Inspirational Story : ఎన్నో అవమానాలు.. మరో వైపు పేదరికంతో పోరాటం.. ఇవేవి లెక్కచేయకుండా.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ..
ఒక వైపు పేదరికం.. మరోవైపు విమర్శలతో కూడిన అవమానాలు. ఇలా ఎన్నో వచ్చిన అతను మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తల్లిదండ్రులను పేదరికం నుంచి విముక్తి చేయాలకున్నాడు. కలలను సాకారం చేసుకోవడానికి ఏడేళ్లు నిర్విరామంగా శ్రమించాడు. ఆ ఫలితమే ప్రభుత్వ ఉద్యోగాలు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో భరత్ సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
భరత్.. తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన వారు. వీరి తల్లిదండ్రులు సాధారణ వ్యవసాయ కూలీలు. తల్లి సుజాత. తండ్రి రవి.
ఎడ్యుకేషన్ :
పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన భరత్. తర్వాత వరంగల్ గవర్నమెంటు పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అలాగే వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్ స్ట్రక్చరల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
కొన్ని సందర్భాల్లో పేదరికంతో..
కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చని నిరూపించాడు భాషిపాక భరత్. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన ఈ రోజుల్లో ఐదు ఉద్యోగాలు సాధించాడు భరత్. సాధారణ వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టి కలలు సాకారం చేసుకోవాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పట్టుదల, నిరంతర సాధనతో వాటన్నింటిని అధిగమించిన కొన్ని సందర్భాల్లో పేదరికం అత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అవేమీ లెక్కచేయకుండా విజయం సాధించాడు భరత్.
తాము పడుతున్న కష్టం నువ్వు పడకూడదని..
అంతటితో ఆగకుండా అంబేడ్కర్ ఓపెన్ యూనవర్సిటీ నుంచి బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కూడా పూర్తి చేశాడు. తాము పడుతున్న కష్టం నువ్వు పడకూడదని బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులు మాటలను ఛాలెంజ్ తీసుకున్నాడు భారత్. వారి కలను సాకారం చేయాలని హైదరాబాద్ వెళ్లి పోటీ పరీక్షలకు ఏడేళ్లు సన్నద్ధం అయ్యాడు.
విమర్శలను ఆశీర్వాదంగా..
కొన్నిపోటీ పరీక్షలలో ఒకటి.., రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలు పోగొట్టుకున్న సందర్భాలు లేక పోలేదు. ఉద్యోగాలు వచ్చినట్టే వచ్చి చేజరిపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా భరత్ తన లక్ష్యాన్ని వదలలేదు. విమర్శలను ఆశీర్వాదంగా తీసుకున్న భరత్ ప్రిపరేషను మరింత ప్రణాళిక బద్ధంగా రూపొందించుకున్నారు. ఇంకేముంది ఒకటి కాదు రెండు కాదు ఐదు ఉద్యోగాలు సాధించి విమర్శించిన నోటితోనే శభాష్ అనిపించుకున్నాడు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో..
ఇటీవల ప్రకటించిన టీఎస్పీఎస్సీ జీఆర్ఎల్ (జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకారం ఐదు ఉద్యోగాలు వస్తున్నాయని అని నిర్ధారించుకున్న భరత్.. ప్రస్తుతం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో చేరిన భరత్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెలువడిన నోటిఫికేషన్లకు భరత్ దరఖాస్తు చేసుకున్నారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు పోటీ పరీక్షలకు హాజరవుతూ వచ్చారు. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడడంతో నాలుగు ఉద్యోగాలు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, గ్రూప్-4 ఉద్యోగాలు వస్తాయని భరత్ తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో కలిపి ఐదు ఉద్యోగాలు సాధించారు భరత్.
బుక్స్ కోసం, ఫీజుల కోసం..
తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఉద్యోగాలు సాధించానని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను ఎదుటి వారితో పోల్చవద్దని భరత్ అన్నారు. గంటల తరబడి చదవకుండా స్మార్ట్‌గా చదివానని భరత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను సొంతంగా ప్రిపేర్ అయ్యానని కోచింగ్‌లకు వెళ్ళలేదని అన్నారు. బుక్స్ కోసం, ఫీజుల కోసం తల్లిదండ్రులతో పాటు స్నేహితులు ఆర్థిక సహాయం చేశారని భరత్ చెప్పారు.