హర్షుని అనంతర ఉత్తర భారతం

హర్షుని తర్వాత ఉత్తర భారతదేశం అనేక రాజ్యాలుగా విడిపోయింది. ఆయా రాజ్యాలను రాజపుత్రులుగా ప్రసిద్ధి చెందిన వివిధ వంశాల రాజులు పాలించారు. ప్రాచీన చరిత్రలో ‘రాజపుత్ర’ అనే పదం ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి వీరు ఎవరు? ఎలా ప్రాభవంలోకి వచ్చారు? అనే అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత లేదు.
రాజపుత్రులపై విశేష పరిశోధనలు చేసి ‘Annals and antiquities of Rajastan’ అనే గ్రంథాన్ని రచించిన లెఫ్టినెంట్ కల్నల్ జేమ్స్ టాడ్ అభిప్రాయంలో వీరు విదేశీయులు కాగా, రాజపుత్రుల సమకాలీన కవి చాంద్ బర్ధాయ్ రచించిన ‘పృథ్వీరాజ్ రాసో’ గ్రంథం వీరిని అగ్నికుల క్షత్రియులని.. రాజపుత్రుల మూల పురుషులు యజ్ఞం నుంచి జన్మించారని పేర్కొంటోంది. అయితే అత్యధికులు ‘స్వదేశీ విదేశీ జాతుల కలయికే రాజపుత్రులని అభిప్రాయపడుతున్నారు. ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి, నీతి నియమాలకు ప్రతీకలుగా నిలిచిన రాజపుత్రులు చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.

రాజకీయ చరిత్ర: పరామారులు, ప్రతీహారులు, చౌహానులు, సోలంకీలు, గహద్వాలులు, చంధేలా, కాలభూరి మొదలైన అనేక రాజవంశాలు వివిధ ప్రాంతాలను పాలిం.

పరామారులు
రాజధాని: ధారా నగరం (ఉజ్జయిని)
స్థాపకుడు: ఉపేంద్రుడు
చివరి పాలకుడు: మహలక్ దేవ్
పాలకులు: రెండో సియక, ముంజ, సింధురాజ, భోజరాజ, జయసింహ తదితరులు పాలించారు.
ముంజ రాజు: క్రీ.శ. 974-998
  • పరామారుల్లో ప్రముఖ పాలకుడు.
  • ఉదయ్‌పూర్ శాసన వివరాల ప్రకారం కర్ణాటక, చోళ, కేరళ పాలకుల్ని ఓడించాడు.
  • రాజధానిలో ముంజసాగరమనే తటాకాన్ని తవ్వించాడు.
  • పద్మగుప్త, ధనంజయ, భట్టి మొదలైన కవులను పోషించాడు.
  • కళ్యాణి చాళుక్య రాజు రెండో తైలపుని దండయాత్రలను విజయవంతంగా తిప్పికొట్టాడు. అయితే రెండో తైలపు ఎదురుదాడి చేసి ఇతణ్ని సంహరించాడు.
భోజరాజు: క్రీ.శ.1010-1055
  • భోజరాజు యుద్ధ విజయాల కంటే వివిధ రంగాల్లో నిష్ణాతుడిగా పేరుగాంచాడు. కవిరాజనే బిరుదు పొందాడు.
  • వైద్యం, వాస్తుశాస్త్రం, వ్యాకరణం, మతం తదితర అంశాలపై 24 గ్రంథాలు రచించాడని ప్రతీతి.
  • ఆయుర్వేద సర్వస్వం (వైద్యం), సమరాంగణ సూత్రధార (వాస్తుశాస్త్రం), శబ్దానుశాసనం మొదలైనవి ఈయన ముఖ్య రచనలు.
  • భోజపురి నగరంతో పాటు రాజధానిలో సరస్వతీ దేవాలయం, భోజశాల అనే విద్యాలయాన్ని నిర్మించాడు.
  • ప్రభా చంద్రసూరి, ధనపాల, శాంతిసేన తదితర కవులను పోషించాడు.
  • భోజరాజు మరణాంతరం పరామార ప్రాభవం తగ్గుతూ వచ్చింది.
  • ఢిల్లీ సల్తనత్‌లో మాళ్వాను కలిపేయడంతో వీరి వంశం అంతరించింది.
ప్రతీహారులు
రాజధానులు: భినమల్, కనోజ్
మూలపురుషుడు: హరిశ్చంద్ర
స్వతంత్ర పాలనా స్థాపకుడు: మొదటి నాగభట్ట
చివరి పాలకుడు: యశః పాలుడు
పాలకులు: నాగభట్ట, వత్సరాజు, మిహిరభోజ, రెండో భోజుడు, మహీపాల మొదలైన వారు పాలించారు.
మిహిర భోజుడు : క్రీ.శ. 836-885
  • ప్రతిహార వంశంలో ప్రముఖ పాలకుడు
  • ఇతనికి ఆది వరాహ, ప్రభాస వంటి బిరుదులున్నాయి.
  • మిహిర భోజుడి కాలంలో అరబ్బు యాత్రికుడు సులేమాన్ ప్రతీహార రాజ్యాన్ని సందర్శించాడు.
  • అరబ్బులను శత్రువులుగా భావించి వారి దండయాత్రలను తిప్పికొట్టినట్లు గ్వాలియర్ శాసనం ద్వారా తెలుస్తోంది.
  • మహమ్మద్ గజనీ దండయాత్రలతో వీరి పతనం ప్రారంభమైంది. కనోజ్‌ను గహద్వాలులు ఆక్రమించారు.
చహమానులు
రాజధాని: శాకాంబరి (సాంబార్) ఆజ్మీర్
మూల పురుషుడు: వాసుదేవుడు
స్వతంత్ర పాలనా స్థాపకుడు: సింహరాజు
విగ్రహరాజు - IV: క్రీ.శ. 1150-64
  • ఇతనికి విశాల దేవ అనే మరో పేరు ఉంది.
  • ఢిల్లీని జయించినట్లు బిజోలియా శాసనం ద్వారా తెలుస్తోంది.
  • ఆజ్మీర్‌లో సరస్వతీ ఆలయంతో పాటు విసాలపూర్ నగరాన్ని నిర్మించాడు. విసల్య అనే తటాకాన్ని తవ్వించాడు.
  • హరికేళి నాటకాన్ని రచించాడు. ఈ నాటకం అదై-దిన్-కా-జోప్రా మసీదు గోడలపై లభించింది. ఇతనికి కవిబాంధవ అనే బిరుదు ఉంది.
  • విగ్రహరాజ గౌరవార్థం మహాకవి సోమదేవ ‘లలిత విగ్రహరాజ’ అనే నాటకాన్ని రచించాడు.
పృథ్వీరాజ్ చౌహాన్ III: క్రీ.శ. 1179-1192
  • ముస్లిం చరిత్రకారులు ఇతన్ని ‘రాయ్‌పత్ రా’ అని పేర్కొన్నారు.
  • చౌహానుల్లోనే కాక రాజపుత్ర రాజులందరిలో పేర్కొనదగినవాడు.
  • ఈయన గహద్వాల జయచంద్రుని కుమార్తె సంయుక్తను రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నట్లు, అది రెండు వంశాల మధ్య వైరానికి కారణమైనట్లు కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
  • మహ్మద్ ఘోరీ తబరిందా (సర్హింద్) కోటను ఆక్రమించటంతో క్రీ.శ.1191లో తరైయిన్ /స్థానేశ్వర్ వద్ద అతడ్ని ఎదురించి ఓడించాడు.
  • 1192లో జరిగిన 2వ తరైయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ ఓటమి చెంది మరణించాడు. ముస్లిం సామ్రాజ్య స్థాపనకు దారితీసిన యుద్ధంగా దీనికి చరిత్రలో స్థానం ఉంది.
  • పృథ్వీరాజ్ ఆస్థానంలో చాంద్ బర్ధాయ్ పృథ్వీరాజ్ రాసో, జయనకుడు పృధ్వీరాజ విజయం అనే గ్రంథాలను రచించారు.
  • పృథ్వీరాజ్ వారసులు రణతంబోర్‌లో నామమాత్ర పాలన కానసాగించారు.
సోలంకీలు
రాజధాని: అన్విల్ వాడ
స్థాపకుడు: మూలరాజు
చివరి పాలకుడు: కర్ణదేవ
పాలకులు: మొదటి మూలరాజు, మొదటి భీమ, కర్ణ, జయసింహ సిద్ధరాజు, కుమారపాల, రెండో మూలరాజు, రెండో భీమ తదితరులు.
మొదటి భీమ: క్రీ.శ.1022-64
  • ఇతని పాలనా కాలంలో మహ్మద్ గజినీ సోమనాథ ఆలయాన్ని కొల్లగొట్టాడు.
  • మౌంట్ అబూపై దిల్వారా ఆలయం నిర్మిత మైంది.
  • కుమారుడైన కర్ణ కోసం సింహాసనాన్ని త్యజించాడు.
  • కర్ణ తన పేరు మీద కర్ణపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. అదే నేటి అహ్మదాబాద్.
సింహ సిద్ధరాజు : క్రీ.శ.1093-1143
  • సిద్ధపురంలో రుద్రమహాకాళీ ఆలయాన్ని నిర్మించాడు.
  • హేమచంద్ర అనే ప్రఖ్యాత జైన పండితుడు ఇతని సమకాలికుడు
రెండో భీమ
  • సోమనాథ దేవాలయాన్ని పునరుద్ధరించాడు.
  • ఇతని మంత్రులైన వస్తు పాలుడు, తేజో పాలుడు ముస్లిం దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
  • వీరిద్దరూ కలసి మౌంట్‌అబూపై జైన దేవాలయాలను నిర్మించారు.
  • రెండో భీమ తదనంతరం వీరి ప్రాభవం తగ్గింది.
  • అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో గుజరాత్ ఢిల్లీ సల్తనత్‌లో భాగం అయ్యింది.
గహద్వాలులు
రాజధాని: కనోజ్
మూలపురుషుడు: యశఃవిగ్రహుడు
పాలకులు: చంద్రసేన, గోవింద చంద్ర, విజయచంద్ర, జయచంద్ర తదితరులు.
#Tags