Arshad Nadeem: ల‌క్ష్యానికి పేద‌రికం అడ్డు రాద‌న్న అర్షద్ నదీమ్‌.. ఒక్కపూట తిండిలేకున్నా ఒలింపిక్‌ వీరుడిగా..

ఆ దేశ జ‌నాభా సుమారు 25 కోట్లు.

కానీ విశ్వ‌క్రీడలైన‌ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కేవ‌లం ఏడుగురు అథ్లెట్‌లు మాత్ర‌మే ఆ దేశం నుంచి ప్యారిస్ గడ్డపై అడుగుపెట్టారు. ఆ కొద్దిమందికి కూడా ఆర్థిక సహాయం అందించలేని దుస్థితి ఆ దేశానిది. అయితే వారిలో ఓ అథ్లెట్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. 

ఒలింపిక్స్‌లో 40 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న పసిడి పతకాన్ని గెలిచి త‌మ దేశ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాడు. తన విజయంతో కష్టాలతో కొట్టిమిట్టాడుతున్న దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు. అతడే పాకిస్తాన్ బల్లెం వీరుడు అర్షద్ నదీమ్‌. ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో పసిడి పతకాన్ని నదీమ్‌ సొంతం చేసుకున్నాడు. 

ఆగ‌స్టు 8వ తేదీ జరిగిన ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ విశ్వవేదికపై సత్తాచాటిన నదీమ్‌ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నదీమ్‌ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

ఎవరీ అర్షద్ నదీమ్‌?
27 ఏళ్ల నదీమ్‌ జనవరి 2, 1997న పంజాబ్ ప్రావిన్స్‌లో ఖనేవాల్ అనే గ్రామంలో జ‌న్మించాడు. నదీమ్‌కు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. అందులో అతడు మూడోవాడు. నదీమ్‌ తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. అతడొక్క‌డే ఆ కుటుంబానికి జీవనాధారం. దీంతో ఒకకానొక స‌మ‌యంలో తిండికి కూడా నదీమ్‌ ఇబ్బంది ప‌డిన దుస్థితి.

కానీ నదీమ్‌ ల‌క్ష్యానికి త‌న పేద‌రికం అడ్డు రాలేదు. త‌న‌ చిన్నత‌నం నుంచే క్రీడాకారుడు కావాల‌ని క‌ల‌లు క‌న్నాడు. స్కూల్ డేస్‌లోనే క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్,అథ్లెటిక్స్ వంటి క్రీడ‌లలో స‌త్తాచాటేవాడు. ముఖ్యంగా నదీమ్‌కు క్రికెట్ అంటే మ‌క్కువ ఎక్కువ‌. క్రికెట్‌పై అత‌డి అభిరుచి జిల్లా స్ధాయిలో ఆడేలా చేసింది.

Paris Olympics: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. పాకిస్తాన్‌ ప్లేయర్‌కు స్వర్ణ పతకం!

నదీమ్‌ క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్ర‌మంలో ఓ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో జావెద్ ప్ర‌ద‌ర్శ‌న‌కు కోచ్ రషీద్ అహ్మద్ సాకీ ఫిదా అయిపోయాడు. దీంతో అత‌డిని అథ్లెట్‌గా తీర్చిదిద్దాల‌ని అహ్మద్ సాకీ నిర్ణ‌యించుకున్నాడు. జావెలిన్ త్రోపై దృష్టి పెట్టడానికి ముందు న‌దీమ్ షాట్ పుట్‌, డిస్కస్ త్రోను ప్రాక్టీస్ చేసేవాడు.

ఆ త‌ర్వాత పూర్తిస్ధాయిలో జావెలిన్ త్రోయ‌ర్‌గా న‌దీమ్ మారాడు. వ‌రుస‌గా పంజాబ్ యూత్ ఫెస్టివల్స్‌లో బంగారు పతకాలు, ఇంటర్-బోర్డ్ మీట్‌లతో సహా జాతీయ స్ధాయిలో సత్తాచాటాడు. అత‌డు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సర్వీస్ అథ్లెటిక్స్ జట్ల నుండి ఆఫర్లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ఆర్ధికంగా అర్షద్ నదీమ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో 2016లో అత‌డికి వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి స్కాలర్‌షిప్ వ‌చ్చింది.

దీంతో మారిషస్‌లోని ఐఏఏఎఫ్ (IAAF) హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు అవ‌కాశం నదీమ్‌కు ల‌భించింది. ఇదే అత‌డి కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్. ఆ త‌ర్వాత 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం ప‌త‌కం గెలిచి త‌న పేరును ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసుకున్నాడు. అనంత‌రం అత‌డికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ త‌న ప్ర‌యాణాన్ని మాత్రం నదీమ్‌ కొన‌సాగించాడు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జకోవిచ్

బంగారు ప‌త‌కం సాధించిన తొలి అథ్లెట్‌గా..
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం, 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ర‌జ‌త ప‌త‌కాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడ‌ల్ సాధించి త‌న క‌ల‌ను సాకారం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో పాక్ త‌రపున వ్య‌క్తిగ‌త విభాగంలో బంగారు ప‌త‌కం సాధించిన తొలి అథ్లెట్‌గా నదీమ్ నిలిచాడు.

అదేవిధంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల విసిరిన నదీమ్‌.. ఒలింపిక్స్‌లో ఈటెను అత్య‌ధిక దూరం విసిరిన అథ్లెట్‌గా నిలిచాడు. అయితే న‌దీమ్ ఒలింపిక్స్ బంగారు ప‌త‌క విజేత‌గా నిల‌వ‌డంలో అత‌డి గ్రామ ప్ర‌జ‌ల సాయం మ‌ర‌వ‌లేన‌ది. చాలా సంద‌ర్భాల్లో అత‌డికి ఖనేవాల్ ప్ర‌జ‌లు ఆర్ధికంగా సహాయం చేసి పోటీల్లో పాల్గొనేలా తోడ్ప‌డ్డారు.

#Tags