Navodaya Entrance Exams 2024-25: విద్యార్థులు ఈ సూచనలు తప్పకుండా పాటించాలి!

పెద్దవూర: పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించనున్న పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశ పరీక్షకు 4,623 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2672 మంది బాలురు, 1950 మంది బాలికలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. యాదాద్రి జిల్లాలో 805 మంది, సూర్యాపేట జిల్లాలో 1564 మంది, నల్లగొండ జిల్లాలో 2254 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకుగాను 15 బ్లాక్‌లలో మొత్తం 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 12, భువనగిరి యాదాద్రిలో 5, సూర్యాపేట జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆరవ తరగతిలో 80 సీట్లు..
ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించారు. ఇందులో ఎస్సీలకు 15 ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, 3 శాతం దివ్యాంగులకు, 27 ఓబీసీలకు, మొత్తం సీట్లలో బాలికలకు 33 శాతం సీట్లు మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. పరీక్ష వ్యవధి మొత్తం 2 గంటలు ఉంటుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 10.30 లోగా చేరుకోవాలని ప్రిన్సిపాల్‌ నాగభూషణం సూచించారు. 11 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అదనంగా మరో 40 నిమిషాల సమయం అనుమతించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారానే హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

చదవండి: Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మూడు విభాగాల్లో పరీక్ష
ప్రవేశ పరీక్ష వంద మార్కులకు 80 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు విభాగాల్లో ఈ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది. రీజనింగ్‌ మేఽథాశక్తిలో 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు, తెలుగు లేదా ఇంగ్లిష్‌లో ఐదు ప్యాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో ప్యాసేజ్‌కు నాలుగు ప్రశ్నల చొప్పున ఉంటాయి. వీటికి 25 మార్కులు ఉంటాయి. మేధాశక్తి విభాగంలో 50 మార్కులు ఉంటాయి.

విద్యార్థులకు సూచనలు

  • అడ్మిట్‌ కార్డు లేకుండా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు.
  • అడ్మిట్‌ కార్డులోని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి.
  • పరీక్షా హాల్‌లో సాధారణ చేతి గడియారం మినహా ఎలక్ట్రానిక్‌ పరికరాలు/గాడ్జెట్‌లు అనుమతించబడవు.
  • పరీక్షా హాల్‌లోకి అడ్మిట్‌ కార్డు, బ్లాక్‌/బ్లూ పెన్నులు మినహా ఏ వస్తువులను తీసుకెళ్లరాదు.
  • బ్లాక్‌, నీలం రంగు పెన్నులతో మాత్రమే సమాధానాలు రాయాలి.
  • పెన్సిల్‌ను ఉపయోగించరాదు.
  • అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న అదే పరీక్షా మాధ్యమం ప్రశ్నాపత్రాన్ని అందిస్తారు.
  • అభ్యర్థులు ఓఎంఆర్‌ షీటుతో పాటు ప్రశ్నపత్రంపై హాల్‌ టిక్కెట్‌ నంబరు వేయాలి.
  • టెస్ట్‌ బుక్‌లెట్‌పై ముద్రించిన టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌, సీరీస్‌, సమాధాన పత్రం సైడ్‌–2పైన ఉన్న టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌, టెస్ట్‌ బుక్‌లెట్‌ సీరీస్‌ ఒకే విధంగా ఉన్నదో లేదో సరిచూసుకోవాలి.
  • ప్రశ్నకు సంబంధించిన బాక్స్‌లో సమాధానాన్ని పెన్నుతో బబ్లింగ్‌ చేయాలి.
  • వైట్‌ ఫ్లూయిడ్‌ గాని కరెక్షన్‌ ఫ్లూయిడ్‌లను ఉపయోగించకూడదు.
  • ఓఎంఆర్‌ షీటుపై దిద్దుట, కొట్టివేయుట, తుడుపుట వంటివి చేయకూడదు. ఏ రకమైన గీతలు, గుర్తులు పెట్టొద్దు.
  • రఫ్‌ వర్క్‌కు సమాధాన పత్రం ఉపయోగించకూడదు.
  • అభ్యర్థులు 1.30 గంటకు ముందు హాల్‌ నుంచి బయటకు వెళ్లటానికి వీలు లేదు.
#Tags