Success Story: బేల్దారి కూలీ కొడుకు... చదువులో టాపర్‌

ఆర్థిక ఇబ్బందులతో తాను చదువుకోలేక పోయానన్న బాధ ఆ తండ్రికి ఎప్పుడూ ఉండేది. తనలాగే తన కుమారుడు మిగిలిపోకూడదని పరితపించాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెనకంజ వేయకుండా చదివించాడు. ఫలితంగా తన కుటుంబం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంగా ప్రత్యేక స్థానాన్ని అధిరోహించింది.

మార్టూరులోని శాంతినగర్‌ కాలనీకి చెందిన తన్నీరు వీరాంజనేయులు బేల్దారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. తన కుమారుడు నాగరాజును ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగంలో చూడాలనేది అతని కోరిక. 
గ్రూప్‌–1 సాధించటమే లక్ష్యం...
తన్నీరు నాగరాజు నల్గొండ జిల్లా కోదాడ సనా ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ దూర విద్య ద్వారా అభ్యసించారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఒంగోలులోని వివేకానంద కోచింగ్‌ సెంటర్‌లో గ్రూప్‌–2కోచింగ్‌ తీసుకున్నారు. ఇంతలో వీఆర్‌ఏ పరీక్షలో 94 మార్కులు, వీఆర్‌ఓ పరీక్షలో 96 మార్కులు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. గ్రూప్‌–1 సాధించటమే లక్ష్యమని నాగరాజు తెలిపారు. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సులభంగా సాధించవచ్చని నాగరాజు చెబుతున్నాడు. తాత్కాలికంగా ఉద్యోగంలో చేరినా తన అంతిమ లక్ష్యం గ్రూప్స్‌ కొట్టడమేనని గర్వంగా చెబుతున్నారు.

#Tags