CBI Takes Over NEET Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీకేజీలో మరో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన సీబీఐ

సాక్షి,ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్‌ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే నీట్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజా కేంద్రం ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. 

దీంతో నీట్‌పై వస్తున్న ఆరోపణలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. కాగా, బీహార్‌లో జరిగిన లీకేజీతో పాటు గ్రేస్‌ మార్క్‌లపై సీబీఐ దృష్టి సారించనుంది‌.

కేంద్రం నిర్ణయంతో 
నీట్‌ పరీక్ష లీకేజీపై కేంద్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. నీట్‌ పరీక్ష ప్రక్రియ, నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిఫార్సుల కోసం ఇస్రో మాజీ చైర్మన్‌ కే.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో పేపర్‌ లీకేజీపై దర్యాప్తు చేయాలంటూ కేంద్రం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. పేపర్‌ లీకేజీపై కేసు నమోదు చేసుకుంది.

NEET UG 2024: నీట్‌ యూజీ–2024 కౌన్సెలింగ్‌.. ఇలా!

720కి 720 మార్కులు
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌-యూజీ2024 ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. దేశ వ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నీట్‌ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా 67 మంది విద్యార్ధులకు 720కి 720  మార్కులు రావడం అనుమానాలు తెరపైకి వచ్చాయి.

విద్యార్ధుల్లో ఉత్కంఠ
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు నీట్‌ పేపర్‌ లీకేజీ జరిగినట్లు తేలింది. లీకేజీలో నిందితుల హస్తం ఆరా తీయగా.. బీహార్‌లో కేంద్రంగా నీట్‌ పేపర్‌ చేతులు మారాయని, పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వరుస పరిణామాలపై సీబీఐ కేసు నమోదు చేయడంతో నీట్‌ పరీక్ష లీకేజీ ఎటుకి దారి తీసుస్తుందోనని విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.

#Tags