Old Students Meet: మళ్లీ.. కాలేజీ రోజుల్లోకి

నిర్మల్‌: వారంతా ఎప్పుడో పాతికేళ్ల క్రితం కలిసి ఇంటర్‌ చదువుకున్న మిత్రులు. ఆ తర్వాత ఉన్నతవిద్య, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు.. ఇలా ఎవరితోవలో వారు సాగిపోయారు.

సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మళ్లీ..ఆనాటి తమ కాలేజీ రోజుల్లోకి వెళ్లారు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీలో 1997–98లో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసుకున్న బ్యాచ్‌ పూర్వవిద్యార్థులు సరిగ్గా స్నేహితుల దినోత్సవమైన ఆగ‌స్టు 4న‌ స్థానిక మారుతీఇన్‌లో రజతోత్సవం నిర్వహించారు.

కార్యక్రమానికి ఎక్కడెక్కడో ఉంటున్న పాతమిత్రులంతా తరలివచ్చారు. ఇన్నేళ్లపాటు కలుసుకోని వారైతే.. అప్యాయంగా మాట్లాడుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన మిత్రులంతా కలిసి రోజంతా గడిపారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన అప్పటి ప్రిన్సిపాల్‌ సాయన్నతో సహా గురువులను సన్మానించుకున్నారు. కార్యక్రమ సమన్వయకర్తలు మునిగెల సాయిప్రసాద్‌, అరుణ్‌, శ్రీహరి, సబిత, సంధ్య మిగతా మిత్రులు ఏర్పాట్లు చూసుకున్నారు.

చదవండి: Alumni's Contribution : పాఠ‌శాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల చేయూత‌..

కలుసుకున్న పూర్వ విద్యార్థులు

మందమర్రిరూరల్‌: పట్టణంలోని శ్రీరాఘవేంద్ర హైస్కూల్‌లో 2001–02 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆగ‌స్టు 4న‌ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరూ కలిసి ఒకరినొకరు ఆప్యాయతతో పలుకరించుకుని అలింగనం చేసుకుని చిన్ననాటి /్ఞాపకాలు నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి పాదాభివందనం చేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి బోజనం చేశారు.

ఆత్మీయ సమ్మేళనం

పాతమంచిర్యాల: నస్పూర్‌ మున్సిపాలిటీలోని సరస్వతి శిశుమందిర్‌లో 2002–03 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆగ‌స్టు 4న‌ కలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి వారు హాజరయ్యారు.

ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. హెచ్‌ఎం ధూళిపాల కాశీ విశ్వనాథం, పూదరి సత్యనారాయణ, ఆచార్యులు పాల్గొన్నారు.
 

#Tags