టీఎస్ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ విధివిధానాలు..
టీఎస్ పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీఈసెట్)ను తెలంగాణ రాష్ర్టంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంటెక్/ఎంఈ; ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు లేదా గేట్, జీప్యాట్ స్కోర్ల ఆధారంగా వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లను కేటాయిస్తారు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి
పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ తేదీలు విడుదలైన తరుణంలో ప్రత్యేక కథనం...
పీజీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంటెక్/ఎంఈ కోర్సుల్లో ప్రవేశించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్/ఎంఈలో సీఎస్‌ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ తదితర బ్రాంచ్‌లకు సంబంధించిన 60కి పైగా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (అర్హత: బి.ఫార్మసీ)లో 11 స్పెషలైజేషన్లు ఉన్నాయి.
సీట్ల సంఖ్య:
సీట్ల సంఖ్య:
- ఎంటెక్/ఎంఈలో 30 వేలకు పైగా సీట్లు, ఎం.ఫార్మసీలో దాదాపు 12 వేలు, ఫార్మ్-డిలో వెయ్యి సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో వెబ్ కౌన్సెలింగ్ ఆధారంగా భర్తీచేస్తారు.
గేట్, జీప్యాట్‌కు ప్రాధాన్యం:
జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్)లో ర్యాంకు సాధించిన వారికి ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. దీనికోసం గేట్, జీప్యాట్ ఉత్తీర్ణులు ప్రత్యేకంగా తమ వివరాలను వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పీజీఈసెట్‌లో ఉత్తీర్ణులకు ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
వెబ్ కౌన్సెలింగ్ విధానం:
పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డికు సంబంధించిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీ వెబ్‌కౌన్సెలింగ్ విధానంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఆగస్టు 3న ప్రారంభం కానుంది. ఇది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తో మొదలై, సీట్ అలాట్‌మెంట్‌తో ముగుస్తుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్:
వెబ్ కౌన్సెలింగ్ విధానంలో ఇంటర్నెట్ ఆధారంగా కాలేజీ, కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. దీనికోసం హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్టర్ చేయించుకోవాలి.
అవసరమైన ధ్రువపత్రాలు:
- గేట్/జీ ప్యాట్/పీజీఈసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్
- బీటెక్/బీఫార్మసీ సర్టిఫికెట్, మార్కుల మెమో
- పదో తరగతి సర్టిఫికెట్
- పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు
- ప్రైవేట్ స్టడీ అయితే ఏడేళ్లకు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ)
- 2015, జనవరి 1 తర్వాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణపత్రం
- ఆధార్ కార్డు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్లు:
ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు తెలంగాణ రాష్ట్రంలో అయిదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి..
- జేఎన్‌టీయూ - హైదరాబాద్
- యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, సైఫాబాద్ - హైదరాబాద్
- యూనివర్సిటీ పీజీ కాలేజ్ - సికింద్రాబాద్
- ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ - హైదరాబాద్
- కాకతీయ యూనివర్సిటీ - వరంగల్
- స్పెషల్ కేటగిరీ (ఎన్‌సీసీ/సీఏపీ/ స్పోర్ట్స్/ పీహెచ్) అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని యూనివర్సిటీ పీజీ కాలేజీ హెల్ప్‌లైన్ సెంటర్లో మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి.
వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ:
వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ తొలిదశలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు మలిదశలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని ఆగస్టు 7 నుంచి ఆగస్టు 16 వరకు ర్యాంకుల వారీగా ఇవ్వాలి.
- తొలుత అభ్యర్థులు వెబ్‌సైట్లో లాగిన్ ఐడీని రూపొందించుకోవాలి. దీనికోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు తప్పనిసరిగా ఉండాలి.
- లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్లీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, ఆప్షన్స్ ఎంట్రీకి సంబంధించిన కాలమ్‌పై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న కోర్సులు, కళాశాలల వివరాలు కనిపిస్తాయి.
- అభ్యర్థులు తమ ఆసక్తి, అర్హతల ఆధారంగా ప్రాధాన్యత సంఖ్యను పేర్కొనాలి.
- ఆప్షన్లు ఇవ్వడం పూర్తయ్యాక, సేవ్ బటన్‌పై క్లిక్‌చేసి లాగ్ అవుట్ అవ్వాలి.
- తర్వాత నిర్దేశించిన తేదీలో సీట్ అలాట్‌మెంట్ విండో ఓపెన్ అవుతుంది. దాని ఆధారంగా తమకు కేటాయించిన కళాశాల వివరాలను డౌన్‌లోడ్ చేసుకొని, ఆ కళాశాలలో గడువులోగా రిపోర్ట్ చేయాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత:
ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి (పోస్ట్ బాక్యులరేట్) కోర్సులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అవకాశం అందుబాటులో ఉంది. కుటుంబ వార్షికాదాయం రూ.రెండు లక్షలలోపున్న ఎస్సీ/ఎస్టీ వర్గాల అభ్యర్థులు, రూ.లక్షలోపున్న బీసీ/ ఈబీసీ వర్గాల అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. ఫీజులు ఆయా కళాశాలలకు ఇచ్చిన గ్రేడ్‌ల ఆధారంగా రూ. 48,500 నుంచి రూ.1.10 లక్షల వరకు ఉన్నాయి. అయితే రీయింబర్స్‌మెంట్ మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికే లభిస్తుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి.
- గేట్, జీప్యాట్ ఉత్తీర్ణులకు యూజీసీ/ఏఐసీటీఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. గతంలో ఈ స్కాలర్‌షిప్ మొత్తం నెలకు రూ.8 వేలుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.12వేలకు పెంచారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్:
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు:
- గేట్/జీప్యాట్ ఉత్తీర్ణులు: ఆగస్టు 3, 2015
- పీజీఈసెట్ ర్యాంకర్లు
ర్యాంకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు 1 - 300 ఆగస్టు 4 301 - 1000 ఆగస్టు 5 1001 - 1850 ఆగస్టు 6 1851 - 2850 ఆగస్టు 7 2851 - 3850 ఆగస్టు 8 3851 - 5000 ఆగస్టు 9 5001 - 7400 ఆగస్టు 11 7401 - లాస్ట్ ఆగస్టు 12 - స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: ఆగస్టు 4,5
వెబ్‌సైట్: www.tspgecet.org
ఎంటెక్‌తో ఉన్నత భవిష్యత్తు
ప్రస్తుత పోటీ వాతావరణంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉన్నత విద్య అవసరం బాగా పెరిగింది. ఈ ఏడాది ఎంటెక్ కోర్సులో చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే సమయానికి ఎన్నో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఎంటెక్ కోర్సు ద్వారా అకడమిక్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఇష్టమైన స్పెషలైజేషన్‌లో పరిశోధన దృక్పథం అలవడుతుంది. కోర్ స్పెషలైజేషన్లకు డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు. కాబట్టి విద్యార్థులు క్రేజ్ అనే కోణంలో ఆలోచించకుండా ఆసక్తికి ప్రాధాన్యమిచ్చి, ఆప్షన్స్ ఎంట్రీ ఇవ్వడం మేలు.
- ప్రొఫెసర్ బి.చెన్నకేశవరావు, ప్రిన్సిపాల్, సీబీఐటీ.
కోర్సులు, కళాశాలలపై అవగాహన అవసరం
వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ముందు విద్యార్థులు తాము పీజీఈసెట్ రాసిన బ్రాంచ్‌కు సంబంధించి స్పెషలైజేషన్లు అందిస్తున్న కళాశాలలు, ఆయా స్పెషలైజేషన్లపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడు ప్రాధాన్యత క్రమాన్ని మాన్యువల్‌గా రూపొందించుకోవాలి. ఆ తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న కోర్సులు, కళాశాలల వివరాలను పీజీఈసెట్ వెబ్‌సైట్లో పొందుపరుస్తాం. ఈ లోపు రాష్ట్రంలోని యూనివర్సిటీల వెబ్‌సైట్ల ఆధారంగా అనుబంధ/ గుర్తింపు పొందిన కళాశాలలు, ఎంటెక్, ఎంఫార్మసీ స్పెషలైజేషన్ల గురించి సమచారం సేకరించుకొని, సిద్ధంగా ఉండాలి.
- ప్రొఫెసర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, కన్వీనర్, టీఎస్‌పీజీఈసెట్-2015.
#Tags