Intermediate Classes: ‘ఇంటర్‌’ క్లాసులు చెప్పేదెవరు? వేధిస్తున్న ఫ్యాకల్టీ కొరత

సాక్షి,  హైదరాబాద్‌ : విద్యాసంవత్సరం మొదలైనా.. ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీల్లో బోధన సాగడం లేదు. అన్నిచోట్ల అధ్యాపకుల కొరత వేధిస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. 

ఏటా గెస్ట్‌ ఫ్యాకల్టీని తీసుకునేవారు. ఫలితంగా బోధన అనుకున్న మేర జరిగేది.ఈ సంవత్సరం గెస్ట్‌ ఫ్యాకల్టీపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అసలు తీసుకుంటారా? లేదా? అనేది కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు త్వరగా సిలబస్‌ పూర్తి చేయాలి. అప్పుడే వారు జేఈఈ, రాష్ట్ర ఈఏపీసెట్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వెసులు­బాటు ఉంటుంది. 

త్వరలో 1372 మంది కొత్త లెక్చరర్లు వస్తారని...
పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 1372 పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించారు. త్వరలో ఫలితాలు వెల్లడించే అవకాశముంది. ఇంటర్వ్యూ లేకపోవడంతో మెరిట్‌ ప్రకారమే నియామకాలుంటాయి. దీంతో గెస్ట్‌ లెక్చరర్ల అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే గెస్ట్‌ లెక్చరర్ల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.

AP DSC 2024 Updates : డీఎస్సీ-2024.. జిల్లాల్లోని 80% స్థానికులకే టీచ‌ర్ పోస్టులు..?

అయితే వీరి అవసరాన్ని తెలియజేస్తూ ఇంటర్‌ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సర్కార్‌ నుంచి స్పష్టత రాలేదు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాలు చేపట్టి, ఆర్డర్లు ఇచ్చే వరకూ ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి.

కొత్తగా వచ్చినవారు కాలేజీల్లో బోధన చేపట్టే వరకూ కొంత సమయం పడుతుందని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. అప్పటి వరకూ కాలం వృథా అవుతుందని, ప్రభుత్వ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్నారు.  

బోధన సాగేదెలా..?
నియామకాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. గెస్ట్‌ ఫ్యాకల్టీని తీసుకుంటారా? లేదా? స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల్లో బోధన కుంటుపడుతోంది. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుందని అధ్యాపక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో 418 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీఉన్నాయి. గత ఏడాది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్‌ చేశారు. వీరితో కలుపుకుంటే 3900 మంది శాశ్వత అధ్యాపకులున్నారు. 

మరో 72 మంది మినిమమ్‌ టైం స్కేల్‌తో పనిచేసే అధ్యాపకులున్నారు. ఇంకా 413 మందిని రెగ్యులర్‌ చేయాల్సి ఉంది. కొంతమంది రిటైర్‌ అయ్యారు. సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 1372 పోస్టుల నియామకం జరిగినా కనీసం 2 వేల మంది అధ్యాపకుల కొరత ఉంటుంది. ఏటా రాష్ట్రంలో 1654 మంది గెస్ట్‌ లెక్చరర్లను తీసుకుంటున్నారు. వీరి సర్వీస్‌ను ప్రతీ ఏటా సంవత్సరం పాటు పొడిగిస్తూ వస్తున్నారు.  వీరికి నెలకు రూ. 27 వేలు ఇస్తున్నారు. 

RGUKT Admissions-2024: ట్రిపుల్‌ ఐటీల్లో ఉన్నది 4వేల సీట్లు.. వచ్చిన దరఖాస్తులు 53,863


రెగ్యులర్‌ అధ్యాపకుల కన్నా ఎక్కువ క్లాసులే చెబుతున్నామనేది వారి వాదన. నిజానికి గడచిన ఐదేళ్లుగా ఒక్క సైన్స్‌ అధ్యాపకుడిని కూడా నియమించలేదు. మేథ్స్‌ లెక్చరర్ల కొరత ప్రతీ కాలేజీలోనూ ఉంది. రాష్ట్రంలో 12 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీస వసతులు కూడా లేవు. గదులు, బల్లాలు సమకూర్చలేదు. ఫ్యాకల్టీ అరకొరగా ఉంది. బదిలీలు చేపట్టకపోవడంతో కొత్తవారు వచ్చే అవకాశమే లేదు. ఇన్ని సమస్యల మధ్య గెస్ట్‌ లెక్చరర్లను తీసుకోకపోతే విద్యార్థులు నష్టపోతారని పలువురు అంటున్నారు. 

అవసరం ఉంటే తీసుకుంటాం 
అవసరం ఉంటే గెస్ట్‌ లెక్చరర్లను తీసుకుంటాం. ఎంతమేర అవసరం అనేది పరిశీలించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. వీలైనంత త్వరగా ఇంటర్‌ కాలేజీల్లో పూర్తిస్థాయిలో బోధన చేపట్టేందుకు ప్రయత్నిస్తాం.  
  –శ్రుతిఓజా, ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి

గెస్ట్‌ లెక్చరర్లు లేకుంటే కష్టమే 
ప్రభుత్వ కాలేజీల్లో పేద విద్యార్థులు చదువుతారు. అవసరమైన బోధకులు ఉంటే తప్ప వారికి నాణ్యమైన విద్య అందించలేం. కొత్త కాలేజీల్లో వసతులు లేవు. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల కొరత ఉంది. తక్షణమే గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమించి, సకాలంలో సిలబస్‌ పూర్తయ్యేలా చూడాలి.    
   –మాచర్ల రామకృష్ణగౌడ్‌  ప్రభుత్వ ఇంటర్‌ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి

#Tags