TSPSC Chairman Janardhan Reddy : ఉత్కంఠ.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా తిరస్కరణ.. ట్విస్ట్ ఇదే..?
ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు డిసెంబర్ 12వ తేదీన (మంగళవారం) వెల్లడించాయి. ఇప్పటికే జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ఈ రాతపరీక్షలపై కీలక నిర్ణయం..
అయితే గవర్నర్ రాజీనామా తిరస్కరించడంతో సీఎం జరిపే సమీక్షకు జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో సచివాలయంలో సమీక్షించనున్నారు. గ్రూప్-2 పోటీ పరీక్షలు, గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ,గ్రూప్-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల విషయంలో..
జనార్దన్‌రెడ్డి డిసెంబర్ 11వ తేదీన (సోమవారం) సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను అందజేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల విషయంలో టీఎస్‌పీఎస్సీ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచింది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియలన్నీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్లింది. 2021 మే 21వ తేదీన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బాధ్యతలు జనార్ధన్‌రెడ్డి స్వీకరించారు. ఆ తర్వాత నూతన జోనల్ విధానం అమలు నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం జరిగింది.
దాదాపు 30 వేల ఉద్యోగాలకు నెలల వ్యవధిలోనే..
అయితే గతేడాది ఏప్రిల్ నుంచి క్రమంగా ఆ ప్రక్రియ ఊపందుకుంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో 503 ఉద్యోగాలతో గ్రూప్–1 నియామకాల ప్రకటన జారీ చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరుసగా దాదాపు 30 వేల ఉద్యోగాలకు నెలల వ్యవధిలోనే ప్రకటలు జారీ చేస్తూ వచ్చింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పూనుకోవడంతో ఇంటిదొంగలు తయారయ్యారు. గ్రూప్–1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరపతి ఒక్కసారిగా దిగజారింది. పోలీసుల కేసులు, పలువురు ఉద్యోగులు జైలుపాలు కావడం, అప్పటికే నిర్వహించిన పరీక్షల రద్దు తదితరాలన్నీ కమిషన్ స్థాయిని పూర్తిగా దిగజార్చాయి. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ను, సభ్యులను మార్చాలంటూ నిరుద్యోగులు ఒత్తిడి తెచ్చారు. క్రమంగా పరిస్థితులు కాస్త సద్దుమణగడం, పరీక్షల పునర్ నిర్వహణ తేదీలు ప్రకటించడంతో నిరుద్యోగులు సన్నద్ధతపై దృష్టి పెట్టారు.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అత్యంత నిజాయితీ గల అధికారిగా..
జనార్ధన్‌రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో గ్రూప్–1 అధికారిగా నియమితులయ్యారు. 1996లో కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలన, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, వ్యవసాయ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. వాటర్ బోర్డు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సేవలందించారు. అత్యంత నిజాయితీ గల అధికారిగా పేరుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఆయన్ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డులో ప్రస్తుతం ఐదురుగు సభ్యులున్నారు. వారు కూడా ఒకట్రెండు రోజుల్లో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.