Summer Holidays: వేసవి సెలవుల్లో జాగ్రత్త.. పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న నిపుణులు

టెక్కలి: వేసవి సెలవులు ప్రారంభమై ఇరవై రోజులు పూర్తయ్యాయి. చాలామంది చిన్నారులు తాతయ్య వారి ఊళ్లకు వెళ్లగా.. మరికొంత మంది ఇళ్ల వద్దే కాలక్షేపం చేస్తున్నారు. ఈ సమయంలో ఆడుకునేందుకు బయటకు వెళ్తున్న పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఇంటి పెద్దలు దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెరువులు, నదుల వద్దకు వెళ్లకుండా చూడాలని అంటున్నారు. కొత్తూరులో తన అమ్మమ్మ ఇంటికి వచ్చి సరదాగా సమీపంలో పారాపురం మినీ జలాశయానికి వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థి హరీష్‌ మృత్యువాత పడ్డాడు. పాత హిరమండలంలో తోటి స్నేహితులతో కలిసి వంశధార నది వద్దకు స్నానానికి వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థి బాల మాధురి మృత్యువాత పడింది..

ఇలా ఏటా వేసవి సెలవుల్లో ఎంతో మంది విద్యార్థులు ఏదో ఒక రూపంలో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటికి జరగకుండా పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎండల భారిన పడి అనారోగ్యానికి గురికాకుండా, ఇతర ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లలకు రామాయణ, మహాభారతం, ఇతిహాస కథలు, మెదడుకు పదును పెట్టే ఆటలతో ఈ వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలి.

పల్లెటూర్లు మేలు..
దేశ ప్రగతికి మూలాలు గ్రామీణ ప్రాంతాలు. వేసవి సెలవుల్లో పిల్లలను అమ్మమ్మ, నాయనమ్మ ఇంటికి పంపించేందుకు ప్రయత్నించండి. నగర కాలుష్యానికి దూరంగా పిల్లలు పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తే అనేక విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ పద్ధతులు ఆచార వ్యవహారాలు మన సంస్కృతి తెలిసే అవకాశం ఉంటుంది.

పిల్లలపై కోపం వద్దు..
వేసవి సెలవుల్లో పిల్లలు అల్లరి చేసే అవకాశం ఉంటుంది. దీంతో అదే పనిగా కోపం తెచ్చుకోవద్దు. వారికి అర్థమయ్యేలా చెప్పి చూడండి. వారిని ఏదైనా పనిలోబిజీగా ఉండేలా చూడండి. రోజులో కొద్ది సమయం పిల్లలకు కేటాయించి వారితో ముచ్చటించండి. వారికి నచ్చిన ఆహారం తయారు చేసి తినిపించండి. పిల్లలతో గార్డెనింగ్‌ చేయించడం ద్వారా అల్లరిని కట్టిపెట్టవచ్చు.

#Tags