Chandrayaan 3 launch live updates : చంద్రయాన్‌-3 లక్ష్యాలు ఇవే.. ప్రయోగం ఇలా.. అలాగే ఉప‌యోగాలు ఇవే..

ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం ప్రారంభ‌మైంది.

ఇందుకు అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది.

చంద్రయాన్‌-3 చాలా సంక్లిష్ట ప్రయోగం. అమెరికా, రష్యా, చైనా సహా మరే దేశమూ ఇప్పటిదాకా చేరుకోలేకపోయిన జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువవడాన్ని ఈ ప్రయోగంలో భారత్‌ తన లక్ష్యంగా విధించుకుంది.

Chandrayaan 3 launch live updates 2023 :

చంద్రయాన్‌-3లోని కీలక సాధనాలు ఇవే..
చంద్రయాన్‌-3 చాలా సంక్లిష్ట ప్రయోగం. అమెరికా, రష్యా, చైనా సహా మరే దేశమూ ఇప్పటిదాకా చేరుకోలేకపోయిన జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువవడాన్ని ఈ ప్రయోగంలో భారత్‌ తన లక్ష్యంగా విధించుకుంది. మరి ఇంతకీ చంద్రయాన్‌-3లో ఏమేం భాగాలున్నాయి? కఠిన సవాళ్ల ఛేదనకు దానిలో వినియోగిస్తున్న  అత్యాధునిక పరికరాలేంటి? జాబిల్లిపై పరిశోధనలకు అవి ఎలా ఉపయోగపడబోతున్నాయి? ఆ వివరాలను పరిశీలిస్తే..
మూడింటి కలయిక.. చంద్రయాన్‌-3లో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. అవి..1) ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, 2) ల్యాండర్‌, 3) రోవర్‌
      ఈ మూడూ సమన్వయంతో పనిచేస్తేనే ఇస్రో కంటున్న జాబిల్లి దక్షిణ ధ్రువం కలలు సాకారమవుతాయి. అందుకోసం వీటిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. వాటిలో ఉప పరికరాలను మోహరించారు.

1.ప్రొపల్షన్‌ మాడ్యూల్ ఎలా ప‌నిచేస్తుంటే..?
ఇది పెట్టె ఆకృతిలో ఉంటుంది. దీనికి ఒకవైపున భారీ సౌరఫలకాన్ని ఏర్పాటుచేశారు. పైభాగంలో సిలిండర్‌ ఆకృతిలో ఇంటర్‌మాడ్యూల్‌ అడాప్టర్‌ కోన్‌ ఉంటుంది. ఈ భాగానికే ల్యాండర్‌ను అమరుస్తారు. దీనికింద ప్రొపల్షన్‌ వ్యవస్థ, ప్రధాన థ్రస్టర్‌ నాజిల్‌ ఉంటాయి.
    ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో ‘స్పెక్ట్రోపొలారీమెట్రీ ఆఫ్‌ హ్యాబిటబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌’ (షేప్‌) అనే పేలోడ్‌ ఉంటుంది. అది చంద్రుడి కక్ష్యలో ఉంటూ.. భూమి నుంచి పరావర్తనం చెందిన కాంతిని విశ్లేషిస్తుంది. స్పెక్ట్రల్‌, పొలారిమెట్రిక్‌ కొలతలు సేకరిస్తుంది. ఈ డేటాను.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్‌)పై పరిశోధనకు ఉపయోగిస్తారు. అక్కడ భూమి తరహాలో నివాసయోగ్య పరిస్థితులు ఉన్నాయా.. ఇప్పటికే అక్కడ జీవం ఉందా అన్నది తెలుసుకోవడానికి ఉపయోగించనున్నారు.ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ చంద్రుడి కక్ష్యలోనే ఉంటూ ల్యాండర్‌కు భూ కేంద్రానికి మధ్య కమ్యూనికేషన్‌ ప్రసార ఉపగ్రహంలా పనిచేస్తుంది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌.. దీనికి బ్యాకప్‌గా వ్యవహరిస్తుంది.

2. ల్యాండర్ ఎలా ప‌నిచేస్తుంటే..?
ఈ సాధనానికి నాలుగు కాళ్లు, నాలుగు ల్యాండింగ్‌ థ్రస్టర్లు (రాకెట్లు) ఏర్పాటుచేశారు. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగడానికి అవసరమైన కెమెరాలు, సెన్సర్లు అమర్చారు. అవి ప్రమాదకరమైన అవరోధాలను తప్పించుకోవడానికి, ల్యాండర్‌కు తాను ఎక్కడ ఉన్నానన్న విషయం తెలియజేయడానికి ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్‌ కోసం ఎక్స్‌ బ్యాండ్‌ యాంటెన్నా ఉంటుంది. ల్యాండర్‌లో 800 న్యూటన్ల సామర్థ్యం కలిగిన నాలుగు థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లు, 58 న్యూటన్ల సామర్థ్యం కలిగిన 8 థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లు ఉన్నాయి.

ల్యాండర్‌లో మొత్తం ఐదు పరికరాలు ఉన్నాయి. .
అవి..
1. చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మోఫిజికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (చేస్ట్‌): చంద్రుడి కండక్టివిటీ, ఉష్ణోగ్రతలను కొలుస్తుంది.
2. ఇన్‌స్ట్రూమెంట్‌ ఫర్‌ లూనార్‌ సైస్మిక్‌ యాక్టివిటీ (ఐఎల్‌ఎస్‌ఏ): ల్యాండింగ్‌ ప్రదేశంలో చంద్రుడి ప్రకంపనలను కొలవడానికి  ఉపయోగపడుతుంది. చందమామ క్రస్టు, మ్యాంటిల్‌ పొరల తీరుతెన్నులను వెలుగులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.
3. లాంగ్‌ముయిర్‌ ప్రోబ్‌: ప్లాస్మా సాంద్రత, దాని వైరుధ్యాలను లెక్కిస్తుంది.
4. ప్యాసివ్‌ లేజర్‌ రెట్రోరిఫ్లక్టర్‌ అరే (ఎల్‌ఆర్‌ఏ): దీన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అందించింది. ఇది చంద్రుడికి సంబంధించిన రేంజింగ్‌ అధ్యయనాల కోసం ఉపయోగపడుతుంది.
5. రేడియో అనాటమీ ఆఫ్‌ మూన్‌ బౌండ్‌ హైపర్‌సెన్సిటివ్‌ అయనోస్పియర్‌ అండ్‌ అట్మాస్పియర్‌ (రంభా): చంద్రుడిపైన ఉండే గ్యాస్‌, ప్లాస్మా  వాతావరణం గురించి శోధిస్తుంది.

3. రోవర్ ఎలా ప‌నిచేస్తుంటే..?
ఇది దీర్ఘచతురస్రాకార ఆకృతిలో.. ల్యాండర్‌లోని ఒక ఛాంబర్‌లో ఉంటుంది. ర్యాంప్‌ ద్వారా లోపలి నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వస్తుంది. చందమామపై సాఫీగా కదలడం కోసం దానికి ఆరు చక్రాలు, మార్గనిర్దేశం కోసం నావిగేషన్‌ కెమెరాను అమర్చారు. సైన్స్‌ పరిశోధనల కోసం ఇందులో ఆల్ఫా పార్టికిల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కొపీ అనే పరికరాలను ఏర్పాటు చేశారు. అవి ల్యాండింగ్‌ ప్రాంతంలో మూలకాల గురించి శోధిస్తాయి. ఆర్‌ఎక్స్‌/టీఎక్స్‌ యాంటెన్నాల ద్వారా నేరుగా ల్యాండర్‌తో రోవర్‌ కమ్యూనికేషన్‌ సాగించగలదు.

ఎంతకాలం పనిచేస్తాయంటే..?
జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగా దిగాక ల్యాండర్‌, రోవర్‌లు.. అక్కడి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఎంతకాలం పనిచేస్తాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టమే! జాబిల్లిపై ఒక రోజు నిడివి భూమిమీద సుమారు 28 రోజులు. అందులో పగటి సమయం 14 రోజులు ఉంటుంది. ఆ తర్వాత రాత్రి సమయం మొదలవుతుంది. అది చాలా శీతలంగా, ప్రతికూలంగా ఉంటుంది. సౌరశక్తి లభించదు. ఆ వాతావరణాన్ని చంద్రయాన్‌-3 పరికరాలు తట్టుకొని నిలబడటం అనుమానమే! అందువల్ల 14 రోజులు మాత్రమే పనిచేసేలా ల్యాండర్‌, రోవర్‌లను రూపొందించారు. అయితే 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ సూర్యోదయమయ్యాక అవి ‘నిద్రాణం’ నుంచి మేల్కొని, తిరిగి పనిచేసే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

చంద్రయాన్‌-1 జాబిల్లి కక్ష్యలో 312 రోజులపాటు..
2008లో ప్రయోగించిన చంద్రయాన్‌-1 జాబిల్లి కక్ష్యలో 312 రోజులపాటు పనిచేసింది. చంద్రుడి ఉపరితలంపై నీటి జాడను తొలిసారిగా కనుగొని, భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో అంగారకుడి వద్దకు ప్రయోగించిన మంగళయాన్‌ వ్యోమనౌక 2014 సెప్టెంబరు 24న అరుణ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆరు నెలలు మాత్రమే అది పనిచేస్తుందని భావించినప్పటికీ ఏకంగా 8 ఏళ్లపాటు సేవలు అందించింది.

వైఫల్యాలనే విజయ సోపానాలుగా మార్చుకొని సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సమాయత్తమైంది. నాలుగేళ్ల కిందట చంద్రయాన్‌-2 ప్రయోగంలో ఆఖరి క్షణాల్లో ఎదురైన అనూహ్య ఎదురుదెబ్బలను అధిగమిస్తూ.. జాబిల్లిపై ప్రయోగాల్లో ప్రపంచ దేశాలకు ఇప్పటిదాకా అందని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకునే దిశగా కీలక ముందడుగు వేయబోతోంది. 

వైఫల్య ఆధారిత డిజైన్ ఇలా..
చంద్రయాన్‌-3 ప్రస్థానం సాఫీగా సాగేందుకు ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్‌-2లో విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో కుప్పకూలిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ దఫా అనేక మార్పులు చేపట్టింది. ల్యాండింగ్‌ క్రమంలో వైఫల్యానికి ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకొని, దాన్ని అధిగమించేలా చంద్రయాన్‌-3ని ఇస్రో రూపొందించింది. అనుకోని అవాంతరం తలెత్తినా ల్యాండర్‌.. విజయవంతంగా కిందకు దిగేలా కసరత్తు చేపట్టింది. దీనికింద.. సెన్సర్‌, ఇంజిన్‌, అల్గోరిథమ్‌, గణన.. ఇలా అనేక అంశాల్లో వైఫల్యాలకు ఉన్న అవకాశాలను ఇస్రో పరిగణనలోకి తీసుకుంది. వాటిని అప్పటికప్పుడు సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని వ్యవస్థలనూ ప్రోగ్రామ్‌ చేసింది.

చంద్రయాన్‌-3 లక్ష్యాలు ఇవే..
☛ చందమామ ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండ్‌ అయ్యే సామర్థ్యం భారత్‌కు ఉందని చాటడం.
☛ జాబిల్లిపై రోవర్‌ను నడపగలమని రుజువు చేయడం.
☛ చంద్రయాన్‌-3లోని పరికరాల ద్వారా.. చంద్రుడి ఉపరితలంపై అక్కడికక్కడే శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం.

చంద్రయాన్‌-3 ప్రయోగం ఇలా..
☛ అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3ని ప్రయోగిస్తారు.
☛ చంద్రయాన్‌-3ని భూమి చుట్టూ ఉన్న 170X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్‌ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను  ట్రాన్స్‌లూనార్‌ ఇంజెక్షన్స్‌ (టీఎల్‌ఐ)గా పేర్కొంటారు.
☛ తర్వాత చంద్రుడి దిశగా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్‌-3ని పంపిస్తారు.
☛ చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ (ఎల్‌వోఐ) ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజిన్‌ను మండించి చంద్రయాన్‌-3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటినుంచి అది చందమామ కక్ష్యలో తిరుగుతుంది.
☛ అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు.
☛ ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి.. ల్యాండర్‌, రోవర్‌తో కూడిన మాడ్యూల్‌ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. 
☛ ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుంది. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్‌ నిలువు వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్‌ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూశారు. వాలు.. 120 డిగ్రీలను మించకూడదు.

చంద్రయాన్‌-2 వైఫల్యానికి కారణాలు ఇవే..
☛ సెకనుకు కేవలం రెండు మీటర్ల వేగాన్ని తట్టుకునేలా ల్యాండర్‌ను రూపొందించారు.
☛ ల్యాండింగ్‌ కోసం చంద్రుడి ఉపరితలంపై 500 X 500 మీటర్ల ప్రదేశాన్నే ఎంచుకున్నారు. ఆ చిన్నపాటి ప్రదేశాన్ని చేరుకోవడం ల్యాండర్‌కు కష్టమైంది.
☛ జాబిల్లి ఉపరితలంపైకి అనువైన ప్రదేశంలో దిగేలా మార్గనిర్దేశం చేసుకునేందుకు ఒకే ఒక్క హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరా ఉంది.
☛ చంద్రయాన్‌-2లో ఇంధన పరిమాణ పరిమితులు ఎక్కువగా ఉండేవి.
☛ జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్‌ వేగాన్ని అంచనా వేయడంలో ఇబ్బందులు తలెత్తాయి.
☛ మోడలింగ్‌ ఆధారంగా అల్గోరిథమ్‌లను  రూపొందించారు.
 
చంద్రయాన్‌-3 ప్రయోగంలో చేసిన మార్పులు ఇవే..
☛ ఈ ల్యాండర్‌ సెకనుకు మూడు మీటర్ల వేగాన్ని తట్టుకోగలదు. ఉపరితలాన్ని బలంగా తాకినా తట్టుకునేలా ల్యాండర్‌ కాళ్ల డిజైన్‌ను మార్చారు.
☛ ఈసారి 4X2.5 కి.మీల సువిశాల ప్రదేశాన్ని ఎంచుకున్నారు. తొలుత 500X500 మీటర్ల ప్రదేశంలో దిగడానికి ల్యాండర్‌ ప్రయత్నిస్తుంది. అక్కడ కుదరకపోతే 4X2.5 కి.మీల పరిధిలో ఎక్కడైనా దిగొచ్చు. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను జోడించారు.
☛ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరాల సంఖ్యను రెండుకు పెంచారు. చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌, మిషన్‌ కంట్రోల్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు అవి దోహదపడతాయి.
☛ ఇందులో ఇంధన పరిమాణాన్ని హెచ్చించారు. ల్యాండర్‌లోని ఇతర ఉపరితలాలపై కూడా సౌరఫలకాలను పెంచారు. అందువల్ల ఏ ప్రదేశంలో దిగినా అది సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.
☛ చందమామపై దిగేటప్పుడు ల్యాండర్‌ వేగాన్ని ఎప్పటికప్పుడు నిర్దిష్టంగా కొలిచేందుకు.. కొత్తగా అభివృద్ధి చేసిన లేజర్‌ డాప్లర్‌ వెలోసీమీటర్‌ అనే పరికరాన్ని ఏర్పాటుచేశారు.
☛ టెస్ట్‌డేటా ఆధారంగా అల్గోరిథమ్‌లను తయారుచేశారు.
☛ ల్యాండర్‌ సురక్షితంగా దిగేందుకు యాక్సెలెరోమీటర్‌, ఆల్టీమీటర్‌, ఇంక్లినోమీటర్‌, టచ్‌డౌన్‌ సెన్సర్‌, అవరోధాలు తప్పించుకోవడానికి కెమెరాలు తదితర సెన్సర్లు ఉంటాయి. ఇవి చంద్రయాన్‌-2లో పొందుపరిచిన వాటికంటే మెరుగైనవి.

#Tags