శిలలు

భూపటలం అనేక శిలలతో కూడి ఉంటుంది. భూ ఉపరితలంపై ఉన్న పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి భూస్వరూపాలు వివిధ రకాల శిలలతో నిండి ఉంటాయి. శిలలు ఖనిజాల సమాహారం. శిలల్లో రెండు వేల రకాలకు పైగా ఖనిజాలున్నాయి. అందులో ఆరు ఖనిజాలు ముఖ్యమైనవి. అవి.. ఫెలస్పార్, క్వార్ట్జ్, పైరిక్సిన్, ఆంఫిబోల్స్, మైకా, ఆలివిన్.
ఉద్భవన విధానం, భౌతికధర్మాల ఆధారంగా శిలలు మూడు రకాలు అవి.. అగ్ని శిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు. పటలంలో అధిక ఉష్ణోగ్రతలు, పీడనాల వల్ల శిలా పదార్థం ద్రవ రూపంలో ఉంటుంది. దీన్ని ‘మాగ్మా’అంటారు. మాగ్మా ఘనీభవించడం వల్ల అగ్ని శిలలు ఏర్పడతాయి. ఇవి ప్రాథమిక శిలలు. పటలం అంతర్భాగంలో అధిక లోతుల్లో మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడినవే పాతాళ (Plutonic) అగ్ని శిలలు. ఇవి విశాలమైన ‘బాతోలిథ్’ భూస్వరూపాలను ఏర్పరుస్తాయి. అధిక లోతుల్లో మాగ్మా నెమ్మదిగా ఘనీభవించడంతో శిలల్లో భారీ స్ఫటికాలు ఏర్పడతాయి. మధ్యస్థ లోతుల్లో మాగ్మా ఘనీభవించడం వల్ల ‘హైపర్‌బేసిల్’ అగ్ని శిలలు ఏర్పడతాయి. ఇవి సిల్స్, డైక్స్, ఫాకోలిథ్, లాకోలిథ్ లాంటి భూస్వరూపాలను ఏర్పరుస్తాయి. ఉపరితలంపైకి ఉబికి వచ్చిన మాగ్మాను ‘లావా’ అంటారు. ఇదే అగ్నిపర్వతక్రియ. లావా ఘనీభవనం వల్ల ఏర్పడే అగ్ని శిలల్లో స్ఫటికాలు ఉండవు. ఈ శిలలు అగ్ని పర్వతాలు, లావాడోమ్లు లాంటి భూస్వరూపాలను ఏర్పరుస్తాయి.
ఆమ్ల అగ్ని శిలలు
సిలికా శాతం అధికంగా ఉన్న అగ్ని శిలలను ‘ఆమ్ల అగ్ని శిలలు’ అంటారు. వీటిలో ఫెర్నో మెగ్నీషియం ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు గ్రానైట్, సిలికా తక్కువగా ఉండి మెగ్నీషియం, అల్యూమినియం, పొటాషియం అధికంగా ఉన్న శిలలను ‘బేసిక్ అగ్నిశిలలు’ అంటారు. బసాల్టు, గాబ్రో మొదలైన శిలలు ఈ తరగతికి చెందినవి. ఆమ్ల అగ్ని శిలలు లేతరంగులో ఉండి, క్రమక్షయాన్ని తట్టుకోగలవు. బేసిక్ అగ్ని శిలలు ముదురు రంగులో ఉండి, త్వరగా క్షయం చెందుతాయి. అగ్ని శిలలు అధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్డ్ద ఏర్పడటం వల్ల వాటిలో శిలాజాలు ఉండవు. అగ్ని శిలలు పటలం లోపలి భాగాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. భారతదేశంలో దక్కన్ నాపల ప్రాంతం.. బసాల్టు రకానికి చెందిన అగ్ని శిలలతో నిండి ఉంటుంది. హిమాలయ పర్వతాల కేంద్రకంలో గ్రానైట్ శిలలు ఉన్నాయి.
నదులు, పవనాలు, హిమనీ నదులు, వేలాతరంగాల వంటి బాహ్య క్రమక్షయ కారకాల చర్య వల్ల ఉపరితలంపై విస్తరించిన శిలలు శిథిలమవడంతో.. శిథిల శిలా పదార్థం ఏర్పడుతుంది. ఈ శిథిల పదార్థం నిక్షేపణ వల్ల అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఉపరితల శిలల్లో 75 శాతం అవక్షేప శిలల తరగతికి చెందుతాయి. ఉద్భవన విధానాన్ని బట్టి అవక్షేప శిలలను రెండు రకాలు. అవి.. ఎ) యాంత్రిక అవక్షేప శిలలు, బి) రసాయనిక అవక్షేప శిలలు.
యాంత్రిక అవ క్షేప శిలలు
శిథిల శిలా పదార్థ నిక్షేపణలు సంఘటితంలో క్రమంగా గట్టిపడి యాంత్రిక అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇసుకరాయి(sand stone),షేల్. రసాయనిక చర్యల ఫలితంగా శిథిలమైన శిలా పదార్థం గట్టిపడి రసాయనిక అవక్షేప శిలలు ఏర్పడతాయి.
ఉదా: కాల్సైట్, జిప్సం, సున్నపురాయి. జీవసంబంధ పదార్థ నిక్షేపాలతో కూడా అవక్షేప శిలలు ఏర్పడవచ్చు.
ఉదా: పీట్, లిగ్నైట్, ప్రవాళ ఇసుకరాయి. అవక్షేప శిలలు, నదీలోయలు, నదీ ముఖద్వారాలు, వరద మైదానాలు, తీరమైదానాల్లో విస్తరించి ఉంటాయి. అవక్షేప శిలల్లో శిలాజాలు ఉంటాయి. బొగ్గు, చమురు, సహజ వాయువులాంటి శిలాజ ఇందనాలు అవక్షేప శిలలో మాత్రమే లభిస్తాయి. అవక్షేప శిలలు పొరలు పొరలుగా ఉంటాయి. బెడ్డింగ్ ప్లేనులు, స్ట్రాటిఫికేషన్ అవక్షేపశిలల ముఖ్య లక్షణం. అవక్షేప శిలలు మృదువుగా లేదా కఠినంగా ఉండొచ్చు.
రూపాంతర శిలలు
మాతృక శిలలు అధిక ఉష్ణోగ్రతలు, పీడనాలకు లోనై వాటి భౌతిక, రసాయనిక లక్షణాలు పూర్తిగా మారిపోయి కొత్తరకం శిలలుగా రూపాంతరం చెందుతాయి. వీటిని రూపాంతర శిలలుగా పిలుస్తారు. సాధారణంగా అగ్నిపర్వత ప్రక్రియ, పర్వతోద్భవన ప్రక్రియల వల్ల రూపాంతర శిలలు ఏర్పడతాయి. ఇవి చాలా కఠినంగా, దృఢంగా, పెళుసుగా ఉంటాయి. ఈ శిలల్లో పగుళ్లు, బీటలు, అతుకులు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక రకాల ఖనిజాలతో కూడి ఉంటాయి. నీస్ (Gneiss), సిస్ట్, క్వార్ట్జైట్ ముఖ్య రూపాంతర శిలలు . రూపాంతర శిలల మాతృక శిలలు అగ్ని, అవక్షేప లేదా రూపాంతర శిలల తరగతికి చెందినవి.
మాతృక శిల - రూపాంతర శిల
షేల్ స్లేటు
స్లేటు సిస్ట్
గ్రానైట్ నీస్
సున్నపురాయి మార్బుల్
ఇసుకరాయి క్వార్ట్జైట్
శిలా చక్రం
భూస్వరూపాల్లాగే శిలలు కూడా శాశ్వతం కాదు. వివిధ ప్రక్రియల వల్ల ఒక తరగతికి చెందిన శిలలు ఇతర రకాల శిలలుగా మారతాయి. దీనినే శిలాచక్రం అంటారు. అగ్ని, రూపాంతర శిలలు క్రమక్షయం వల్ల శిథిలమై.. అవక్షేప శిలలు ఏర్పడతాయి. పర్వతోద్భవనం, అగ్నిపర్వత ప్రక్రియల వల్ల అవక్షేప, అగ్నిశిలలు పటలంలోకి చొచ్చుకొనిపోయి అధిక ఉష్ణోగ్రత, పీడనాల ప్రభావం వల్ల రూపాంతర శిలలుగా మారతాయి. పలకల సరిహద్దుల వద్ద సబ్‌డక్షన్ మండలంలో ఉపరితల శిలలు.. పటల అంతర్భాగాల్లోకి నెట్టడం వల్ల శిలాద్రవంగా మారిపోతాయి. శిలాద్రవం ఘనీభవించి అగ్నిశిలలుగా ఏర్పడతాయి.









#Tags