముఖ నిదర్శనాలు. ఇందులో 7.5 అడుగుల ఎత్తయిన సుల్తాన్‌గంజ్‌లోని బుద్ధ విగ్రహం మొదటిది కాగా, 18 అడుగుల ఎత్తు ఉన్న నలందలోని బుద్ధుడి విగ్రహం రెండోది. రాతితో చేసిన శిల్పాల్లో సారనాథ్‌లోని బుద్ధ విగ్రహం, ఉదయగిరి గుహల్లోని వరాహ విగ్రహం ప్రసిద్ధి చెందినవి.
చిత్రకళ: అజంతా, బాఘ్, బాదామీ ప్రాంతాల్లో గుప్తుల చిత్రకళకు సంబంధించిన ఆనవాళ్లు లభిస్తున్నాయి.

సాహిత్యం
ప్రధాన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు ఈ కాలంలోనే తుది రూపాన్ని సంతరించుకున్నాయి. పురాణాలు కూడా ఈ కాలంలోనే లిఖిత రూపాన్ని పొందాయి. గుప్తుల కాలం అనేక స్మృతి గ్రంథాల రచనకు చిరునామాగా మారింది. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలోని నవరత్నాలతోపాటు అనేక మంది బౌద్ధ, జైన కవులు తమ రచనల ద్వారా ఈ కాలం నాటి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వసుబంధుడు ‘స్వప్న వాసవదత్త’ అనే గ్రంథాన్ని, దిగ్నాగుడు ‘ప్రమాణ సముచ్ఛయం’, ఆర్యా అసంగుడు యోగాచారం అనే గ్రంథాలను రాశారు. ఈ కాలం నాటి నవరత్నాల్లోని కొందరు కవులు ప్రసిద్ధ రచనలు చేశారు.

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం
గణితంలో దశాంశ పద్ధతితో పాటు, సున్నా(0) ఉపయోగం గుప్తుల కాలం నుంచే ప్రారంభమైంది. ఆర్యభట్టుడు తన సూర్య సిద్ధాంతంలో చంద్ర, సూర్య గ్రహణాల గురించి వివరించాడు. అలాగే భూమి పరిమాణాన్ని, విశ్వానికి సూర్యుడే కేంద్రమనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చాటిచెప్పాడు. ఇతడు ‘ఆర్యభట్టీయం’ గ్రంథంలో గణిత శాస్త్రంలోని పలు భాగాలను వివరించాడు. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, బృహజ్జాతక, బృహత్ సంహిత గ్రంథాల ద్వారా ఖగోళ, భౌతిక, భూగోళ, జీవశాస్త్రాలపై చర్చించాడు. బ్రహ్మగుప్తుడు.. భూ గురుత్వాకర్షణశక్తి గురించి తెలిపాడు. ఇతడు బ్రహ్మస్ఫూత సిద్ధాంత, ఖండఖడ్యాక అనే గ్రంథాలను రచించాడు. గుప్తుల కాలం నాటి శాస్త్ర, సాంకేతికాభివృద్ధికి రెండో చంద్రగుప్తుడి మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం ఓ మచ్చుతునక. కొన్ని వందల ఏళ్లుగా ఈ స్తంభం చెక్కు చెదరకుండా నేటికీ సగర్వంగా నిలిచింది.










































#Tags