Group 1 Preliminary Exam: 60 డేస్‌ ప్రిలిమ్స్‌ ప్లాన్‌.. సిలబస్‌, సబ్జెక్ట్‌ అంశాలు..

group 1 exam preparation Strategy Syllabus topics and Subject‌

తెలంగాణలో.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ జూలై లేదా ఆగస్ట్‌లో ఉంటుందని.. నోటిఫికేషన్‌లో వెల్లడించింది సర్వీస్‌ కమిషన్‌! మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ మరికొద్ది రోజుల్లోనే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ దిశగా చర్యలు చేపడుతున్న అధికార వర్గాలు. దీంతో.. గ్రూప్‌–1పై గురి పెట్టి.. లక్ష్యం సాధించాలనుకునే అభ్యర్థులు.. వైవిధ్యమైన వ్యూహాలతో ప్రిపరేషన్‌ సాగించాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ సిలబస్‌ అంశాలు, సబ్జెక్ట్‌లకు అనుగుణంగా వెయిటేజీ అంచనా వేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించడమెలాగో తెలుసుకుందాం...

  • జూలై లేదా ఆగస్ట్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌
  • రెండు నెలల సమయంలో సన్నద్ధత పొందే అవకాశం 
  • ప్రతి సబ్జెక్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చి ప్రిపరేషన్‌ సాగించాలి
  • సబ్జెక్ట్‌ వారీగా ప్రత్యేక విధానంతో సత్ఫలితం

తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడితే.. పోస్ట్‌ల సంఖ్యతో నిమిత్తం లేకుండా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్‌ విషయంలోనూ తీవ్రంగా శ్రమిస్తుంటారు. అభ్యర్థుల విజయ సాధన దిశగా..ప్రిపరేషన్‌ పరంగా అనుసరించే వినూత్న వ్యూహాలే వారిని గ్రూప్స్‌ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తాయి. కాబట్టి అభ్యర్థులు లక్ష్యం నిర్దేశించుకోవడమే కాకుండా.. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వినూత్నంగా, వైవిధ్యభరితంగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సబ్జెక్ట్, టాపిక్‌ వారీగా వెయిటేజీ అంచనా

  • గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు ముందుగా సిలబస్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లు, టాపిక్‌ల వారీగా ప్రశ్నల సంఖ్య వెయిటేజీపై అవగాహన పెంచుకోవాలి.
  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ పేరుతో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 13 అంశాలను సిలబస్‌లో పేర్కొన్నారు. ఈ టాపిక్స్‌ అన్నీ కూడా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్నవే. కాబట్టి ఒక్కో అంశం నుంచి 10 నుంచి 15 వరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1లో.. ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్‌ పరీక్ష పేరుతో రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. ఇందులో పేపర్‌–1 నాలుగు సబ్జెక్ట్‌ల నుంచి(హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ)120 ప్రశ్నలు, అదే విధంగా పేపర్‌–2లో రెండు విభాగాలుగా మూడు అంశాల నుంచి(మొదటి విభాగంలో జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ అండ్‌ సైకలాజికల్‌ ఎబిలిటీస్‌; రెండో విభాగంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌) 120 ప్రశ్నలు అడుగుతున్నారు.
  • పేపర్‌–1లో నాలుగు సబ్జెక్ట్‌ల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులు; పేపర్‌–2లో పార్ట్‌–ఏ నుంచి 60 ప్రశ్నలు, పార్ట్‌–బీ నుంచి 60 ప్రశ్నలు చొప్పున అడుగుతారని స్పష్టం చేశారు.
  • ఈ సమాచారం ఆధారంగా అభ్యర్థులు ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన పొందాలి.

టాపిక్‌ వారీగా.. అడుగులు ఇలా

ఆయా అంశాలకు సంబంధించి వెయిటేజీపై అవగాహన పొందిన తర్వాత.. అభ్యర్థులు టాపిక్‌ వారీగా ప్రత్యేక వ్యూహంతో ప్రిపరేషన్‌ సాగించాలి. ఆయా అంశాలపై పట్టు సాధించడమే కాకుండా.. వాటిని సమకాలీన పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ సాగాలి. అందుకోసం సబ్జెక్ట్‌/టాపిక్‌ వారీగా అనుసరించాల్సిన వ్యూహం...

Latest Current Affairs

కరెంట్‌ అఫైర్స్, జీకే

ఈ విభాగం నుంచి 12 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని అంచనా. కోర్, కాంటెంపరీ అంశాల కలయికగానూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీనికి విస్తృత అధ్యయనం అవసరం. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో.. పరీక్షకు ముందు çసంవత్సర కాలంలో జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా.. సమావేశాలు, సదస్సులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిఫెన్స్, అవార్డులు, స్పోర్ట్స్‌ వంటివి. అంశాల వారీగా ప్రిపరేషన్‌ సాగించటం మంచిది. అదే విధంగా ఒక ఇంగ్లిష్, తెలుగు దినçపత్రికతోపాటు ప్రముఖ కాంపిటీటివ్‌ మ్యాగజైన్‌ను తప్పనిసరిగా అనుసరించాలి. టెక్ట్స్‌బుక్‌ చదివినట్లుగా కాకుండా.. రెగ్యులర్‌గా కరెంట్‌ అఫైర్స్‌ అంశాలను ఏరోజుకారోజు చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్‌ సాగిస్తూనే.. ఆయా అంశాలపై రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. ఫలితంగా మలి దశలో మెయిన్స్‌ పరీక్ష సమయంలో కొంత వేగంగా ప్రిపరేషన్‌ పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.

​​​​​​​History Study Material

హిస్టరీ

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ.. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో కీలక సబ్జెక్ట్‌గా హిస్టరీని పేర్కొనొచ్చు. ఇందులో భారతదేశ చరిత్రతోపాటు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విభాగం నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. దీంతో.. అభ్యర్థులు హిస్టరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా సంబంధిత రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, కళలు, సాహిత్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

Polity Study Material

పాలిటీ

గ్రూప్‌–1లో కీలకమైన మరో విభాగం.. పాలిటీ. ఈ విభాగంలోనూ కోర్, సమకాలీన అంశాల కలయికతో 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు భారతీయ రాజకీయ వ్యవస్థకు సంబంధించి.. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు,రాజ్యాంగ లక్షణాలు, రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి–గవర్నరు వ్యవస్థలు, మంత్రి మండలి, రాష్ట్రపతి, గవర్నర్‌ ఎన్నికల విధానం–అధికారాలు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ ఏర్పాటు–అధికారాలు, సుప్రీం కోర్టు, హైకోర్టులు, న్యాయశాఖ–శాసనశాఖ, న్యాయ –కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం–వివాదాలు, గ్రామీణ పట్టణ స్థానిక స్వపరిపాలన వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే ప్రిలిమ్స్‌లో పాలిటీలో సంఘటనలు, తేదీలకు కూడా ప్రాధ్యాం ఇవ్వాలి. 

Economy Study Material

ఎకానమీ

ఇటీవల కాలంలో ఎంతో కీలకంగా మారుతున్న విభాగంగా ఎకానమీని పేర్కొనొచ్చు. ఈ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ–లక్షణాలు, జాతీయాదాయం, పంచవర్ష ప్రణాళికలు, పేదరికం–నిరుద్యోగం, వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు, పారిశ్రామికాభివృద్ధి, సేవారంగ వృద్ధి అంశాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా తాజా ఆర్థిక విధానాలు–పారిశ్రామిక తీర్మానాలు, బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ద్రవ్యోల్బణం, వ్యవసాయ రంగం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్‌ల గురించి సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. అదే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు.. సంబంధిత రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి– ఉత్పాదకత, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న తాజా ఆర్థిక విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ పరపతి,సేవారంగ ప్రాధాన్యం, ప్రాంతీయ అసమానతలు అంశాలపై శ్రద్ధ వహించాలి.

Geography Study Material

జాగ్రఫీ

ఈ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అంచనా వేయొచ్చు. ఇండియన్‌ జాగ్రఫీతోపాటు రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రంలో, దేశంలో భౌగోళిక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ విభాగంలో సమకాలీన అంశాల కలయికగా ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంది. సౌరకుటుంబం, వ్యవసాయం, పంటలు, వ్యవసాయ సమస్యలు, ప్రాంతీయ స్థాయిలో అమలవుతున్న కొత్త పథకాలు లేదా కొత్త ప్రాజెక్ట్‌లు, వాటి ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అదే విధంగా పర్యావరణ సమస్యలు, పర్యావరణ నిర్వచనం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఒప్పందాల గురించి తెలుసుకోవాలి. అట్లాస్‌పై సమగ్ర అవగాహన తప్పనిసరి. ఫలితంగా ముఖ్యమైన ప్రదేశాల గురించి అడిగే ప్రశ్నలకు సమాధానం సులువుగా గుర్తించవచ్చు. ప్రిపరేషన్‌ సమయంలో ఆయా అంశాలను సమకాలీన పరిణామాలతో బేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా జాగ్రఫీని ఎకానమీతో అనుసంధానం చేసుకోవాలి. వ్యవసాయ, రవాణ సంబంధిత అంశాల విషయంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

Science & Technology Study Material

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ఈ విభాగం నుంచి సుమారు 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటికి సరైన సమాధానాలు ఇవ్వాలంటే.. పదో తరగతి స్థాయిలోని ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్‌ అంశాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఇందులోనూ ఎక్కువగా సమకాలీన అంశాల కలయికగా ప్రశ్నలు అడిగే విధానం పెరిగింది. దీంతో ఈ దృక్పథాన్ని కూడా అలవర్చుకోవాలి. ఇక కోర్‌ అంశాలకు సంబంధించి ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్,యాంత్రిక శాస్త్రం, ఉష్ణం, ద్రవ పదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతికశాస్త్రం వంటి అంశాలు; భారత్‌లో అణుశక్తి, అంతరిక్ష విజ్ఞానం– ఇస్రో, క్షిపణులు–రక్షణ రంగంలో ఉపయోగించే వివిధ ఆయుధ వ్యవస్థలు, సమాచార–సాంకేతిక రంగం, కంప్యూటర్లు, ఇంధన వనరులు, కాలుష్యం, నానో–టెక్నాలజీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

ఈ విభాగానికి కూడా ప్రిలిమ్స్‌లో తగినంత ప్రాధాన్యం ఉంటోంది. కనీసం పది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ విభాగంలో రాణించాలంటే.. నంబర్‌ సిరీస్, రీజనింగ్, కోడింగ్‌ అండ్‌ డీ కోడింగ్, ఇన్ఫరెన్సెస్, సగటు, శాతాలు, నిష్పత్తి, గడియారాలు, క్యాలెండర్, అరేంజ్‌మెంట్స్, పెర్ముటేషన్స్, కాంబినేషన్స్, నంబర్‌ సిస్టమ్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం టేబుల్స్, బార్‌ డయా గ్రామ్స్, పై డయాగ్రామ్స్, గ్రాఫ్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, ప్రైమ్‌ నెంబర్స్, నంబర్‌ అనాలజీ క్లాసిఫికేషన్‌లపై పట్టు సాధించాలి. అర్థమెటిక్‌కు సంబంధించి కాలం–దూరం, కాలం–పని; లాభం–నష్టం; భాగస్వామ్యం; సాధారణ వడ్డీ; చక్రవడ్డీ; నిష్పత్తి–అనుపాతం; శాతాలు; కసాగు; గసాభా వంటి వాటిని ప్రాక్టీస్‌ చేయడం కూడా ఎంతో మేలు చేస్తుంది. 

  • ఇలా ప్రతి టాపిక్‌కు సంబంధించి వెయిటేజీకి అనుగుణంగా ముఖ్యమైన అంశాలను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించడం ద్వారా ప్రిలిమ్స్‌లో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌1 ప్రత్యేక వ్యూహాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రిలిమ్స్‌ పరీక్షను జూలై లేదా ఆగస్ట్‌లో నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. అంటే... జూలై రెండో వారంలో పరీక్ష జరుగుతుందని భావించి ప్రిపరేషన్‌ సాగిస్తే.. దాదాపు 60 రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉందని చెప్పొచ్చు.

Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుపై ప్రత్యేకంగా

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు హాజరవుతున్న అభ్యర్థులు ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంపై ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మేలు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలు ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీæ ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. తొలితరం తెలంగాణ ఉద్యమం నుంచి అన్నీ చదవాలి. 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

టీఎస్‌ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇలా

  • తెలంగాణ ప్రాధాన్యత సబ్జెక్ట్‌ల విషయంలో ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా ఉన్న అంశాల విషయంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు.. 
  • చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. 
  • జాగ్రఫీ విషయంలో.. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు;ముఖ్యమైనపంట లు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం. 
  • ఎకానమీ విషయంలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు–ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన ఏర్పరచుకోవాలి. 

TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ ఇదే..

ప్రస్తుత సమయంలో ఇలా

  • ఇప్పుడే కొత్తగా ప్రిపరేషన్‌ ప్రారంభించిన అభ్యర్థులు.. కాన్సెప్ట్‌ బేస్డ్‌గా చదవాలి. ముందుగా తమకు పట్టున్న అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. అందులో మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేయాలి. 
  • ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక అవగాహన కోసం హైస్కూల్‌ స్థాయి పాఠ్య పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, డిగ్రీ స్థాయిలోని అకాడమీ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. వాటిలోని ముఖ్యాంశాలు, ప్రాథమికాంశాలు, భావనలపై పట్టు పెంచుకోవాలి. 
  • ప్రతి సబ్జెక్ట్‌లోని టాపిక్స్‌ను కాన్సెప్ట్యువల్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. 
  • బేసిక్స్‌పై అవగాహన పొందుతూనే.. సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. 
  • ప్రతి సబ్జెక్ట్‌కు ప్రతిరోజు కనీసం రెండు గంటలు కేటాయించేలా సమయ పాలన అనుసరించాలి. 
  • ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివే విధంగా చూసుకోవాలి. 
  • ప్రిలిమ్స్‌ అభ్యసనం సమయంలోనే డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదవడం అలవర్చుకోవాలి. ఫలితంగా మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ కొంత సులభం అవుతుంది. 
  • ఇలా ప్రతి దశలోనూ నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. జూలై లేదా ఆగస్ట్‌.. పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనే సన్నద్ధత సొంతం చేసుకోవచ్చు.

స్పష్టతతో అడుగులు వేస్తే.. సత్ఫలితం

గ్రూప్స్‌ అభ్యర్థులు పోటీని చూసి ఆందోళన చెందకుండా..తమకంటూ.. స్వీయ స్పష్టతతో అడుగులు వేస్తే సత్ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ప్రశ్నల శైలి,ఆయా టాపిక్స్‌కు ఉన్న వెయిటేజీపై అవగాహనతో సగం స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా ప్రిపరేషన్‌ పరంగా సబ్జెక్ట్‌ వారీగా నిర్దిష్ట సమయ పాలన అనుసరించాలి. అదే విధంగా రైటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా చేయాలి. ఇది తదుపరి దశలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా అంశాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్లను నోట్స్‌ రాసుకోవాలి. ఆయా టాపిక్స్‌ను కోర్, కాంటెంపరరీ అప్రోచ్‌తో చదవడం వల్ల వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
–కె.నిఖిల, గ్రూప్‌–1 గత విజేత (వికారాబాద్‌ కలెక్టర్‌)


టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags