వ్యవసాయ మార్కెటింగ్

ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ సంప్రదాయబద్ధమైన జీవన విధానం నుంచి వ్యాపార పరమైన వృత్తిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. బహుళ జాతి సంస్థలు ఆహార చిల్లర వ్యాపారంలో ప్రవేశించడం వల్ల వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ కొత్త రూపును సంతరించుకుంది. భారత్‌లో ప్రవేశ పెట్టిన మార్కెట్ సంస్కరణల కారణంగా వ్యవసాయ రిటైల్ వాణిజ్యంలో విప్లవం ప్రారంభమైంది. టాటా, రిలయన్స్, స్పెన్సర్స్, హిందూస్థాన్ లీవర్, డీసీఎం, మహీంద్ర అండ్ మహీంద్రా లాంటి సంస్థలు ఆహార ఉత్పత్తుల అమ్మకాల్లో ప్రవేశించాయి. ఆయా సంస్థలు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, నీటిపారుదల సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడం, పరపతి సౌకర్యం కల్పించడం, ప్రాసెసింగ్, శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయటం లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
గత రెండు దశాబ్దాలకు పైగా భారత ఆర్థిక వ్యవస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. సంస్కరణల అనంతర కాలంలో అధిక జీడీపీ వృద్ధితోపాటు స్వదేశీ వినియోగ మార్కెట్ల వృద్ధి కారణంగా అసంఘటిత రంగానికి చెందిన రిటైల్ రంగంలో వృద్ధి అధికమైంది. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతి, క్యాష్ అండ్ క్యారీ విధానం వల్ల భారత్‌లో రిటైల్ మార్కెట్లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. వ్యవసాయ రిటైలింగ్‌లో విదేశీ పెట్టుబడి అనుమతి కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మూలధన ప్రవాహం పెరిగింది. తద్వారా వివిధ వర్గాల ప్రజల శ్రేయస్సు మెరుగవుతుంది. ముఖ్యంగా వినియోగదారులు, ఉత్పత్తి దారులు అధిక ప్రయోజనాన్ని పొందగలుగుతారు. రైతుల ఆదాయాల వృద్ధితో పాటు వ్యవసాయ రంగం వృద్ధి అధికంగా ఉండి వినియోగ ధరల ద్రవ్యోల్బణం తగ్గుతుంది. వ్యవసాయ వస్తువుల నాణ్యత ప్రమాణాలు మెరుగవడంతోపాటు వినియోగదారుని అవసరాలు తీరుతున్నాయి.
 రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడి వల్ల కలిగే పరిణామాల గురించి అధ్యయనం చేయడానికి ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకానామిక్ రిలేషన్స్’ను  ప్రభుత్వం  కోరింది. కార్పొరేట్ సంస్థలు లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశం వల్ల భారత రిటైల్ వాణిజ్యం విలువ 2011-12 నాటికి 496 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. చిన్న, సాంప్రదాయ రిటైలర్లపై పెద్ద కార్పొరేట్ సంస్థల ప్రభావం తక్కువేనని సంస్థ అభిప్రాయపడింది.
 
వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు
స్వాతంత్య్రానంతరం వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. క్రమబద్ధమైన మార్కెట్ల ఏర్పాట్లు, గిడ్డంగుల నిర్మాణం, ఉత్పత్తుల శ్రేణీకరణ, ప్రామాణీకరణ, తూనికలు, కొలతల ప్రామాణీకరణ, ఆల్ ఇండియా రేడియో ద్వారా మార్కెట్ ధరల సమాచారాన్ని రైతులకు తెలియజేయడం, రవాణా సౌకర్యాలు మెరుగుపర్చడం వీటిలో ముఖ్యమైనవి.
క్రమబద్ధమైన మార్కెట్లు (Regulated Markets):
దళారుల నుంచి రైతులకు రక్షణ కల్పించడానికి క్రమబద్ధమైన మార్కెట్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం మార్కెట్ కమిటీలను నియమించారు. మార్కెట్ కమిటీల్లో స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ నామినీలతోపాటు, దళారులు, రైతులు సభ్యులుగా ఉంటారు. ఒక నిర్ణీత కాలానికి మార్కెట్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మార్కెట్ కమిటీలు కింద పేర్కొన్న విధులను నిర్వర్తిస్తాయి.
 1. తూనికలు, కమీషన్ చార్జీలను నిర్ణయించడం.
 2. దళారులకు లెసైన్స్ లు మంజూరు చేయడం.
 3. గిట్టుబాటు ధర లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా గిడ్డంగి సౌకర్యాలు కల్పించడం.
 4. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించే క్రమంలో రవాణా సౌకర్యాలు కల్పించడం.
 5. తూనికలు, కొలతలు ప్రామాణికంగా ఉండే విధంగా చూడటం.
 6. ఉత్పత్తి నిల్వ ఆధారంగా పరపతి సౌకర్యం కల్పించడం.
 7. రైతులు, దళారుల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం.
 అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌ను నియంత్రించడానికి ‘అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ యాక్ట్ (ఏపీఎంసీ)’ను తీసుకువచ్చాయి. దేశంలో ప్రస్తుతం 7246 క్రమబద్ధమైన మార్కెట్లు విధులు నిర్వహిస్తున్నాయి. 21221 గ్రామీణ పీరియాడికల్ మార్కెట్లు ఉండగా, వీటిలో 15 శాతం నియంత్రణ (రెగ్యులేషన్)లో ఉన్నాయి. కేరళ, మణిపూర్, అండమాన్, నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, డామన్, డయ్యూ, లక్షద్వీప్‌లలో ఈ ఏపీఎంసీ యాక్ట్ లేదు. ఈ చట్టం పరిధిలోకి రాకుండా గ్రామీణ పీరియాడికల్, ట్రైబల్ మార్కెట్లు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో విధులను నిర్వహిస్తున్నాయి.
 
శ్రేణీకరణ, ప్రామాణీకరణ
వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి శ్రేణీకరణ, ప్రామాణీకరణ ప్రక్రియలను పాటిస్తే వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో ఎలాంటి అభివృద్ధినీ ఊహించలేం. ఈ క్రమంలో ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ (గ్రేడింగ్, మార్కెటింగ్) చట్టాన్ని 1937లో తీసుకువచ్చింది. ప్రారంభంలో గ్రేడింగ్‌ను జనపనార, పొగాకు ఉత్పత్తుల్లో ప్రవేశపెట్టి  ఆ తర్వాత మిగిలినవాటికి విస్తరించారు. గ్రేడింగ్ సౌకర్యం కల్పించే నిమిత్తం 182 వ్యవసాయ ఉత్పత్తులకు ప్రామాణికాలను రూపొందించారు. ప్రభుత్వం నాగపూర్‌లో సెంట్రల్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీని, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ అనుబంధ నాణ్యత నియంత్రణ ల్యాబొరేటరీలను  ఏర్పాటు చేసింది. నాణ్యతతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులకు ‘అగ్‌మార్క్’ ముద్రను వేస్తున్నారు. అంతర్గత వినియోగానికి అగ్‌మార్క్ కింద గ్రేడ్ చేసిన వస్తువుల్లో పత్తి, కూరగాయలు, క్రీమ్, నెయ్యి, వెన్న, గుడ్లు, బియ్యం, గోధుమ, స్ఫటిక బెల్లం, పప్పుధాన్యాలు, తేనె ముఖ్యమైనవి.
 
ప్రామాణిక తూనికలు, కొలతల ఉపయోగాలు
వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో దళారులు సరైన తూనికలు, కొలతలు వినియోగించకుండా రైతులను మోసగించడం ప్రధాన సమస్యగా పేర్కొనవచ్చు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వం స్టాండర్డ్ వెయిట్ యాక్ట్-1939  తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రామాణిక కొలతలకు సంబంధించి సొంత శాసనాలు చేయడానికి ఒక నమూనాగా ఉపకరించింది. కేంద్ర ప్రభుత్వం 1958లో మెట్రిక్ సిస్టమ్ ఆఫ్ మెజర్స్ ను ప్రవేశ పెట్టింది.
 
గోడౌన్, నిల్వ సౌకర్యాలు
రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు విక్రయించడానికి వారిపై ఒత్తిడి పెరగడానికి సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో గోడౌన్, నిల్వ సౌకర్యాలను పెంపొందిస్తే రైతులకు ధరల విషయంలో బేరమాడే శక్తి పెరుగుతుంది. గోడౌన్‌లలో నిల్వ ఉంచిన ఉత్పత్తి రశీదుల ఆధారంగా వాణిజ్య బ్యాంకులు, సహకార సంఘాల నుంచి తగిన పరపతిని రైతులు పొందగలుగుతారు. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించే వరకు వేచి ఉండగలుగుతారు.
గోడౌన్, నిల్వ సౌకర్యాల ఆవశ్యకతను గుర్తించిన రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ (1954) జాతీయ, రాష్ట్ర, జిల్లా - గ్రామీణ స్థాయిలో మూడంచెల నిల్వ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కమిటీ సిఫార్సులకనుగుణంగా 1957లో కేంద్ర గిడ్డంగుల సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత అనేక రాష్ట్రాల్లోనూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థలను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. జూన్  2013 నాటికి ఎఫ్‌సీఐ 355.19 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, రాష్ట్రాల గిడ్డంగుల సంస్థలు 205.25 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ గోడౌన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ పథకాన్ని ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు. మార్చి 2001 తర్వాత గ్రామీణ గోడౌన్ల నిర్మాణానికి ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌ను అమలు పరుస్తోంది.
 
మార్కెట్ సమాచారం
వివిధ మార్కెట్లలో ధరల సమాచారాన్ని రైతులకు తెలియజేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రధాన మార్కెట్లలో ధరల ధోరణులను ఆల్ ఇండియా రేడియో ద్వారా రైతులు తెలుసుకోగలుగుతున్నారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మార్కెట్ల ధరల ధోరణులపై సమీక్షలను నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక మార్కెట్లలో మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టులను అందుబాటులో ఉంచుతున్నారు. ఉత్పత్తుల నిల్వలు, అమ్మకాలు, ధరలు, మార్కెట్‌కు చేరే సరకు వివరాలను ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టులు ప్రచురిస్తున్నాయి. వివిధ వార్తా పత్రికలు కూడా వ్యవసాయ ధరలను తెలియజేస్తూ వాటికి సంబంధించిన సమీక్షలను ప్రచురిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, మార్కెట్ సమాచారాన్ని రైతులకు చేరవేయడానికి ‘మార్కెట్ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్’ అనే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ముఖ్య వ్యవసాయ మార్కెట్లకు ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ అందించారు. ప్రస్తుతం 300 వస్తువుల హోల్‌సేల్ ధరలను అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్ పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు.
 
మార్కెటింగ్, పర్యవేక్షణ డెరైక్టరేట్
వివిధ ఏజెన్సీల వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలను సమన్వయపరచడానికి భారత ప్రభుత్వం డెరైక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్‌‌సపెక్షన్‌ను ఏర్పాటు చేసింది. వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ డెరైక్టరేట్ సలహాలను ఇస్తుంది. ఇది ఇప్పటివరకూ 212 వ్యవసాయ, అనుబంధ వస్తువుల గ్రేడ్ స్టాండర్‌‌డ్సను నోటిఫై చేసింది. అనేక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ముందు వాటిపై కచ్చితంగా నాణ్యత నియంత్రణను విధిస్తుంది. మార్కెట్‌లపై చట్టబద్ధమైన నియంత్రణ, శిక్షణ, మార్కెట్ విస్తరణ మార్కెట్ సర్వేలు, పరిశోధన లాంటి కార్యకలాపాలను డెరైక్టరేట్ నిర్వహిస్తుంది.
ప్రభుత్వ కొనుగోలు, మద్ధతు ధరల నిర్ణయం
 
పైన వివరించిన చర్యలకు అదనంగా ప్రభుత్వం అనేక వ్యవసాయ వస్తువులకు సేకరణ ధర, మద్దతు ధర నిర్ణయించడం ద్వారా రైతులు గిట్టుబాటు ధరలు పొందే విధంగా చర్యలు తీసుకుంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫార్సులకనుగుణంగా ఆయా ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రభుత్వ ఏజెన్సీ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిట్టుబాటు ధర వద్ద రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. తద్వారా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరళమైన ధరలకు విక్రయిస్తుంది. ఈ క్రమంలో ఉత్పత్తిదార్లు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
 
వ్యవసాయ మార్కెటింగ్‌లో సమస్యలు
స్వభావరీత్యా భారత వ్యవసాయ రంగాన్ని జీవనాధార వ్యవసాయంగా పేర్కొనవచ్చు. దీర్ఘకాలికంగా పరిశీలిస్తే.. ప్రజలు జీవనాధారం కోసమే సేద్యం చేసి పంటలను పండించేవారు. రైతులు భాటకం, రుణాల చెల్లింపు, ఇతర అవసరాల కోసం పంట చేతికి వచ్చిన వెంటనే దానిలో కొంత భాగాన్ని విక్రయించేవారు. నిల్వ సౌకర్యాలు లేనందువల్ల ఈ విధమైన పంట విక్రయాన్ని అవలంభించేవారు. ఇటీవల రవాణా సౌకర్యాలతోపాటు గిడ్డంగుల వసతి పెరగడం వల్ల సొంత వినియోగం కోసమే కాకుండా వ్యాపార ప్రయోజనాల కోసం రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అనేక అనుభవ పూర్వక ఆధారాల ప్రకారం గ్రామీణ రైతులు పంటలో అధిక భాగాన్ని వడ్డీ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లు/ మండీలకు ఉత్పత్తులను విక్రయం కోసం తీసుకెళ్లిన రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా రైతులు వ్యవసాయ ఉత్పత్తి ధరలో అధిక భాగాన్ని కోల్పోతున్నారు. డి.ఎస్. సింధూ అభిప్రాయం ప్రకారం బియ్యం ధరలో రైతుల వాటా 53 శాతం కాగా, మధ్యవర్తుల వాటా 31 శాతంగా, మార్కెటింగ్ వ్యయం 16 శాతంగా ఉంది. కూరగాయలు, పండ్ల ధరల్లో రైతుల వాటా కూరగాయలకు సంబంధించి 39 శాతం కాగా, పండ్లలో 34 శాతం. మధ్యవర్తుల వాటా కూరగాయల ధరల్లో 29.5 శాతం కాగా, పండ్ల ధరల్లో 46.5 శాతం. రైతులు వారి అమాయకత్వం, నిరక్షరాస్యత కారణంగా గిట్టుబాటు ధరలను పొందలేకపోతున్నారు. మార్కెట్‌లో తూనికలు, కొలతల విషయంలోనూ రైతులు మోసానికి గురవుతున్నారు. వారి ఉత్పత్తులను సరైన పద్ధతుల్లో శ్రేణీకరణ చేయలేకపోవడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకే  విక్రయించాల్సి వస్తుంది. ఉత్పత్తులకు సంబంధించి ధరల సమాచారం రైతులకు లభ్యం కాకపోవడం వల్ల లాభదాయక  ధరలను పొందలేకపోతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ను ఉత్పత్తులను సమూహాలుగా కూర్చడం, వినియోగానికి అనువుగా మార్చడం, పంపిణీ అనే  మూడు ముఖ్య విధులు కలిగిన ప్రక్రియగా పేర్కొనవచ్చు.









#Tags