PGCET 2024: పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
PGCET 2024: పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

కర్నూలు : రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు మూడో సంవత్సరం కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఏపీ పీజీసెట్‌–2024 నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 14 వర్సిటీలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. జూన్‌ 10 నుంచి 14వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటకి వస్తున్నారు. వీరిలో 50 శాతం అంటే సుమారు లక్ష మంది విద్యార్థులు పీజీ పరీక్షలు రాస్తుంటారు. ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తుండటంతో పీజీ సెట్‌ రాసే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయంలో 12 పీజీ కోర్సులు ఉండగా 580 సీట్లు, 10 అనుబంధ పీజీ కళాశాలల్లో 10 కోర్సులకు 934.. మొత్తం 1,514 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన సమాచారం

● ఏపీ పీజీసెట్‌–2024ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

● ఎలాంటి ఫైన్‌ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు మే 4వ తేదీ వరకు అవకాశం ఉంది.

● దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాలి.

● సబ్జెక్టుల వారీగా ప్రవేశ పరీక్షలు జూన్‌ 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు.

● ఒక సబ్జెక్టుకు దరఖాస్తు ఫీజు ఓసీలు రూ.850, బీసీలు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులు రూ.650 చెల్లించాలి.

●ఆర్‌యూ పరిధిలో 16 కోర్సులు  అందుబాటులో 1835 సీట్లు

ప్రతిభావంతులు వస్తారు

ఉన్నత విద్యా మండలి మూడు సంవత్సరాలుగా ఏపీ పీజీసెట్‌ పేరుతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. దీంతో వర్సిటీల్లోకి ప్రతిభావంతులైన విద్యార్థులు వస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అన్ని వర్సిటీల్లో చేరే అవకాశం ఉంటుంది. దీంతో మల్టీ కల్చర్‌ డెవలప్‌ అవుతుంది. ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతాయి.

– బి. సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌, వైస్‌ చాన్సలర్‌ , రాయలసీమ యూనివర్సిటీ

#Tags