Global Warming: భగ్గుమంటోన్న భూగోళం.. 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత..!

మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది.

గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా జ‌న‌వ‌రి 9వ తేదీ (మంగళవారం) ఐరోపా యూనియన్‌కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌’ (సీసీసీఎస్‌) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్‌ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది.

భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్‌లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్‌ అంటున్నాయి. 

పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్‌లో జరిగిన ‘కాప్‌–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్‌ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్‌ అనే హద్దు అలిఖిత శాసనమైంది.

Space Meal: వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం.. తయారు చేసిన శాస్త్రవేత్తలు..!

ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసం..
అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్‌లో మొదలై డిసెంబర్‌ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్‌లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్‌ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. 

గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్‌ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట.

ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్‌ నినో.. ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి.

డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్‌లే కాదు.. వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా.. వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి.

Lithium Blocks: అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్‌ దృష్టి.. 5 బ్లాక్‌ల కొనుగోలుకు చర్చలు..

భూతాపంతో ఉడికిపోయిన ప్రాంతాలు..
ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి.  

పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘటనల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావరణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది.

ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్‌ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! 

Best Food Cities: ఉత్తమ ఆహార జాబితాలో చోటు దక్కించుకున్న 5 భారతదేశ‌ నగరాలు, టాప్ 10 న‌గ‌రాలివే..!

#Tags