SI Exam Results: వారంలోగా SI పరీక్షల ఫలితాలు?.. వివిధ విభాగాల్లో పోస్టులు ఇవీ...

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
వారంలోగా SI పరీక్షల ఫలితాలు?.. వివిధ విభాగాల్లో పోస్టులు ఇవీ...

ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో తుదిజాబితా ప్రకటించడమే మిగిలి ఉంది. పోలీస్‌ కొలువుల భర్తీ ప్రక్రియలో భాగంగా తొలుత సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి సన్నద్ధమవుతోంది. వారంరోజుల్లోనే ఎస్సై తుదిఎంపిక జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు కలిపి మొత్తం 97,175 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజ రయ్యారు.

చదవండి: High Court: డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే ఫలితాలు వెల్లడించండి

ఈ ప్రక్రియ సైతం గత నెల 26వ తేదీనే పూర్తి చేసినట్టు బోర్డు అధికారులు ప్రకటించారు. ఆయా రిజర్వేషన్‌ కేటగిరీ, రోస్టర్‌ పాయింట్లు, మల్టీ జోన్లు... ఇలా మొత్తం 180 అంశాలను పరిగణన లోకి తీసుకుని ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితా విడుదల చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా న్యాయపరమైన చిక్కులతో మొత్తం ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదముండటంతో బోర్డు ఉన్నతాధికారులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

చదవండి: TS SI and Constable Final Results 2023 : ఎస్సై, కానిస్టేబుల్ తుది ఎంపిక‌ ఫలితాలు విడుద‌ల‌.. ఎప్పుడంటే..? కటాఫ్‌ మార్కులు మాత్రం..

వివిధ విభాగాల్లో పోస్టులు ఇవీ...

పోలీస్‌ నియామక మండలి తొలుత విడుదల చేయ నున్న ఫలితాల్లో సివిల్‌ ఎస్సై పోస్టులు 414, ఏఆర్‌ రిజర్వ్‌ ఎస్సై 66, రిజర్వ్‌ ఎస్సై (ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌) 5, టీఎస్‌ఎస్పీ రిజర్వ్‌ ఎస్సై 23, ఎస్‌పీఎఫ్‌ ఎస్సై 12, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ 26, డిప్యూటీ జైలర్‌ ఎనిమిది, ఐటీ కమ్యూనికేషన్‌ ఎస్సై 22, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై పోస్టులు మూడు కలిపి మొత్తం 579 ఖాళీలు ఉన్నాయి. వీటన్నింటికీ వారం రోజుల్లో తుదిఎంపిక అభ్యర్థుల జాబితా విడుదల కానున్నట్టు సమాచారం.

ఎస్సై తుదిఎంపిక అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత వారి వ్యక్తిగత ప్రవర్తన, నేరచరిత్రపై వారి స్వస్థలాల్లోని పోలీస్‌స్టేషన్ల నుంచి వివరాలు సేకరించి పరిశీలించాల్సి ఉంటుంది. అన్నీ సరిగా ఉన్నవారికి ఉద్యోగ నియామకపత్రం అందుతుంది. వారినే శిక్షణకు పంపుతారు. ఎంక్వైరీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అన్ని సకాలంలో పూర్తి చేసి ఆగస్టు నుంచి ఎస్సైల శిక్షణ ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

#Tags