Group-4 Rankers Success Stories : ఇలాంటి పనులు చేస్తూనే.. గ్రూప్‌-4 ఉద్యోగం కొట్టామిలా.. కానీ..!

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన గ్రూప్‌-4 ఫ‌లితాల్లో ఎంతో మంది త‌మ ప్ర‌తిభ చాటి ఉద్యోగాల‌ను సాధించారు. ఈ నేప‌థ్యంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఉద్యోగానికి ఎంపికైన వారి స‌క్సెస్ స్టోరీలు మీకోసం...

గ్రూప్‌–1 మెయిన్స్‌ కూడా..
గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన గర్షకుర్తి విజయ–పర్శరాములు దంపతుల కుమారుడు నవీన్‌ గ్రూప్‌–4 ఫలితాల్లో సత్తా చాటాడు. నిజామాబాద్‌ మున్సిపల్‌ ఆఫీస్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. ఇతని తండ్రి నాయీబ్రాహ్మణ వృత్తిలో కొనసాగుతుండగా, సోదరుడు ప్రవీణ్‌ బోయినపల్లి మండల పరిషత్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. తాను గ్రూప్‌–1 మెయిన్స్‌ కూడా రాశానని నవీన్‌ తెలిపాడు. 

నాయీబ్రాహ్మణ వృత్తిని వృత్తి చేస్తూనే..
గన్నేరువరం మండల కేంద్రానికే చెందిన గర్షకుర్తి రవీందర్‌–సరోజన దంపతులకు కుమారుడు అరుణ్‌ సాయి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రవీందర్‌ నాయీబ్రాహ్మణ వృత్తిని వృత్తినే కొనసాగిస్తున్నారు. పిల్లల ఉన్నత చదువులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో అరుణ్‌సాయి బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమై, గ్రూప్‌–4 ఫలితాల్లో కరీంనగర్‌ మున్సిపల్‌ ఆఫీస్‌లో మున్సిపల్‌ వార్డు ఆఫీసర్‌ ఉద్యోగం సాధించాడు. ఇద్దరు చెల్లెళ్లు కూడా బీటెక్‌ చదువుతున్నారు.

➤☛ Success Story : అక్క‌.. త‌మ్ముడు.. అమ్మ ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..

అమ్మానాన్న కోరికను..
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లంకదాసరి నర్సయ్య–లక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలు. వీరి కుమారుడు శ్రీనివాస్‌ గ్రూప్‌–4 ఉద్యోగం సాధించాడు. తనను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్న అమ్మానాన్న కోరిక నెరవేర్చానని సంతోషంగా తెలిపాడు.

బేకరీలో పనిచేస్తూ..
కల్వచర్లకు చెందిన పందిళ్ల లక్ష్మి–శ్రీనివాస్‌ దంపతుల కుమారుడు శ్రీధర్‌ గ్రూప్‌–4 ఫలితాల్లో పెద్దపల్లి జిల్లాస్థాయిలో 176వ ర్యాంక్‌ పొంది, ఉద్యోగం సాధించాడు. ఇతను సెంటినరీ కాలనీలోని ఓ బేకరిలో పనిచేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఎలాంటి కోచింగ్‌ లేకుండానే..
బోయినపల్లి మండలంలోని బూగ్గుపల్లికి చెందిన అతికం భాగ్యవ్వ–చంద్రయ్య దంపతుల కుమారుడు సురేశ్‌ జ్యోతిబాపూలే గురుకులంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించాడు. చంద్రయ్య గీత కార్మికుడు. తాను ఎలాంటి కోచింగ్‌ లేకుండా కరీంనగర్‌ టైబ్రరీలో చదువుకొని, ఉద్యోగం సాధించినట్లు సరేశ్‌ తెలిపాడు.

ఈ పనులు చేస్తూ..
ఓదెల మండలంలోని గుంపులలో ఊరగొండ సదయ్య–సునీత దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి రెండో కూతరు అనూష వ్యవసాయ పనులు చేస్తూ చదువుకొని, గ్రూప్‌–4 ఉద్యోగం సాధించింది. ఆమె సోదరి అశ్విని పోస్టల్‌శాఖలో ఉద్యోగం చేస్తుండగా తమ్ముడు అరవింద్‌ డిగ్రీ చదువుతున్నాడు.

➤☛ TSPSC Group 4 Appointment Letters 2024 : గ్రూప్‌-4 అభ్యర్థులకు నియామక పత్రాలను ఇచ్చే తేదీ ఇదే..? కానీ...

మా కుటుంబంలో మొదటి మహిళను నేనే..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నాన్న ఆకాంక్షను నెరవేర్చాను. పోటీపరీక్షలకు రిపేర్‌ అయ్యే క్రమంలో ఎంతోమంది అవహేళన చేశారు. అయినా, అమ్మానాన్న భారతి–మల్లికార్జున్‌, మా పెద్ద బావ బలరాం, మా ఆయన భాను ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. మా కుటుంబంలో ఉద్యోగం సాధించిన మొదటి మహిళను నేనే.

మా కుటుంబంకు ఆధారం ఇదే..
గంభీరావుపేట మండలంలోని శ్రీగాధ గ్రామానికి చెందిన వేముల భరత్‌గౌడ్‌, మండల కేంద్రానికి చెందిన యాడారపు మధు గ్రూప్‌–4 కొలువులు కొట్టారు. భరత్‌గౌడ్‌ తల్లిదండ్రులు నారాగౌడ్‌–రాజమణి. వ్యవసాయం, గీత వృత్తి వీరి కుటుంబానికి ఆధారం. మధు తండ్రి దేవయ్య. వీరిది వ్యవసాయ కుటుంబం.

ఈ పట్టుదలతోనే..
పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన పడాల కొమురయ్యది వ్యవసాయ కుటుంబం. పెద్దపల్లిలో వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నాడు. ఆయన కూతురు సౌమ్య జిల్లా ట్రెజరీ శాఖలో ఉద్యోగం సాధించింది. తాను గ్రూప్‌–1 ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నానని తెలిపింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

మాది వ్యవసాయ కుటుంబం...
వీర్నపల్లి మండలంలోని బాబాయిచెరువు తండాకు చెందిన అజ్మీరా పంగవ్వ–తార్యాల దంపతుల చిన్న కుమారుడు లింగం జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించాడు. ఇదే తండాకు చెందిన బానోత్‌ కిషన్‌–జయ దంపతుల కుమారుడు సురేశ్‌ వార్డు ఆఫీసర్‌ ఉద్యోగం పొందాడు. ఇరువురివీ వ్యవసాయ కుటుంబాలే.

వ్యవసాయం చేస్తూ తనను..
సారంగాపూర్‌ మండలంలోని మ్యాడారం తండా నుంచి భూక్య విక్రమ్‌ గ్రూప్‌–4లో వార్డు ఆఫీసర్‌ పోస్టుకు ఎంపికయ్యాడు. తల్లి విజయ, తండ్రి రమేశ్‌ వ్యవసాయం చేస్తూ తనను చదివించారని, వారి ప్రోత్సాహం వల్లే ఉద్యోగం సాధించానని తెలిపాడు.

ఇంటి వద్దే తండ్రికి వ్యవసాయంలో..
దొంగతుర్తి గ్రామానికి చెందిన అల్వాల తిరుపతి కుమారుడు కమలాకర్‌ 2020లో బీటెక్‌ పూర్తి చేశాడు. ఇంటి వద్దే తండ్రికి వ్యవసాయంలో సహయం చేస్తూనే గ్రూప్‌ 4కు ప్రిపేర్‌ అయ్యి ఉద్యోగం సాధించాడు.

మా కుటుంబంలో ఇద్దరికి ఒకేసారి...
దొంగతుర్తికి చెందిన పిల్లలమర్రి తిరుపతి కుమారులు వినోద్‌, అరవింద్‌ గ్రూప్‌–4 ఉద్యోగాలు సాధించారు. తాను కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైనా వెళ్లకుండా చదివినట్లు వినోద్‌ తెలిపాడు. బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి తాను హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకున్నట్లు అరవింద్‌ పేర్కొన్నాడు. తండ్రి వ్యవసాయం చేస్తూ తమను చదివించాడని తెలిపాడు. సోదరులిద్దరం ఒకేసారి ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నాడు.

కూలీ పనులు చేస్తూనే..
పెగడపల్లిలో మండల కేంద్రానికి చెందిన తాటిపాముల బాలయ్య–శోభ దంపతుల కుమారుడు లక్ష్మణ్‌. శోభ బీడీలు చుడుతూ బాలయ్య కూలీ పనులు చేస్తుంటాడు. లక్ష్మణ్‌ 6 నెలల క్రితం సింగరేణి ఉద్యోగం సాధించాడు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. నామాపూర్‌కు చెందిన ఆరెల్లి పోచయ్య–సరిత దంపతులు కరీంనగర్‌లో నివాసం ఉంటూ చిన్న కిరాణ దుకాణం నడిపిస్తున్నారు. వీరి కుమారుడు విజ్ఞాన్‌ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివాడు. అది ఫలించడంతో అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మా అమ్మ‌ అంగన్‌వాడీ టీచర్‌గా...
ధర్మపురి చెందిన ఆకుల దినేశ్‌, దమ్మన్నపేటకు చెందిన మైదం ప్రశాంత్‌, ముత్యాల శేఖర్‌ గ్రూప్‌–4 ఉద్యోగాలు సాధించారు. దినేశ్‌ తండ్రి రాజనర్సు వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి లక్ష్మి అంగన్‌వాడీ టీచర్‌. ప్రశాంత్‌ తల్లిదండ్రులు విజయ–వీరేశం, శేఖర్‌ తల్లిదండ్రులు పోశవ్వ–సత్తయ్య వ్యవసాయం చేస్తుంటారు.

ట్యూషన్స్‌ చెబుతూ...
చొప్పదండి పట్టణానికి చెందిన బొడిగె వెంకటేశ్‌ సిద్దిపేట జిల్లాలోని రెసిడెన్షియల్‌ స్కూల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు బొడిగె మల్లవ్వ–లచ్చయ్య. గీత వృత్తితో పాటు వ్యవసాయం ఈ కుటుంబానికి ఆధారం. సాయంత్రం ట్యూషన్స్‌ చెబుతూ, అమ్మానాన్నకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూ చదివానని వెంకటేశ్‌ తెలిపాడు.

గ్రూప్‌–1 ఉద్యోగం సాధించడమే తన లక్ష్యం..
అనంతగిరికి చెందిన గొట్టిపర్తి రాకేశ్‌ ఎక్సైజ్ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. తండ్రి యాదగిరి వ్యవసాయం చేస్తూ గ్రామంలో మోటార్‌ వైండింగ్‌ పనులు చేస్తుంటాడు. రాకేశ్‌ 2015 నుంచి 2020 వరకు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కోచింగ్‌ తీసుకొని, హైదరాబాద్‌ లీగ్స్‌కు ఆడాడు. గ్రూప్‌–1 ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు.

గ్రూప్‌–4 ఉద్యోగం సాధించిన వారు వీరే...

 

 

 

 

 

ఓ సినిమా థియేటర్‌లో..
జమ్మికుంట పట్టణానికి చెందిన ఆరువూరి రాహుల్‌రాజ్‌ మంచిర్యాల జిల్లాలో మిషన్‌ భగీరథ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించాడు. తండ్రి శ్రీనివాస్‌రాజ్‌ ఓ సినిమా థియేటర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రాహుల్‌రాజ్‌కు తల్లి సుజాత, ఒక సోదరుడు, సోదరి ఉన్నారు.

భర్త ప్రోత్సాహంతోనే..
పొరండ్లకు చెందిన పొన్నాల పద్మ బీటెక్‌ పూర్తి చేసి, పలు పోటీ పరీక్షలకు సిద్ధమైంది. తాజాగా గ్రూప్‌–4 ఉద్యోగం సాధించింది. భర్త శంకర్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. భర్త ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించానని పద్మ తెలిపింది. పొరండ్లకు చెందిన పాలమాకుల మల్లారెడ్డిది వ్యవసాయ కుటుంబం. బీటెక్‌ పూర్తి చేశారు. ఇటీవలే గ్రూ ప్‌–1 మెయిన్స్‌ రాశాడు. ఇప్పుడు గ్రూప్‌–4 ఉద్యోగం సాధించాడు. తల్లి లక్ష్మి మృతిచెందగా తండ్రి చిన్న గంగారెడ్డి ఉన్నారు.

#Tags