11వ G-20 సదస్సు

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
జీ-20 దేశాల పదకొండో సదస్సు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో చైనాలోని హాంగ్జౌలో జరిగింది. దీంతో దక్షిణ కొరియా (జీ-20, 2010) తర్వాత ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన రెండో ఆసియా దేశంగా చైనా నిలిచింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్ర దాడులను ఖండించడంతోపాటు ఉమ్మడి కృషితో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని సదస్సు పేర్కొంది. నూతన అభివృద్ధి బ్యాంక్.. పునరుత్పాదక, హరిత ఇంధనాలకు సంబంధించి మంజూరు చేసిన తొలి విడత రుణాలపై సదస్సు సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రధానాంశాలైన వాతావరణ మార్పు, శక్తికి సంబంధించిన చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించలేదు. ఆర్థిక వినూత్నత, సమ్మిళితాలే లక్ష్యంగా
Toward an Innovative, Invigorated, Interconnected and Inclusive World Economy థీమ్‌గా తీసుకొని జీ-20 సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో దేశాధినేతలు ప్రధానంగా ప్రపంచ ఆర్థిక గవర్నెన్‌‌సలో సంస్కరణలకు సంబంధించి జరుగుతోన్న కృషిపై చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 85% వాటా, ప్రపంచ జనాభాలో 2/3 వంతు జనాభాను కలిగిన అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు జీ-20లో సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే తాజా సదస్సు నిర్వహణను తన ప్రాభవాన్ని పెంచుకొనేందుకు సాధనంగా ఉపయోగించుకోవాలని చైనా భావించింది. ఈ దిశగా బీజింగ్ ఆర్థిక నమూనాతోపాటు One Belt, One Road ప్రోత్సాహకం, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (అవస్థాపన, పెట్టుబడి బ్యాంక్ -ఏఐఐబీ)ని ప్రపంచం ముందు నిలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశంగా తన రెండు థీమ్‌లు.. అభివృద్ధి, సమ్మిళితాలను వెలుగులోకి తెచ్చింది.

జీ-20లో సభ్యత్వం కలిగిన దేశాలతోపాటు ఇతర దేశాలతోనూ అధికారిక చర్చలను విస్తరించడం ద్వారా అధిక సమ్మిళిత జీ-20 ఆతిథ్య దేశంగా చైనా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విశ్వాసం, నాయకత్వాన్ని పెంపొందించడం ద్వారా దేశాల్లో నూతన దశ ఆవిర్భావానికి జీ-20 సదస్సు సంకేతాలిచ్చింది. జీ-20లో అమెరికా, యూకే, ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండోనేసియా, జపాన్, ఫ్రాన్‌‌స, జర్మనీ, కెనడా, ఇటలీ, రష్యా, ఆస్ట్రేలియా, చైనా, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, ఇండియా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ యూరోపియన్ యూనియన్లు సభ్య దేశాలు. పన్నెండో జీ-20 సదస్సు జర్మనీలోని హాంబర్‌‌గలో 2017, జూలై 7, 8 తేదీల్లో జరుగుతుంది.

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా చివరిసారి జీ-20 దేశాల సదస్సుకు హాజరుకావడాన్ని ముఖ్యాంశంగా పరిగణించవచ్చు.

నిర్ణయాలు
  • చట్టబద్ధం కాని కార్యకలాపాల ద్వారా దేశాల మధ్య జరుగుతున్న ఆర్థిక వనరుల ప్రవాహాన్ని అరికట్టాలి.
  • అభివృద్ధికి సంబంధించి స్వదేశీ వనరుల సమీకరణకు అవరోధంగా ఉన్న అంశాలపై కలిసికట్టుగా పనిచేయాలి.
  • ప్రపంచవ్యాప్తంగా సక్రమమైన, ఆధునిక అంతర్జాతీయ పన్నుల వ్యవస్థను రూపొందించడంతోపాటు వృద్ధిరేటును వేగవంతం చేయడం, పోటీతత్వంతో కూడిన కరెన్సీ మూల్యహీనీకరణ విధానాన్ని విడిచిపెట్టడం.
  • పటిష్ట, సుస్థిరత, సంతులిత, సమ్మిళిత వృద్ధి లక్ష్యసాధనకు అన్ని విధాన సాధనాలను వినియోగించడం.
  • శరణార్థులను ప్రపంచ అంశంగా పరిగణించడం ద్వారా భారాన్ని అందరూ పంచుకోవాలి. వారికి మానవత్వంతో కూడిన సహాయాన్ని అందించాల్సిన ఆవశ్యకతను సదస్సు గుర్తించింది.
  • పన్ను సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, అభివృద్ధి చెందుతున్న దేశాల పన్ను సామర్థ్య నిర్మాణత, వృద్ధి, పన్నును పెంపొందించుకునే అంశాలకు సంబంధించి దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించడం.
  • అధిక ఉక్కు ఉత్పత్తిపై చైనా చర్యలు తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ నేతలు జీ-20 సదస్సులో కోరారు. అమెరికా, జర్మనీ, చైనా, ఇతర ఆర్థిక వ్యవస్థలు అధిక ఉక్కు ఉత్పత్తికి సంబంధించి తక్షణ పరిష్కారం కనుగొనాలని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు కోరారు.
  • సెప్టెంబర్ 3, 2016న గ్లోబల్‌వార్మింగ్‌కు సంబంధించి పారిస్ ఒప్పందాన్ని ఆమోదిస్నున్నట్లు ఒబామా, జిన్ పింగ్ ప్రకటించారు. ఇప్పటివరకు 26 దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. ప్రపంచ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో అమెరికా వాటా 18 శాతం కాగా, చైనా వాటా 20 శాతం. సదస్సు ప్రారంభానికి ముందు వాతావరణ మార్పునకు సంబంధించిన పారిస్ ఒప్పందాన్ని అమెరికా- చైనాలు సంయుక్తంగా ఆమోదించాయి. దీంతో జీ-20 భాగస్వామ్య నాయకత్వ విషయంలో నూతన నమూనా ఆవిష్కరణకు తెరతీసింది.
  • యాపిల్ సంస్థ నుంచి పన్ను వసూలు చేయాలన్న ఐర్లాండ్ నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ సమర్థించింది.
  • అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అవలంబిస్తున్న కోటా విధానం.. వర్తమాన ప్రపంచ ఆర్థిక వాస్తవికతను ప్రతిబింబించడం లేదని సదస్సు అభిప్రాయపడింది.

ప్రముఖుల ప్రసంగాలు-ముఖ్యాంశాల
నరేంద్ర మోదీ:
జీ-20 సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ అవినీతి, నల్లధనంపై పోరును సమర్థ ఫైనాన్షియల్ గవర్నెన్స్‌కు కేంద్ర బిందువుగా పేర్కొన్నారు. ఆర్థిక తప్పిదాలకు పాల్పడుతున్న safe havens (పన్ను స్వర్గధామాల)ను నిర్మూలించడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో అధిక దాపరికానికి స్వస్తి పలకాలని జీ-20 దేశాలను కోరారు. కఠిన అంతర్జాతీయ నియంత్రణలు, అవినీతి, వాటి మూలాలను దాస్తున్న బ్యాంకింగ్ రంగ రహస్యాలను బట్టబయలు చేయాల్సిన ఆవశ్యకతను మోదీ వెలిబుచ్చారు. ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవడానికి తీవ్రస్థాయిలో చర్చలు సరిపోవన్నారు. లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొని ప్రపంచ ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడానికి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, మౌలిక రంగంలో పెట్టుబడుల పెంపు, నైపుణ్య శిక్షణ ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవాలని సూచించారు. రానున్న కాలంలో ప్రపంచ అభివృద్ధికి సాంకేతిక అనుసంధానం, డిజిటల్ విప్లవం, నవకల్పనలు దోహదపడతాయన్నారు.

జిన్‌పింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, నష్ట భయం (risk)తోపాటు శాంతియుతమైన, సుస్థిర అంతర్జాతీయ వాతావరణం ఏర్పరచడం వంటి వాటిని ప్రాధాన్యతాంశాలుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. జీ-20 దేశాలు, స్థూల ఆర్థిక విధానాల అమలు విషయంలో సహకరించుకోవాలన్నారు. దేశాలు సమర్థ విధాన సాధనాలైన ద్రవ్య, కోశ, నిర్మాణాత్మక సంస్కరణలను వినియోగించుకోవాలన్నారు. స్వల్ప కాలంలో ఎదురయ్యే నష్టభయాలను తొలగించుకోవడంతోపాటు మధ్యకాలిక, దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంపై తాము దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. రక్షణ విధానానికి తాము వ్యతిరేకమని బహుళ వాణిజ్య యంత్రాంగానికి (Multi lateral trade mechamism) తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

క్రిస్టిన్ లగార్డె: ఐఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టిన్ లగార్డె మాట్లాడుతూ.. సంఘటిత కృషి ద్వారా వృద్ధిని పెంపొందించడాన్ని మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్నారు. ద్రవ్య, కోశ, నిర్మాణాత్మక విధానాలను వ్యక్తిగతంగా, సమష్టిగా అమలు పరచడం ద్వారా వృద్ధిని పెంపొందించవచ్చని జీ-20 సదస్సు అంగీకరించింది అన్నారు. సంస్కరణలను గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో అమలుపరచడం ద్వారా ప్రతి దేశం అధిక వృద్ధి సాధించగలదని పేర్కొన్నారు. ప్రతి దేశం వృద్ధి సాధించడానికి అవసరమైన సంస్కరణలపై ఐఎంఎఫ్ దృష్టి సారించినట్లు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వృద్ధి ఎజెండాలో ముఖ్యమైన అంశమన్నారు. వృద్ధి అందరికీ పంపిణీ అయ్యేలా దేశాలు కృషి చేయడంతోపాటు వృద్ధి పంపిణీని రెండో ప్రాధాన్యతాంశంగా పరిగణించాలని సూచించారు. అసమానతల తగ్గింపు, ఆర్థిక ప్రగతి పెంపునకు సంబంధించి తగిన సాధనాలను వినియోగించాలన్నారు. ప్రధానంగా అల్పాదాయ వర్గాలు, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుల వల్ల ప్రభావితమైన శ్రామికుల ప్రగతి కోసం తగిన విధానాలకు రూపకల్పన చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుల నేపథ్యంలో శిక్షణ, నైపుణ్యం పెంపు, విద్య, ఆరోగ్యంపై పెట్టుబడులు పెంచాల్సిన ఆవశ్యకతను లగార్డె గుర్తుచేశారు. అధిక వృద్ధి మనకు అవసరం, అదే సమయంలో సాధించిన వృద్ధి సంతులితంగా, అధిక సుస్థిరతతో కూడుకున్నదిగా, సమ్మిళితంగా ఉండి ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిపై విధాన నిర్ణేతలు దృష్టి సారించి, అన్ని ధనాత్మక సాధనాలను వినియోగించుకోవడం ద్వారా నష్ట భయాన్ని ఎదుర్కోవచ్చన్నారు. ద్రవ్య, కోశ విధానాల సమన్వయం ద్వారా డిమాండ్‌ను వేగవంతం చేయాలని సూచించడంతోపాటు, అన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రపంచం విజయవంతం కాలేకపోయిందన్నారు.

సదస్సు ప్రధానోద్దేశాలు
  • పన్నుల ఎగవేతకు వ్యతిరేకంగా పోరాడటం.
  • అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించడంతోపాటు రక్షణ విధానాన్ని వ్యతిరేకించడం.
  • విత్త మద్దతు, ఆర్థికవృద్ధి పెంపునకు నవకల్పనలు.
  • ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగే ప్రధాన చర్యలన్నింటినీ (పాపులిస్ట్ ఎటాక్స్) నిర్మూలించడం.

జీ-20 సదస్సు ప్రధానంగా సంఘటిత స్థూల ఆర్థిక విధానం, స్వేచ్ఛా వాణిజ్యం, నవకల్పనల ద్వారా సమ్మిళిత వృద్ధి సాధనకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది.

ఫైనాన్షియల్, ఎకనమిక్ గవర్నెన్‌‌స, వాణిజ్యం, పెట్టుబడి, అభివృద్ధి, విధాన పరమైన సహకారం, నవకల్పనతో కూడిన ఆర్థిక వృద్ధి ముఖ్యాంశాలుగా చర్చలు జరిగాయి.

సుస్థిర, సంతులిత పురోగతికి సభ్య దేశాల సమన్వయం, విస్తృత ఆర్థిక విధానాలతో ముందడుగు వేయాల్సిన అవసరాన్ని సదస్సు గుర్తించింది.







#Tags