Right to Equality (Article 14-18): 'సమన్యాయ పాలన'ను ప్రతిపాదించిందెవరు?

ప్రాథమిక హక్కులు–వర్గీకరణ
సమానత్వ హక్కు (ప్రకరణ 14–18)

 ప్రకరణ 14 ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. ఈ భావన బ్రిటిష్‌ రాజ్యాంగంలోని సమ న్యాయపాలన (Rule of law)కుఅనుగుణంగా పొందుపరిచారు. వ్యక్తి హోదా, గౌరవంతో సంబంధం లేకుండా హక్కులు కల్పిస్తారు.
సమన్యాయ పాలన భావాన్ని ‘ఎ.వి. డైసీ’అనే రాజ్యాంగ నిపుణుడు ప్రతిపాదించాడు. చట్టం మూలంగా సమాన రక్షణ (Equal protection of law) అనేది అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. దేశంలో ఒకే చట్టం ఉన్నప్పటికీ, ఆ చట్టాన్ని అమలు చేసే సమయంలో ప్రజలను వర్గీకరించి అమలు చేయొచ్చు. అయితే వర్గ చట్టాలు చేయొద్దు (Classification of people but not class legislation). దీన్నే ‘రక్షిత వివక్ష’ అంటారు. దీంతో సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
ప్రకరణ 14 ప్రకారం, చట్టం ముందు అందరూ సమానులే. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితు­ల్లో మినహాయింపులు ఇవ్వొచ్చు. హేతుబద్ధ, శాస్త్రీయ వర్గీకరణ ద్వారా మినహాయింపులు ఇవ్వడం ప్రకరణ 14కు వ్యతిరేకం కాదు. భౌగోళిక ప్రాంతం, అక్షరాçస్యత, పెద్ద, చిన్న పరిశ్రమలు, మైనర్, మేజర్, స్త్రీలు, పురుషులు మొదలైన ప్రాతిపదికలపైన మినహాయింపులు ఇవ్వొచ్చు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ప్రత్యేక వివరణ:

ప్రకరణ 39(బి),(సి)లోని ఆదేశికాలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటే అవి ప్రకరణ 14కు వ్యతిరేకమని న్యాయస్థానంలో ప్రశ్నించొద్దు. వీటిని అమలు చేయడానికి ప్రకరణ 14 అడ్డుకాదు.
మినహాయింపులు:

  • నిబంధన 14లో పేర్కొన్న‘ అందరూ సమానులు’ అనే సూత్రం రాష్ట్రపతి, గవర్నర్లకు వర్తించదు. వారు ఈ సూత్రానికి మినహాయింపు.
  • ప్రకరణ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్‌ తమ అధికార విధుల నిర్వహణలో ఏ న్యాయ స్థానానికీ జవాబుదారులు కారు. వారిపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు పెట్టడానికి వీలులేదు. అయితే రెండు నెలల ముందస్తు నోటీసుతో సివిల్‌ కేసులు పెట్టొచ్చు.
  • ప్రకరణ 105, ప్రకరణ 194 ప్రకారం, పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల్లో సభ్యులు వ్యక్తీకరించిన అభిప్రాయాలకు వారు ఏ న్యాయస్థానానికీ బాధ్యులు కారు.
  • విదేశీ సార్వభౌములకు, దౌత్యవేత్తలకు కూడా మినహాయింపుఉంటుంది.
  • ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి కూడా ఈ మినహా యింపు వర్తిస్తుంది.

చ‌ద‌వండి: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు

సుప్రీంకోర్టు ముఖ్య తీర్పులు

చిరంజిత్‌ లాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1950)

చట్టం ముందు అందరూ సమానులే అంటే సమానుల్లో మాత్రమే సమానత్వం అమలుచేస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. హేతుబద్ధమైన వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది.

బెన్నెట్‌ కోల్‌మెన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1973)

 పత్రికలను చిన్న, పెద్ద పత్రికలు అనే ప్రాతిపదికపై వర్గీకరించి న్యూస్‌ ప్రింట్‌ పంపిణీ చేయడం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్ని పత్రికలకు సమానంగా పంపిణీ చేయడం న్యాయసమ్మతం కాదని పేర్కొంది.

విశాఖ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ (1997)

పనిచేసే ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులు ప్రకరణ 14లోని చట్టం ముందు అందరూ సమానులే అనే సూ­త్రానికి వ్యతిరేకం,స్త్రీల పట్ల వివక్ష అని,పురుషుల­తో సమానంగా వారు హక్కులను కలిగి ఉండే అధికారం ఉందని పేర్కొంది. పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపులు నివారించడానికి సమగ్ర మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు జారీ చేసింది.

ప్రకరణ 15

ప్రకరణ 15(1): మత, జాతి, కుల, లింగ,పుట్టుక అనే వివక్షను పాటించొద్దు. ప్రకరణ 15(2): ప్రజా ప్రయోగకర ప్రదేశాల్లోకి అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. ఈ సౌకర్యాల విషయంలో వివక్ష చూపొద్దు. బావులు, చెరువులు, రోడ్లు, హోటళ్లు, వినోద ప్రదేశాలు, ఇతర ప్రజా సంబంధ ప్రదేశాల్లోకి అందరికీ సమాన అవకాశాలు ఉండాలి.
మినహాయింపులు:
ప్రకరణ 15(3): దీని ప్రకారం మహిళలు, బాలలకు ప్రత్యేక మినహాయింపులు, సౌకర్యాలు కల్పించవచ్చు. ప్రకరణ 15(4): సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలు, మినహాంపులు ఇవ్వొచ్చు. ఈ క్లాజ్‌ను 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
ప్రకరణ 15(5): ప్రైవేట్, ప్రభుత్వ ధన సహాయం పొందిన విద్యాసంస్థల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు లేదా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధికి ప్రత్యేక మినహాయింపులు, సౌకర్యాలు కల్పించవచ్చు. అయితే ఇది ప్రకరణ 30లో పేర్కొన్న మైనారిటీ సంస్థలకు వర్తించదు. ప్రకరణ 15(5) క్లాజ్‌ను 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

ప్రకరణ 16

ప్రకరణ 16(1): ప్రభుత్వోద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు.
ప్రకరణ 16(2): ప్రభుత్వోద్యోగాల్లో పౌరులను జాతి, మత, కుల, లింగ పుట్టుక వారసత్వ, స్థిర నివాస అనే ఏడు ప్రాతిపదికలపై వివక్ష చూపొద్దు.
ప్రకరణ 16(3): ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక మినహాయింపులు, సదుపాయాలు కల్పించవచ్చు.
ప్రకరణ 16(4ఎ): ప్రభుత్వోద్యోగాలు, ప్రమోషన్లలో షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఈ అంశాన్ని 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. 
ప్రకరణ 16(4బి): ఈ క్లాజును 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000లో చేర్చారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక ఏడాదిలో కేటాయించిన రిజర్వ్‌ కోటా భర్తీ కాకుంటే ఆ ఖాళీలను తర్వాత సంవత్సరంలో సంబంధిత రిజర్వేషన్‌ కోటాలో కలుపుతారు. అప్పుడు రిజర్వేషన్ల శాతం 50కి మించిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఆ ఏడాది రిజర్వేషన్‌ కోటాలో కలిసిన గత సంవత్సరం కోటాను పరిగణనలోకి తీసుకోకుండా, మిగిలిన ఖాళీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో క్యారీ ఫార్వర్డ్‌ అవకాశాన్ని కల్పించారు. 
ప్రకరణ 16(5): ప్రభుత్వంలో ఏదైనా ఒక శాఖ­లో పూర్తిగా ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం ఉంటే ఆ శాఖలో కేవలం ఆ మత విశ్వాసాలకు చెందిన వారిని మాత్రమే నియమించడానికి తగిన చట్టాలను ప్రభుత్వాలు రూపొందించుకోవచ్చు.
దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేయడానికి హిందువులు మాత్రమే అర్హులు. అలాగే వక్ఫ్‌బోర్డు ఇతర మత సంస్థల్లో నియామకాలకు సంబంధిత మత విశ్వాసం ఉన్నవారే అర్హులు. 
అదేవిధంగా 2001లో 85వ రాజ్యాంగ సవరణ ప్రకారం, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందిన ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు తద్వారా లభించే సీనియారిటీ అర్హత కూడా లభిస్తుంది. ఈ సవరణ 1995 నుంచి వర్తిస్తుంది.
ప్రత్యేక వివరణ:
81, 85వ రాజ్యాంగ సవరణల ద్వారా గతంలో సుప్రీంకోర్టు బాలాజీ వర్సెస్‌ మైసూరు (1963), ఇంద్ర సహాని వర్సెస్‌ భారత ప్రభుత్వం (1992) కేసుల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చెప్పిన తీర్పులకు మినహాయింపు లభించింది. 

చ‌ద‌వండి: Indian Polity Study Material: 1956 తర్వాత ఏర్పాటైన రాష్ట్రాలు..

మండల్‌ కమిషన్‌ నివేదిక

వెనుకబడిన తరగతులను వర్గీకరించి తగిన రాయితీలు కల్పించడానికి 1979లో నాటి జనతా ప్రభుత్వం బి.పి. మండల్‌ అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు కేంద్ర సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని 1980లో తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 1989లో అధికారంలోకి వచ్చిన వి.పి.సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తర్వాత పి.వి. నరసింహారావు ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ నివేదికకు రెండు సవరణలు చేసింది.
ఎ) వెనుకబడిన తరగతులకు కేటాయించిన రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయడం.
బి) అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం.
పై అంశాలు ఇంద్రా సహాని కేసులో సుప్రీంకోర్టులో చర్చకు వచ్చాయి.

ఇంద్రా సహాని వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (మండల్‌ కేసు) (1993)

  • వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమే.
  • వెనుకబడిన తరగతుల్లో క్రిమీలేయర్‌ (మెరుగైన వర్గాలు)ను గుర్తించి వారిని రిజర్వేషన్లకు అనర్హులుగా పరిగణించాలి.
  • కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా, అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించొద్దు.
  • ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవు. రాజ్యాంగంలో ఈ ప్రాతిపదికన మినహాయింపులు లేవని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది.

గమనిక: క్రిమీలేయర్‌ వర్గాలను గుర్తించడానికి  1993లో రామ్‌నందన్‌ ప్రసాద్‌ కమిటీని నియమించారు.

ప్రకరణ 17

ఈ ప్రకరణ ప్రకారం అస్పృశ్యతను నిషేధించారు. ఈ ప్రకరణ తనంతట తాను అమలులోకి రాదు. దీని అమలుకు సంబంధిత చట్టాలను రూపొందించాలి. అయితే అస్పృశ్యత అనే పదాన్ని రాజ్యాంగంలోగాని, చట్టంలోగానీ నిర్వచించలేదు. కులతత్వ నేపథ్యంలో అస్పృశ్యతను గమనించాలని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. దీని అమలుకు సంబంధించి పార్లమెంట్‌ ఈ కింది చట్టాలను రూపొందించింది.

అస్పృశ్యత నిషేధ చట్టం (1955)

అస్పృశ్యతను నిషేధిస్తూ, దాన్ని నేరంగా పరిగణిస్తూ, పార్లమెంట్‌ 1955లో ఈ చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ చట్టంలోని లొసుగులను తొలగించడానికి 1976లో ఈ చట్టాన్ని సమగ్రంగా సవరించి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా పేరు మార్చారు. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు, అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు.

ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టం (1989)

ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై అకృత్యాలను సమగ్రంగా నిరోధిస్తూ కఠినమైన నియమ నిబంధనలను రూపొందించారు.

చ‌ద‌వండి: Indian Polity Study Material: గాంధీజీ హాజరైన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏది?

ప్రకరణ 18

18(1): సైనిక, విద్యాపరమైన గుర్తింపు మినహా మిగతా బిరుదుల రద్దు. 18(2): భారత పౌరులు విదేశీ బిరుదులను స్వీకరించొద్దు. 18(3): భారత పౌరులు కానప్పటికీ భారత ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి ఎలాంటి బిరుదులు స్వీకరించొద్దు. 18(4): ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో ఉన్న వ్యక్తులు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి ఎలాంటి బహుమతులను, భత్యాన్ని, ఉద్యోగాన్ని స్వీకరించొద్దు.
ఈ ప్రకరణలో కొన్ని రకాల బిరుదులను రద్దు చేశారు. ఉదాహరణకు, బ్రిటిష్‌ పాలనా కాలంలో సమాజంలోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక ప్రాతిపదికలపై కల్పించిన ప్రత్యేక హోదాలైన రావ్‌ బహద్దూర్, రావ్‌ సాహబ్, రాజా విక్రమార్క, జాగిర్దార్, ఇనాందార్, జమిందార్‌ మొదలగు వాటిని రద్దు చేశారు. అయితే ఈ నిషేధం విద్యా, సైనిక, విశిష్ట యోగ్యతాపరమైన బిరుదులకు వర్తించదు. ఉదాహరణకు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. అదే విధంగా సైనిక హోదాలైన పరమ వీరచక్ర, అశోక చక్ర, శౌర్య చక్ర, మొదలగు వాటిని ఇవ్వవచ్చు.

ప్రత్యేక వివరణ:
భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటివి ప్రత్యేక పౌర పురస్కారాలేకానీ బిరుదులు కావు. వీటిని పేరుకు ముందుకానీ, పేరుకు తర్వాతకానీవాడటం, వ్యాపార కార్యక్రమాలకు వినియోగించొద్దని బాలాజీ రాఘవన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1996)లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సినీ నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం తమ పద్మశ్రీ గుర్తింపును వ్యాపారపరంగా ఉపయోగించారనే అభియోగంతో వాటిని రద్దు చేయాలని కోర్టు సూచించింది.
 

ప్రధాన మంత్రులు.. పదవీ కాలం (జనరల్‌ నాలెడ్జ్‌ ఫర్‌ గ్రూప్స్‌)
జవహర్‌లాల్‌ నెహ్రూ 1947 – 1964
గుల్జారీ లాల్‌ నందా 1964 మే–జూన్‌
లాల్‌ బహదూర్‌ శాస్త్రి 1964 –1966
గుల్జారీ లాల్‌ నందా 1966 జనవరి11–24
ఇందిరా గాంధీ 1966 – 1977
మొరార్జీ దేశాయ్‌ 1977 – 1979
చరణ్‌ సింగ్‌ 1979 – 1980
ఇందిరా గాంధీ 1980 – 1984
రాజీవ్‌ గాంధీ 1984 – 1989
విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ 1989 – 1990
చంద్రశేఖర్‌ 1990 – 1991
పీవీ నరసింహారావు 1991 – 1996
అటల్‌ బిహారీ వాజ్‌పేయి 1996 మే 16–28,
హెచ్‌డీ దేవెగౌడ 1996 –  1997
ఐ.కె. గుజ్రాల్‌ 1997 ఏప్రిల్‌ 21 –1998 మార్చి 18
అటల్‌ బిహారీ వాజ్‌పేయి 1998 మార్చి 19– 1999 అక్టోబర్‌ 13
అటల్‌ బిహారీ వాజ్‌పేయి 1999 అక్టోబర్‌ 13 – 2004 మే
డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ 2004 మే 22 –     2009 ఏప్రిల్‌ 21 
డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ 2009 మే 22 –     2014 మే
నరేంద్ర మోదీ 2014 మే 26 నుంచి


బి. కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు
 

#Tags