73వ రాజ్యాంగ సవరణ-ముఖ్యాంశాలు

73వ రాజ్యాంగ సవరణ బిల్లును పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు (1991లో) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది 1992లో ఆమోదం పొందింది. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లు కనుక దీన్ని 50 శాతం కన్నా తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. ఈ బిల్లుకు 17 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మ ఈ బిల్లుపై 1993 ఏప్రిల్ 20న సంతకం చేశారు. ఇది 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. IXవ భాగంలో 243, 243 ‘A’ నుంచి 243 'O' వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణను పొందుపర్చారు. అలాగే 11వ షెడ్యూల్‌లో పంచాయతీలు నిర్వర్తించాల్సిన 29 విధులను కూడా చేర్చారు.
ప్రకరణ-243(A) గ్రామసభ ఏర్పాటు
ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష ప్రతీకగా గ్రామ సభను ఏర్పాటుచేయాలి. ఇందులో గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. గ్రామసభకు గ్రామ పంచాయతీ బాధ్యత వహిస్తుంది. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనకు సలహాలు ఇవ్వడంలో గ్రామసభ కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రకరణ-243(B) మూడంచెల పంచాయతీ వ్యవస్థ
ప్రతి రాష్ర్టంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. మొదటి అంచె.. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ; రెండో అంచె.. మధ్య (రెండో) స్థాయిలో మండల పరిషత్; మూడో అంచె.. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్.

ప్రకరణ-243(C) పంచాయతీ నిర్మాణం, ఎన్నికలు
1) రాష్ట్ర శాసన సభ నిర్ణయించిన చట్టాల మేరకు పంచాయతీ నిర్మాణం ఉంటుంది.
2) పంచాయతీలోని అన్ని స్థాయిల్లో ప్రతినిధులు నేరుగా ఓటర్లతో ఎన్నికవుతారు.
3) గ్రామ పంచాయతీ అధ్యక్షుడు/సర్పంచ్ రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన పద్ధతి మేరకు ఎన్నికవుతాడు.

ప్రకరణ-243(D) పంచాయతీల్లో రిజర్వేషన్లు
రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు ఉంటాయి. మొత్తం స్థానాల్లో 1/3 వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు కేటగిరీ వారీగా 1/3 వంతు స్థానాలు రిజర్వు చేశారు.
ప్రత్యేక వివరణ: 110వ రాజ్యాంగ సవరణ బిల్లు-2009 ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లు ఇంతవరకు ఆమోదం పొందలేదు. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. అవి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం మహిళలకు 1/3 వంతుకు తక్కువ కాకుండా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. అంతకంటే ఎక్కువ కూడా అమలుచేయొచ్చు. అందువల్ల పైన పేర్కొన్న రాష్ట్రాల్లో రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే 50 శాతం రిజర్వేషన్లు చెల్లుబాటవుతాయి. రాజ్యాంగ సవరణ చేస్తే అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంటుంది.

ప్రకరణ-243(E) పంచాయతీల పదవీ కాలం
సాధారణంగా స్థానిక సంస్థల పదవీ కాలం ఐదేళ్లు ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పదవీ కాలం పూర్తికాకముందే వాటిని రద్దు చేయొచ్చు. ఒక వేళ మధ్యలో రద్దయితే ఆరు నెలల్లోపు తిరిగి ఎన్నికలను పూర్తి చేయాలి. పంచాయతీ మిగిలిన కాలం ఆరు నెలల కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నిక అవసరం ఉండదు.

ప్రకరణ-243(F) పంచాయతీ సభ్యుల అనర్హతలు
పంచాయతీలకు ఎన్నికైన సభ్యులను కింది కారణాలపై అనర్హులుగా ప్రకటించొచ్చు. రాష్ట్ర శాసనసభలు రూపొందించిన అనర్హత చట్టాల మేరకు సభ్యత్వం రద్దవుతుంది.
  • నేరారోపణ రుజువైనప్పుడు..
  • కనీస వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు..
  • అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు.
  • పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ఏర్పరిచే అథారిటీకి అప్పీలు చేసుకోవాలి. ప్రస్తుతం సభ్యుల అనర్హత వివాదాలను విచారించే అధికారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జిల్లా కోర్టులకు ఉంది.
ప్రత్యేక వివరణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పంచాయతీ సభ్యుల అనర్హతకు ఒక ప్రత్యేక కారణాన్ని పొందుపరిచారు. 1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే పోటీ చేయడానికి అనర్హులు. ఈ మధ్యనే(2015)లో రాజస్థాన్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హతను నిర్ణయిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.

ప్రకరణ-243(H) పంచాయతీలకు ఆదాయ వనరులు
ఎ) రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ద్వారా పంచాయతీలకు కొన్ని పన్నులను విధించే అధికారాన్ని కల్పిస్తుంది.
బి) రాష్ర్ట ప్రభుత్వం కొన్ని పన్నులను వసూలు చేసి పంచాయతీలకు బదలాయిస్తుంది.
సి) రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ రూపంలో నిధులు ఇస్తుంది.
డి) పంచాయతీలకు సంబంధించిన నిధులను జమ చేయడానికి, ఖర్చు చేయడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయొచ్చు.

ప్రకరణ-243(I) రాష్ట్ర ఆర్థిక సంఘం
73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ఏర్పాటుచేస్తారు. ఈ సంఘాన్ని గవర్నర్ ప్రతి ఐదేళ్లకు ఏర్పాటుచేస్తారు. రాష్ట్ర ఆర్థిక సంఘంలో గవర్నర్ నిర్ణయించిన సంఖ్యలో సభ్యులు ఉంటారు. ఆర్థిక సంఘం ఇతర అంశాలను రాష్ట్ర శాసన సభ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉన్నారు. ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు అందజేస్తుంది. గవర్నర్ ఆ నివేదికను రాష్ట్ర శాసన సభ ముందు ఉంచుతారు.
ఆర్థిక సంఘం విధులు: రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు, ఇతర సుంకాలు, వసూలైన నికర ఆదాయంలో స్థానిక సంస్థలకు ఏవిధంగా బదిలీ చేయాలో ఆర్థిక సంఘం సూచిస్తుంది. స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నులు, డ్యూటీలు, సుంకాలను నిర్థారిస్తుంది. పంచాయతీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి సూచనలు చేస్తుంది. గవర్నర్ సూచించిన ఇతర అంశాలపై సలహాలు ఇస్తుంది.

ప్రకరణ-243(J) పంచాయతీల ఖాతాల ఆడిటింగ్
రాష్ట్ర శాసనసభ నిర్ణయం మేరకు ఖాతాలను నిర్వహించడానికి, వాటిని ఆడిట్ చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయొచ్చు.

ప్రకరణ-243(K) రాష్ట్ర ఎన్నికల సంఘం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఓటర్ల జాబితా వంటి అంశాలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించడానికి రాజ్యాంగ ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ నియమిస్తారు. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఐదేళ్లు. ఇతర సర్వీసు విషయాలను రాష్ట్ర శాసనసభ చట్టాల మేరకు గవర్నర్ నిర్ణయిస్తారు. హైకోర్టు జడ్జీలను తొలగించే పద్ధతిలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తారు.
విధులు: ఓటర్ల జాబితాను రూపొందించడం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను గవర్నర్ అనుమతితో సమకూర్చుకోవడం. ఎన్నికల వివాదాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడం.

ప్రకరణ-243(L) కేంద్ర పాలిత ప్రాంతాలకు అనువర్తన
73వ రాజ్యాంగ సవరణలోని అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలకూ అనువర్తిస్తారు. శాసనసభలు గల కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి తీర్మానాల మేరకు వీటిని అనువర్తింప జేసుకుంటాయి (లేదా) రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా కొన్ని మార్పులతో ఈ అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలకు అనువర్తింప జేస్తారు.

ప్రకరణ-243(M) మినహాయింపులు
73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న అంశాల నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. ప్రకరణ-243(M)(1) ప్రకారం ఈ అంశాలు ప్రకరణ 244లో పేర్కొన్న షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తించవు. ప్రకరణ-243(2) ప్రకారం మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు; మణిపూర్‌లోని స్వతంత్ర జిల్లా కౌన్సిళ్లకు; పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ప్రాంతాలకు ఈ అంశాలు వర్తించవు.
ప్రత్యేక వివరణ: ప్రకరణ-243M(3A) ప్రకారం అరుణాచల్‌ప్రదేశ్ స్థానిక సంస్థల్లో షెడ్యూల్డు కులాలకు రిజర్వేషన్లు వర్తించవు. ఇది ప్రకరణ-243(D)కి మినహాయింపు. ఈ అంశాన్ని 2000 సంవత్సరంలో 83వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో షెడ్యూల్డు కులాలు గుర్తించదగిన సంఖ్యలో లేవు.

ప్రకరణ-243(N) అప్పటికే ఉన్న పంచాయతీ చట్టాల కొనసాగింపు
73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏడాది వరకు ఆ రాష్ట్రాల్లో ఉన్న పాత పంచాయతీ చట్టాలనే కొనసాగించొచ్చు. ఏడాది తర్వాత ఆ రాష్ట్రాలు నూతన పంచాయతీ చట్టాలను ఆమోదించి అమలుచేయాలి.

ప్రకరణ-243(O) ఎన్నికల అంశాలకు న్యాయస్థానాల నుంచి మినహాయింపు
పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు, నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ మొదలైన అంశాలను న్యాయస్థానాల జోక్యం నుంచి మినహాయించారు. అయితే ఎన్నికల పిటిషన్ ద్వారా రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన పద్ధతిలో నిర్ణీత న్యాయ వ్యవస్థ ముందు ఎన్నికల వివాదాలను ప్రశ్నించవచ్చు.

నూతన పంచాయతీ వ్యవస్థ ముఖ్య లక్షణాలు
73వ రాజ్యాంగ సవరణలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. మొదట ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన పంచాయతీ వ్యవస్థను ఏర్పాటుచేయాలనే అంశాన్ని, ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు విధిగా నిర్వహించాల్సిన అంశాలను పేర్కొన్నారు. కొన్ని అంశాలను ఆ రాష్ట్ర శాసనసభల ఐచ్ఛికానికి వదిలేశారు. తప్పనిసరిగా నిర్వహించాల్సిన అంశాలు (దేశంలో ఏకరూపత ఉన్న అంశాలు)
  • మూడంచెల విధానం కొనసాగింపు
  • గ్రామ సభల ఏర్పాటు
  • పంచాయతీ అధ్యక్షుడి (సర్పంచ్) ఎన్నికలు ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన పద్ధతిలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఉంటాయి.
    ఉదా: సర్పంచ్ ఎన్నిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రత్యక్షంగా ఉంది. కర్ణాటకలో పరోక్షంగా ఉంది.
  • స్థానిక సంస్థల్లో అన్ని స్థాయిల్లోనూ ప్రతినిధులు (వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) ప్రత్యక్షంగా ఎన్నికవుతారు.
  • మధ్య స్థాయి, జిల్లా స్థాయిలోని అధిపతులు పరోక్షంగా ఎన్నికవుతారు.
  • షెడ్యూల్డు కులాలు, తెగల వారి జనాభా మేరకు రిజర్వేషన్లు వర్తింపజేయడం.
  • మహిళలకు అన్ని స్థాయిల్లో 1/3వ వంతు తగ్గకుండా రిజర్వేషన్లను ఇవ్వడం.
  • ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘాన్ని నియమించడం వనరుల బదిలీ కోసం రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేయడం ప్రతి ఐదేళ్లకు ఒక సారి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం.
ఐచ్ఛిక అంశాలు: కింది అంశాలను రాష్ర్ట ప్రభుత్వ విచక్షణకు వదిలేశారు.
  • వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం.
  • 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధుల బదలాయింపు.
  • స్థానిక సంస్థల సభ్యుల అనర్హతకు సంబంధించిన అంశాలు, ఇతర షరతులు.
  • పంచాయతీ వ్యవస్థకు స్వయంప్రతిపత్తి కల్పించడం.
  • పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు పంచాయతీలో ఓటు హక్కులు కల్పించడం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ-కమిటీల సిఫార్సులు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పంచాయతీ సమితిని 1959, అక్టోబర్ 11న నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్‌లో ప్రారంభించారు. మూడంచెల పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది.































#Tags