భారతదేశంలో మహిళల భద్రత – సమీక్ష

ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత:) అని ఆర్యోక్తి. మాతృదేవో భవ: అనే సనాతన ధర్మానికి నెలవు భారతదేశం. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి. పోలీసులున్నారు. చట్టాలున్నాయి. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్థరాత్రి అన్నాడు. కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపురించింది. ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి / మహిళ క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. గృహ హింస చట్టం (Domestic Violence Act), వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. దేశంలో రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న అకృత్యాలు, అత్యాచారాలు, నిర్భయ లాంటి ఘటనలు, కొత్త చట్టాల నేపథ్యంలో భారత దేశంలో మహిళల భద్రతపై ఈవ్యాసం మీకోసం..

భారతదేశంలో మహిళలపై నేరాలు - స్థితిగతులు
భారతదేశంలో ప్రతీ గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురికావడం దేశంలో నెలకొన్న పరిస్థితి ఎంత విషమంగా ఉందో చెబుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిమిషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, వరకట్నం కోసం ప్రతి 99 నిమిషాలకు ఒక వధువు బలి అవుతోంది.

2012లో దేశవ్యాప్తంగా మహిళలపై 2,44,270 నేరాలు జరిగాయి. ఏటా మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యాచారాలు, అపరహరణలు, వరకట్న వేధింపులు, అమ్మాయిల అక్రమ రవాణా ఇలా అనేక విధాలుగా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ నేరాలు మహిళాభివృద్ధికి శాపంగా మారాయి. చిన్నారులు, యువతులు, మహిళలపై నగరాలు, పట్టణాలు సహా చివరికి గ్రామాల్లో సైతం విచక్షణరహితంగా దాడులు జరుగుతున్నాయి. 2011లోనే దేశంలోని 53 మహానగరాల్లో 33,789 మంది మహిళలపై దారుణాలు జరిగాయి. 2009-11 సంవత్సరాల మధ్య దేశంలో మొత్తం 68 వేల మందికి పైగా మహిళలపై అత్యాచారాలు జరిగాయి. మధ్యప్రదేశ్ లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అక్కడ మూడేళ్లలో 9,539 మందిపై దాడులు జరిగాయి.

జాతీయ నేర గణాంక సంస్థ (National Crime Records Bureau) గణాంకాల ప్రకారం వరకట్న సంబంధ సమస్యలతో 2001 జనవరి నుంచి 2012 డిసెంబర్ వరకు 91,202 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. 2012 లోనే మొత్తం 8,233 వరకట్న చావులు నమోదయ్యాయి. ముఖ్యంగా 2007 నుంచి 2011 వరకు ఏటా అవి పెరుగుతూనే ఉన్నాయి. 2007లో 8,093 , 2011 వచ్చే సరికి 8,618 కి పెరిగింది. అయినా ఈ కేసుల్లో దోష నిర్ధారణ శాతం 2011 తో పోల్చితే 2012 లో 3.8 శాతం తగ్గడం గమనించాల్సిన విషయం. 2008లో 4 గంటలకోసారి వినిపించిన ఆర్తనాదం ఇప్పుడు గంటకొకటిగా మారింది.

దేశంలో మహిళల్లో 70 శాతం మంది ఏదో ఒక రూపంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు. NCRB ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకసారి భర్త అత్తమామల రూపంలో వివాహితలు వేధింపులు, హింస బారిన పడుతున్నారు.

పనిచేసే మహిళల్లో (Working women) ఎక్కువ శాతం విధులకు వెళ్లి వచ్చేటప్పుడు తమకు రక్షణ లేదని వెల్లడించారని అసోచామ్‌సర్వే తేల్చింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలతో పాటు ముంబై, పూణె, కోల్‌కతా, హైదరాబాద్‌లోని పెద్ద సంస్థలతో పాటు, మధ్యస్థ చిన్నతరహా కంపెనీల్లో పనిచేస్తున్న 5 వేల మందిని ఈ సంస్థ సర్వే చేయగా, ఏకంగా 92 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీపీఓ, ఐటి అనుబంధ రంగాలు, హాస్పిటాలిటీ, పౌర విమానయానం, నర్సింగ్‌హోమ్స్ లో పనిచేస్తున్న మహిళలు తమకు తగిన రక్షణ లేదని చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో లేకపోవడం, సమాచార లోపాల కారణంగా నేరాలకు ఆస్కారం ఏర్పడుతోంది. పట్టణాల్లో పోలీసు భద్రత, నిరంతర గస్తీ ఉన్నప్పటికీ నేరాలు విచ్చల విడిగా జరుగుతున్నాయి. అభం శుభం తెలియని పసిమొగ్గలతో పాటు బాలికలు, మహిళలపై జరిగే దాడులు దేశానికి మచ్చతెస్తున్నాయి. విదేశీ మహిళా పర్యాటకులపై చోటుచేసుకుంటున్న వేధింపుల సంఘటనలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని సాక్షాత్తూ పర్యాటక శాఖే నిగ్గుతేల్చింది.

రాజ్యాల కోసం యుద్ధాలు జరిగినా, దేశ విభజనలు జరిగినా, సామాజిక సమస్యలపై పోరాటాలు జరిగినా, కులమతాల కుమ్ములాటలు జరిగినా మొదటి బాధితులు మహిళలే అవుతున్నారు. చివరికి వినిమయ సంస్కృతిలో ఒక మారకపు వస్తువుగా మార్చేస్తున్నారు. ఫలితంగా అమ్మ కడుపులోనే అంతం చేసేందుకు కూడా సాహసిస్తున్నారు. ఇలా పుట్టుక నుంచి చావుదాకా అడుగడుగునా ఆంక్షలతో, అభద్రతతో జీవించాల్సిన స్థితికి నెట్టబడుతున్నారు.

దేశవ్యాప్తంగా 2012లో మహిళలపై నమోదైన నేరాలు (NCRB నివేదిక ప్రకారం)
జమ్మూకాశ్మీర్ : 3,328
హిమాచల్ ప్రదేశ్: 912
పంజాబ్ : 3,238
ఉత్తరాఖండ్: 1067
లక్షద్వీప్: 2
అండమాన్, నికోబార్ ద్వీపాలు: 49
పుదుచ్చేరి: 61
తమిళనాడు: 7,192
కేరళ: 10,930
కర్నాటక: 10,366
ఆంధ్రప్రదేశ్: 28,171
గోవా: 200
మహారాష్ట్ర: 16,353
ఒడిశా: 11,988
ఛత్తీస్ గఢ్: 4,228
మధ్యప్రదేశ్: 16,832
గుజరాత్: 9,561
డామన్, డయ్యు: 11
దాద్రా నగర్ హవేలి: 16
పశ్చిమ బెంగాల్: 30,942
జార్ఖండ్: 4,536
బీహార్: 11,229
ఉత్తరప్రదేశ్: 2,569
రాజస్థాన్: 21,106
ఢిల్లీ: 5,959
హర్యానా: 6,000
చండీగఢ్: 24
అరుణాచల్ ప్రదేశ్: 201
అసోం: 255
నాగాలాండ్: 51
మణిపూర్: 304
మిజోరాం: 199
మేఘాలయ: 255
త్రిపుర: 1,550
సిక్కిం: 611

మహిళలపై నేరాలకు కారణాలు:
  1. పితృస్వామిక భావజాలం:
    అనాదిగా కొనసాగుతున్న పితృసామ్య వ్యవస్థ మహిళలను శారీరకంగా, మానసికంగా బలహీనులుగా మార్చి లింగపరమైన అసమానతల సమాజంగా మార్చడం వల్లనే మహిళలపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మహిళలను సంభోగ వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా, వంటింటి కుందేలుగా, వరకట్నం తీసుకువచ్చేవారిగా మాత్రమే చూస్తూ వారిపై అజమాయిషీ చలాయించే పితృస్వామిక భావజాలం సమాజంలో బాగా పాతుకుపోయి ఉంది. భారతీయ సమాజంలో ఆడది అంటే చులకన భావం వ్యాపించి ఉంది. పురుషాధిక్య సమాజం మహిళను ఏమీ చేయలేని బలహీనురాలు, నిస్సహాయురాలిగా చిన్నచూపు చూస్తోంది. దీనిని ఉగ్గుపాలతో కలిపి తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచుతున్నారు. భార్య, తల్లి, పక్కింటమ్మాయి అందరూ ఆడవాళ్ళే. వారిపై నేనేం చేసిన చెల్లుబాటు అవుతుందనే ధోరణి. వారిని దాడులకు పురిగొల్పుతోంది. స్త్రీ అస్తిత్వాన్ని గుర్తించని పితృస్వామిక ఆధిపత్య ధోరణి మహిళలపై లైంగిక, భౌతిక దాడులకు కారణమవుతోంది.
  2. వరకట్న దాహం:
    మహిళలపై హత్యాయత్నాలు, భౌతిక దాడులకు ప్రధాన కారణం వరకట్నం. నిరక్షరాస్యుల నుంచి ఉన్నత విద్యావంతుల వరకు, పేదల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ వరకట్నం కోసం, అదనపు కట్నం కోసం మహిళలను చిత్రవధ చేస్తున్నారు.
  3. చలన చిత్ర,, శ్రవణ మాధ్యమాల ప్రభావం:
    మహిళలను అన్ని రకాల వ్యవస్ధలలోనూ ఆట వస్తువుగానే చూస్తున్నారు. మహిళపై లైంగిక దాడులకు మరో ప్రధాన కారణం చలనచిత్ర, శ్రవణ మాధ్యమాలు. స్త్రీ అంగాంగ ప్రదర్శన, వర్ణనలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి చలనచిత్ర, దృశ్య మాధ్యమాలు. స్త్రీని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కాకుండా శృంగార వస్తువుగా చిత్రీకరిస్తున్నారు. ఫిలిం సెన్సార్ బోర్డు ఉన్నా ఐటం సాంగ్ లేని సినిమాలు రాకపోవడం దురదృష్టకరం. హీరోయిజం.. సినిమాలు, హీరోల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హీరోయిన్ ప్రేమిస్తున్నట్లు.. దానికి ఎంతకైనా తెగించి గొప్ప ప్రేమగా నిరూపించుకున్నట్లు.. సినిమాల్లో చూపిస్తారు. దీన్నే నిజజీవితంలో నేటి యువత పాటిస్తుంటారు. రాక్షస ప్రేమతో అమ్మాయిల మనసులు గాయపరుస్తుంటారు. ఇది చాలా అనర్ధదాయకం. సినిమాల్లో ప్రేమ పేరుతో మహిళలపై జరిగే దాడిని చూపించే దృశ్యాలను కట్టడి చేయకపోవడం వల్లే ఈ విపరిణామాలు సంభవిస్తున్నాయంటున్నాయి మహిళాసంఘాలు. అటు సీరియళ్లలోనూ మహిళలపై దౌర్జన్యాలను చూపిస్తున్నారు. దీనివల్ల యువత పెడదోవ పడుతోంది.
  4. పోర్నోగ్రఫీ (అశ్లీల సాహిత్యం, దృశ్యాలు):
    సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సాంకేతికరంగ అభివృద్ధి సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతే విచ్ఛిన్నం కలిగిస్తోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే దుష్పరిణామాల్లో మహిళలపై లైంగిక దాడులు కూడా ఒకటి. నియంత్రణ లేని అశ్లీల సాహిత్యం, అసభ్యకర దృశ్యాలు నేడు మొబైల్స్, ల్యాప్ టాప్, కంప్యూటర్ లలో దర్శనమిస్తున్నాయి. ఇవన్ని చాలా సులభంగా లభిస్తుండటం వల్ల యువత మనసులను కలుషితం చేయడమే కాదు స్త్రీలపై లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడేలా పురికొల్పుతున్నట్లు అనేక కేసుల్లో వెల్లడైంది.
  5. పాశ్చాత్యీకరణ:
    సమాజంపై పాశ్చాత్యీకరణ ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడి శృంగారం లాంటి పెడ ధోరణుల ప్రభావంతో యువత మహిళలపై లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విదేశీ సంస్కృతి ప్రభావంతో యువత ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు లెక్కలేనన్ని వెలుగులోకి వస్తున్నాయి.
  6. నైతిక విలువల పతనం:
    సమాజంలో అన్ని వ్యవస్థల్లోనూ నైతిక విలువలు పతనమవుతుండటం కూడా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక దాడులు పెరగడానికి ఒక కారణమే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమవడంతో పిల్లల్లో తగిన పరిపక్వత, సంపూర్ణ వ్యక్తిత్వం పెంపొందటం లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, స్వీయ నియంత్రణపై యువతకు తగిన మార్గనిర్దేశం చేసేవారే కరువయ్యారు. ఇంటా బయటా వారికి తగిన క్రమశిక్షణ, జవాబుదారీతనం లోపించడం కూడా నేర తీవ్రతకు దారితీస్తుంది.
  7. పైశాచిక ప్రేమ:
    అమ్మాయిలు ప్రేమ అంగీకరించని కారణంగా అబ్బాయిలు యాసిడ్ దాడులు, గొంతుకోయడం లాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అమ్మాయి తనకు దక్కలేదని కసి, పగ, ద్వేషాలు పెంచుకొని దాడులు చేస్తున్నారు. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదని బాహ్య సౌందర్యాన్ని పాడుచేయాలని యాసిడ్ దాడులు చేస్తున్నారు. నేరప్రవృత్తి ఉన్నవారే ఎక్కువగా ఈ నేరాలకు పాల్పడుతున్నారు.
  8. విష సంస్కృతి:
    అభివృద్ధి పరిణామాల కారణంగా జీవనశైలిలో మార్పులు వస్తున్నాయి. ప్రమాణాలు మారుతున్నాయి. ఇదే తరహాలో నేరాలూ పెచ్చరిల్లుతుండటం ఆందోళనకర పరిణామం. సామూహిక అత్యాచారాల వంటి క్రూర ఘటనలు నానాటికీ పెరిగిపోతుండటం సభ్యసమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అత్యాచారం కేవలం మహిళల సమస్యకాదు. సమాజంలోని మానసిక రుగ్మతకు చిహ్నం. అడుగంటుతున్న మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం. అనేక ఘటనల్లో అత్యాచారానికి పాల్పడిన నిందితులు, బాధితులకు తెలిసినవారై ఉంటున్నారు. విద్యావంతులైనవారు సైతం వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. మహిళలపై ఇంటా బయటా ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి సామాజికంగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రం. అందుకే ఎలాంటి జంకు లేకుండా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
  9. చట్టంపై అవగాహనా రాహిత్యం:
    వరకట్న నిషేధ చట్టం, గృహ హింస చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, భ్రూణ హత్యల నియంత్రణ చట్టం లాంటివి ఎన్ని వచ్చినా వాటిపై ఇప్పటికీ ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహనే లేదు. దీనివల్ల తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. నేరాలకు పాల్పడుతున్నవారికి కూడా ఇటువంటి చట్టాలపై అవగాహన ఉండట్లేదు. నిర్భయ చట్టం వచ్చాక కూడా దేశంలో వందల కొద్దీ కేసులు నమోదవ్వడం దీనికి నిదర్శనం.
  10. చట్టం అమల్లో జాప్యం:
    మహిళలకు సంబంధించి ఇప్పటికే అనేక చట్టాలు వచ్చాయి. వరకట్న నిషేధిత చట్టం వచ్చినా అది అమలుకు నోచుకోలేదు. ఇలా అనేక చట్టాలు వచ్చినా వాటి అమలు జరగడం లేదు. చట్టాలు రావాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు మారాలి. చట్టాన్ని సరిగా అమలు చేసే యంత్రాంగం, చట్టం స్ఫూర్తిగా నడిచే అధికారులు ఉండట్లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఒక బాల నిందితుడికి మూడేళ్ల శిక్షపడటం చట్టపర లొసుగుల ఫలితమే.
    శిక్ష అమలులో జాప్యం: 2009-11 మధ్యలో మహిళలపై దాడులకు పాల్పడినవారిలో నేర నిరూపణ జరిగి శిక్షపడింది కొద్దిమందికి మాత్రమే. వేధింపుల కేసుల్లో కూడా శిక్షలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. 2009-11 సంవత్సరాల మధ్య దేశంలో మొత్తం 1,22,292 కేసులు నమోదయ్యాయి. 27,408 మందికే శిక్షలు పడ్డాయి.
  11. పోలీసుల వైఖరి:
    నేరానికి పాల్పడిన వాడిని వెంటనే వెతికి పట్టుకొని కోర్టులో హాజరు పరచాలి. కానీ, పోలీసులే నేరాలు చేస్తున్నారు. అందుకే నేరస్తులు భయపడడం లేదు. లోపభూయిష్ఠమైన విచారణ విధానాలు, తగిన సాక్ష్యాలు సేకరించలేక పోలీసులు చేతులెత్తేస్తుండటంతో నిందితులు శిక్షల బారి నుంచి సులభంగా తప్పించుకోగలుగున్నారని కేంద్ర హోంశాఖ వర్గాలు వాపోతున్నాయి. అత్యాచారం కేసుల్లో పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నవే. ఈ దేశంలో చట్టంతో, పోలీసులతో మొత్తం మారిపోతుందనుకోవడం అవివేకం. ప్రభుత్వాలు సైతం శిక్షలను పకడ్బందీగా అమలు చేయాలి.
  12. రాజకీయ పలుకుబడి:
    మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, భౌతిక దాడులకు పాల్పడే నిందితులను సమాజం నుంచి వెలేస్తారని తెలిసినా దాడులకు పాల్పడుతున్నారు. దీనికి కారణం సదరు నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండడమే. దాంతో కేసును ఎలాగైనా కప్పి పుచ్చవచ్చనే దురుద్దేశంతో దాడులకు వెనుకాడడం లేదు.
  13. శాసనకర్తలే కళంకితులు:
    దేశవ్యాప్తంగా వివిధ పార్టీల తరపున ఎన్నికైన 369 మంది MP, MLAలపై అత్యాచార కేసులు నమోదైనట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని ప్రజాస్వామ్య హక్కుల సంస్థ వెల్లడించింది. దేశంలోని మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే గౌరవం ఎలాంటిదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. రక్షణ కల్పించాల్సిన పాలకుల స్థానంలో భక్షించే కీచకులున్నారని మరోసారి తేటతెల్లమైంది. అత్యాచార కేసుల్లో నిందితులుగా పరిగణించి, కోర్టు విచారిస్తున్న ఆరుగురు ప్రముఖులకు వివిధ పార్టీలు టికెట్లు ఇచ్చాయి. వారంతా ప్రస్తుతం శాసన సభల్లో కొనసాగుతున్నారు. 2009 లో లోక్‌సభలో ఎంపికైన ఆరుగురు MPలు అత్యాచార కేసుల్లో చిక్కుకున్నవారే. వీరే కాదు మరో 34 మంది MPలు సైతం మహిళా వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
జస్టిస్ వర్మ కమిటీ నివేదిక - ముఖ్యాంశాలు: ప్రస్తుతం అమల్లో ఉన్న నేర చట్టాలను అవసరాలకనుగుణంగా మార్చడానికి, తగిన సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.వర్మ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. హిమాచల్‌ప్రదేశ్ హై కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లీలాసేథ్, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల స్వామి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా సమీక్షించిన ఈ కమిటీ సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ సూత్రబద్ధమైన లక్ష్యాలకే పరిమితం కాకుండా మహిళల భద్రత, రక్షణకు అవసరమైన, విస్తృతమైన సిఫార్సులను చాలా లోతుగా సామాజిక కోణం నుంచి చేసింది. 644 పేజీల నివేదికలో సునిశితత్వం, సమగ్రత రెండూ కన్పిస్తున్నాయని, మహిళల పరిస్థితి మెరుగవడానికి ఈ నివేదిక దోహదం చేస్తుందని సానుకూల స్పందన వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని క్రిమినల్ నేరాల చట్ట సవరణలో చేర్చలేదన్నదే కీలక చర్చనీయాంశం.

నివేదిక - ముఖ్య సిఫార్సులు
  1. పాలనా వైఫల్యంతో పెరిగిన నేరాలు:
    జస్టిస్ వర్మ కమిటీ అభిప్రాయంలో మహిళలపై అత్యాచారాలు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పాలనా వైఫల్యం, పోలీసుల స్పందనా రాహిత్యం. లింగ వివక్షతను రూపుమాపడంతో పాటు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందించినా అమలు విషయంలో ప్రభుత్వ పాలనా యంత్రాంగం అవసరమైన శ్రద్ధ చూపడం లేదు. అత్యాచారాలకు గురైన మహిళలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే పలు సందర్భాల్లో పోలీసులు కేసులను నమోదు చేసుకోవడం లేదని, అభ్యంతరకర ప్రశ్నలతో వేధిస్తున్నారన్న విమర్శను ఈ కమిటీ ప్రధానంగా పరిశీలించింది.
  2. అత్యాచారాలు, లైంగిక వేధింపులు- సామాజిక సమస్య:
    మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య కేవలం పాలనాపరమైన, న్యాయపరమైన సమస్య మాత్రమే కాదు. సామాజిక సమస్య కూడా. సామాజికంగా ఎంతో పురోగతిని సాధించామని చెప్పుకొనే భారతీయ సమాజంలో నేటికీ లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది.
  3. చట్టాలను నిజాయితీగా, సమర్థవంతంగా అమలు చేయాలి:
    మహిళల భద్రతను, గౌరవాన్ని కాపాడటానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత సమర్థవంతంగా, చిత్తశుద్ధితో అమలుచేస్తే సరిపోతుందని, ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయని, ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులను చేయాలని కమిటీ సూచించింది.
  4. సత్వర న్యాయం -చాలినంత న్యాయ సిబ్బంది:
    భారత రాజ్యాంగ ప్రకరణ 21 ప్రకారం ప్రజలందరికి ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉంది. సత్వర న్యాయాన్ని ఇందులో అంతర్భాగంగానే చూడాలి. చట్టం పటిష్టతకు, ఆశించిన ప్రభావాన్ని చూపేందుకు, ఉల్లంఘనకు గురికాకుండా ఉండేందుకు కూడా సత్వర న్యాయం అవసరం. దీనికి ఉన్న ప్రధాన ప్రతిబంధకం న్యాయస్థానాల్లో కేసులు చాలా కాలంగా పేరుకుపోయి ఉండటమే. ఈ పరిస్థితి మెరుగవాలంటే సరిపడ న్యాయ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. మౌలిక వసతులను కల్పించి కొన్ని వ్యవస్థాగత మార్పులు చేపట్టాలి. అందులో భాగంగా దశలవారీగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం, Fast Track కోర్టులను ఏర్పాటు చేసి బాధితురాలికి న్యాయాన్ని అందించాలని కమిటీ సూచించింది. ఎంత కఠినమైన శిక్ష పడింది అనే దాని కంటే ఆ శిక్షలు ఎంత వేగంగా పడ్డాయన్నది కీలకం.
  5. మరణశిక్ష సమర్థనీయం కాదు:
    ఢిల్లీలో నిర్భయ సామూహిక అత్యాచార ఘటన అనంతరం ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులకు మరణ శిక్ష విధించాలని పౌర సమాజం సూచించింది. అయితే మరణశిక్ష సమస్యకు పరిష్కారం కాదని, నేర తీవ్రతను బట్టి 7 ఏళ్ల నుంచి యావజ్జీవం వరకు విధించాలని, వైద్య ఖర్చులను వసూలు చేయాలని కమిటీ సూచించింది. కానీ తాజా చట్టంలో కనీసం 20 ఏళ్లు జైలు శిక్ష విధించాలని, ఒకవేళ బాధితురాలు మరణించినా లేదా సాధారణ జీవితం గడిపే పరిస్థితి లేకపోయినా నేరస్థుడికి మరణశిక్షను విధించవచ్చని పొందుపరిచారు.
  6. లైంగిక వేధింపులు-బెదిరింపులు:
    అనుమతి లేకుండా లైంగిక దురుద్దేశాలతో ముట్టుకోవడాన్ని నేరంగా పరిగణిస్తూ దీనికి ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించాలని సూచించింది. వేధించే ఉద్దేశంతో అశ్లీల సంభాషణలు, సంకేతాలివ్వడం వంటివి లైంగికపరమైన బెదిరింపుల కిందకు వస్తాయని వీటికి ఏడాది కఠిన శిక్షతోపాటు జరిమానా కూడా వేయాలని సిఫార్సు చేసింది. తాజా చట్టంలో వీటిని పొందుపరిచారు.
  7. నగ్న చిత్రాలు (Voyeurism), వెంటాడటం (Stalking): అశ్లీల చిత్రాలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించడం మొదలైన నేరాలకు 1 నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు వీటిని నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణించారు. తరచూ వెంటాడి వేధించడం, తనకు ఇష్టం లేకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నించడం, ఈమెయిల్స్, కదలికలపై నిఘా పెట్టడం, ఇటువంటి చర్యలను వర్మ కమిటీ ప్రత్యేక నేరాలుగా పరిగణించి 1 నుంచి 3 ఏళ్ల కారాగారం విధించాలని సూచించింది. రెండోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే యావజ్జీవ శిక్ష విధిస్తారు.
  8. బలవంతం చేస్తే భర్త కూడా నేరస్థుడే:
    వైవాహిక బంధంలోనైనా భాగస్వామి ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక సుఖాల కోసం బలవంతం చేస్తే నేరస్థులుగానే పరిగణించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. వైవాహిక అత్యాచారం పై చట్టాల్లోని నిర్వచనాన్ని సరిదిద్దాలని సూచించింది. భార్యపై భర్తకు సర్వ హక్కులు అనే భావనకు స్వస్తి పలకాలని కమిటీ సిఫారసు చేసింది.
  9. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సమీక్షించాలి:
    కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలోని సాయుధ దళాలకు 1958లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఏర్పాటు చేశారు. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, ఈ చట్టం ముసుగులో మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. మణిపూర్‌లో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల పుష్కర కాలం నుంచి నిరాహార దీక్ష చేస్తోంది. సాయుధ దళాల అత్యాచారాలను క్రిమినల్ చట్టాల కింద విచారించాలని దాని కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతిని తీసుకునే ప్రస్తుత పద్ధతిని సవరించాలని సూచించింది.
  10. చికిత్స నిరాకరిస్తే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తప్పవు:
    అత్యాచార బాధితురాలికి సమీపంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి చికిత్స నిరాకరించడానికి వీలు లేదు. పోలీసులకు సమాచారం అందిస్తూనే చికిత్స ఆరంభించి, ఉచితంగా సేవలందించాలి. ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండని తప్పించుకోవడానికి వీల్లేదు. చికిత్స నిరాకరించడం నేరం అవుతుంది. అటువంటి ఆస్పత్రి నిర్వాహకులకు, విధుల్లో ఉన్న సిబ్బందికి ఏడాదిపాటు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేసు నమోదు చేయడంతోపాటు బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా అధికారి సమక్షంలో నమోదు చేయాలని, వీడియో ద్వారా చిత్రీకరించాలని చట్టంలో పేర్కొన్నారు.
  11. ఆత్మరక్షణార్థం చేసే హత్య నేరంగా పరిగణించరాదు:
    మహిళలపై పెరుగుతోన్న పలు రకాలైన లైంగిక అత్యాచారాలను ఎదుర్కోవడానికి తమను తాము రక్షించుకునే పరిస్థితి ఉండాలి. అత్యాచారానికి పాల్పడే వ్యక్తిని బాధితురాలు హత్య చేస్తే దాన్ని ఆత్మ రక్షణ హక్కుగా గుర్తిస్తూ ఐపీసీ సెక్షన్ 100 ను సవరించాలని సూచించింది.
  12. బాల నేరస్థుల నిర్ధార వయసులో మార్పు అవసరం లేదు:
    అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి 18 ఏళ్లలోపు వయసున్న వారిని బాల నేరస్థులుగా పరిగణిస్తున్నారు. నిర్భయ అత్యాచారం కేసులో నిందితుల్లో ఒకడు బాల నేరస్థుడు. ఆమె తీవ్రంగా గాయపడటానికి ఇతను ముఖ్య కారకుడు. అతి క్రూరంగా హింసించి, పైశాచికంగా లైంగికదాడికి పాల్పడటం బాల నేరం అవుతుందా అనే చర్చ జరిగింది. కాబట్టి వయసును తగ్గించాలని పౌర సమాజం డిమాండ్ చేసింది. వర్మ కమిటీ ఈ సూచనను తిరస్కరించింది. వయోపరిమితిని తగ్గించాల్సిన అవసరం లేదని చెప్పింది.

ప్రభుత్వం చేపట్టిన చర్యలు:
క్రిమినల్ నేరాల చట్ట సవరణ - 2013:

అత్యాచారాల విషయంలో మహిళలకు మరింత రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం 2012 డిసెంబర్ 4వ తేదీన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ చేసిన సిఫారసులు ఆ బిల్లుకు మూలాధారం. అదే నెల 16న నిర్భయ సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వర్మ కమిటీ నియామకం, సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. అయితే వర్మ కమిటీ నివేదికలోని సిఫారసులను చాలా వరకు ప్రభుత్వం విస్మరించిందనే విమర్శలు లేకపోలేదు.

నిర్భయ చట్టం:
ఇండియన్‌పీనల్‌కోడ్‌ (IPC), కోడ్‌ఆఫ్‌ క్రిమినల్‌ప్రొసీజర్‌(CPC), ఇండియన్‌ఎవిడెన్స్ యాక్ట్, లైంగిక అత్యాచారం నుంచి పిల్లలను రక్షించే చట్టం తదితరాలను సవరించి నేర న్యాయ (సవరణ) చట్టం -2013 చేశారు. ఈ చట్టం కింద సాధారణంగా అత్యాచార నిందితులకు 20 ఏళ్ల శిక్ష విధిస్తారు. రెండోసారి అత్యాచారానికి పాల్పడితే జీవిత ఖైదు విధిస్తారు. Eve teasing పై కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఇతరుల శృంగారాన్ని రహస్యంగా చూసినా నేరంగా పరిగణిస్తారు. పరస్పర అంగీకార శృంగార వయస్సు 18 ఏళ్లుగా నిర్ధారించారు. మహిళలపై నేరాలకు పాల్పడే ప్రభుత్వ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు, ఆర్థికంగా పలుకుబడి గల వ్యక్తులను కూడా ఈ చట్టంలోని సెక్షన్ 367 కింద శిక్షిస్తారు. చట్టాన్ని మాత్రం చాలా పకడ్బంధీగా రూపొందించారు.

చట్టంలోని ముఖ్య అంశాలు:
  1. అత్యాచారం, సామూహిక అత్యాచారినికి పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్ష. అవసరమైతే చనిపోయేంత వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు.
  2. గతంలో చేసిన ఇటువంటి నేరాల్లో కూడా దోషిగా తేలితే, మళ్లీ అలాంటి వాటికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు.
  3. పరస్పరామోద శృంగారానికి వయోపరిమితి 18 ఏళ్లు.
  4. మహిళలను వెంటాడటం, ఇతరులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు, శృంగారంలో పాల్గొంటున్నప్పుడు దొంగచాటుగా చూడటం వంటి నేరాలను శిక్షార్హమైనవిగా ప్రకటించారు. ఈ నేరాలను శిక్షార్హమైన నేరాలుగా ప్రకటిచండం ఇదే తొలిసారి.
  5. ఇటువంటి నేరాలకు తొలిసారి పాల్పడితే బెయిల్ ఇస్తారు. అటువంటి నేరాలకు పదేపదే పాల్పడితే బెయిల్ ఇవ్వరు.
  6. యాసిడ్ దాడి దోషులకు 10 ఏళ్ల జైలు శిక్ష. ఈ దాడిని నేరంగా ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ దాడి బాధితులకు ఆత్మరక్షణ హక్కు కల్పించారు.
  7. అత్యాచార, యాసిడ్ దాడుల బాధితులకు అన్ని ఆస్పత్రులూ తప్పనిసరిగా చికిత్స అందించాలి. నిరాకరిస్తే జైలు శిక్ష విధిస్తారు.
  8. పోలీసు అధికారులు, ప్రజాసేవకులు, సాయుధ బలగాల సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది మహిళలపై తీవ్ర నేరాలకు పాల్పడితే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష. అవసరమైతే యావజ్జీవం, జరిమానా కూడా విధిస్తారు.
  9. అత్యాచార బాధితురాలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మానసిక, శారీరక వికలాంగురాలైతే ఆమె వాంగ్మూలాన్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు అనుసంధానకర్త సాయంతో నమోదు చేయించడానికి అనుమతి, వాంగ్మూల ప్రక్రియను చిత్రీకరిస్తారు.
  10. అత్యాచార బాధితురాలు చనిపోయినా లేదా జీవచ్ఛవంగా మారినా దోషికి కనీస శిక్షగా ఇరవై ఏళ్లు జైలు, గరిష్టంగా చనిపోయే వరకు జైలు శిక్ష విధించే అవకాశం.
నిర్భయ చట్టం అనంతర పరిణామాలు:
నిర్భయచట్టం ప్రకారం అత్యాచార ఘటనలో బాధితురాలు మరణించినా లేదా శాశ్వతంగా అచేతన స్థితిలో ఉండిపోయినా నేరస్థులకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడాలి. నేరస్థులు జీవించి ఉన్నంత కాలం పాటు జైలు లేదా మరణశిక్ష విధించవచ్చని చట్టంలో నిర్దేశించారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా మహిళలపై 400లకు పైగా అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. కఠిన చట్టాలు వచ్చినా నేరగాళ్ల ప్రవృత్తి మారడం లేదు.

పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు:
సమగ్ర కార్యాచరణ చర్యల ద్వారా మహిళలపై నేరాలను సమూలంగా నియంత్రించవచ్చని పార్లమెంటరీ స్థాయీసంఘం స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై సమగ్రంగా నడుం బిగించాల్సిన అవసరముందని స్థాయీ సంఘం పేర్కొంది. ప్రత్యేక సమన్వయ కమిటీ లేదా పర్యవేక్షక వ్యవస్థ ఉండాలని సూచించింది. పోలీసు యంత్రాంగాన్ని పటిష్ఠ పరచాలని, వారికి ఆయుధాలతో పాటు ఆధునిక సమాచార సామగ్రి, ఇతర మౌలిక వసతులను కల్పించాలని సూచించింది.

లైంగిక వేధింపుల నిరోధక చట్టం:
పనిచేసేచోట సురక్షిత వాతావరణం కల్పించడం, మహిళలు ఆర్ధికంగా స్వతంత్రత సాధించాలంటే, వారు సురక్షితంగా పనిచేసుకునేలా చర్యలు తీసుకోవడం అవసరం. మొదటిసారి దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న స్త్రీలందరిని లైంగిక వేధింపుల నిరోధక చట్టపరిధిలోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రతి పని ప్రదేశంలోను ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలి. స్త్రీల ఆధ్వర్యంలో, సగం మందికి పైగా మహిళా సభ్యులతో ఎస్‌.సి., ఎస్‌.టి., మైనారిటీ మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ కమిటీలను రూపొందించాలి. అలా చెయ్యని పక్షంలో యాజమాన్యాలు శిక్షార్హమౌతాయి. యాజమాన్యాలు ఈ చట్టం గురించి అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలి. ప్రభుత్వోద్యోగుల సర్వీస్‌ రూల్స్ ను మార్చాలి. విధి నిర్వహణలో తప్పులు చేసినపుడు ఎలాంటి శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలుంటాయో లైంగిక వేధింపులకు పాల్పడితే అలాంటి శిక్షలు / క్రమశిక్షణా చర్యలు తప్పవనే హెచ్చరికతో యాజమాన్యాలు ఈ చట్టం అమలుకు చిత్తశుద్ధితో పని చేయాలి. పనిచేసే చోట భద్రమైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదే కాబట్టి వారు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలి. మహిళలు సురక్షితంగా, హాయిగా పనిచేసుకునే పరిస్థితులేర్పడే లాగా స్త్రీల సంఘాలు ఈ అంశం మీద పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలి.

నేపథ్యం: 1997లో సుప్రీమ్‌కోర్టు విశాఖ జడ్జిమెంట్‌లో మొట్ట మొదటిసారి పనిచేసే చోట లైంగిక వేధింపులంటే ఏమిటి? నిత్యం మహిళలు ఎలాంటి వేధింపుల్ని ఎదుర్కొంటారు? అవి ఎలా ఉంటాయి? అంటూ ప్రస్తావిస్తూ వేధింపుల్ని చాలా విపులార్ధంలో నిర్వచించింది. ఈ సందర్భంలో విశాఖ కేసు పూర్వాపరాలను ఒకసారి పరికించాల్సి ఉంటుంది. రాజస్థాన్‌లో ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ, తన ఉద్యోగ ధర్మంగా బాల్య వివాహాలను ఆపే ప్రయత్నం చేసినందుకుగాను భన్వరీ దేవి అనే దళిత మహిళ సామూహిక లైంగిక దాడికి గురైంది. ఆమె కేసులో పోలీసులు FIR కూడా నమోదు చెయ్యనపుడు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగాయి. మహిళోద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయితే అగ్రవర్ణాల పురుషులు దళిత మహిళలను ముట్టుకోరని, ముట్టుకోనప్పుడు అత్యాచారం ఎలా చేస్తారని రాజస్థాన్‌హైకోర్టు దారుణమైన తీర్పునిచ్చింది. జైపూర్‌లో స్త్రీలతో పనిచేసే ‘విశాఖ’ అనే సంస్థ ఈ తీర్పుపై సుప్రీమ్‌కోర్టు కెళ్ళినపుడు సుప్రీమ్‌కోర్టు 1997లో తన తీర్పును ప్రకటిస్తూ ”విశాఖ గైడ్‌లైన్స్‌” పేరుతో పనిచేసే చోట మహిళలెదుర్కొనే హింసను చాలా విపులంగా, వివరంగా నిర్వచించింది. భారత ప్రభుత్వం ఈ అంశమై సమగ్రమైన చట్టం చేయాలని, చట్టం వచ్చే వరకు ఈ గైడ్‌లైన్స్‌చట్టంగా చలామణి అవుతాయని కూడా పేర్కొంది. అన్ని కార్యాలయాల్లోను ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి, విశాఖ గైడ్‌లైన్స్‌ గురించి ప్రచారం చెయ్యాలని కూడా ఆదేశించింది. విశాఖ గైడ్‌లైన్స్‌వెలువడిన తొలిరోజుల్లో ఈ అంశమై సమావేశాలు, సెమినార్లు జరిగాయి. స్త్రీల సంఘాలు ఉద్యమస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ, సమగ్ర చట్టం తేవాలని డిమాండ్‌చేస్తూనే వున్నాయి. చివరికి 2013 ఫిబ్రవరిలో పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం రూపొందింది.

వరకట్న నిషేధ చట్టం (1961)

ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం నేరమే. ఒకవేళ ఆచారం పేరుతోనో,స్త్రీధనం పేరుతోనో అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కట్నకానుకలు స్వీకరిస్తే వివాహం జరిగిన మూడు నెలల్లోగా ఆ ఆస్తిని పెళ్లి కూతురికి బదలాయించాలని చట్టం చెపుతోంది. ఈ చట్టం అతిక్రమిస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేసినప్పటికీ కోరుకున్న ఫలితాలు రాలేదు. కట్నం వేధింపులు తగ్గుముఖం తప్పలేదు.ఈ చట్టం సరైన ఫలితం ఇవ్వకపోవడానికి కారణం కట్నం ఇవ్వడం నేరమైనప్పటికీ,కట్నం ఇచ్చిన వారికి శిక్ష నుంచి మినహాయింపు ఉండడంతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతోంది.

భారత శిక్షాస్మృతి 1973 - సెక్షన్ 304 బి, 4987:
వరకట్న నిషేచట్టం వచ్చిన ఇరవై సంవత్సరాలకు మరింత పదునైన చట్టాన్ని వరకట్న భూతం కోరలు పీకడానికి 1983లో 4981 సెక్షన్, 1986లో సెక్షన్ 304బిను భారత శిక్షాస్మృతిలో చేర్చారు. ఈ చట్టాల ప్రకారం భర్త, అతని తరపు బంధువులు, వివాహితను కట్న కోసం కానీ, ఇతర వేధింపులకు గురిచేసినట్లయితే భర్తతో సహా శిక్షార్హులు అవుతారని చట్టం పేర్కొంటుంది. కట్నం వేధింపుల కేసుల్లో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న చట్టం ఇది. అయితే ఈ చట్టాన్ని భర్తపై, అతని కుటుంబ సభ్యులపై కక్షకట్టి ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. వరకట్నం కోసం భార్యలపై కిరోసిన్ పోసి కానీ, ఇతరేతర పద్దతుల ద్వారా కానీ అంతమొందించే భర్త, అతని కుటుంబ సభ్యులను కచ్చితంగా కటకటాల పాలు చేయడానికి 1986లో తీసుకొచ్చిన చట్టం వరకట్న హత్య (సెక్షన్ 304బి) చట్టం . ఈ సెక్షన్ కింద నిందితులు తప్పించుకోకుండా ఉండేందుకు భారత సాక్షి చట్టంలో కూడా అవసరమైన మార్పులు తీసుకువచ్చారు. ఈ నేరం మోపబడిన నిందితుడే తాను నేరం చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
వరకట్న నిషేధ చట్టం 1961 నుంచి అమల్లో ఉంది. మహిళలపై జరిగే నేరాల్లో అత్యధికంగా వరకట్న వేధింపులే ఉన్నాయి. వివాహ సమయంలో ఇచ్చుకునే ఆస్తి, విలువైన సెక్యూరిటీని వరకట్నం అంటారు. వివాహ సమయానికి ముందు, వెనుక ఇచ్చే లాంఛనాలన్నీ వరకట్నం కిందకే వస్తాయి. సెక్షన్ 3 ప్రకారం వరకట్న వేధింపుల కింద నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. అలాగే, సెక్షన్ 4 ప్రకారం వరకట్నం కోసం ఒత్తిడి చేసే బంధువులు, స్నేహితులకు సైతం ఆరు నెలల నుంచి రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 4ఎ ప్రకారం వరకట్న ప్రకటనలు చెల్లవు.
1997 నుంచి 2005 దాకా వరకట్న నిషేధ చట్టంపై సుప్రీం కోర్టు సమగ్ర విచారణ జరిపింది. 28 రాష్ట్రాల వారిని ఇందులో ప్రతివాదులుగా చేసింది. అనంతరం సుప్రీం కొన్ని ప్రతిపాదనలు చేసింది. వరకట్నా కేసులకు సంబంధించి రెవెన్యూ అధికారి, కలెక్టర్ బాధ్యతలు తీసుకోవాలి. వీరికి అధిక బాధ్యతలుగా దీన్ని చేర్చారు కానీ ఈ సమస్యపై ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదు. కట్నాన్ని చెక్ రూపేణ కానీ, డిడి రూపేణ కానీ ఇస్తే మంచిది. వరకట్న హత్యలు, వేధింపులు తగ్గాలంటే యువతలో, తల్లిదండ్రులలో మార్పు రావాలి.

గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం (2005):
వరకట్న నిరోధం, మహిళలపై అమలవుతున్న అత్యాచారాల నుంచి మహిళను రక్షించడానికి రూపొందించబడి బహుళ ప్రజాదారణ పొందిన చట్టం గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005. మహిళలపై కుటుంబంలో జరిగే శారీరక హింసతోపాటు మానసిక, లైంగిక, భావోద్వేక హింసారూపాలను హింసగా గుర్తించిన మొదటి చట్టం గృహ హింసచట్టం. గృహ హింస ను మానవహక్కుల ఉల్లంఘనగా గుర్తించి తగిన పరిష్కార మార్గాలను అందిస్తుంది ఈ చట్టం. భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండకుండా ఒక హక్కుగా భర్త నివసించే ఇంటిలోనే స్థానం ఇప్పించే విప్లవాత్మకమైన చట్టం గృహహింస చట్టం.
జమ్ము, కాశ్మీర్‌ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సివిల్‌ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు (స్తీలకు) ఉపశమనం కల్పించేదిశగా ఈ చట్టం ఏర్పడింది. తన కుటుంబానికి సంబంధించినవారు, తన కుటుంబంలోని మగవారు (భర్త / బావ / మరిది / అన్నదమ్ములు / మామ/ కొడుకు / అల్లుడు / తండ్రి) జరిపే ఎటువంటి హింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయటం జరిగింది.
మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరవడిందో, తను ఎక్కడైతే హింసకు గురవుతుందో అక్కడినుంచే సహాయంతో పోరాటం సాగించే హక్కు ఈ చట్టం కల్పించింది. అంటే స్త్రీకి స్థానబలం కల్పించింది. ఇది గొప్ప వెసులుబాటు. ఇది ఒక సివిల్‌ చట్టం అయినప్పటికీ పకడ్బందీ అమలు కోసం నేర న్యాయవ్యవస్థకు అమలు బాధ్యత పొందుపరిచారు. వైవాహిక జీవితంలో అంటే సున్నితమైన బాంధవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్‌పాత్ర పరిమితం చేస్తూ మెజిస్ట్రేట్‌ కుటుంబ పెద్దగా ఆ భర్తకు / మగవారికి సంబంధించి జరిగిన తప్పును ఎత్తిచూపి సరిదిద్దుకోమని సూచించి, భార్య పిల్లల్ని తల్లిని / స్త్రీని సరిగ్గా చూసుకోమని ఆజ్ఞాపించి - అట్టి ఉత్తర్వులు అమలుపరచని పక్షంలో రక్షణ ఉత్తర్వుల ధిక్కారాన్ని మాత్రం నేరంగా పరిగణించి - శిక్షించే అధికారం కల్పించింది. ఈ చట్టం ద్వారా మహిళలు, పిల్లలు (ఆడ, మగ మగవారైతే 18 సంవత్సరాలలోపు) లబ్ధిదారులు.

చేపట్టాల్సిన చర్యలు:
సమాజంలో మార్పు: కేవలం చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పన ద్వారా మహిళలపై అత్యాచారాలను అరికట్టవచ్చు అనే భావన సమంజసం కాదు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో మార్పు వస్తేనే మహిళలపై దాడులు ఆగుతాయి. చట్టాల ద్వారా సమాజం మారదు. కానీ సమాజంలో అభ్యుదయ మార్పులు జరగాలంటే చట్టాలు కావాలి. మహిళలకు సంబంధించి ఇప్పటికే అనేక చట్టాలు వచ్చాయి. వరకట్న నిషేధిత చట్టం వచ్చినా అది అమలుకు నోచుకోలేదు. ఇలా అనేక చట్టాలు వచ్చినా వాటి అమలు జరగడం లేదు. చట్టాలు రావాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు మారాలి. చట్టాన్ని సరిగా అమలు చేసే యంత్రాంగం, చట్టం స్ఫూర్తిగా నడిచే అధికారులు ఉండాలి. ఈ దేశంలో చట్టంతో, పోలీసులతో మొత్తం మారిపోతుందనుకోవడం అవివేకం.

మహిళా పోలీసుల సంఖ్య పెంపు: మహిళా పోలీస్ స్టేషన్లు పెరగాలి. ఈ విషయంలో మనం వెనకబడి ఉన్నాం. మహిళల్లో కొంత విశ్వాసం నింపేలా మహిళా పోలీసులను ఎక్కువ సంఖ్యలో నియమించాలి.

మహిళలను తప్పు పట్టరాదు: మహిళలపై దాడులు జరిగినప్పుడు పలువురు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. రాత్రిళ్లు మహిళలు బయటకు రాకూడదని, మహిళల వస్త్రధారణ మారాలని ఇలా అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. స్త్రీలు బయటకు రావడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మహిళలపై దాడులు జరగడానికి ప్రధాన కారణం ఉన్మాదం అనే విషయాన్ని పక్కన పెడుతున్నారు. మహిళల రక్షణ కోసం సలహాలు ఇవ్వడం తప్పుకాదు. దాడులకు కారణాలు చూడకుండా మహిళలను తప్పుపట్టడం సరికాదు. అత్యాచార బాధితుల పట్ల సమాజంలో ఉండే భావన వల్ల కూడా పలు సందర్భాల్లో దాడులు, హింసకు గురైనవారు బయటకు వచ్చి కేసులు పెట్టలేకపోతున్నారు. బాధితుల పట్ల కేవలం సానుభూతి చూపడం కాకుండా, గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు, పరిస్థితులను కల్పించాలి.

కంపెనీల్లో కమిటీలు: కంపెనీలలో పని చేస్తున్న మహిళలకు ఆ కంపెనీ రక్షణ కల్పించాలి. మహిళా ఉద్యోగుల కోసం సొంత రవాణా సదుపాయం (Transport) వినియోగించాలి. GPS (Global Positioning System) టెక్నాలజీ ఉపయోగించాలి. మహిళల కోసం కంపెనీలలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేయాలి.
నిర్దిష్ట సమయంలోపే దర్యాప్తు: అనేక కేసుల్లో శిక్ష పడాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇలాంటి కేసుల్లో నిర్ధిష్ట సమయంలోపు దర్యాప్తు పూర్తి చేయాలి. గడువులోపు విచారణ పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలాగే కేసును పదే పదే వాయిదా వేసే న్యాయమూర్తులపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి న్యాయమూర్తులను నియమించాలి.

మరికొన్ని సూచనలు:
1. ప్రభుత్వ (ప్రజా) రవాణా వ్యవస్థను బలపర్చాలి. ప్రైవేటు ట్రాన్స్ పోర్టు వల్ల కొంత సమస్య (Risk) ఉంటుంది.
2. నగరాల్లోని అనేక ప్రాంతాల్లో CC కెమెరాలు పనిచేయడం లేదు. వీటిని బాగు చేయించాలి.
3. బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల గస్తీ పెంచాలి.
4. ప్రతి వీధిలోనూ లైట్లు ఏర్పాటు చేయాలి.
5. టోల్ గేట్ వద్ద వాహనం ఆగే సమయంలో కిటికీలు తెరిచి ఉంచాలని నిబంధన పెట్టాలి. ఇలా చేస్తే వాహనం లోపల ఎవరైనా బాధితులు ఉంటే తెలుస్తుంది.
6. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి. భ్రూణ హత్యలు, స్త్రీ శిశుమరణాలు, వరకట్న వేధింపులను నిరోధించగలగాలి.
7. మహిళా విద్యను ప్రోత్సహించాలి.
8. పిల్లలకు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ఇవ్వాలి.
9. మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు సమాజంలో నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గానూ సమాజం, కుటుంబ వ్యవస్ధ, విద్యా వ్యవస్ధ, మీడియా, ప్రచార సాధనాలు మహిళలపట్ల గౌరవభావాన్ని పెంచాలి.
10. పరువు హత్యలు కూడా మహిళలపై జరుగుతున్న దుర్మార్గపు చర్య. లింగ వివక్ష తో కూడిన పరిస్థితులు ఉన్నంత కాలం మహిళలపై దాడులు జరుగుతూనే ఉంటాయి. కనుక ఈ లింగ వివక్షను దూరం చేయాలి.
11. రాత్రివేళ పనిచేసే మహిళా ఉద్యోగినులకు అవగాహన కల్పించడానికి ఆయా కంపెనీలు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి.
12. గుర్తు తెలియని వాహనాలు, ప్రయివేటు వాహనాలలో ప్రయాణించకపోవడం శ్రేయస్కరం. 13. తమ వెంట పెప్పర్ లాంటి స్ప్రేలు, లేదా మిర్చి పౌడర్ లాంటివి బ్యాగులో ఉంచుకోవాలి.
14. నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్లకూడదు.
15. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ పరధ్యానంగా ఉండకూడదు.
16. స్వీయ రక్షణ పద్ధతులు కూడా నేర్చుకోవటం అవసరం. అవసరమైతే కరాటే లాంటి వాటిలో శిక్షణ పొందాలి.
17. ప్రజల ఆలోచన విధానం, నైతిక విలువల్లో మార్పు రానంత వరకు మహిళలపై అత్యాచారాలు, హింసలు పెరుగుతూనే ఉంటాయి. సమాజాన్ని నైతిక విలువలవైపు మళ్లించాల్సిన అవసరమెంతైనా ఉంది.
18. సమాజంపై బలమైన సాంస్కృతిక ప్రభావాన్ని కలిగించే మీడియా ప్రసారాల్లో ముఖ్యంగా సినిమాలు, టీవీ సీరియల్స్, వ్యాపార ప్రకటనల్లో మహిళలను చిత్రీకరించే, చూపించే విధానంలో బాధ్యతాయుత, సంస్కారవంతమైన మార్పు రావాలి.
19. మహిళలపై అత్యాచారాలను జాతి సమస్యగా గుర్తించాలి. పటిష్ట చట్టాలు, సత్వర న్యాయం, సామాజిక దృక్పథంలో మార్పు, పౌర సమాజం స్పందన, కుటుంబ ఆలంబన, సమాన అవకాశాలు, సాధికారత ద్వారా మహిళలపై నేరాలను / దాడులను అరికట్టడం అసాధ్యమేమీ కాదు. దానికి రాజకీయ చొరవ, చిత్తశుద్ధి ఉండాలి. పౌర సమాజం వీటిని సాధించుకోవాలి.

మహిళలు – ఆత్మ రక్షణ:
1. ప్రతి స్త్రీ బాల్యం నుంచే తనను తాను రక్షించుకోవటం ఎలా అన్నది తల్లి ఉగ్గుపాలతోనే నేర్పించాలి. ఎందుకంటే చంటి పిల్లల్ని కూడా (మృగాలుగా వ్యవహారించే, తార్కిక జ్ఞానం కోల్పోయిన) మగవారు అత్యాచారం చేయడానికి వెనకాడటం లేదన్నది వాస్తవం.
2. బాల్యంలో బాలికలను ముద్దు చేసే దగ్గర బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వారిని ముట్ట రాని ప్రదేశాలలో నోటితో చేతులతో ముట్టినప్పుడు వారి నుంచి దూరంగా మసలడం పిల్లలకు నేర్పాలి. సాధ్యమయినంతవరకు ఎదుటి వ్యక్తులకు ఆనుకోని, తగులుతూ మాట్లాడకుండా దూరం జరగాలి.
3. చిన్నప్పటి నుంచే ‘అమ్మని, అక్కని, చెల్లిని, మొత్తం స్త్రీ జాతిని గౌరవించాలని మగ పిల్లలకు తల్లితండ్రులు నేర్పాలి. స్త్రీ పురుష సమానతలు, ఒకరు లేకుండా మరొకరు లేరన్న విషయం తెలియజేయాలి.
4. వివక్షతతో చూడకుండా బాల బాలికలను ఒకే రకమైన పాఠశాలలకు పంపడం పౌష్ఠికాహారం, ఆటపాటలు నేర్పించాలి.
5. బాలికలకు ఆత్మరక్షణ విద్యలు అంటే కరాటే, జూడో, క్రికెట్‌, బంతి ఆటలు అన్నీ నేర్పాలి.
6. ఎవరైనా స్త్రీలపై దాడి సంఘటన జరగబోతున్నపుడు తమ దగ్గర సెంటు స్ప్రే డబ్బాల్లో కారంపొడి / మిరియాల పొడి నీళ్ళలో కలిపి వారి కళ్ళలో కొట్టాలి. అప్పుడు దొరికిన సమయంలో తప్పించుకోవాలి.
7. ఆడపిల్లలు ప్రతిరోజూ ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే వారిలో ఆత్మస్థెర్యం పెంపొందుతుంది.
8. ఎక్కడికి వెళ్ళినా తమ సెల్‌ఫోనుల్లో పోలీస్ నెంబరు – 100/1098, దగ్గర పోలీసు స్టేషన్ నెంబరు, దగ్గర బంధువులకు తమ ఉనికిని తెలియ జేయడం, ద్వారా ఆత్మరక్షణ చేసుకోగలుగుతారు.
దేశ జనాభాలో దాదాపు సగభాగం మహిళలు ఉంటే వారి సంక్షేమానికి, భద్రతకు నిర్దేశించిన నిధులు 30 శాతానికి మించడం లేదు. మహిళా సాధికారిత సాధించి, నేర రహిత సమాజ సాధనకు నిధుల కేటాయింపు పెంచాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు శిక్ష ఒక్కటే కాదు చట్టాల్లోనూ మార్పులు చేయాలి. మహిళలపై జరుగుతున్న నేరాలుకు గల మూలాలపై పోరాటం చేయాలి. సమాజంలోని అన్ని వర్గాల్లోనూ, యువతలోనూ మానసిక పరిపక్వత కల్పించాల్సిన అవసరముంది. నేరం జరిగిన తర్వాత నిందితుణ్ని శిక్షించడం కంటే అది జరగకుండా నియంత్రించడమే ముఖ్యం. అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎదుర్కొనేలా మహిళలకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.

మహిళలపై నేరాలకు మూలాలేంటి? లోపం ఎక్కడుంది? వ్యవస్థలోనా? వ్యక్తుల్లోనా? బాపూ కలల నిర్భయ భారతం ఎన్నాళ్లకి? ఎన్నేళ్ళకి సాకారమవుతుంది ?

ప్రేమ విఘ్నేశ్వర్ రావు కె.






















































#Tags