బౌద్ధ శిల్పకళ

భారతదేశంలో మొదటగా శిల్పకళను ప్రారంభించింది బౌద్ధులే. వీరు భారతదేశ వాస్తు, శిల్పకళ, చిత్రలేఖనాలకు విశేషమైన సేవ చేశారు. వీరి శిల్పకళ తర్వాతికాలంలో హిందూ శిల్పాలకు మార్గదర్శకమైంది. బౌద్ధ శిల్పకళకు ముందు హిందువులకు దేవాలయాలు లేవు. యజ్ఞాలు మాత్రమే చేసేవారు. ఈ యజ్ఞాల కోసం యజ్ఞశాలలు, స్తంభాలు మాత్రమే నిర్మించారు. సింధూ నాగరికతలోనూ దేవతల బొమ్మలున్నాయిగానీ దేవాలయాలు లేవు. విహారాలు, స్తూపాలు, చైత్యాలను మొదటగా బౌద్ధులే నిర్మించారు. ఆ కాలంలో బుద్ధుడిని అసాధారణ వ్యక్తిగా భావించారు. బుద్ధుడి నిర్యాణం తర్వాత ఆయన అస్థికలపై 8 స్థూపాలు కట్టించారు. ఈ కట్టడాలే తర్వాత బౌద్ధ శిల్పకళకు, క్రమంగా జైన హిందూ శిల్పకళకు మార్గదర్శకమయ్యాయి.
బౌద్ధ శిల్పకళా వాస్తు విధానాలను ‘మహాపరినిభావ సుత్తం’ అనే గ్రంథం వివరిస్తోంది. బుద్ధుడు తాను దేవుడినని, దైవ అవతారమని చెప్పుకోలేదు. ఆయన చిహ్నాలైన పద్మం, బోధి వృక్షం, ధర్మచక్రం, స్థూపాలను హీనయానులు ఆరాధించారు. కానీ మహాయానశాఖ ఆవిర్భావం తర్వాత బుద్ధుడిని భగవంతునిగా కొలిచే ఆచారం మొదలైంది. దీంతో బుద్ధుని విగ్రహాలు తయారయ్యాయి. హీనయాన కాలంలో బౌద్ధులు ప్రార్థన చేసే చైత్యాలను మహాయానులు బుద్ధుని దేవాలయాలుగా మార్చి ఆయన విగ్రహాలు ప్రతిష్టించారు.
మౌర్యులకాలంలో బౌద్ధ శిల్పకళ: అశోకుడు దేశంలో 84,000 స్థూపాలు నిర్మించాడు. వీటిలో సాంచి, సారనాథ్ ముఖ్యమైనవి. సారనాథ్‌లోని దామేక స్థూపం పరిమాణంలో పెద్దది. ఢిల్లీ, టోప్రా, మీరట్‌లోని స్తంభ శాసనాలు, సాంచి, సారనాథ్, కౌశాంబిలోని ఉపస్తంభ శాసనాలు బౌద్ధశిల్పకళకు చెందిన తొలి నిర్మాణాలు. ఈ స్తంభాలపై కిరీటాల్లా మలిచిన ఎద్దు, సింహం, గుర్రం బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి. స్థూపాలపై బుద్ధుడి జీవిత విశేషాల ను, స్వస్తిక్, ఖాళీ సింహాసనం, బోధివృక్షం మొదలైన బొమ్మలను చెక్కారు. స్థూపాల చుట్టూ ప్రాకారాలు, ద్వారాలపై అందమైన బొమ్మలు ఉన్నాయి. బౌద్ధ బిక్షువులు నివసించడానికి అనేక గుహలు నిర్మించారు. బరాబర్ బౌద్ధగుహలు అశోకుని కాలం నాటివే. శృంగుల కాలంలో నిర్మించిన బారాహుత్ స్థూపం కూడా ప్రముఖమైందే. శృంగులు హిందూ మతస్థులైనప్పటికీ అశోకుని స్థూపాల్లా అనేక ప్రాకారాలు నిర్మించారు.
దక్షిణ భారతదేశంలో బౌద్ధ శిల్పకళ: దక్షిణ భారతదేశం కూడా బౌద్ధమతానికి గొప్ప కేంద్రమైంది. ముఖ్యంగా శాతవాహన యుగానికి ముందే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ప్రవేశించింది. మొదటి నుంచి కర్ణాటక జైనమతానికి నిలయం కాగా, ఆంధ్రదేశం బౌద్ధమతానికి గొప్ప కేంద్రమైంది. అమరావతి స్థూపం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని బ్రిటిష్ చరిత్రకారులు శ్లాఘించారు. శాతవాహనుల కాలంలో అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, గుంటుపల్లి, గుమ్మడిదుర్రు గొప్ప బౌద్ధ క్షేత్రాలుగా విలసిల్లాయి. తెలంగాణలో ఫణిగిరి (నల్గొండ జిల్లా), కోటిలింగాల (కరీంనగర్ జిల్లా), నాగార్జునకొండ (నల్గొండ జిల్లా) కూడా బౌద్ధ కళా ఖండాలే. మహారాష్ట్రలో కన్హేరి,కార్లే, భాజీ, నాసిక్ గుహాలయాలు ప్రసిద్ధి చెందాయి.
మహాయాన కాలంనాటి బౌద్ధ శిల్పకళ: మహాయాన మతం ఆవిర్భావంతో బౌద్ధశిల్పకళ చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. మహాయానులు బుద్ధుడిని దేవునిగా ఆరాధించడంతో బుద్ధుడు, బోధిసత్వ విగ్రహాలను చెక్కడం ఆరంభమైంది. బౌద్ధ శిల్పాలను ఎలా చెక్కాలో మహాపరినిభావ సుత్తం అనే గ్రంథం వివరిస్తుంది. ఈ శిల్పాలు మొదట గాంధార దేశంలో కనిష్కుని కాలంలో మొదలయ్యాయి. 5వ శతాబ్దం వరకు కొనసాగి, కొన్ని వేల లక్షల బుద్ధ ప్రతిమలతో పెషావర్, తక్షశిల, జలాలాబాద్, స్వాత్ లోయలు మొదలైన వందల ప్రదేశాల్లో మహాయాన బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. ఇవన్నీ కూర్చున్న, నిల్చున్న, నిర్యాణ స్థితిలో పడుకొని ఉన్న అనేక బుద్ధ ప్రతిమలు. గాంధార దేశమంతటా గ్రీకు శిల్ప శైలిలో వీటిని రూపొందించారు. ఈ ప్రభావంతో భారత శిల్పులు భారతీయ శైలిలో మధురలో బుద్ధ బోధిసత్వ ప్రతిమలు తయారుచేశారు. ఇవి ఉత్తర దేశమంతటా ప్రచారంలోకి వచ్చాయి.
అజంతా గుహలు: దేశవ్యాప్తంగా అనేక గుహల్లో బౌద్ధ శిల్పాలు చెక్కారు. కానీ వీటన్నింటికీ తలమానికమైనవి అజంతా గుహలు. ఇవి మొత్తం బౌద్ధ గుహలే. అద్భుతమైన శిల్పాలతో వెలిగే ఈ గుహలను చూసి ఆంగ్లేయులు అబ్బురం చెందారు. దక్షిణ దేశంలో మహాయాన శిల్పాలు శిల్పుల ప్రతిభకు తార్కాణాలు. స్థూపాలతోపాటు ఈ గుహల్లో బుద్ధుని జాతక కథలు చెక్కారు. మొత్తం 29 గుహలున్నాయి. మొదటి గుహలో మహాజనక జాతక స్నాన దృశ్యాలను రమ్యంగా చిత్రించారు.
16వ గుహలో బుద్ధుని విగ్రహం ధర్మాన్ని బోధిస్తున్నట్లు ఉంది. 17వ గుహలో మాతృపోషక జాతకం, మహా హంస జాతకాలు, 19వ గుహలో మాతా శిశువులు బుద్ధుని ఎదుట ఉన్నట్లుగా, 26వ గుహలో మహాపరినిర్యాణం చెక్కి ఉన్నాయి. వీటిని ఎంతో రమ్యంగా మలిచారు. అమరావతిలో మిత్రవిందుని కథ, బోధిసత్వుడు గజావతారం ఎత్తడం మొదలైన జానపద కథలను తొలిచారు.
చిత్రలేఖనం: ఈ గుహల్లోని గోడలపై అనేక వర్ణచిత్రాలు ఉన్నాయి. నాటి రంగులు నేటికీ చెక్కుచెదరలేదు. ఇందు రాజకుమారి మరణం, రెండో పులకేశి రాయబారికి దర్శనమివ్వడం, పద్మపాణి స్త్రీలు అలంకరించుకోవడం వంటి ఆచార వ్యవహారాలను వివరించే బొమ్మలను సైతం చెక్కారు. ఈ విధంగా బౌద్ధులు భారత శిల్పకళను అభివృద్ధి చేశారు. ఎల్లోరా గుహల్లోనూ బౌద్ధశిల్పాలున్నాయి.

గాంధార శిల్పకళ
గాంధార దేశంలో ఉద్భవించడం వల్ల దీనికి గాంధార శిల్పకళ అనే పేరు వచ్చింది. పంజాబ్ వాయువ్య సరిహద్దు రాష్ట్రం, అఫ్గానిస్తాన్‌లో కొంత భాగాన్ని పూర్వ గాంధార దేశమని పిలిచేవారు. గాంధార శిల్పకళను ఇండో-గ్రీకు కళ అని కూడా అంటారు. ఈ కళలో భారతీయ లక్షణం ఆత్మగా, భౌతిక రూపం గ్రీకు లక్షణంగా ఉంటుంది. గాంధార శిల్పకళలో గ్రీకు పద్ధతులు మేళవించారు. గ్రీకుల నమ్మకం ప్రకారం విశ్వానికి 1) జూస్ 2) పోస్‌డస్ 3) హేడ్స్ అనే ముగ్గురు అధిపతులు. భూమి, ఆకాశం జూస్ ఆధిపత్యంలో, సముద్రం పోస్‌డస్ ఆధిపత్యంలో, నిమ్నలోకాలు హేడ్స్ ఆధిపత్యంలో ఉంటాయని భావించారు. వీరు హిందువులకు త్రిమూర్తుల వంటివారు.
శిల్పకళా లక్షణాలు: బుద్ధుడు కళాతపస్విగా కాకుండా ఒక యుద్ధ వీరుడిలా కనిపిస్తాడు. గ్రీకులు భౌతికవాదులు, యుద్ధ వీరులు, సౌందర్య పిపాసకులు. ఇవే గ్రీకు శిల్పాల్లో ఉండే ప్రధాన లక్షణాలు. ఇవన్నీ గాంధార శిల్పకళలోనూ కనిపిస్తాయి. కానీ భారతీయులు ఆధ్యాత్మికవాదులు. ఆధ్యాత్మిక భావాలైన ప్రసన్నత, ఆత్మానందం అనుభవించడం, సంతృప్తి మొదలైన భావాలు భారతీయ శిల్పాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ గాంధార శిల్పకళ ఒకటో శతాబ్దంలో కనిష్కుని కాలంలో పుట్టిందని కొంతమంది, అంతకుముందు నుంచే ఉందని చరిత్రకారుడు స్మిత్ పేర్కొన్నారు. కనిష్కుని కాలంలోనే ప్రారంభమైందని పాల్‌మాసన్, ఎన్.ఆర్. రాయ్ కూడా అభిప్రాయపడ్డారు. బిమర్‌గావ్ అనే ప్రదేశంలో తొలిసారిగా గాంధార శిల్పం లభించింది. తలలేని రెండు బుద్ధ విగ్రహాలు లోరిమన్ తొంగై, హస్తనగర్ అనే ప్రదేశాల్లో లభించాయి. కనిష్కుని కాలంలో జలాలాబాద్, హడ్డా, బమియన్, కాబూల్ లోయలో (అఫ్గానిస్తాన్), చర్‌చద్దు, తక్షశిల, స్వాత్ లోయ, పెషావర్ (పాకిస్థాన్), కాశ్మీర్‌లోయలోని ఉష్కర, ఆర్వన్, పంజాబ్ (భారత్)లో గాంధార శిల్ప కేంద్రాలు ఉన్నాయి.
పురుషపురం: ఇది కనిష్కుడి రాజధాని. ప్రస్తుత పెషావర్ నగరమే నాటి పురుషపురం. ఇక్కడ కనిష్కుడు అనేక బౌద్ధవిహారాలు, స్థూపాలు నిర్మించాడు. అందులో 400 అడుగుల పెద్ద గోపురం, బుద్ధుని నిలువెత్తు విగ్రహం కూడా ప్రతిష్టించాడని హ్యూయాన్‌త్సాంగ్ రచనల వల్ల తెలుస్తోంది. ఇతర స్థావరాల్లో లభించిన బుద్ధ విగ్రహాల్లో ఒకటి గ్రీకు దేవుడైన అపోలోను పోలి ఉంది. మరికొన్నింటికి రోమ్ దేవతలకు ఉండే వస్త్రధారణ, ఆభరణాలున్నాయి. కాబూల్ లోయలానే స్వాత్ లోయలోనూ 15 సంఘారామ అవశేషాలు బయటపడ్డాయి. వాటిలో కొన్ని గుహల్లో చెక్కి ఉన్నాయి. పెషావర్‌కు 60 కి.మీ. దూరంలో ఉన్న జమల్ గిరి, రావల్పిండి సమీపంలోని మంక్యాల, తక్షశిలకు దగ్గరలో ఉన్న ధర్మరాజలోనూ సంఘారామాలున్నాయి.
గాంధార శిల్పకళా ప్రభావం: గాంధార శిల్పకళ భారతీయ, ఆసియా ఖండ శిల్పకళలపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ లక్షణాలను అమరావతి శిల్పంలోనూ ప్రవేశపెట్టారు. మధుర, అమరావతి శిల్పకళలపై గాంధార శిల్పకళారీతులు ఎన్నో మిళితమై ఉన్నాయి. నాటి విగ్రహాల్లో శిరోజాలతో కూడినవి, లేనివి రెండు రకాలుగా ఉన్నాయి. శిరోజాలు లేని శిల్పాలు మధురలో తయారయ్యాయి. శిరోజాలు ఉన్నవి గాంధార శిల్పాలు.
  1. బౌద్ధులను చూసి జైనులు కూడా తీర్థంకరుని విగ్రహాలు తయారు చేసుకున్నారు.
  2. హిందూమతస్థులు కూడా దేవతలకు విగ్రహాలు ప్రతిష్టించి దేవాలయాలు నిర్మించడం ప్రారంభించారు.
  3. హిందువులు ప్రారంభంలో బౌద్ధుల్లా గుహాలయాలను నిర్మించారు. మధ్యప్రదేశ్‌లో గుప్తులనాటి ఉదయగిరి గుహాలయాలు, దక్షిణదేశంలోని పల్లవుల కాలంనాటి మహాబలిపురం, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానది ఒడ్డున ఉన్న ఉండవల్లి, విజయవాడలోని మొగల్‌రాజపురం గుహాలయాలు బౌద్ధ శిల్పకళకు అనుకరణాలే.
  4. బౌద్ధుల స్థూపాలే హిందువుల శివలింగ రూపాలు. మహాపరినిర్యాణ స్థితిలో మలిచిన బుద్ధుని రూపమే అనంత పద్మనాభస్వామికి ప్రతిరూపం. నిలువెత్తు బుద్ధుడి విగ్రహరూపమే విష్ణువు విగ్రహాలు. బౌద్ధుల చైత్యాలే హిందూదేశ ఆలయ వాస్తుశిల్పానికి మూలం. బౌద్ధ స్థూపాలైన అమరావతి, భీమేశ్వరం, ద్రాక్షారామం, క్షీరారామం, కుమారారామం, బౌద్ధ ఆరామాలు కాలక్రమంలో శివాలయాలుగా మారాయి. అజంతా గుహల్లోని చిత్ర లేఖనంలా హిందువులు కూడా తమ దేవాలయాల గోడలపై రామాయణ, మహాభారత గాథలను రంగులతో చిత్రించుకున్నారు. ఈ విధంగా బౌద్ధ శిల్పకళ భారతదేశ శిల్పకళకు మూలాధారం. మహాయాన శిల్పకళ భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండమంతా విస్తరించి చైనా, జపాన్, శ్రీలంక, ఇండో- చైనా దేశాల శిల్పకళపై ప్రభావాన్ని చూపించింది.
#Tags