Carrington Event: పొంచి ఉన్న ‘కారింగ్టన్‌ ఈవెంట్‌’.. మానవాళికి పెను ముప్పు?

ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు అనేకం జరుగుతుంటాయి.

ఇవి మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా ఆందోళనకు కూడా గురిచేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విమానాలన్నీ రద్దయితే? శాటిలైట్లు పనిచేయడం మాసేసి, ఇంటర్నెట్‌ ఆగిపోతే? అటు ఫోన్లు మూగబోయి.. ఇటు విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వినడానికే ఆందోళన కలిగించే ఇటువంటి ఘటన 150 ఏళ్ల క్రితం సంభవించింది. దీనిని కారింగ్టన్ ఈవెంట్ అని పిలుస్తారు.  

కారింగ్టన్ ఈవెంట్ అంటే..
1859, సెప్టెంబరు 2వ తేదీ కారింగ్టన్ ఈవెంట్‌ను నాటి శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్‌లోని రెడ్ హిల్‌లో ఉంటున్న శాస్త్రవేత్తలు రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్‌, అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్గ్‌సన్‌లు సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమూహం(సన్‌ స్పాట్‌)పై అధ్యయనం చేస్తుండగా వారు సూర్యునిపై సంభవించిన భారీ పేలుడును గమనించారు. దీనినే కారింగ్టన్‌ ఈవెంట్‌గా పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావం భూమికున్న ధ్రువ ప్రాంతాలలో కనిపించింది. ఇదే తొలి సౌర తుఫానుగా నమోదయ్యింది.

భారీ పేలుళ్ల గుర్తింపు
రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్ సూర్యునిపై ఐదు నిమిషాల పాటు సంవించిన భారీ పేలుళ్లను గమనించారు. ఈ భారీ సౌర తుఫానును గమనించిన ఏడు రోజుల తర్వాత లండన్‌లోని క్యూ అబ్జర్వేటరీలోని అయస్కాంత సెన్సార్లు భూ అయస్కాంత క్షేత్రంలో గణనీయమైన మార్పును గుర్తించాయి. ఈ పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత భూమికి చెందిన మాగ్నెటోస్పియర్ చుట్టూ కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) విక్షేపం చెందడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. 

Aditya-L1: సూర్యుడి రహస్యాలను అన్వేషించే భారతీయ అంతరిక్ష నౌక ఇదే..

కుప్పకూలనున్న కమ్యూనికేషన్‌ వ్యవస్థ?
1859లో సంభవించిన కారింగ్‌టన్ ఈవెంట్‌ సమయంలో ప్రపంచంలో భారీ విద్యుత్తు వ్యవస్థ, ఉపగ్రహాలు మొదలైనవి లేవు. అందుకే నాడు భారీ విధ్వంసం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ స్థాయి సౌర తుఫాను సంభవిస్తే, ప్రపంచంలో భారీ విపత్తులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విద్యుత్తు అంతరాయాలు  ఏర్పడవచ్చు. భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాలు స్థంభించిపోవచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ చాలా కాలం పాటు నిలిచిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

రాబోయే రోజుల్లో..
కాగా 2003 అక్టోబరులో సంభవించిన సౌర తుఫాను దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ వ్యవస్థలను, విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేసింది. దీనికి ‘హాలోవీన్ సౌర తుఫాను’అని నామకరణం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర తుఫానుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రాలలో హెచ్చతగ్గులు ఏర్పడతాయి. అది బ్లాక్‌అవుట్‌లకు దారితీసి, విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పేస్‌క్రాఫ్టులు అధిక రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటాయి.

భూమికి పొంచివున్న ప్రమాదం?
రెండు దశాబ్దాల తర్వాత 2024 మే 10వ తేదీ అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను  భూమిని తాకింది. ఈ  సౌర తుఫానును తొలుత తీవ్రమైంది కాదని భావించారు. కానీ, తర్వాత అత్యంత శక్తివంతమైందిగా అంచనా వేశారు. సూర్యుడి సన్‌స్పాట్ ఏఆర్‌ 3663 వద్ద అత్యంత శక్తివంతమైన రెండు విస్ఫోటనాలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. 

NISAR Mission: హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే ప్రయత్నం!

#Tags