Supreme Court: లోపాలను వెంటనే సరిచేయాలి: ఎన్టీఏకు సుప్రీం అక్షింతలు

న్యూఢిల్లీ: నీట్‌ యూజీ పరీక్ష విధానానికి సంబంధించిన లోపాలను (సరిదిద్దాలని) నివారించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆగ‌స్టు 2న‌ హెచ్చరించింది.

మున్ముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు కేంద్రంతోపాటు ఎన్టీఏను మందలించింది. ఈ మేరకు నీట్‌ యూజీ పేపర్‌లీక్‌పై దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఆగ‌స్టు 2న‌  తుది తీర్పు వెలువరించింది.

పేపర్‌ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని,  కేవలం పాట్నా, హజారీబాగ్‌కే పరిమితమని సుప్రీం వ్యాఖ్యానించింది. అందుకే నీట్‌ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసంన సమగ్ర తీర్పు వెల్లడించింది.

చదవండి: NEET UG Paper Leak: నీట్‌ పిటిషన్లపై సమగ్ర తీర్పు వెల్లడించిన కోర్టు.. సుప్రీం చేసిన సూచనలు..

నీట్‌ వంటి జాతీయ పరీక్షలో ఇలాంటి 'ఫ్లిప్ ఫ్లాప్స్'ను నివారించాలని, ఇవి విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్‌ యూజీ  పేపర్ లీక్‌పై​ ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను వెలువరిస్తూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది

పరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది. ఎన్టీఏ స్ట్రక్చరల్​ ప్రాసెస్​లోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని స్పష్టం పేర్కొంది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.

చదవండి: NEET UG 2024 Revised Results: ‘నీట్‌’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్‌!.. కటాఫ్‌ మార్కులు ఇలా

ఈసందర్భంగా ఎన్టీఏ పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను సెప్టెంబర్‌ 30 లోపు కోర్టుకు సమర్పించాలి. ఈ కమిటీ మొత్తం పరీక్ష ప్రక్రియను విశ్లేషించి, పరీక్ష విధానంలో లోపాలను సరిచేసి, ఎన్టీఏ మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమయ్యే మార్పులను సూచించాలి. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే విషయంపై కేంద్రం, విద్యాశాఖ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి.

  • అర్హత పరీక్షల నిర్వహణకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లేదా ప్రోటోకాల్‌ను రూపొందించడం,
  • పరీక్షా కేంద్రాల కేటాయింపు, మార్పు ప్రక్రియను సమీక్షించాలి.
  • అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి కఠినమైన విధానాలను సిఫార్సు చేయాలి.
  • అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి.
  • ట్యాంపరింగ్ ప్రూఫ్ ప్రశ్నపత్రాల కోసం యంత్రాంగాలను సమీక్షించాలి. సూచనలు ఇవ్వాలి.
  • పరీక్షా కేంద్రాల్లో క్రమం తప్పకుండా ఆడిట్లు, తనిఖీలు నిర్వహించాలి.

#Tags