AP Grama/Ward Volunteers Demands 2024 : వలంటీర్లుకు.. రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే.. ఇంకా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీటీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని.., వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు బహిరంగ సభలలో చెప్పడంతో పాటు.. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే.., ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను.. 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి వారే క్షేత్రస్థాయిలో సమర్థంగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మొదటిసారి ఇచ్చిన‌ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను దూరంగా పెట్టి, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నిర్వహించారు. 

వలంటీర్లకు జూన్‌ నెల గౌరవ వేతన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. జూలై 29వ తేదీన (సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వలంటీర్ల ప్రతినిధులు జిల్లా కలెకరేట్లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వినతిపత్రాలు సమర్పించారు. 

వలంటీర్లతో సంబంధం లేకుండానే..

ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పింఛన్ల పంపిణీ కూడా వలంటీర్లతో సంబంధం లేకుండా సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది వలంటీర్లు విధుల్లో కొనసాగుతుండగా.., వారిలో దాదాపు 75 శాతం మందికి జూన్‌ నెల గౌరవ వేతనం ఇప్పటి వరకూ కూడా అందలేదని వలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.10 వేలు వేతనం ఇవ్వాలి.. 

కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వలంటీర్లు జూలై 29వ తేదీన (సోమవారం) విశాఖ కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌ వలంటీర్లు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి సంపత్‌ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు.

#Tags