Ts Dsc 2024 For Disabled Students: తొలిసారి డీఎస్సీలో.. దివ్యాంగ విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల నియామకం

మోర్తాడ్‌(బాల్కొండ): ప్రత్యేక అవసరాలు గల(దివ్యాంగులైన) విద్యార్థులకు బోధించేందుకు ప్రభుత్వం డీఎస్సీలో ప్రత్యేక పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల్లో 11 స్కూల్‌ అసిస్టెంట్‌, 32 ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రత్యేక కేటగిరి కింద ఎంపికయ్యే ఉపాధ్యాయులు దివ్యాంగులైన విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి ఉంటుంది.

TSRTC Jobs: సొంతంగా పోస్టుల భర్తీ అధికారం కోల్పోయిన ఆర్టీసీ.. ఖాళీలు ఉన్నా రిక్రూట్‌మెంట్‌కు నో

ఇప్పటి వరకు దివ్యాంగులైన విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించేందుకు మండల కేంద్రాల్లో భవిత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే దివ్యాంగులైన వారికి బోధించడానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులు లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి డీఎస్సీలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ఆలోచన చేయడం విశేషం.

ఆయా పాఠశాలల్లో సర్వే నిర్వహించి ఎక్కడ ఎక్కువ మంది దివ్యాంగులైన విద్యార్థులు ఉంటే అక్కడ ప్రత్యేక పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఆ ఉపాధ్యాయులు ఇతర పాఠశాలల్లోని దివ్యాంగులైన విద్యార్థులకు వారంలో ఒకటి రెండుసార్లు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు భవిత పాఠశాలల్లో ఇప్పటి వరకు 1,100 మంది వరకు ఉన్నారు.

Budget 2024: ఈ రంగాలపైనే మోదీ 3.0 బడ్జెట్ ఫోకస్!

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోను విద్యార్థుల సంఖ్య దాదాపు 500 వరకు ఉంటుందని అంచనా. ఏది ఏమైనా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రత్యేక పాఠాలు చెప్పడానికి మాస్టార్లు బడుల్లోకి త్వరలోనే రానుండటం మంచి పరిణామమని పలువరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#Tags