Inspirational story : గిరిజన బిడ్డ‌కి 23 ఏళ్ల‌కే.. సివిల్‌ జడ్జి ఉద్యోగం.. సీఎం స్టాలిన్, సినీ ప్రముఖులు అభినందనలు.. ఇంకా..

మ‌నలో సాధించాల‌నే క‌సి.. ప‌ట్టుద‌ల ఉంటే.. మ‌నం ఎక్క‌డ నుంచి వ‌చ్చాము అనేది ప్ర‌దానం కాదు.. ఎంత ఉన్న‌త స్థానంలో ఉన్నాము అనేది ముఖ్యం అని నిరూపించింది.. తమిళనాడులోని తిరుపట్టూరు జిల్లా ఎలగిరి హిల్స్‌కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి.శ్రీపతి.

ఈమె 23 ఏళ్లలోనే సివిల్‌ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు. నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో  గిరిజన మహిళా జడ్జి లేరు. ఈ నేప‌థ్యంలో  సివిల్‌ జడ్జి వి.శ్రీపతి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
తిరువణ్ణామలైలోని గిరిజన గూడెంలో కలియప్పన్‌ అనే మలయాళి రైతుకు తొలి కుమార్తెగా జన్మించింది శ్రీపతి. ఈమె పసి వ‌య‌స్సు నుంచే చురుగ్గా ఉండేది.

☛ Santosh Lakshmi: ‘నాడు సర్పంచ్‌.. నేడు న్యాయమూర్తి’.. జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన మ‌హిళ‌

ఎడ్యుకేష‌న్ : 

తిరువణ్ణామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు. వీళ్ల గూడెం నుంచి బస్సెక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి. అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పన్‌ అక్కడినుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యలగిరి హిల్స్‌ (తిరుపట్టూరు జిల్లా)కు మకాం మార్చాడు. ఇక్కడా కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్లుండే అత్తనాపూర్‌లో ఇంటర్‌ వరకూ చదివించే మిషనరీ స్కూల్‌ ఉంది. అక్కడే శ్రీపతి ఇంటర్‌ వరకూ చదువుకుంది. ఇప్పుడు చదివి ఏం చేయాలంటా అని తోటి తెగ వారు తండ్రిని, తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినా వాళ్లు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు. ఇంటర్‌ అయ్యాక లా చదవాలని నిశ్చయించుకుంది శ్రీపతి.

ఆరు నెలల క్రితం..  పచ్చి బాలింత అయి ఉండి..

తమిళనాడు తిరుపట్టూరు జిల్లాలోని యలగిరి హిల్స్‌ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది. నాలుగున్నర గంటల ప్రయాణం. లోపల ఉన్నది పచ్చి బాలింత. అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యి ఆడపిల్ల పుట్టింది. కాని మరుసటి రోజు చెన్నైలో ‘తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’(టి.ఎన్‌.పి.ఎస్‌.సి) ఎగ్జామ్‌ ఉంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె ‘సివిల్‌ జడ్జ్‌’  అర్హత సాధిస్తుంది. అందుకే ప్రయాణం చేస్తోంది. ఆమె పేరు వి. శ్రీపతి. వయసు 23. ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేశన్, తండ్రి కలియప్పన్‌. 

కొండ ప్రాంతంలో  పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బతుకుతున్న ‘మలయలి’ తెగలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం. లా చేయడం ఇంకా విశేషం. సివిల్‌ జడ్జి కావడం అంటే చరిత్రే.

☛ IAS Success Story : మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ 2వ‌ ర్యాంక్ కొట్టా.. క‌లెక్ట‌ర్ అయ్యా.. కానీ నా భ‌ర్త..

నా ల‌క్ష్యం ఇదే..
మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మావాళ్లకు తెలియదు. వారిని చైతన్యవంతం చేయాలి. వారి హక్కులు వారు పొందేలా చేయాలి. అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను. ఈమెకు ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లాకోర్సులో చేరింది. 

పరీక్ష రాసే సమయానికి..
చదువు సాగుతుండగానే అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేసే వెంకటేశన్‌తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్‌ జడ్జి పోస్ట్‌ కోసం టీఎన్‌పీఎస్సీ పరీక్ష రాసే సమయానికి నిండు చూలాలు. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది. ఇప్పుడు రిజల్ట్స్‌ వచ్చి సివిల్‌ జడ్జిగా పోస్ట్‌ వచ్చింది. 

ఈమెకు సీఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు..

ఈ సంగతిని ప్రస్తావిస్తూ తమిళనాడు సి.ఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియచేశారు. తమిళ మీడియంలో చదువుకున్నవారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా  ద్రవిడ మోడల్‌ను ప్రవేశ పెట్టడం వల్లే శ్రీపతి సివిల్‌జడ్జి కాగలిగిందని.. ఇలా మారుమూల  ప్రాంతాల వారికి అవకాశం దక్కాలని’ స్టాలిన్‌ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

☛ Success Story: ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్య‌ను విడిచిపెట్టిన భ‌ర్త‌.. ఆ ముగ్గురూ ‘సరస్వతులు’ అయ్యారు..

#Tags