NEET-UG Exam Row: తప్పు జరిగితే ఒప్పుకుని సరిదిద్దుకోండి.. NTA తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, సాక్షి:  NEET- 2024 పరీక్ష అవకతవకలపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాధ్యత గల సంస్థగా NTA పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తప్పు జరిగితే ఒప్పుకుని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

నీట్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా.. ‘‘నీట్‌పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగదు. పిల్లలు పరీక్షలకు సిద్ధం అయ్యారు. వాళ్ల కఠోర శ్రమను మనం వృథా చేయొద్దు. పరీక్షను నిర్వహించే సంస్థగా.. మీరు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తప్పు జరిగితే.. ‘అవును తప్పు జరిగింది’ అని చెప్పండి. అప్పుడు మేం చర్యలు తీసుకుంటాం. కనీసం ఇలాగైనా పని తీరు మెరుగుపడేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుందేమో’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Neet Ug Paper Leakage: నీట్‌ అవకతవకలపై ప్రత్యేక కమిటీని నియమించాలని కపిల్‌ సిబల్‌ డిమాండ్‌

.. అలాగే విద్యార్థుల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏదైనా తప్పిదం ఉంటే వెంటనే సరిచేయాలి. నీట్ పరీక్ష వ్యవహారంలో 0.001 శాతం నిర్లక్ష్యం వహించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలి’’ అని ఎన్టీయేకు సుప్రీం బెంచ్‌ సూచించింది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తో పాటు కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. 

మరోవైపు నీట్‌ వ్యవహారంలో ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే వేసిన పిటిషన్‌పైనా జూన్‌ 13వ తేదీన విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ.. కేంద్రం, ఎన్టీయేలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ తదుపరి విచారణను జులై 8వ తేదీకే వాయిదా వేసింది.

#Tags