గిరిజన ఉద్యమాలు
భారతదేశంలో బ్రిటిషర్ల కాలంలో వివిధ కారణాలతో ప్రారంభమైన గిరిజనోద్యమాలు స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగాయి. బ్రిటిషర్ల పాలనలో జరిగిన తిరుగుబాట్లను మూడు దశలుగా విభజించవచ్చు.
అవి:
- 1795-1860 మధ్య కాలం: బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, విస్తరణ జరుగుతున్న కాలంలో చెలరేగిన తిరుగుబాట్లు.
- 1861-1920 మధ్య కాలం: వలస పాలన, ఆర్థిక మూలధనం గిరిజనుల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల జరిగిన తిరుగుబాట్లు.
- 1921-1947 మధ్య కాలం: స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్న కాలంలో జరిగిన తిరుగుబాట్లు.
బ్రిటిష్ కాలంలో జరిగిన ప్రముఖ గిరిజన తిరుగుబాట్లు
రంపా తిరుగుబాటు (ఆంధ్రా)
1766లో నిజాం రాజు రంపా ప్రాంతాన్ని తూర్పు ఇండియా కంపెనీకి ఇచ్చాడు. కంపెనీ అధికారుల మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా 1802-03లో రామభూపతి నాయకత్వంలో కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన తెగలు పోరాటం సాగించాయి. 1813లో బ్రిటిషర్లు రామభూపతిని ఈ ప్రాంతానికి అధిపతిగా అంగీకరించడంతో పోరాటాన్ని నిలిపేశారు. కానీ, ఆ తర్వాత రామభూపతి కుమారుడు బ్రిటిష్ అధికారుల ప్రోద్బలంతో గిరిజనులపై అనేక రకాల పన్నులు విధించడంతో వారు తమ్మన్నదొర నాయకత్వంలో 1879లో మళ్లీ తిరుగుబాటు చేశారు. ఇది విశాఖ, భద్రాచలం, రేకపల్లి, చోడవరం మొదలైన ప్రాంతాలకు విస్తరించింది. 1880లో సైనిక బలంతో ఈ తిరుగుబాటు బలవంతంగా అణచివేశారు.
ఖోండుల తిరుగుబాటు (ఒడిశా)
ఖోండులు మొదటిసారిగా 1817లో తిరుగుబాటు లేవదీశారు. తర్వాత 1830లో చినోయి దొర, 1850లో చక్రబోయి దొర, 1857లో సురేంద్రసాయి నాయకత్వంలో కంపెనీ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 1894లో కొండసవరలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లన్నింటినీ సైనికబలంతో అణచివేశారు.
కోల్ తిరుగుబాటు
ఛోటా నాగపూర్ ప్రాంతంలో కోల్ గిరిజన తెగకు చెందినవారు నివసించేవారు. బ్రిటిష్ పాలకులు గిరిజనేతర రైతులను గిరిజన ప్రాంతాల్లో స్థిరపడేలా ప్రోత్సహించడంతో భూ యజమానులతో కౌలు సంబంధాలు మొదలయ్యాయి. దీంతో ద్రవ్య విధానం కూడా ప్రారంభమైంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, దోపిడీలు మొదలయ్యాయి. కోల్ గిరిజన ప్రముఖులు హిందువులుగా మారడంతో గిరిజనుల్లో అశాంతి అధికమైంది. గిరిజనులు వారి భూముల్లో వారే కట్టు బానిసలుగా మారారు. ప్రభుత్వ, గృహ అవసరాల్లోనూ శ్రమ దోపిడీ ఎక్కువైంది. వీటికి నిరసనగా కోల్‌లు 1831-32లో తిరుగుబాటు చేశారు.
సంతాల్‌ల తిరుగుబాటు
ఈ తిరుగుబాటు బిహార్, బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో సంభవించింది. దీన్ని గొప్ప తిరుగుబాటుగా పేర్కొంటారు. దీనికి ప్రముఖ కారణం కార్‌నవాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు విధానం. దీనికి వ్యతిరేకంగా సంతాల్‌లు 1811, 1823, 1829లో తిరుగుబాట్లు చేశారు. 1854లో కన్హూ, సిద్ధు అనే గిరిజన సోదరుల నాయకత్వంలో ఈ తిరుగుబాటు మరోసారి చెలరేగింది. వీరు జమీందార్ల భూముల ఆక్రమణకు ప్రయత్నించారు. 1855 జూన్‌లో ఈ సోదరుల నాయకత్వంలో సంతాల్‌ల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు ర్యాలీ నిర్వహించారు. ఈ పోరాటంలో 15,000 నుంచి 25,000 సంతాల్‌లు బ్రిటిష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 1856 ఫిబ్రవరిలో కన్హూ కూడా సైన్యం చేతిలో మరణించాడు. 1885 జూలైలో బ్రిటిష్ ప్రభుత్వం మార్షల్ లా విధించి ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసింది.
బస్తర్ తిరుగుబాటు (ఛత్తీస్‌గఢ్)
బస్తర్ ప్రాంతంలో మురియా, మరియా, హాల్భా మొదలైన గోండు తెగలు జీవించేవారు. బ్రిటిషర్ల రాకతో బనియాలు, రోహిల్లాలు మొదలైన వడ్డీ వ్యాపారులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు గోండుల భూములు ఆక్రమించుకోవడం, వెట్టి చాకిరీ చేయించడం, స్త్రీలను వేధించడం మొదలైన ఆకృత్యాలకు ఒడిగట్టారు. దీంతో గిరిజనులు 1880లో తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం 1891 నాటికి ఈ తిరుగుబాటును అణచివేసింది.
ముండాల తిరుగుబాటు (బిహార్)
ఛోటా నాగపూర్ ప్రాంతంలో నివసించే మరో గిరిజన తెగ ముండాలు. తెగలో అంతర్యుద్ధాల కారణంగా వీరి భూమిలో కొంత భాగం సమీప హిందూ రాజుల పాలనలోకి వెళ్లింది. దీంతో అనేక మంది గిరిజన నాయకులు హిందూ మతం స్వీకరించారు. క్రమంగా అధిక సంఖ్యలో గిరిజనేతరులు స్థిరపడటంతో వీళ్ల పరిస్థితి దిగజారింది. క్రైస్తవ మిషనరీల ప్రచారంతో ఆ మతాన్ని స్వీకరిస్తే తమ పరిస్థితి మెరుగవుతుందని భావించి ముండాలు అధిక సంఖ్యలో మతమార్పిడి చేసుకున్నారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. చివరకు 1895లో బిర్సా ముండా నాయకత్వంలో తమ ప్రాంతాల్లో స్థిరపడ్డ గిరిజనేతరులందరినీ తరిమివేయాలని తిరుగుబాటు ప్రారంభించారు.
బిర్సా ముండాను 1895లో నిర్బంధించగా తెగ ప్రజలు విడిపించుకున్నారు. 1899 నాటికి తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరింది. 1900లో బిర్సా ముండాను మళ్లీ నిర్బంధించారు. కారాగారంలో హింసించడంతో ఇతడు మరణించాడు. దీంతో క్రమంగా ఈ ఉద్యమం బలహీనమైంది.
గోండుల తిరుగుబాటు (తెలంగాణ)
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ‘కొమరం భీం’ నాయకత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. ఈయన 1901 అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లాలో ‘జోడెఘాట్’ ప్రాంతంలో జన్మించారు. నిరక్షరాస్యుడైనప్పటికీ ఆ ప్రాంతంలో గోండు, కొలాం మొదలైన గిరిజన తెగలను ఏకం చేసి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపారు. జోడెఘాట్‌పై దాడికి ప్రయత్నించిన నిజాం సైన్యాన్ని సంప్రదాయ ఆయుధాలతోనే ఎదుర్కొన్నారు. ‘జల్, జంగల్, జమీన్ (నీరు, అటవీ, భూమి) మనవే’ అనే నినాదంతో గిరిజనులను చైతన్యపరిచారు.
భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు ప్రభావంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. నిజాం ప్రభుత్వం ఈయణ్ని బంధించడానికి స్థానిక తాలుక్‌దార్ ‘అబ్దుల్ సత్తార్’ను నియమించింది. ఆయన విఫలం చెందడంతో నిజాం సైన్యమే ప్రత్యక్ష దాడికి దిగింది. 1940 అక్టోబర్ 8న జరిగిన దాడిలో ‘కొమరం భీం’ వీర మరణం పొందారు. ఈయణ్ని సైన్యానికి కుర్థం పటేల్ చూపించాడు. ‘కొమరం భీం’ను నిజాం పాలకుల నుంచి తెలంగాణ ప్రజల స్వాతంత్య్రానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. కమ్యూనిస్ట్ నాయకులు ‘పుచ్చలపల్లి సుందరయ్య’ ఈయన జీవిత చరిత్రను రచించారు. గోండులు ఈయణ్ని దేవుడిగా ఆరాధిస్తారు.
తానాభగత్ ఉద్యమం (బిహార్, 1914)
ఛోటా నాగపూర్ ప్రాంతంలో ఓర్గాన్ అనే ఆదిమవాసులు నివసించేవారు. వీరు పెద్ద ఎత్తున హిందూ సంస్కృతీకరణ కోసం పేరు చివరన భగత్ అనే పదాన్ని చేర్చుకొని తమ స్థాయి మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇతర ప్రాంతాల గిరిజనేతరులు అక్కడ చేరి తమకు అన్యాయం చేస్తున్నారని వారిని తరిమేసేందుకు ఉద్యమించారు.
మన్యం తిరుగుబాటు (ఆంధ్ర,1922-24)
మద్రాసు రెసిడెన్సీలో ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతం 19,287 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండేది. ఇందులో గంజాం, విశాఖపట్నం, గోదావరి ప్రాంతాలు ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో మద్రాస్ అటవీ చట్టం చేసి పోడు వ్యవసాయంపై అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడి గిరిజన తెగల్లో కోయలు, కొండరెడ్లు అధిక సంఖ్యలో ఉండేవారు. బ్రిటిష్ అధికారుల సహాయంతో స్థానిక నేతలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన గిరిజనులను అల్లూరి సీతారామరాజు సమైక్యపరిచి తిరుగుబాటు లేవదీశారు. గెరిల్లా పోరాట పద్ధతిలో ఈ తిరుగుబాటు సాగింది. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సేకరించేవారు. సీతారామరాజు అనుచరులతో మొదట చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. తర్వాత అడ్డతీగల, రాజ ఒమ్మంగి, కృష్ణదేవిపేట మొదలైన పోలీసు స్టేషన్లపై దాడి చేశారు.
ఈ తిరుగుబాటును అణచివేసేందుకు మద్రాసు ప్రభుత్వం ‘రూథర్ ఫర్డ్’ను పంపించింది. సీతారామరాజు ముఖ్య అనుచరుడైన గొంముల్లు దొరను 1923 సెప్టెంబర్‌లో నిర్బంధించారు. మరో అనుచరుడు ‘అగ్గిరాజు’ను కాల్చి చంపారు. దీంతో ఈ ఉద్యమం ముఖ్య నాయకులను కోల్పోయింది. చివరకు 1924 మే 7న సీతారామరాజును కాల్చి చంపడంతో ఈ ఉద్యమం అంతరించిపోయింది.
కొండ సవరలు తిరుగుబాటు (1943, ఒడిశా)
కోరాపుట్ జిల్లాలో గిరిజనులు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా లక్ష్మణ్ నాయక్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం అతణ్ని నిర్బంధించి 1943లో బెరంపూర్ జైలులో ఉరి తీసింది. దీంతో ఈ తిరుగుబాటు ఆగిపోయింది.
వర్లీ తిరుగుబాటు (1944) (మహారాష్ట్ర)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో వర్లీ ఆదిమ తెగలు నివసించేవి. పంటకోతల సమయంలో కూలీ రోజుకు 12 అణాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ తిరుగుబాటు మొదలైంది. 1945లో కిసాన్‌సభ ఇచ్చిన పిలుపుతో భూస్వాముల భూములు దున్నవద్దని, వెట్టిచాకిరీ చేయొద్దని, అత్యాచారాలను ప్రతిఘటించాలనే లక్ష్యాలతో వీరు తిరుగుబాటును కొనసాగించారు. 1946లో వర్లీ మహాసభ జరిగింది. చివరకు వ్యాపారులు, భూస్వాములు రాజీకి వచ్చారు. వర్లీ గిరిజనులు డిమాండ్ చేసినదాని కంటే ఎక్కువ కూలీ సాధించుకున్నారు. ఈ తిరుగుబాటు ఘన విజయం సాధించింది.
ఛోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతాలు
- జార్ఖండ్ (అధిక భాగం)
- ఒడిశా
- పశ్చిమ బెంగాల్
- ఛత్తీస్‌గఢ్
- బిహార్
గిరిజనోద్యమాలకు కారణాలు
- గిరిజన ప్రాంతాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేందుకు ప్రయత్నించడం. దీనివల్ల తరతరాలుగా అనుభవిస్తున్న అటవీ సంపద, భూములపై గిరిజనులకు అధికారం కోల్పోయే పరిస్థితి తలెత్తింది.
- గిరిజనుల భూములను ఆక్రమించి, వారిని కట్టుబానిసలుగా మార్చడం.
- గిరిజనుల సంస్కృతి, ఆచారాల్లో జోక్యం చేసుకోవడం.
- వస్తు మార్పిడి స్థానంలో ద్రవ్య మార్పిడి విధానం చోటు చేసుకోవటంతో వడ్డీ వ్యాపారుల అక్రమాలు.
- గిరిజనుల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కులను హరించడం.
- అటవీ నియంత్రణ చట్టం-1865, భారత అటవీ చట్టం-1878, భారత అటవీ చట్టం-1927 మొదలైన వాటిలో గిరిజనుల హక్కులను గుర్తించకపోవడం.
- స్వాతంత్య్రానంతరం అభివృద్ధి పేరుతో పరిశ్రమలు, ఆనకట్టల నిర్మాణం చేపట్టడంతో గిరిజనులు తమ ఆవాసాలు కోల్పోవడం. వారికి సరైన పునరావాసం కల్పించకపోవడం.
గిరిజన తిరుగుబాటు | జరిగిన సం. | ప్రాంతం | ప్రస్తుత రాష్ట్రం | నాయకులు |
రంపా తిరుగుబాటు | 1802-03 | విశాఖ, భద్రాచలం | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ | రామభూపతి, తమ్మన్న దొర |
ఖోండుల తిరుగుబాటు | 1817 | గుమేసూర్, | ఒడిశా | చినోయి దొర |
1830 | చినకిమిడి | చక్రబోయి దొర | ||
1846-1857 | కలహండి | సురేంద్ర సాయి | ||
కోల్ తిరుగుబాటు | 1831-32 | ఛోటా నాగపూర్ | బుద్ధూ భగత్, జోవా భగత్, మదరా మహత్ | |
సంతాల్ తిరుగుబాటు | 1811, 1823, 1829, 1854 | తూర్పు భారతదేశం | బిహార్, బెంగాల్, ఒడిశా | సిద్ధూ, కన్హూ |
బస్తర్ తిరుగుబాటు | 1880 | ఛత్తీస్‌గఢ్ | ||
ముండా తిరుగుబాటు | 1895 | |||
గోండు తిరుగుబాటు | 1940 | ఆదిలాబాద్ | తెలంగాణ | కొమరం భీం |
మన్యం తిరుగుబాటు | 1922-24 | విశాఖపట్నం, గోదావరి | ఆంధ్రప్రదేశ్ | అల్లూరి సీతారామరాజు |
కొండసవర తిరుగుబాటు | 1945 | కోరాపుట్ | ఒడిశా | లక్ష్మణ్ నాయక్ |
వర్లీ తిరుగుబాటు | 1944 | థానే | మహారాష్ట్ర | కిసాన్ సభ |
#Tags